సింధు నాగరికత పార్ట్‌ 2

indus vally civilization

సింధు నాగరికత ప్రధాన పట్టణాలు

సింధు నాగరికిత ప్రధానంగా పట్టణ నాగరికత. ఈ నాగరికతకు సంబంధించిన 250కిపైగా పట్టణాలను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందులోని ముఖ్యపట్టణాల గురించిన సమాచారాన్ని ఒక పట్టిక రూపంలో ఇవ్వడమైనది. #సింధు నాగరికత పార్ట్‌ 2#

పట్టణం పేరు కనుగొన్న

సంవత్సరం

త్రవ్వకాలు నిర్వహించిన శాస్త్రవేత్త నది రాష్ట్రం
హరప్పా 1921 దయారాం సహాని రావి పంజాబ్‌ (పాకిస్థాన్‌)
మొహంజోదారో 1922 ఆర్‌.డి.బెనర్జీ సింధు నది కుడి ఒడ్డున సింధ్‌ (పాకిస్థాన్‌)
సత్కజెన్‌దారో 1931 ఆరియల్‌ స్టీన్‌ (Auriel Stein) దస్త్‌ బెలూచిస్థాన్‌ (పాకిస్థాన్‌)
చాన్హుదారో 1931 యం.జి.మజుందార్‌ సింధు నది ఎడమ ఒడ్డున సింధ్‌ (పాకిస్థాన్)
రంగపూర్‌ 1953 యం.ఎస్‌.వాట్స్‌ బాదర్‌ గుజరాత్‌
లోథాల్‌ 1955 యస్‌.ఆర్‌.రావ్‌ భొగావో గుజరాత్‌
రొపార్‌ 1955 వై.డి.శర్మ సట్లెజ్‌ పంజాబ్‌
కోట్‌డిజి 1955 యఫ్‌.ఏ.ఖాన్‌ సింధు సింధ్‌ (పాకిస్థాన్‌)
కాలిబంగన్ 1961 బి.బి.లాల్‌ ఘగ్గర్‌ (సరస్వతి) రాజస్థాన్‌
బనవాలి 1975 ఆర్‌.ఎస్‌.బిస్త్‌ సరస్వతి హరియాణా
ధోలవీర 1991 జె.పి.జోషి నది లేదు. అందుకే ఇక్కడ రిజర్వాయర్‌ నిర్మించారు. గుజరాత్‌
రాఖిగర్హి 1963 (1997 నుంచి త్రవ్వకాలు ప్రారంభమయ్యాయి) సూరజ్‌బన్‌ ఘగ్గర్‌-హక్ర లేదా ద్రిషద్వతి హరియాణా
మొహంజొదారో:
  • సింధి భాషలో మొహంజొదారో అంటే మృతులదిబ్బ అని అర్ధం. ఇక్కడి త్రవ్వకాల్లో కుషాణుల కాలం నాటి బౌద్ధ స్థూపం బయల్పడింది. ఈ నగరము ఏడు సార్లు వరదల్లో ధ్వంసమై తిరిగి నిర్మించబడింది.
  • మహాస్నానవాటిక (great bath – 391 x 231 x 81); మహాధాన్యాగారము (great granary 1501 x 501); అసెంబ్లీ హాల్‌ మరియు దేవాలయంలాంటి కట్టడము బయల్పడ్డాయి.
  • కాంస్యముతో చేసిన నాట్యగత్తె విగ్రహము (Bronze dancing girl – 14cms) మరియు స్టియటైట్‌తో చేసిన గడ్డపు మనిషి బొమ్మ (బహుశ పురోహితుడు  కావచ్చు!) లభించాయి.
  • మెసపుటేమియాకు చెందిన మూడు స్థూపాకారపు ముద్రికలు (Cylindrical seals) లభించాయి. ఇవి రెండు నాగరికతల మధ్య గల వ్యాపార సంబంధాలను తెలియజేస్తాయి.
  • కాంస్యముతో చేసిన రంపము మరియు రాగితో చేసిన రెండు ఖడ్గాలు లభించాయి.
  • పశుపతి మహాదేవ ఉన్న ముద్రిక మరియు ఎద్దు బొమ్మ ఉన్న ముద్రిక బయల్పడ్డాయి.
  • రాళ్ళతో చేసిన లింగాలు కూడా లభించాయి.
హరప్పా:
  • రెండు వరుసల్లో ఆరు ధాన్యాగారాలు బయల్పడ్డాయి. ఒక్కొక్క ధాన్యాగారము 501 X 501 పరిమాణంలో నిర్మించబడ్డాయి.
  • కాంస్యముతో చేసిన దర్పణాలు (Copper mirrors), ఎడ్లబండి మరియు కొలబద్ద (scale) లభించాయి.
  •  చెక్కతో చేసిన శవపేటిక లభించింది (wooden coffin).
  • కుమ్మరి చక్రం మరియు శ్రామికుల ఇరుకైన గదులతో కూడిన ఇళ్ళు బయల్బడ్డాయి.
  • నాట్యం చేస్తున్న పురుషుని బొమ్మ లభ్యమైంది.
చన్హుదారో:
  • సింధునాగరికతలో కోటలేని ఏకైక నగరము.
  • సిరాకుండ (ink pot) మరియు కాంస్యముతో చేసిన ఎడ్లబండి లభ్యమయ్యాయి.
  • పిల్లికి సంబంధించిన ఆధారాలు దొరికాయి.
లోథాల్‌:
  • గుజరాతీ భాషలో లోథాల్‌ అంటే మృతులదిబ్బ అని అర్థం. ఇది సింధు నాగరికత యొక్క ప్రధాన రేవు పట్టణం. ఇక్కడ ఓడరేవు (dockyard) ఉంది.
  • పర్షియన్ గల్ఫ్‌కు చెందిన ముద్రిక, ఓడబొమ్మ కలిగిన ముద్రిక దొరికాయి.
  • హోమగుండం (fire alter), చదరంగపు బల్ల (చెస్‌ బోర్డ్‌), టెర్రకోటతో చేసిన గుర్రపు బొమ్మ, బియ్యపు గింజ, కాంస్యముతో చేసిన స్కేల్‌ దొరికాయి.
  • ద్విఖననము (double burial) అంటే ఒకే సమాధిలో రెండు అస్థిపంజరాలు లభ్యమయ్యాయి.
  • బంగారం, ఇతర విలువైన రాళ్లతో చేసిన పూసలు, రాగి గాజులు లభించాయి.
కాలిబంగన్‌:
  • నాగలితో దున్నిన భూమి (furrows) బయల్పడింది.
  • ఏడు హోమగుండాలు మరియు జంతుబలులకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి.
బనవాలి:
  • సింధు నాగరికత యొక్క అద్భుతమైన నగర నిర్మాణశైలి బనవాలిలో కనిపించదు. రహదారులను క్రమపద్ధతిలో నిర్మించడము కాని, భూగర్భ మురికి కాలువల నిర్మాణము కాని ఈ నగరములో లేవు.
  • 11 గదులు కలిగిన ఒక భవనము బయల్పడింది.
  • టెర్రకోటతో చేసిన నాగలిబొమ్మ దొరికింది.
  • పులిబొమ్మ కలిగిన ముద్రిక లభించింది.
సర్కొటడ:
  • గుజరాత్‌లోని కఛ్‌ ప్రాంతములో ఉన్న నగరము.
  • గుర్రపు వాస్తవ అవశేషాలు లభించాయి. (ప్రారంభంలో పండితులు సింధు ప్రజలకు గుర్రం తెలియదని, ఆర్యులు గుర్రాన్ని భారతదేశానికి పరిచయము చేశారని భావించేవారు)
  • కుండల్లో శవాన్ని పెట్టి ఖననము చేసే పద్దతి ఇక్కడ కొనసాగింది.
ధోలవీర:
  • జలాశయము (రిజర్వాయర్‌) మరియు స్టేడియం బయల్పడ్దాయి. ఈ నగరము నది పరివాహక ప్రాంతంలో లేనందున వీరికి రిజర్వాయర్‌ నిర్మించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
  • ఇటీవల దీనిని ప్రపంచ వారసత్వ కేంద్రంగా యునెస్కో వారు గుర్తించారు.

సింధు నాగరికత – పట్టణ నిర్మాణం

సింధు నాగరికత అభివృద్ధి చెందిన పట్టణ నాగరికత, సింధు పట్టణాలన్నీ ఒకే ప్రణాళిక ఆధారంగా నిర్మించబడ్డాయి. ఉన్నత శాస్త్రసాంకేతిక పరిజ్ఞానముతో ప్రణాళికబద్దంగా కొనసాగిన పట్టణ నిర్మాణమే సింధు నాగరికత యొక్క విశిష్ట లక్షణం.

ప్రతి పట్టణం ఎగువ మరియు దిగువ పట్టణాలుగా, కోటగోడ ద్వారా విభజించబడ్డాయి. ఎగువ పట్టణంలో కులీన వర్గాలు (పాలకులు, పురోహితులు, వర్తకులు మరియు ఇతర ధనిక వర్గాలు) నివసించగా, దిగువ పట్టణంలో సామాన్య ప్రజలు జీవించేవారని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనిని బట్టి సింధునాగరికత ప్రజల్లో సామాజిక మరియు ఆర్థిక వ్యత్యాసాలు బలంగా ఉండేవని తెలుస్తుంది. అయితే ఈ క్రింది రెండు పట్టణాల్లో మాత్రము ఈ రకమైన విభజన కనిపించదు.

  • చాన్హుదారో: ఇక్కడ నగర విభజన స్పష్టంగా జరగలేదు. ఎగువ నగరము చుట్టూ కోట నిర్మించబడలేదు. అంటే కోటలేని ఏకైక నగరము చాన్హుదారో.
  • ధోలవీర: సింధు నగరాలన్నీ రెండు భాగాలుగా విభజించబడితే, ధోలవీర మాత్రము ఎగువ నగరం, మధ్య నగరము మరియు దిగువ నగరము అనే మూడు భాగాలుగా విభజించబడింది. అంటే ఈ నగరం భిన్నమైన ప్రణాళికతో నిర్మించబడింది.

సింధు నాగరికతలో ప్రధానంగా గ్రిడ్‌ పద్ధతిని అనుసరించి పట్టణ నిర్మాణము జరిగింది. రహదారులను వంకరలు లేకుండా నిర్మించారు.

అన్ని రహదారులు పరస్పరము 90 కోణంలో ఖండించుకుంటూ నగరాన్ని సమాన కొలతలు కలిగిన భాగాలుగా విభజించాయి. విహంగ వీక్షణములో ఈ నగరాలు చదరంగపు బల్ల (chess board)ను తలపిస్తాయి.

Note: హరియాణాలోని బనవాలిలో మాత్రం ఈ గ్రిడ్‌ నిర్మాణ పద్ధతిని అనుసరించలేదు.

భూగర్భ మురికి కాలువలు (underground drainage)

సింధు నగర నిర్మాణంలో మరొక విశిష్ట లక్షణం భూగర్భ మురికి కాలువలు (underground drainage). ప్రతి నగరములో మురికినీరు భూగర్భ కాలువల ద్వారా బయటకు వెళ్ళే ఏర్పాటు చేయబడింది. బనవాలి మినహా అన్ని నగరాల్లో భూగర్భ మురికి కాలువల నిర్మాణము జరిగింది.

సింధు ప్రజలు తమ ఇళ్ళకు కిటికీలు, తలుపులు రహదారి వైపు కాకుండా వెనుకవైపు ఏర్పాటు చేసుకున్నారు. బహుశా దుమ్ము, ధూళి ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు చేపట్టి ఉంటారు. ఒక లోథాల్‌లో మాత్రమే ఇళ్ళ తలుపులు, కిటికీలు ప్రధాన రహదారి వైపు నిర్మించారు. సింధు ప్రజలు ఆరోగ్యానికి మరియు పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని ఆర్‌.ఎస్‌.శర్మ అభిప్రాయపడ్డారు.

సింధు నాగరికత – సామాజిక వ్యవస్థ

సింధు నాగరికత యొక్క సామాజిక పరిస్థితులు తెలియజేసే ఖచ్చితమైన ఆధారాలు లభ్యంకాలేదు. అందువల్ల చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు సింధు నాగరికత యొక్క సామాజిక వ్యవస్థ గురించి కొన్ని అభిప్రాయాలను తెలియజేశారు.

  • సర్‌ జాన్‌ మార్షల్‌ అభిప్రాయం ప్రకారం, సింధు నాగరికతలో మాతృస్వామ్య వ్యవస్థ కొనసాగింది. సింధు ప్రజల ప్రధాన దైవం మాతృదేవత కావడం, త్రవ్వకాల్లో స్త్రీమూర్తుల బొమ్మలే అధికంగా లభించడంతో సింధు నాగరికతలో మహిళల ఆధిపత్యం ఉండి ఉండవచ్చని మార్షల్‌ అభిప్రాయపడ్డాడు.
  • ఆనాటి సమాజంలో కులవ్యవస్థ కనిపించదు. కులవ్యవస్థ తరువాతి కాలంలో ప్రవేశపెట్టబడింది. అయితే సమాజంలో తీవ్రమైన సామాజిక, అర్థిక వ్యత్యాసాలు, వివక్షతలు కొనసాగాయని చెప్పవచ్చు.
  • ధనికులు అందరూ కోటతో రక్షితమైన ఎగువ నగరంలో జీవించగా, సామాన్యులు దిగువ నగరంలో జీవించారు. అందువల్ల వీరి మధ్య సామాజిక సంబంధాలు కూడా బలహీనంగా ఉండేవని చెప్పవచ్చు.
  • అనాటి ప్రజలు నూలు మరియు ఉన్ని దుస్తులను ధరించారు. పట్టువస్త్రాలకు సంబంధించి ఆధారాలు లభ్యం కాలేదు.
  • గోధుమలు, బార్లీ ఆ కాలం నాటి ప్రధాన ఆహార ధాన్యాలు.

సింధు ప్రజలు అలంకార ప్రియులు కావడంతో అలంకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. దువ్వెనలు, దర్పణాలు, కాటుక, పెదాలకు వేసుకునే రంగులు (lipsticks) మొదలైన సౌందర్య సాధనాలు త్రవ్వకాల్లో లభించాయి. బంగారు, వెండి, వివిధ రంగుల వైఢూర్యాలు (gem stones) మరియు సముద్రపు గవ్వలు (shells) తో చేసిన ఆభరణాలను ధరించేవారు.

సింధు నాగరికత – రాజకీయ వ్యవస్థ

పురావస్తు త్రవ్వకాల్లో లభించిన వస్తు అవశేషాలు వారి పరిపాలన వ్యవస్థ గురించి సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో చరిత్రకారులు వివిధ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.

  • డి.డి.కౌశాంభి అనే చరిత్రకారుడు సింధు నాగరికత ఒక మతపరమైన రాజ్యమని (theocratic state) అని, దానిని పురోహితులు పాలించి ఉంటారని అభిప్రాయపడ్డారు. సమకాలీన మెసపుటేమియాను పురోహితులే పరిపాలించారు.
  • డి.డి.కౌశాంభి అభిప్రాయాన్ని ఆర్‌.ఎస్‌.శర్మ తిరస్మరించారు. సింధు పాలకులు మతానికి కాకుండా, వ్యాపార వాణిజ్యాలకు ప్రాధాన్యతనిచ్చారు. కాబట్టి  సింధు ప్రాంతాలను వర్తకులు పాలించి ఉండవచ్చని మరియు ఇది పూర్తిగా లౌకిక రాజ్యమని (Secular state) ఆర్‌.ఎస్‌.శర్మ అభిప్రాయపడ్డారు.
  • సింధు నాగరికతలో బలమైన కేంద్రీకృత పరిపాలన వ్యవస్థ కొనసాగి ఉండవచ్చని ఏ.యల్‌.భాషం అభిప్రాయపడ్డారు.
  • సింధు నాగరికత పట్టణాల్లో స్థానిక ప్రభుత్వాలు (మున్సిపల్‌ పాలన) ఉండవచ్చని గార్డన్‌ ఛైల్డ్‌ అభిప్రాయపడ్డాడు. పారిశుద్ధ్యం, వీధి దీపాలు, అద్భుతమైన నగర నిర్వహణ, స్థానిక ప్రభుత్వాలతోనే సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

సింధు నాగరికత – ఆర్థిక వ్యవస్థ

సింధు నాగరికత కాలంలో బలమైన మరియు అత్యంత సంపన్నమైన ఆర్థికవ్యవస్థ కొనసాగింది. #సింధు నాగరికత పార్ట్‌ 2#

వ్యవసాయం:

సింధు నాగరికత ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ (Agrarian economy). గోధుమలు, బార్లీ, ప్రత్తి, ఆవాలు, నువ్వులు, వివిధ రకాలైన పండ్లు, కూరగాయలను పండించారు.

  • వరికి సంబంధించిన ఆధారాలు లభించినప్పటికినీ, విస్తారంగా పండించబడలేదని చెప్పవచ్చు. లోథాల్‌లో బియ్యపుగింజ మరియు రంగపూర్‌ (గుజరాత్‌)లో వరి పొట్టు లభ్యమయ్యాయి. అయితే ఈ కాలంలో పప్పుదినుసులు మరియు చెరకు పండించిన ఆధారాలు లేవు.
  • సింధు ప్రజలకు నాగలి పరిజ్ఞానం ఉంది. బనవాలిలో టెర్రకోట (కాల్చిన బంకమట్టితో చేసిన నాగలి బొమ్మ మరియు కాలిబంగన్‌లో నాగలితో దున్నిన భూమి (furrows) బయల్పడ్డాయి.
  • భారతీయులకు గుర్రం తెలియదని, ఆర్యులే గుర్రాన్ని ప్రవేశపెట్టారనే అభిప్రాయముండేది. సింధు త్రవ్వకాల్లో గుర్రానికి సంబంధించిన ఆధారాలు బయల్పడటముతో ఈ వాదన తప్పని రుజువు అయినది. లోథాల్‌లో టెర్రకోటతో చేసిన గుర్రపు బొమ్మ మరియు సర్కొటడ (గుజరాత్‌)లో గుర్రపు అస్థిపంజరము బయల్పడ్డాయి. అయితే ఇది గుర్రపు అస్థిపంజరమా లేదా గాడిద అస్థిపంజరమా అనే విషయంలో పురావస్తు శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
పరిశ్రమలు:

సింధు నాగరికత కాలంలో వివిధ రకాలైన చేతివృత్తులు అభివృద్ధి చెందాయి. వస్త్ర పరిశ్రమ, కుండల పరిశ్రమ, తోలు పరిశ్రమ, ఇటుకల పరిశ్రమ, లోహ పరిశ్రమ, నౌక పరిశ్రమ, ఆభరణాల పరిశ్రమ మొదలైన పరిశ్రమలు సింధు నాగరికత కాలంలో అభివృద్ధి చెందాయి.

నౌకాపరిశ్రమ లోథాల్‌లో బయల్పడింది. పూసలు, గవ్వలతో ఆభరణాలు తయారుచేసే పరిశ్రమలు లోథాల్‌, చాన్హుదారో మరియు ధోలవీరలో బయల్పడ్డాయి. సింధు ప్రజలు రాగి మరియు కాంస్యముతో అనేక రకాలైన ఆయుధాలు మరియు పనిముట్లను తయారుచేశారు. వీరికి ఇనుము తెలియదు.

వ్యాపార వాణిజ్యాలు:

సింధు ప్రజలు కొనసాగించిన అంతర్గత, అంతర్జాతీయ వ్యాపారము సింధు నాగరికత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతము చేశాయి.

అంతర్గత వ్యాపారము ప్రధానంగా ఎడ్లబండ్లు ద్వారా, నదులపై పడవల ద్వారా కొనసాగింది. ప్రధాన నగరాలన్నీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండటముతో నదీ వ్యాపారము బాగా అభివృద్ధి చెందింది.

ఆనాటి సమకాలీన నాగరికతల్లో మెసపుటేమియాతో మాత్రమే సింధు ప్రజలు వ్యాపార సంబంధాలను కొనసాగించారు. (ఈజిప్టు నాగరికత మరియు చైనా నాగరికతతో సంబంధాలున్నట్లు ఆధారాలు లభించలేదు). విదేశీ వాణిజ్యములో సింధు నాగరికత ప్రధాన రేవు పట్టణమైన లోథాల్‌ కీలకపాత్ర పోషించింది.

మెసపటోమియా – సింధు నాగరికతల మధ్య వ్యాపార సంబంధాలు కొనసాగాయి అని చెప్పడానికి తిరుగులేని ఆధారాలు లభ్యమయ్యాయి. సింధు నాగరికత యొక్క చిత్రలిపి కలిగిన ముద్రికలు మెసపుటేమియలోని అనేక నగరాల్లోను మరియు మెసపుటేమియకు చెందిన ముద్రికలు మొహంజొదారోలోను లభ్యమయ్యాయి. అంతేకాకుండా క్యూనిఫాం లిపిలో వ్రాయబడిన మెసపుటేమియా శాసనాల్లో ప్రత్తిని ‘సింధన్‌’ అని, దానిని ‘మెలుహ’ అంటే (భారతదేశము) నుంచి దిగుమతి చేసుకున్నారనే సమాచారముంది.

సింధు ప్రజలు ప్రధానంగా ప్రత్తి, నూలు వస్త్రాలు, ఆహారధాన్యాలు, పూసలు మరియు గవ్వలతో చేసిన ఆభరణాలు, ఏనుగు దంతాలతో చేసిన వస్తువులు (ivory products) మొదలైనవి ఎగుమతి చేశారు. అలాగే బంగారు, వెండి, రాగి, తగరము మరియు విలువైన వైఢూర్యాలను దిగుమతి చేసుకొన్నారు.

సింధు నాగరికత – మత విశ్వాసాలు

సింధు ప్రజల మత విశ్వాసాలను ముద్రికలు, టెర్రకోట బొమ్మలు మరియు త్రవ్వకాల్లో బయల్పడిన వస్తు అవశేషాల ద్వారా తెలుసుకోవచ్చు.

  • వీరి ప్రధాన దైవము మాతృదేవత లేదా అమ్మతల్లి (Mother Goddess). టెర్రకోటతో చేసిన మాతృదేవత విగ్రహాలు అనేకచోట్ల లభ్యమయ్యాయి.
  • పశుపతి మహాదేవుడు సింధు ప్రజలు పూజించిన మరొక దైవము. మొహంజొదారోలో లభ్యమైన ఒక చతురస్రాకార ముద్రికపైన మూడు తలలు కలిగిన ఈ దేవుని చిత్రం ఉంటుంది. పశుపతి మహాదేవునికి ఇరువైపులా ఏనుగు, బర్రె, పులి, ఖడ్గమృగం బొమ్మలు ఉండగా, పాదాల దగ్గర రెండు జింకలు చిత్రించబడ్డాయి. ఈ దైవమే తరువాత హిందూమతంలో శివుడయ్యాడని (proto shiva) జాన్‌మార్షల్‌ అభిప్రాయపడ్డారు.
  • సింధు ప్రజలు స్త్రీ, పురుష జననాంగాలను కూడా పూజించారు. రాళ్ళతో చేసిన యోనిలు హరప్పాలోను, లింగాలు మొహంజొదారోలో బయల్పడ్డాయి.
  • వీరు ఎద్దు, పాము, చెట్లు మరియు పావురాలను పూజించారు.
  • జంతుబలులతో కూడిన యజ్ఞయాగాలు కూడా సింధుప్రజలు నిర్వహించారని ఆధారాలు లభ్యమయ్యాయి.
  • అనేక చోట్ల లభించిన తాయత్తులు సింధు ప్రజల మూఢ నమ్మకాలను తెలియజేస్తాయి.

సింధు నాగరికత కాలం నాటి వాస్తు శిల్ప కళలు

భారతదేశంలోని మొట్టమొదటి శిల్పకళ సింధు నాగరికత కాలానికి చెందినది. సింధు ప్రజలు స్నానవాటికలు, నివాస గృహాలు, ధాన్యాగారాలు లాంటి అవసరమైన కట్టడాలను మాత్రమే నిర్మించారు. అద్భుత కళాసౌందర్యమున్న కట్టడాలు మాత్రం నిర్మించలేదు. వీరు నిర్మించిన కట్టడాల్లో మొహెంజొదారోలోని మహాస్నానవాటిక అత్యంత ముఖ్యమైనది. 39 అడుగుల పొడవు, 23 అడుగుల వెడల్పు మరియు 8 అడుగుల లోతు కలిగిన దీని నిర్మాణానికి కాల్చిన ఇటుకలను, జిప్సంను ఉపయోగించారు. సింధు ప్రజలు బహుశా ఈ మహాస్నానవాటికను పవిత్ర స్నానాల కోసం ఉపయోగించి ఉండవచ్చని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.

సింధు నాగరికత కాలంలో బలమైన రాచరిక వ్యవస్థ లేకపోవడము, దేవాలయాలు మరియు విగ్రహారాధన లాంటి మత సాంప్రదాయాలు పరిపూర్ణంగా అభివృద్ధి కాకపోవడం వలన చెప్పుకోదగిన గొప్ప కట్టడాలు నిర్మించబడలేదు. అలాగని సింధు ప్రజలకు కళా నైపుణ్యం లేదని కూడా చెప్పలేము. వివిధ ప్రాంతాల్లో జరిపిన త్రవ్వకాల్లో సింధు కాలం నాటి గొప్ప కళాసౌందర్యమున్న అనేక వస్తువులు బయల్పడ్డాయి. అందులో కొన్ని ముఖ్యమైనవాటి గురించి తెలుసుకుందాం.

ముద్రికలు: స్టియటైట్‌తో చేసిన సుమారు 4000 ముద్రికలు సింధు త్రవ్వకాల్లో బయల్పడ్డాయి. అత్యంత చిన్న పరిమాణంలో ఉన్న ముద్రికలపైన దేవతలు, మనుషులు, జంతువుల చిత్రాలతో పాటు చిత్ర లిపి కూడా చెక్కడము వారి కళా నైపుణ్యానికి నిదర్శనము. మొహంజొదారోలో లభించిన ఒక ముద్రికపైన వారి దైవమైన పశుపతి మహాదేవుడితో పాటు ఏనుగు, పులి, బర్రె, ఖడ్గమృగముతో పాటు క్రింది భాగంలో రెండు జింకలను కూడా చిత్రీకరించారు. దీని పైభాగంలో చిత్రలిపి కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కేవలం ఒక అంగుళం పరిమాణంలోని ముద్రికపైన చిత్రీకరించడము చాలా గొప్ప విషయము. మొహంజొదారోలో లభ్యమయిన మరొక ముద్రికపైన ఎద్దు చెక్కబడింది. దీనిలో ఎద్దు యొక్క జాతి లక్షణాలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. #సింధు నాగరికత పార్ట్‌ 2#

మనుష్యుల బొమ్మలు: సింధు నాగరికత త్రవ్వకాల్లో అనేక చోట్ల టెర్రకోట మరియు లోహాలతో తయారుచేసిన బొమ్మలు లభించాయి. టెర్రకోటతో చేసిన మాతృదేవత విగ్రహాలు, మొహెంజొదారోలో లభ్యమైన కాంస్యపు నాట్యగత్తె విగ్రహం, స్టీయటైట్‌ చేసిన గడ్డపు మనిషి బొమ్మ, హరప్పాలో లభ్యమైన నృత్యం చేస్తున్న నగ్నపురుషుడి శిల్పం మొదలైనవి ఆనాటి శిల్పకళ నైపుణ్యానికి నిదర్శనాలు.

జంతువుల బొమ్మలు: రాగి, కాంస్యము మరియు మట్టితో చేసిన బొమ్మలు సింధు త్రవ్వకాల్లో విరివిగా లభ్యమయ్యాయి. దైమాబాద్‌ త్రవ్వకాల్లో కాంస్యముతో చేసిన ఏనుగు, ఖడ్గమృగము మరియు రథసారథితో పాటు రథము యొక్క బొమ్మలు బయల్పడ్డాయి. మట్టితో చేసిన జంతువుల బొమ్మలు, ఎడ్ల బండ్లు ఆనాటి ప్రజల శిల్పకళా చాతుర్యాన్ని తెలియజేస్తాయి.

సింధు నాగరికత శిల్పకళ భారతదేశంలో తర్వాత కాలాల్లో అభివృద్ధి చెందిన అత్యద్భుతమైన శిల్పకళకు మార్గదర్శకమైనదని చెప్పవచ్చు.

సింధు నాగరికత అంతం

ఆర్‌.ఎస్‌.శర్మ ప్రకారము సింధు నాగరికత క్రీ.పూ.2500లో ప్రారంభమై క్రీ.పూ.1750లో అంతమైంది. అయితే సింధు నాగరికత అంతానికి ఖచ్చితమైన ఆధారాలు మాత్రము లభించడం లేదు. అందుకే పండితులు అనేక అభిప్రాయాలు వెలిబుచ్చారు.

మార్టిమర్‌ వీలర్‌ (Mortimer Wheeler) ప్రకారము ఆర్యుల దండయాత్రల వలన సింధునాగరికత అంతం అయింది. సింధు నాగరికత చివరికాలంలో ఆర్యులు భారతదేశంలో ప్రవేశించి సింధు ప్రజలను ఓడించి నగరాలను ధ్వంసం చేశారని మార్టిమర్‌ వీలర్‌ అభిప్రాయపడ్డారు. యుద్ధ ప్రియులైన ఆర్యులు శాంతికాముకులైన సింధు ప్రజలను సునాయాసంగా ఓడించారు. సింధు ప్రజలు రక్షణ ఆయుధాలైన (కవచము, డాలు, శిరస్త్రాణం మొదలైనవి) ఉపయోగించకపోవడము వలన ఓటమి పాలయ్యారని వీలర్‌ అభిప్రాయపడ్డారు.

జి.ఎఫ్‌.డేల్స్‌ (G.F.Dales) ప్రకారం తరచుగా సంభవించే వరదల వలన సింధు నాగరికత అంతమయింది. ప్రకృతి సింధు నాగరికత యొక్క ప్రధాన శత్రువని డేల్స్‌ వ్యాఖ్యానించాడు.

  • మొహంజొదారో నగరము ఏడు సార్లు సింధు నది వరదల్లో ధ్వంసం అయ్యి, తరువాత పునర్నిర్మించబడింది.
  • చాన్హుదారో కూడా వరదల్లో ధ్వంసమైన ఇంకొక ప్రధాన నగరము.

రాబర్ట్‌.ఎల్‌.రైక్స్‌ (Robert L Raikes) ప్రకారము భూకంపాల (tectonic upliftment) వలన నదుల్లో ప్రవహించే నీరు శాశ్వతంగా నగరాల్లోకి చేరి నగరాలను అంతం చేసింది.

హెచ్‌.టి.ల్యాంబ్రిక్‌ (H.T.Lambrick) ప్రకారం నదులు తమ ప్రవాహ దిశను మార్చుకోవడము వలన అనేక పట్టణాలు నీటి ఎద్దడికి గురయ్యాయి. ఫలితంగానే ఆ పట్టణాలు క్రమంగా ఖాళీ చెయ్యబడ్డాయి.

డా.అగర్వాల్‌ ప్రకారము నదులు ఎండి నీటి కొరత వలన ప్రజలు పట్టణాలను విడిచి వెళ్ళిపోయారు. ముఖ్యంగా సరస్వతి పరివాహక ప్రాంతంలోని నగరాలు సరస్వతి నది ఎండిపోవడం వల్లనే అంతమయ్యాయి. (సరస్వతి నది ఎండిపోయి ప్రస్తుతం రాజస్థాన్‌లోని థార్‌ ఎడారిగా మారిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు).

ఫెయిర్‌సర్వీస్‌ (Fairservice): ఇతను తను రాసిన “Pre – Historic India” అనే గ్రంథంలో పర్యావరణ కారణాల వలనే సింధు నాగరికత అంతమైందని అభిప్రాయపడ్డారు. సింధు నాగరికత చివరి కాలంలో జనాభా అనూహ్యంగా పెరిగింది. దీనితో సహజంగానే సహజ వనరులపైన ఒత్తిడి పెరిగింది. అడవులను నరికి వెయ్యడం వలన నేల క్రమక్షయానికి (soil erosion) గురైంది. ఫలితంగా నదుల్లో పూడిక పెరిగి, తరచుగా వరదలు సంభవించాయి. చెట్లు నరికి వేయడం వలన వర్షపాతము క్రమంగా తగ్గుతూ ఆ ప్రాంతం నిస్సారంగా మారింది. సింధు ప్రజలు సహజ వనరులను విచక్షణా రహితంగా వాడుకొని పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీయమే, వారి పతనానికి కారణమైందని ఫెయిర్‌సర్వీస్‌ అభిప్రాయపడ్డారు.

క్రీ.పూ.1750 తర్వాత సింధు నాగరికత

క్రీ.పూ.1750లో సింధు నాగరికత అంతమైనదని చరిత్రకారులు విశ్వసిస్తున్నారు. ఆర్యుల దండయాత్రలు, వరదలు, భూకంపాల వలన సింధు నాగరికత అకస్మాత్తుగా అంతమయిందని కొందరు అభిప్రాయపడగా, ఒక పరిణామ క్రమంలో పర్యావరణ సమతౌల్యం దెబ్బతిని ఈ నాగరికత ముగిసిందని మరికొందరు వాదిస్తున్నారు. అయితే సింధు పట్టణాలు అంతమైన తర్వాత కూడా సింధు ప్రజలు గ్రామీణ ఆవాసాలను ఏర్పాటు చేసుకొని కొన్ని శతాబ్దాలు జీవించారని ఆధారాలు లభ్యమవుతున్నాయి.

క్రీ.పూ.1750 నుంచి క్రీ.పూ.1200 వరకు కొనసాగిన ఈ సంస్కృతికి Sub-Indus Culture అని నామకరణం చేసారు. ఇది పూర్తిగా గ్రామీణ నాగరికత. ఈ కాలంలో సింధు ప్రజలు, భారతదేశానికి వలస వచ్చిన తొలి ఆర్యులతో కలిసి జీవించారని పురావస్తు ఆధారాలు లభ్యమయ్యాయి. హరియాణాలోని భగవాన్‌పుర, పంజాబ్‌లోని కట్పలన్‌ మరియు జమ్ములోని మండ దగ్గర జరిగిన త్రవ్వకాల ద్వారా తొలి ఆర్యులు, మలికాలం నాటి సింధు ప్రజలు ఒకే ప్రాంతంలో నివసించారని తెలుస్తోంది. తొలి ఆర్యులు రచించిన ఋగ్వేదంలో కూడా లింగారాధకులైన సింధు ప్రజలతో ఆర్యులకున్న ఘర్షణ గురించి ప్రస్తావించబడింది.

సింధూ సంస్కృతి కొనసాగింపు

సింధు నాగరికత అంతానికి గల వివిధ కారణాలను కొంతమంది పండితులు అన్వేషిస్తుంటే, మరికొంతమంది అసలు సింధునాగరికత అంతమయ్యిందా? అని ప్రశ్నిస్తున్నారు. క్రీ.పూ.1750లో అంతమైంది కేవలం సింధు పట్టణాలే కాని సింధు సంస్కృతి కాదనే వాదన సమంజసంగా అనిపిస్తుంది. నాటి సంస్కృతి మరియు సాంప్రదాయాలు నేటికీ కొనసాగుతూ భారతదేశ జీవనవిధానంలో అంతర్భాగమయ్యాయి.

మత రంగాన్ని పరిశీలిస్తే, సింధు ప్రజలు పూజించిన పశుపతి మహాదేవుడిని నేడు శివుడిగా, మాతృదేవతను నేడు అమ్మవారి రూపంతో భారతీయులు నేటికి పూజిస్తున్నారు. అదేవిధంగా లింగారాధన చేయడం, ఎద్దులను, పాములను, చెట్లను పూజించే సాంప్రదాయాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. భూతప్రేత పిశాచాలను అంతం చెయ్యడానికి సింధు ప్రజలు ఉపయోగించిన తాయత్తులు, దేవతలను తృప్తిపరచడానికి చేపట్టిన యజ్ఞాలు, జంతుబలులను నేడు కూడా భారతీయులు పాటిస్తున్నారు.

ఆర్థికరంగంలో కూడా సింధునాగరికత కాలం నాటి పరిస్థితులు నేడు కూడా కొనసాగుతున్నాయి. సింధు నాగరికత కాలం నుంచి నేటి వరకు భారత ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపైన ఆధారపడి ఉంది. ఖరీఫ్‌ మరియు రబీ కాలంలో పంటలను పండించే సాంప్రదాయం కొనసాగుతోంది. సింధు కాలం నాటి ప్రధాన ఎగుమతులైన ఆహారధాన్యాలు, వస్త్రాలు, ఆభరణాలు నేటికి మన ముఖ్యమైన ఎగుమతులుగా కొనసాగుతున్నాయి. ఎంతో సాంకేతిక ప్రగతి సాధించిన ఆధునిక యుగంలో కూడా సింధు నాగరికత కాలం నాటి ఎడ్లబండ్లను రవాణా కోసం ఉపయోగించడము జరుగుతోంది.

సింధు కాలం నాటి సామాజిక సాంప్రదాయాలు, వ్యవస్థలు నేటికి చెక్కుచెదరలేదు. ఆనాటి ఆహారపు అలవాట్లు, దుస్తులు, అలంకరణలు, ఆభరణాలు ఇత్యాది అంశాల్లో ఎటువంటి మార్పులేదు.

ఆనాటి నగరాల్లోని భూగర్భ మురికి కాలువల నిర్మాణము, వీధి దీపాలు మరియు చెత్తకుండీలను ఏర్పాటు చెయ్యడము మొదలైనవి నేటి నగరాల్లో కూడా కనిపిస్తుంది.

తూనికలు – కొలతలకు 16 ప్రామాణికం కావడము కూడా కొనసాగుతోంది.

ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే, సింధు పట్టణాలు అంతమైనప్పటికి సింధు నాగరికత మాత్రము నేటికి సజీవంగా కొనసాగుతోందని అర్థమవుతుంది. ప్రముఖ చరిత్రకారుడు A.L.Bhasam చెప్పినట్లుగా భారత సంస్కృతి నిరంతరంగా కొనసాగే ఒక విశిష్టమైన సంస్కృతి. నాటి సింధు సంస్కృతి నేటి భారతదేశ సంస్కృతికి పునాదిగా మారింది.

Read హరప్పా నాగరికత

Read: Pre-Historic Cultures

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?