తెలుగు భాషా ప్రియుల కోసం బద్దెన కవి రచించిన సుమతీ శతకంలోని కొన్ని అమృతమయ పద్యాలు. # అమృతమయం #
పద్యం – 1
ధీరులకు జేయు మేలది
సారంబుగ నారికేళ సలిలముభంగిన్
గౌరవమున మణి మీదట
భూరి సుధావహమునగును భువిలో సుమతీ
తాత్పర్యం:
నారికేళ వృక్షమునకు ఎంత నీరుపోసి పెంచిన, అది అంత బలవంతమై నారికేళములిచ్చును. అటులనే శ్రేయోభిలాషులకు చేసిన ఉపకారం అనునది ఉచితమైనది. అది గౌరవమును, సుఖోన్నతిని కలుగజేయును.
పద్యం – 2
లావు గలవాని కంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాఁ డెక్కినట్లు మహిలో సుమతీ.
తాత్పర్యం:
శరీర బలము గలవాని కంటే బుద్ధి బలము గల మానవుడు శక్తిమంతుడు. ఎట్లనగా గొప్ప బలము గల ఏనుగును మావటివాడు స్వారీ చేస్తుండడం ఇందుకు నిదర్శనం.
పద్యం – 2
శుభమున నొందని చదువును
నభినయమును రాగరసమునందని పాటన్
అభిలాష లేని కూటము
సభ మెచ్చని మాటలెల్లఁ జప్పన సుమతీ
తాత్పర్యం:
ప్రయోజనం లేని విద్య, నటనకు, రాగానికి సంబంధములేని పాట, కోరికలేని సాంగత్యం, సభ మెచ్చని వాక్యాలు రసహీనం అనగా అవి పూర్తిగా వ్యర్థం.
ఇదీ చూడండి: అర్జున x ఆదియోగి: గెలుపెవరిదో తెలుసా?
ఇదీ చూడండి: ప్రజాకవి వేమన పద్యరత్నాలు