జింక- నక్క కథ

deer and fox story

మిత్రులారా! ఇంతకు ముందు మనం పావురం-ఎలుక కథ చదివాం కదా! ఇప్పుడు దాని తరువాత జరిగిన కథేంటో తెలుసుకుందాం.

(గమనిక: మీకో విషయం చెబుతాను. పంచతంత్రం కథలు అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ఒక కథలో మరో కథ అందులో మరిన్ని ఉపకథలు ఉంటాయి. అలాగే ఒక కథలోని పాత్రలు మరో కథలో కూడా ఉంటాయి. అందువల్ల చాలా శ్రద్ధగా వినండి. లేకుంటే మీకు తరువాతి కథలు సరిగ్గా అర్థంకావు. ( విష్ణుశర్మ రాసిన పంచతంత్రం కథలను యథాతథంగా, సరళంగా చెప్పడమే మా ప్రధాన ఉద్దేశం.)

హిరణ్యకుని మంచితనానికి ముగ్ధురాలైన లఘుపతనకం అనే కాకి ఎలాగైనా అతనితో స్నేహం చేయాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా హిరణ్యకుని కలుగు ముందు వాలింది.

కలుగులో ఉన్న హిరణ్యకునితో, “మిత్రమా హిరణ్యకా! ఒకసారి కలుగులోంచి బయటకు వస్తావా? అని పిలించింది.

“ఇప్పుడే కదా నా మిత్రుడు చిత్రగ్రీవుడికి వీడ్కోలు పలికింది. మళ్లీ ఎవరబ్బా నన్ను పిలిచేది!” అనుకుంటూ… ఆ ఎలుకల రాజు కలుగులోంచి కొంచెం బయటకు వచ్చి చూసింది. తన ఎదురుగా కాకి ఉండడం చూసి ఒక్కసారిగా ఉల్లిక్కిపడింది. అయ్యబాబోయ్ అనుకుంటూ, తుర్రున తన కలుగులోకి పారిపోయింది.

దీనితో లఘుపతనకం, “మిత్రమా! హిరణ్యకా నన్ను చూపి భయపడకు. నా పేరు లఘుపతనకం. ఆపదలో ఉన్న చిత్రగ్రీవుడికి… నిస్వార్థంగా నీవు చేసిన సాయం చూసి… నేను ఎంతో చాలా సంతోషించాను. నీ మంచితనానికి ముగ్ధురాలిని అయ్యాను. నాకు తెలిసి నీ అంత గొప్ప మనస్సున మూషికం మరెక్కడా లేదు. అందుకే నీతో స్నేహం కోరి వచ్చాను” అంది.

లఘుపతనకం మాటలు విన్న హిరణ్యకుడు, “చూడు నీవు కాకివి. నేను ఎలుకను. మన ఇరువురికి మధ్య జాతివైరం ఉంది. నేను నీకు దొరికితే కచ్చితంగా పొడిచి పొడిచి చంపి తింటావు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే మన మధ్య స్నేహమన్నది కలలో మాట” అని తేల్చిచెప్పేశాడు.

అందుకు లఘుపతనకం, “హిరణ్యకా! నన్ను నమ్ము. నేను నీకు ఎలాంటి హానీ తలపెట్టను” అంది.

దానికి హిరణ్యకుడు, “చూడు లఘుపతనకా! ‘సమాన వియ్యం సమాన కయ్యం’ అని నానుడి. అంటే మనతో సమానమైన వారితోనే మనం స్నేహం చేయాలి. అయితే మనమిద్దరం ఏ రకంగానూ సమానులం కాదు. నీతో స్నేహం చేస్తే అది నా ప్రాణాలకే ప్రమాదం. వెనుకటికి ఓ అమాయకపు జింక, జిత్తులమారి నక్కతో స్నేహం చేసి, ప్రాణాలమీదికి తెచ్చుకున్న కథ నీకు తెలుసుగా!” అంది.

లఘుపతనకం ఆశ్చర్యపోతూ… “మిత్రమా! జింక – నక్క కథ నాకు తెలియదు” అని చెప్పింది. అయితే చెబుతాను విను అంటూ హిరణ్యకుడు జింక- నక్క కథ చెప్పడం ఆరంభించాడు.

                             జింక- నక్క కథ

“అనగనగా ఓ గొప్ప రాజ్యం. ఆ రాజ్యం పేరు మగధ. అందులో మందావతి అనే మహారణ్యం ఉంది. అందులో ఓ జింక, కాకి ఉండేవి. అవి రెండూ చాలా మంచి స్నేహితులు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్నేహం వారిది. ఎప్పుడూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ హాయిగా జీవనం సాగించేవి.

అడవి సుభిక్షంగా ఉండడంతో జింకకు కావాల్సినంత ఆహారం దొరికేది. దానితో పుష్టిగా తిని ఆ జింక చాలా బలిష్టంగా తయారైంది. ఎప్పుడూ ఉత్సాహంగా చెంగుచెంగున ఎగురుతూ అడవిలో కలియదిరిగేది.

అదే అడవిలో సుబుద్ధి అనే నక్క కూడా ఉండేది. అది పేరుకే సుబుద్ధి… కానీ నిజానికి అది జిత్తులమారి నక్క. ఒక రోజు ఆ గుంటనక్క అడవిలో స్వేచ్ఛగా విహరిస్తున్న ఈ జింకను చూసింది. “భలే ఉంది జింక. ఆహా! చూస్తుంటేనే నోరు ఊరిపోతోంది” అనుకుంది.

అయితే జింక బాగా బలిష్టంగా ఉంది. దాన్ని తరిమితే పారిపోతుంది. కనుక దానిని వేటాడి చంపడం కుదరదు. అందువల్ల ఈ జింకను తినాలంటే మంచి మాయోపాయం పన్నాలి అని నక్క అనుకుంది.

అనుకున్నదే తడవుగా జింక దగ్గరకు వెళ్లింది. నక్కను చూసిన జింక, భయంతో పారిపోవడానికి సిద్ధమయ్యింది.

వెంటనే ఆ నక్క, “మిత్రమా! భయపడకు. నేను నిన్ను ఏమీ చేయను” అని అభయమిచ్చింది. దీనితో జింక కాస్త స్థిమితపడి, పక్కగా నిలబడింది.

తరువాత ఆ నక్క… “మిత్రమా! నా పేరు సుబుద్ధి. నేను ఒంటరిదాన్ని. నాకంటూ ఈ అడవిలో ఎవరూ లేరు. మూగజీవాలను వేటాడవద్దు అన్నందుకు… తోటి నక్కలు నన్ను విడిచిపెట్టేశాయి. దానితో నేను దిక్కులేని దాన్ని అయిపోయాను. అందుకే నీలాంటి మంచి వాడితో స్నేహం చేయడానికి వచ్చాను. అయితే నీవు కూడా నన్ను దూరం పెడుతున్నావు” అంటూ మొసలికన్నీరు కార్చింది.

పాపం అమాయకురాలైన ఆ జింక… ఆ జిత్తులమారి నక్క మాటల్ని నమ్మేసింది. నక్కను ఓదారుస్తూ, “బాధపడకు మిత్రమా! నేను నీతో తప్పకుండా స్నేహం చేస్తాను. రా…! మనమిద్దరం కలిసి మా ఇంటికి వెళ్దాం” అని అంది.

అమాయకపు జింక తన బుట్టలో పడిపోయిందని… ఆ నక్క మనస్సులోనే తెగ సంబరపడిపోయింది. వెంటనే, “చాలా సంతోషం మిత్రమా! నీలాంటి మంచివాడి స్నేహం దొరకడం నా అదృష్టం. ఇక నిన్ను విడిచిపెట్టను. పద మీ ఇంటికి వెళ్దాం” అని అంది.

రెండూ కలిసి జింక ఇంటికి వెళ్లాయి. చెట్టుపైన ఉన్న కాకి… నక్కను చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే జింకతో, “మిత్రమా! మన ఇంటికి ఈ నక్కను ఎందుకు తీసుకొచ్చావ్‌? అది ఎంత ప్రమాదమో తెలుసా? అని హెచ్చరింది.

దీనితో జింక, “మిత్రమా! ఈ నక్క పేరు సుబుద్ధి. చాలా మంచిది. మనతో స్నేహం కోరుకుంటోంది. పాపం తనకు ఎవరూ లేరు. దిక్కూమొక్కూ లేకుండా తిరుగుతుంటే, నేనే జాలిపడి మన ఇంటికి తీసుకొచ్చాను” అని అంది.

వెంటనే కాకి, “నక్కతో జింకకు స్నేహమా? విడ్డూరం కాకపోతేనూ. నిజానికి మనం కొత్తవారిని వెంటనే నమ్మేయకూడదు. దాంట్లోనూ ఈ నక్కను అసలు నమ్మకూడదు. ఎందుకంటే పూర్వం ఓ గండు పిల్లిని నమ్మి, ముసలి గద్ద ప్రాణాలు కోల్పోయిన కథ నీకు తెలుసుకదా!” అంది.

“పిల్లి- ముసలి గద్ద కథ… నాకు తెలియదు మిత్రమా! నాకోసం ఒక్కసారి ఆ కథ చెప్పవూ” అంది జింక. దీనితో కాకి కథ చెప్పడం ప్రారంభించింది.

                   పిల్లి- ముసలి గద్ద కథ

cat and old hawk story


వెనుకటికి గంగానదీ తీరాన ఓ జువ్విచెట్టు ఉండేది. దాని తొర్రలో జరద్గవం అనే ముసలి గద్ద ఉండేది. అది గుడ్డిది కూడా కావడంతో ఎక్కడకీ వెళ్లలేక ఆకలితో అలమటిస్తూ ఉండేది. దాని అవస్థ చూసి జాలిపడిన తోటి పక్షులు… ప్రతిరోజూ తమ పిల్లల కోసమే కాకుండా, దీనికి కూడా ఆహారం తీసుకొచ్చి ఇస్తూ ఉండేవి.

ఒక రోజు ఆ పక్షులన్నీ కలిసి, ఈ గుడ్డి గద్దతో, “చూడు జరద్గవమా! నీవు చూస్తే ముసలిదానివి. అందులోనూ గుడ్డిదానివి. కనుక నీవు వేటకు వెళ్లలేవు. మేమంటావా… తిండి కోసం వేటకు వెళ్లక తప్పదు! అందువల్ల మేము గూడికి చేరే వరకు మా పిల్లలకు కాపలా ఉండు. మేము సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు నీకు ఎప్పటిలాగే మంచి ఆహారం తెస్తాము” అన్నాయి.

దానికి ముసలి గద్ద, “ఎంత మాట! మీరు నాకు చాలా సాయం చేస్తున్నారు. అందుకు ప్రతిగా నేను కూడా నాకు వీలైన సాయం చేస్తాను. తప్పకుండా మీ పిల్లలకు కాపలా ఉంటాను. వారిని కంటికి రెప్పలాగా చూసుకుంటాను” అని మాట ఇచ్చింది. దీనితో పక్షులన్నీ ఎంతో సంతోషించాయి.

ప్రతిరోజూ ఆహారం తెచ్చి తమ పిల్లలతో పాటు ఈ ముసలిగద్దకు కూడా పంచి ఇచ్చేవి. ఇలా కొంత కాలం గడిచింది.

ఒక రోజు ఓ గండుపిల్లి ఆహారం వెతుక్కొంటూ, ఈ ముసలి గద్ద ఉంటున్న చెట్టు దగ్గరకు వచ్చింది. ఆ చెట్టుపైన ఉన్న పక్షి పిల్లలను చూసి దాని నోరు ఊరింది. వెంటనే గబగబా చెట్టు ఎక్కంది. దీనితో పక్షి పిల్లలన్నీ భయంతో అరవడం మొదలు పెట్టాయి. ఆ అరుపులు విన్న ముసలి గద్ద, ఎవరో వచ్చారని గ్రహించింది.

వెంటనే, “ఎవరది?” అని గట్టిగా గద్దించి అడిగింది. ఉలిక్కిపడిన పిల్లి, ఆ గద్దను చూసి భయపడి, వెనక్కు తగ్గింది. లేలేత మాంసం తినాలన్న ఆతృతతో అది గద్దను చూసుకోలేదు. ఇప్పుడు ఒక్కసారిగా దానిని చూసి బిత్తరపోయింది.

అయితే చూస్తూ, చూస్తూ ఆ లేలేత పిల్లల మాంసాన్ని వదులుకోవడం ఆ పిల్లికి ఇష్టంలేదు. ఎలాగైనా వాటిని తినాలని నిర్ణయించుకుంది. అలా జరగాలంటే, ఈ ముసలి గద్దను మాయోపాయంతో బుట్టలో వేసుకోవాలని పిల్లి గ్రహించింది. గజగజా వణుకుతూ నెమ్మదిగా గద్ద దగ్గరకు చేరుకుంది.

ఎవరో తన దగ్గరకు వచ్చారని జరద్గవం గ్రహించింది. “ఎవరు నీవు? ఇక్కడకు ఎందుకు వచ్చావు?” అని గట్టిగా గద్దించి అడిగింది. ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఆ పిల్లి, నెమ్మదిగా తేరుకుని, “పక్షిరాజా! నేను ఓ పిల్లిని. నా పేరు దీర్ఘకర్ణం” అని చెప్పింది.

“పిల్లివా! అయితే ఇక్కడ నీకేం పని?” అని బెదిరించింది ఆ గద్ద.

అందుకు ఆ పిల్లి…  “అయ్యా! నేను మీతోనే ఓ పని ఉండి వచ్చాను” అంది.

గద్ద ఆశ్చర్యపోతూ, “పిల్లివైన నీకు నాతో పనా? ఏంటది?” అని ప్రశ్నించింది.

గద్ద మెల్లగా తన దారిలోకి వస్తోందని గ్రహించిన ఆ పిల్లి… “పక్షి రాజా! నేను మిగతా పిల్లుల్లా కాదు. మాంసాహారం మానేసి, పూర్తిగా శాఖాహారిగా మారిపోయాను. పూర్వం చేసిన పాపాలను గడిగేసుకోవడానికి, నిత్యం పవిత్ర గంగానదిలో స్నానం చేస్తున్నాను. పూర్తి బ్రహ్మచర్యం పాటిస్తూ, చాంద్రాయణ వ్రతం చేస్తున్నాను” అని చెప్పింది.

అంతా విన్న ఆ ముసలి గద్ద, “ఓహో, అలాగా ఇంతకీ నీకు నాతో పనేంటి?” అని మళ్లీ ప్రశ్నించింది.

ముసలి గద్ద నెమ్మదిగా బుట్టలో పడుతోందని గ్రహించిన ఆ పిల్లి… “ ఓ పక్షిరాజా, మీ గురించి నేను చాలా గొప్పగా విన్నాను. మీరు చాలా గొప్పవారని, నీతిశాస్త్రాలన్నింటినీ పుక్కిటపట్టారని నాకు తారసపడిన అందరినోటా విన్నాను. అందుకే మిమ్మల్ని కలవాలని, మీ నుంచి గొప్ప విషయాలు తెలుసుకోవాలని వచ్చాను. మీ దయ ఉంటే మీ ఆశ్రయంలో ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కాదంటే చెప్పండి… మరెప్పుడూ మీకు ఇలా ఇబ్బంది కలిగించను. ఎక్కడి నుంచి వచ్చానో, అక్కడికే వెళ్లిపోతాను” అని అంది.

ఓ పిల్లి తనను చాలా గొప్పవాడవని పొగడడంతో… గద్దకు చాలా ఆనందం వేసింది. చాలా గర్వంగానూ అనిపించింది. దీనితో, “సరే దీర్ఘకర్ణ! నీవేమీ బాధపడకు. అయితే ఈ చెట్టుపై చాలా పక్షి పిల్లలు ఉన్నాయి. వాటి రక్షణ బాధ్యత నాపై ఉంది. కనుక నీవు ఇక్కడ ఉండడానికి వీలుపడదు” అని చెప్పింది.

వెంటనే ఆ పిల్లి, “పక్షిరాజా! నేను మాంసాహారం మానేశానని ముందే మీకు చెప్పాను. జీవహింస ఘోర పాపమని, భూతదయే గొప్ప ధర్మమని మీ లాంటి పెద్దల వలన నేను తెలుసుకున్నాను. అందువల్ల ఈ లేత పక్షి పిల్లలను అసలే ముట్టుకోను. మీతో పాటే నేను కూడా ఆ పక్షి పిల్లలకు కాపలాగా ఉండి, వాటిని రక్షిస్తాను. నన్ను నమ్మండి” అని చెప్పింది.

పాపం ఆ ముసలి గద్ద… పిల్లి మాటలను గుడ్డిగా నమ్మేసింది. వెంటనే “దీర్ఘకర్ణా! నీవు ఇంత మంచివాడవని తెలియక తొందరపడ్డాను. మరేమీ అనుకోకు. ఇకపై నీవు కూడా నాతో ఉండొచ్చు” అని అభయమిచ్చింది.

తన పథకం పారినందుకు ఆ పిల్లి మనస్సులోనే చిందులు వేసింది. చక్కగా మిగతా పక్షులకు తెలియకుండా, గద్ద ఉండే తొర్రలోనే ఉండసాగింది.

ఇలా కొద్ది రోజులు గడిచిన తరువాత… ఆ పిల్లి… గద్దకు తెలియకుండా చెట్టుపైకి ఎక్కి పక్షి పిల్లలను చంపడం, వాటిని గద్ద తొర్రలోకి తెచ్చి తినడం ప్రారంభించింది. తినగా మిగిలిన ఎముకలను కావాలనే ఆ తొర్రలో విడిచిపెట్టేసేది. పాపం ఆ గద్దకు ఈ విషయం ఏమీ తెలియకపోవడం వల్ల, పిల్లిని గుడ్డిగా నమ్ముతూనే ఉండేది.

అయితే తరచుగా తమ పిల్లలు మాయమవుతుండడంపై మిగతా పక్షులు చాలా ఆందోళన చెందాయి. తమ పిల్లలకు ఇంకా రెక్కలు రాలేదు. కనుక ఎగరలేవు. పోనీ గూటిలో నుంచి కింద పడ్డాయా? అంటే అదీ లేదు. దీనితో తమ పిల్లల ఆచూకీ కోసం పక్షులు వెదకసాగాయి.

ఇదంతా దొంగచాటుగా చూసిన పిల్లి, ఇంకా ఇక్కడే ఉంటే ప్రమాదమని గ్రహించి, అక్కడి నుంచి ఉడాయించింది.

పక్షులు వెతగ్గా వెతగ్గా తమ పిల్లల ఎముకలు గుడ్డి గద్ద తొర్రలో కనిపించాయి. దీనితో వాటి ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

పోనీలే పాపం అని ముసలి గద్దకు ఆశ్రయం కల్పించి, ఆహారం అందిస్తే… అది తమ పిల్లలనే చంపేసిందని వాపోయాయి. పట్టరాని కోపంతో మూకుమ్మడిగా ముసలి గద్దపై దాడి చేసి చంపేశాయి. పాపం పిల్లి చేసిన మోసానికి ముసలి గద్ద ప్రాణాలు కోల్పోయింది. అందుకే కొత్త వాళ్లను వెంటనే నమ్మకూడదు. నమ్మితే కష్టాలు తప్పవు” అని కథ ముగించింది కాకి.

దీనితో జింక… ఒకింత అనుమానంతో నక్క వంక చూసింది.

                           *మిత్రులారా కథ ఇంకా ఉంది… వేచి ఉండండి*

ఇదీ చూడండి: పులి – బాటసారి కథ

ఇదీ చూడండి: ఏమిటి ఈ ‘మనిషి’ బ్రతుకు?

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?