శత్రువు ఎంత బలవంతుడైతే ఏంటి?

self confidence
శత్రువు ఎంత బలవంతుడైనా కావచ్చు…
చేసే పని ఎంత కష్టమైన అవ్వొచ్చు…
చేరాల్సిన లక్ష్యం వేల మైళ్లు ఉండొచ్చు..

 కానీ ఏదైనా సాధించడానికి ఆత్మవిశ్వాసాన్ని మించిన ఆయుధం లేదు. బలహీనుడ్ని బలవంతుడు గెలిస్తే అందులో కిక్కేముంది? అదే బలహీనుడు.. ఓ బలవంతుడ్ని గెలిస్తే అది చరిత్ర. అదే నిజమైన గెలుపు. భయపడకు నిన్ను మించిన బలవంతుడు ఈ లోకంలో లేడు. సరదాగా ఓ కథ చెప్పుకుందామా?

ఓ పిట్ట కథ…

సముద్రపు ఒడ్డున తిత్తిబం అనే ఓ పిట్ట ఉండేది. మగ పిట్టతో ఎంతో ఆనందంగా జీవించేది. సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుకలో గుడ్లు పెట్టేది. కానీ సముద్రపు అలలు వచ్చి ఆ గుడ్లను తీసుకెళ్లిపోయేవి. అది చూసిన ఆడ పిట్ట బాధపడేది. అయినా గుడ్లను ఆ ఒడ్డునే పెట్టేది. మళ్లీ అలలు తీసుకెళ్లిపోయేవి. ఓ రోజు బాధ.. ఆ పిట్ట గుండెల్లో నిప్పు రాజేసింది. ఎంతగా అంటే తన గుడ్లను తీసుకెళ్లిన సముద్రాన్ని కప్పెట్టేయాలి అనేంత.

సంకల్పం…

వెంటనే మగపిట్టతో కలిసి చేయాలనుకున్న పని మొదలుపెట్టింది. సముద్రంలోకి వెళ్లి రెక్కలు తడిపేవి ఆ పక్షలు. ఒడ్డుకు వచ్చి తమ రెక్కలకు ఇసుకను అంటించుకొని వెళ్లి ఆ సంద్రంలో కలిపేవి. ఇలా సముద్రాన్ని కప్పేటేయాలనుకొని రోజు ఇదే పని చేసేవి.

ఆ రెండు పక్షులను చూసి మిగిలిన పిట్టలు నవ్వేవి. కానీ కొద్ది రోజులు పోయాక వాటి సంకల్పాన్ని చూసి సాయం చేశాయి. వాటిని చూసి పక్షి జాతులు మొత్తం అలా ఇసుకను తమ రెక్క,లతో తీసుకెళ్లి సముద్రంలో కలపడం మొదలుపెట్టాయి. రోజురోజుకు అక్కడికి వచ్చే పక్షుల సంఖ్య పెరిగిపోయింది. ఓ రోజు ఈ విషయం గరుత్మంతుడికి తెలిసింది.

తన పక్షిజాతికి సాయం చేయాలనుకున్న గరుత్మంతుడు పెద్ద పెద్ద పర్వాతాలనే తన రెక్కలతో మోసుకొచ్చి సముద్రంలో పడేయడం మొదలుపెట్టాడు. శ్రీ మహావిష్ణువు ఓ రోజు బయటకు వెళ్లాల్సి వచ్చి గరుత్మంతుడు ఎక్కడా అని అడగ్గా ఈ విషయం తెలుస్తుంది.

సముద్రం దగ్గరకు వచ్చి పక్షులు పడుతున్న శ్రమను శ్రీ మహావిష్ణువు చూస్తాడు. గరుత్మంతుడితో ఎన్ని రోజులు ఇలా కష్టపడతారు అని అడుగుతాడు. ఎన్నిరోజులైనా కష్టపడతాం.. ఎదో రోజు ఈ సముద్రాన్ని కప్పెడతాం అని బదులిస్తాడు గరుత్మంతుడు.

ఆ పక్షిజాతి సంకల్పానికి ముగ్ధుడైన శ్రీమహావిష్ణువు.. సముద్రుడ్ని పిలిచి తిత్తిబం పక్షి గుడ్లను తిరిగి వాటికి ఇప్పిస్తాడు.

శత్రువు ఎంత బలవంతుడైతే ఏంటి? నీ పోరాటంలో నిజాయితీ ఉంటే.. ఆత్మవిశ్వాసం నీ ఆయుధం అయితే విజయం నీ పాదాక్రాంతం అవుతుంది.. అని ఆ పక్షులు నిరూపించాయి.

                                                        రచయిత: యుగ (కె. ఎం.కె)

 

ఇదీ చూడండి: మా అమ్మమ్మ

ఇదీ చూడండి: ఈ Whatsapp toolను మీరు చూశారా?

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?