పూర్వం చంద్రవంశంలో నందుడు అనే రాజు ఉండేవాడు. అతనికి ధర్మగుప్తుడు అనే కుమారుడు కలిగాడు. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడయ్యాక రాజ్యభారాన్ని అప్పగించి అరణ్యవాసానికి వెళ్లిపోయాడు నందుడు.
ధర్మగుప్తుడు రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడు. ఓనాడు వేట కోసం అడవికి వెళ్లాడు. చాలా సేపటి వరకు వేటాడి బాగా అలసిపోయాడు. అప్పటికే బాగా పొద్దుపోయింది. ఆ సమయంలో ఒక సింహం ధర్మగుప్తుడిపైకి లంగించబోయింది. దీనితో భయపడిపోయిన అతను పక్కనే ఉన్న ఓ చెట్టుపైకి ఎక్కాడు. కానీ ఆ చెట్టుపై అంతకుముందే ఓ ఎలుగుబంటి ఉంది. దానిని చూసి భయపడపోయాడు ధర్మగుప్తుడు. కానీ ఆ ఎలుగుబంటి రాజుతో మానవభాషలో, ఓ రాజా! మీరేమీ భయపడకండి. నేను నిన్ను ఏమీ చేయను. ఆ సింహం చెట్టు క్రిందే ఉంది. అది ఇక్కడి నుంచి వెళ్లేదాకా, మీరు కాసేపు నిశ్చింతగా విశ్రాంతి తీసుకోండి. నేను మీకు కాపలాగా ఉంటాను అంది. అప్పటికే బాగా అలసిపోయిన ధర్మగుప్తుడు ఎలుగుబంటి ఇచ్చిన అభయంతో, ఆదమరిచి నిద్రపోయాడు. # నమ్మకద్రోహి #
అప్పుడు సింహం… ఎలుగుబంటిని చూసి, ఆ రాజును నాకు ఆహారంగా క్రిందకు పడవెయ్యి అన్నది. అందుకు ఎలుగు, నేను అతనికి అభయమిచ్చాను. అతనికి ద్రోహం తలపెట్టలేను అంది.
కొంత సేపటి తరువాత రాజు నిద్రలేచాడు. ‘ఇప్పటి వరకు నేను విశ్రాంతి తీసుకున్నాను. ఇప్పుడు నీవు కాస్త విశ్రమించు’ అని ఎలుగుబండితో అన్నాడు. దీనితో ఆ ఎలుగుబంటి నిద్రకు ఉపక్రమించింది.
అప్పుడు సింహం రాజుతో, ఆ ఎలుగును నాకు ఆహారంగా క్రిందకు తోసేయ్. దానిని తిని నేను ఆకలి తీర్చుకుంటాను. ఆ తరువాత నిన్ను ఏమీ చేయకుండా విడిచిపెడతాను అంది. దీనితో ధర్మగుప్తుడు సహజమైన మానవప్రవృత్తితో కృతఘ్నుడై ఎలుగును క్రిందకు తోసేశాడు.
కానీ మగతనిద్రలో ఉన్న ఆ ఎలుగు గభాలున ఒక చెట్టుకొమ్మను పట్టుకొని పైకొచ్చింది. నమ్మకద్రోహం చేసిన ధర్మగుప్తుని ఉద్దేశిస్తూ, ‘నీవు కృతఘ్నుడివి. నమ్మకద్రోహానికి పాల్పడి మహాపాపం చేశావు. కాబట్టి ఇక నుంచి మతిభ్రమించి పిచ్చివాడవై పోదువుగాక’ అని శపించింది. దీనితో ఆ రాజు పిచ్చివాడై అడవిలో దిక్కూమొక్కూ లేకుండా తిరగసాగాడు. # నమ్మకద్రోహి #
(# నమ్మకద్రోహి # కథ స్కాంద పురాణంలో ఉంది.)
ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, నమ్మినవారికి ద్రోహం చేస్తే, ఆ పాపానికి తగ్గ ప్రతిఫలం పొందక తప్పదు.
ఇదీ చూడండి: పులి – బాటసారి కథ
ఇదీ చూడండి: చరిత్ర అధ్యయనం – ఆధారాలు