శ్రీమహావిష్ణువు దశావతారాల్లో శ్రీకూర్మావతారం ఒకటి. మత్స్యావతారం తరువాత ఆయన కూర్మావతారం ఎత్తవలసి వచ్చింది. కూర్మం అంటే తాబేలు అని అర్థం. ఈ అవతారంలో శ్రీమహావిష్ణువు ప్రత్యక్షంగా రాక్షస సంహారం చేయలేదు. తాబేలు రూపంలో అవతరించి, రాక్షసుల నుంచి దేవతలకు రక్షణ కల్పించాడు.
దేవతలు x రాక్షసులు
అప్పట్లో దేవతలు, రాక్షసుల మధ్య తరచూ యుద్ధాలు జరుగుతుండేవి. దీనితో దేవతల శక్తి రోజురోజుకు క్షీణించసాగింది. దీనిని గమనించిన శ్రీమహావిష్ణువు, మరణం లేకుండా అమృతాన్ని సాధించమని దేవతలకు సూచించాడు. అంతే కాకుండా పాలసముద్రంలో అనేక రకాల మూలికలను, ఓషధులను, లతలను వేసి మధించాలని, అందుకు అవసరమైతే రాక్షసుల సాయం కూడా తీసుకోవాలని దేవతలకు సూచించాడు.
మొత్తానికి అమృతం కోసం పాలసముద్రాన్ని మధించడానికి రాక్షసులు, దేవతలు సిద్ధమయ్యారు. వాసుకి అనే మహాసర్పం మంథర పర్వతాన్ని చుట్టలు చుట్టుకోగా, రాక్షసులు ఆ సర్పం పడగ వద్ద, దేవతలు తోకవద్ద నిలబడి పాలసముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. అయితే ఆధారం లేకపోవడం వల్ల మంథర పర్వతం పాలసముద్రంలోకి క్రుంగిపోసాగింది.
అప్పుడు శ్రీమహావిష్ణువు శ్రీకూర్మనాథుడిగా అవతరించి, పాలసముద్రంలో మునిగిపోతున్న మంథర పర్వతాన్ని తన వీపుమీద మోశాడు. ఆ మంథర పర్వత శిఖరం మీద గరుత్మంతుని రూపంలో కూర్చుని ఆ పర్వతం స్థిరంగా నిలబడేలా చేశాడు.
విషం మింగిన శివుడు
దీనితో దేవతలు, రాక్షసులు కలిసి మరలా క్షీరసాగర మథనం ప్రారంభించారు. ఈ మథనంలో క్షీరసముద్రం నుంచి ఐరావతం (తెల్లని ఏనుగు), కల్పవృక్షం (కోరిన కోర్కెలు తీర్చే వృక్షం), కామధేనువు (కోరిన కోర్కెలు తీర్చే గోవు), ఉచ్ఛైశ్రవం (తెల్లని గుర్రం), చంద్రుడు, లక్ష్మీదేవి ఉద్భవించారు. ఆ తరువాత కాలకూట విషం పెల్లుబికింది. ఈ ఉపద్రవం నుంచి జగత్తును రక్షించడానికి పరమేశ్వరుడు సిద్ధమయ్యాడు. విషాన్ని తన కంఠంలో బంధించి, గరళ కంఠుడు అయ్యాడు.
చివరకు పాలసముద్ర మథనంలో అమృతం ఉద్భవించింది. ఈ అమృతం కోసం దేవతలు, రాక్షసుల మధ్య తగవులాట మొదలైంది. దీనితో మరలా శ్రీమహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి, రాక్షసులను తన అందచందాలతో ఏమార్చి, అమృతాన్ని దేవతలకు మాత్రమే దక్కేటట్లు చేశాడు.
ఈ విధంగా రాక్షసుల నుంచి దేవతలకు రక్షణ కల్పించడానికి శ్రీకూర్మనాథుడు వైశాఖపూర్ణిమనాడు అవతరించాడు. అందుకే ఆ రోజును శ్రీకూర్మజయంతిగా జరుపుకుంటారు. ఈ కూర్మావతారానికి సంబంధించిన విశేషాలు భాగవతపురాణంలో, అగ్నిపురాణంలో, రామాయణం బాలకాండలో ఉన్నాయి.
శ్రీకూర్మం
శ్రీకాకుళం జిల్లాలో శ్రీకూర్మంలో శ్రీకూర్మనాథేశ్వరుని ఆలయం ఉంది. అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన ఈ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం భక్తుల కొంగుబంగారంగా భాసిల్లుతోంది. # శ్రీకూర్మావతారం #
ఇది గాక కర్నూలు జిల్లా ఆస్పరి దగ్గర ‘నల్లగట్టు శ్రీకూర్మనాథక్షేత్రం’ ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతోంది.
ఫలం: శ్రీకూర్మనాథుడిని సేవిస్తే సకల కార్యసిద్ధి కలుగుతుంది. వేదనలు తొలిగిపోయి సుఖశాంతులు చేకూరుతాయి.
ఊర్ములను నశింపజేయువాడు కూర్ముడు. ఊర్మి అనగా వేదన. ఆకలి, దప్పిక, దుఃఖం, మోహం, వృద్ధాప్యం, మరణం – ఈ ఆరింటిని షడూర్ములు అంటారు. వీటిని తొలగించేవాడే శ్రీకూర్మనాథుడు.
ఇదీ చదవండి: పులి – బాటసారి కథ
ఇదీ చదవండి: జింక- నక్క కథ