ఒకనాడు కొండవీటి సీమ నుంచి ఒక పండితుడు హంపి విజయనగర పాలకుడు శ్రీకృష్ణదేవరాయలవారి ఆస్థానానికి వచ్చాడు. రాయలవారి సభలో “మహారాజా! నేను మా ప్రభువు అల్లయ వేమారెడ్డిగారి మీద ఒక పద్యాన్ని చెప్పాను. దానికి అర్థాన్ని చెప్పగలిగిన పండితులు ఎవ్వరూ ఇంతవరకూ నాకు కనిపించలేదు. తమ ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉన్నారని విన్నాను. అందుకే నా పద్యానికి, మీ ఆస్థాన కవిపండితులు ఎవరైనా అర్థాన్ని వివరిస్తారేమోనని ఇలా వచ్చాను” అన్నాడు. # వికటకవి తెనాలి రామకృష్ణ కథలు #
ఏదీ ఆ పద్యం ఒకసారి చదవండి అని రాయలవారు అడిగారు. అప్పుడు ఆ పండితుడు పద్యాన్ని ఇలా చెప్పాడు.
సీ: “రాజనందన రాజ రాజాత్మజుల సాటి
తలప నల్లయ వేమ ధరణి పతికి
రాజనందన రాజ రాజాత్మజుల సాటి
తలప నల్లయ వేమ ధరణి పతికి
రాజనందన రాజ రాజాత్మజుల సాటి
తలప నల్లయ వేమ ధరణి పతికి
రాజనందన రాజ రాజాత్మజుల సాటి
తలప నల్లయ వేమ ధరణి పతికి
గీ. భావ భవ భోగ సత్కళా భావములను
భావ భవ భోగ సత్కళా భావములను
భావ భవ భోగ సత్కళా భావములను
భావ భవ భోగ సత్కళా భావములను”
మేక తోకకి మేక!
పద్యాన్ని విన్న సభలోని కవి, పండితులు ఒకింత ఆశ్చర్యపోయారు. దీనికి అర్థమేమిటో తెలియక తికమకపడ్డారు. అయితే సభలోనే ఉన్న వికటకవి రామలింగడు పైకిలేచి, “పండితులవారు చెప్పిన పద్యానికి నేను అర్థం చెబుతాను. కానీ ఈలోగా నేను చెప్పిన పద్యానికి అర్థ వివరణలు చేప్తారా? పండితులవారు” అంటూ ఓ పద్యాన్ని సభాసదులకు వినిపించాడు.
సీ. “మేకతోకకు మేక తోక మేకకు మేక
మేకతోకకు మేక తోక మేక
మేకతోకకు మేక తోక మేకకు మేక
మేకతోకకు మేక తోక మేక
మేకతోకకు మేక తోక మేకకు మేక
మేకతోకకు మేక తోక మేక
మేకతోకకు మేక తోక మేకకు మేక
మేకతోకకు మేక తోక మేక
గీ. మేక తొకతోక తొకతోక తోకమేక
మేక తొకతోక తొకతోక తోకమేక
మేక తొకతోక తొకతోక తోకమేక
మేక తొకతోక తొకతోక తోకమేక”
రామలింగడి పద్యం విని సభ మొత్తం నవ్వులతో నిండిపోయింది. పద్యం బాగుందికానీ దానికి అర్థం ఏమిటో ఏ ఒక్కరికీ అర్థం కాలేదు. రాయలసభకు వచ్చిన ఆ మహాపండితుడు కూడా ఈ పద్యానికి అర్థం వివరించలేనని వినమ్రంగా ఒప్పుకున్నాడు. # వికటకవి తెనాలి రామకృష్ణ కథలు #
అప్పుడు రామలింగడు, మహాప్రభూ! “పండితులవారు చెప్పిన పద్యానికి భావం చెబుతా వినండి అంటూ, “అల్లయ వేమారెడ్డి మహారాజుకు తెలివిలో చంద్రుడి కుమారుడైన బుధుడు, ఐశ్వర్యంలో ఈశ్వరుడు, వైభవంలో దేవేంద్రుడు, విద్యలో బ్రహ్మదేవుడు మాత్రమే సమానులు కాని ఇతరులు కారు” అని పద్యానికి అర్థతాత్పర్యాలు వివరించాడు. అది విని కొండవీటి పండితుడు తన ఓటమిని ఒప్పుకున్నాడు.
దీనితో శ్రీకృష్ణదేవరాయలవారు, రామకృష్ణకవి చమకృతిని, విజ్ఞానాన్ని సభాసముఖంగా అభినందించాడు. అలాగే ఆంధ్రభోజుడు, కవిజన పక్షపాతి అయిన శ్రీకృష్ణదేవరాయలు, ఆ కొండవీటి పండితుణ్ణి కూడా ఘనంగా సత్కరించి, సగౌరవంగా కొండవీటికి సాగనంపాడు.
ఇదీ చదవండి: పులి – బాటసారి కథ
ఇదీ చదవండి: పంచతంత్రం