సిరిగల మాతల్లి పైడితల్లమ్మ సిరిమానోత్సవం

paiditalli sirimanotsavam

పండుగలు సంప్రదాయాలకు ప్రతీకలు. పూర్వీకుల సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు అందించే వారధులు. వేడుకలనంగానే ప్రధానంగా గుర్తుకొచ్చేవి తెలుగు పండుగలే. ఒకటా రెండా తెలుగు వారి మనసుల్లాగానే.. వారికి రోజూ పండుగలే. # సిరిగల మాతల్లి పైడితల్లమ్మ సిరిమానోత్సవం #

దసరా వేడుక ముగిసినా ఉత్తరాంధ్ర ప్రాంతమైన విజయనగరంలో మరోసారి పండగ వాతావరణం మొదలవుతుంది. ఊరూ వాడా సందడిగా.. ఏ ఇంట చూసిన పండుగగా… కనుబడుతుంది. ఆ ఊత్సవమే ఉత్తరాంధ్రలో పేరుగాంచిన పైడితల్లమ్మ జాతర. ప్రతి కన్ను పైకి చూస్తుంది.. ప్రతి అడుగు జాతరవైపు పడుతుంది. నేలంతా రంగవళ్లికల తివాచి పరచుకుని ఉంటాయి.

పైడితల్లికి ప్రతీకగా చూసుకునే సిరిమాను ముందుకు కదులు తుంది. నేలతల్లి పులకరిస్తుంది. జనుల కళ్లన్నీ సిరిమానుపై ఊరేగుతున్న అమ్మను చూస్తూ… మనసు భక్తి పారవశ్యంలో తడిసి ముద్దవుతోంది. ఆ వేడుకే విజయనగంలో రెండు రోజుల పాటు కన్నుల పండువగా జరిగే పైడితల్లమ్మ జాతర.

ఎవరు ఈ పైడి తల్లమ్మ

 

విజయనగర సంస్థానాధీశుల ఇంట పుట్టిన అమ్మావారి స్వరూపమే పైడితల్లమ్మ. కనకదుర్గమ్మ ఆశీస్సులతో పూసపాటి వారి వంశంలో జన్మనొందింది. విజయనగర సంస్థానానికి అప్పటి రాజు అయిన పెద విజయరామరాజు తోబుట్టువే పైడితల్లి. రాజదర్పాన్ని ఏనాడు దరిచేరనీయకుండా… నలుగురికి తల్లో నాలుకలా ఉండేది. దుర్గాదేవిక్తురాలైన పైడితల్లి చిన్న నాటి నుంచి అల్లారు ముద్దుగా పెరిగి పెద్దదైంది. విధి వక్రించి యుక్తవయసులోనే దైవంలో ఐఖ్యమైంది.

దేవత ఎలా అయ్యిందంటే…

 

paidi thalli    

పైడితల్లి అమ్మవారు

ఆంగ్లేయుల ప్రోద్భలంతో పొరుగున్న ఉన్న బొబ్బిలి సంస్థానంతో విజయనగర సామ్రాజ్యానికి పొరపచ్చాలు వచ్చాయి. మాటా మాటా పెరిగి శరములు దూసుకునే స్థాయికి వచ్చి యుద్దానికి దారి తీసింది. యుద్ధానికి వెళ్లొద్దని అన్నగారయిన విజయరామరాజును ఎంతలా వేడుకున్నా వినలేదు. పోరులో ఇరు సంస్థానాధీశులు తనువు చాలించారు. # సిరిగల మాతల్లి పైడితల్లమ్మ సిరిమానోత్సవం #

తన మాట కాదని కదనరంగానికి వెళ్లిన అన్నను చూసేందుకు… సన్నిహితుడైన పతివాడ అప్పలనాయుడుతో వెళ్తున్న పైడితల్లమ్మకు మార్గమధ్యలో తన సోదరుడు వీరమరణం పొందాడనే వార్త తెలుస్తుంది. శోకంలో మునిగిపోయిన ఆ తల్లి విజయనగర కోటకు చేరువలో ఉన్న పెద్ద చెరువులో దూకి ఆత్మార్పణం చేసుకుంటుంది. కొంత కాలానికి సన్నిహితుడైన అప్పలనాయుడికి స్వప్నంలో కనిపించి తాను ఆ ప్రాంతవాసుల ఇలవేల్పుగా అవతరించానని… చెరువు గర్భాన ఉన్న తన విగ్రహాన్ని తీసి ప్రతిష్టించమని… తన ఉనికిని చెప్పింది.

ఆ విగ్రహాన్ని బయటకు తీసి దేవాలయం నిర్మించి ప్రతిష్టించారు. అప్పటి నుంచి అది వనంగుడిగా ప్రసిద్ధి పొందింది. క్రీ.శ. 1758 నుంచి అమ్మవారు పూజలు అందుకుంటోంది. అది అటవీ ప్రాంతం కావడం వల్ల నగర నడిబొడ్డులో మరో ఆలయాన్ని నిర్మించారు. ఇది చదురు గుడిగా ప్రసిద్ధి పొందింది. వనంగుడిని పుట్టింటిగాను… చదురుగుడిని మెట్టినింటిగాను భావిస్తారు.

 

sirimanotsavam 

సిరిమానోత్సవం

ఈ అమ్మవారికి నిర్వహించే వేడుకల్లో సిరిమానోత్సవం మిక్కిలి ప్రసిద్ధి చెందినది. అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించిన పతివాడ వంశీయులే అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. సిరిలు కురిపించే సిరిమానోత్సవం విజయదశమి తర్వత వచ్చే తొలి మంగళ వారం అమ్మవారికి సిరిమానోత్సవం నిర్వహిస్తారు. ఇది రెండు రోజుల పండుగ. # సిరిగల మాతల్లి పైడితల్లమ్మ సిరిమానోత్సవం #

భక్తుల కొంగు బంగారం

 

మొదటి రోజు తోలేళ్లు పండుగ. ఈరోజున ప్రజలంతా బంధుమిత్ర సపరివార సమేతంగా మొక్కులు తీర్చుకుంటారు. బాజా భజంత్రీలతో ఘటాలను తలపై పెట్టుకుని పైడితల్లిని దర్శించుకుంటారు. ఈ రెండు పర్వదినాలు… నగరంలోని ఏ వీధి చూసినా… ఏ ఇంట గాంచినా పండుగ వాతావారణమే కనిపిస్తుంది. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన నగర వీధులన్నీ కిక్కిరిసిపోతాయి.

సిరిమాను సిద్ధం

తోలేళ్ల వేడుకనాడు అమ్మవారు భవిష్యవాణి చెబుతుంది. మరునాడే సిరిమానోత్సవం. సిరిమానును చింత చెట్టు మానుతో రూపొందిస్తారు. అమ్మవారే స్వయంగా ఫలానా వృక్షాన్ని సిరిమాను చేయమని పతివాడ వంశస్థుల స్వప్నంలో కనిపించి చెబుతుంది. ఆ వృక్షానికి ముందు నుంచే పూజలు చేసి వేడుక నాటికి సిరిమానుగా సిద్ధం చేస్తారు.

చెట్టును మొదలుతో సహా తెచ్చి సిరిమానుగా చెక్కుతారు. పైన అమ్మవారి స్వరూపమైన పూజారి కూర్చునేందుకు ఆసనం ఉంటుంది. రెండో రోజు సాయంత్రం సిరిమానును నగర వీధుల్లో ముమ్మారు ఊరేగిస్తారు. స్థానికులే కాక పొరుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన భక్తులు జాతరలో పాల్గొంటారు.

 

sirimanotsavam 
సిరిమానోత్సవం

 

అమ్మవారికి ప్రసాదంగా దారి పొడవునా సిరిమానుపైకి అరటి పండ్లు విసురుతారు. కన్నుల పండుగగా జరిగే ఈ జాతరను కనులారా గాంచేందుకు భారీ సంఖ్యలో భక్తులు విజయనగరానికి చేరుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా… మనసారా కొలుచుకునే వారి కొంగుబంగారంగా విరాజిల్లుతోంది పైడితల్లమ్మ. సిరిమాను జాతరను చూసిన ప్రతి మనసు భక్తి పారవశ్యంతో నిండిపోతుంది.

                                                              రచయిత – అమ్ము( ముమ్ముడివరం)

ఇదీ చూడండి: ప్రజాకవి వేమన పద్యరత్నాలు

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?