రారండో.. అట్లతదియ వేడుక చేసుకుందాం..

atla tadhiya

దేశ వ్యాప్తంగా జరుపుకునే పండుగలు కొన్ని అయితే… కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పండుగలు మరికొన్ని… అలాగే ప్రతిరోజు పండుగలా జరుపుకునే తెలుగు ప్రజలు అనుసరించి… జరుపుకునే పండుగలు ఇంకొన్ని. అటువంటి పండుగలలో ఒకటి అట్లతద్ది… # రారండో.. అట్లతదియ వేడుక చేసుకుందాం.. #

ఇది కేవలం భక్తి శ్రద్ధలతో చేసుకునేదే కాదు… అతివల ఆటపాటలకు పెట్టింది పేరు అట్లతద్ది పండుగ. పండుగ వస్తుందంటే పల్లెల్లో ప్రతి ఇంటా ఉండే సందడే వేరు… వేడుక కోసం పెద్దలు ఏర్పాట్లు చేసుకుంటుంటే… చిన్నారులు పండుగ విశేషాలు పెద్దల వద్ద తెలుసుకుంటూ.. తాము తెలుసుకున్న సంగతులను స్నేహితులకు చెప్పుకుంటూ ఉత్సాహంగా పండుగ కోసం ఎదురుచూస్తుంటారు.

అచ్చమైన తెలుగుపండుగైన.. అందులోను ఆడపిల్లలకు మాత్రమే పరిమితమైన అట్లతదియ గురించి ప్రతి ఆడపిల్లా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుందనడంలో అతిశయోక్తి ఉండదు. అట్లతదియ కోసం ఇంట్లో ఏర్పాట్లు చేసుకుంటున్న పెద్దలను చూసి ఇద్దరు చిన్నారులు గౌరి, పార్వతి ఆ వేడుక గురించి ఒకరి కొకరు ఇలా చెప్పుకుంటున్నారు. ఆ పండుగ గురించి వారి మాటల్లోనే…

పార్వతి: ఏమే గౌరి ఇవాళ అట్లతదియ అంట కదా.. మా ఇంట్లో చాలా బాగా చేసుకుంటున్నాం. మీరెలా జరుపుకుంటున్నారు.

గౌరి: మేము చాలా బాగా జరుపుకుంటున్నాం పార్వతి. మా అమ్మ, అమ్మమ్మ, అక్కలు అందరూ కోడికూతప్పుడు లేచి స్నానాలు చేసి, పూజ చేసుకుని, సూర్యోదయానికి ముందే భోజనం చేశాం. మా అమ్మ వాళ్లతో పాటు నేను కూడా ఇవాళ తద్ది ఉంటున్నాను తెలుసా…

పార్వతి: ఓ… ఔనా.. నేను నీకు అదే చెబుదాం అనుకుంటున్నా.. నేను కూడా తద్ది ఉన్నా.. అసలు నాకో సందేహం గౌరి.. అసలు తద్ది అంటే ఏమిటి.. మిగతా పండల్లా కాకుండా.. దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటావ్ గౌరి.

గౌరి: నాకూ పూర్తిగా తెలియదు కాది.. నిన్న మా బామ్మ చెప్పింది. అదే నీకు చెబుతాను. ఆశ్వయుజ మాసంలో శరత్పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణ తృతీయను తదియ అంటారు. దాన్నే వాడుక భాషలో తద్ది అంటారు. ప్రతి మాసంలోనే తదియ అనేది గౌరి దేవి పూజకు ప్రసిద్ధి. ఇది ముత్తైదువులు… అమ్మాయిలు జరుపుకునే వేడుక.. గౌరీదేవి శివున్ని పతిగా పొందేందుకు తొలుతగా చేసిన నోము ఇది. స్త్రీలు సౌభాగ్యం చేసుకునే వ్రతమిది.. చంద్రారాదణ ప్రధానమైన పూజ అంట. ఈ నోమును పెళ్లికాని అమ్మాయిలు మంచి భర్త లభించాలని.. పెళ్లైన వారు సౌభాగ్యం కోసమని… గర్భస్త దోషములు రాకుండా ఉండాలని ఈ నోము చేసుకుంటారంట..

పార్వతి: ఓ.. అలాగా!. అసలు ఈ తద్ది ఎలా చెయ్యాలో చెప్పవే.

గౌరి: ఈ వ్రతాన్ని ఆచరించడానికి ముందురోజే మగువలంతా చేతులకు గోరింటాకు పెట్టుకుంటారంట. ముందు రోజు సాయంత్రం భోజనం వండి.. పిండి రుబ్బి పెట్టుకుంటారు. తదియ రోజు తెల్లవారుజామున లేచి. స్నానాధిక్రతువులు ముగించుకుని.. అమ్మవారికి పూజచేసి. చద్ది అన్నం తింటారు. దానిలో ప్రధానంగా. అన్నం, పెరుగు, గోంగూర పచ్చడి, పులుసు వేసుకుని భోజనం చేస్తారు. కొంతమంది పొట్లకాయ కూరకూడా వేసుకుంటారు. సూర్యోదయం తర్వాత నుంచి రాత్రి చంద్రున్ని చూసి పూజ చేసేవరకు ఉపవాసం ఉంటారు. మధ్యలో తాంబూలం వేసుకుంటారు. రాత్రికి నెలవంకను చూసిన తర్వాత అమ్మవారికి పూజ చేసి…. 11 అట్లు, పళ్లను ముత్తైదువకు వాయినంగా ఇస్తారు. గౌరీదేవిని పూజించి తమ మనోవాంఛ సిద్ధించాలని ప్రార్థిస్తారు. అప్పడు బియ్యం, పప్పుతో చేసిన అట్లను తింటారు. ఇకపోతే రోజంతా పొలంలోకి వెళ్లి ఆటలాడుకుంటూ.. ఉయ్యాల ఊగుతూ రకరకాల పాటలు పాడుకుంటూ సంతోషంగా గడుపుతారంట.. అందుకే కదా మనం తోటకి వెళ్లేది ఇప్పడు. ఇదీ పూజా విధానమే రాత్రి పడుకునేటప్పుడు మా బామ్మని అడిగితే చెప్పిందే పార్వతి.

పార్వతి: భలే ఉందే.. పండుగ. అంటే ఇది కేవలం మన ఆడవాళ్ల పండుగ అన్నమాట.. భలేభలే.. ఇంతకీ ఈ పండుగ ఎలా వచ్చిందే.. ప్రత్యేకించి ఏమైనా కథ ఉందా.. ప్లీజ్ చెప్పవే.. ఉయ్యాల దగ్గరకు వెళ్లేంతవరకైనా చెప్పు.

గౌరీ: ఇన్ని ప్రశ్నలేమిటే పార్వతి. సర్లే చెబుతాలే విను. అట్లతదియకు సంబంధించి పురాణాల్లో ఎక్కడా ప్రత్యేకమైన కథ ఏమీలేదు గాని.. ఆయా ప్రాంతాలను బట్టి ఓ కథ ప్రాచుర్యంలో ఉందంట. వానామి అనే యువరాణి తన నలుగురు స్నేహితులతో కలిసి తద్దినోము చేయడానికి నిచ్చయించుకుంది. తెల్లవారుజామునే చద్ది ఆరగించి ఉపవాసం ఉంది. సుకుమారి అవ్వడం చేత మధ్యాహ్నం వేళకే పూర్తిగా అలసిపోయింది. తమ సోదరిని చూసిన ఆమె అన్నలు చంద్రోదయం కాకముందే.. దూరంగా ఒక గడ్డివామును అంటించి.. దానిని చంద్రునిగా తమ సోదరికి చూపించారు. అసలే నీరసంగా ఉన్న ఆమె భ్రమపడి.. ఆ వెలుగును చంద్రుడనుకుని అమ్మవారికి ప్రసాదం నివేదించి తాను భుజించింది. ఈ విధంగా ఆమె వ్రతానికి భంగం కలిగింది. అందుచేత ఆమెకు ముసలి భర్త లభించాడు. అందుకు ఆమె చింతించగా.. పార్వతీ దేవి దయ తలచి ఆమె చేసిన అపరాదాన్ని తెలియజెప్పి.. మరలా నిష్టగా వ్రతం ఆచరించమని చెప్పింది. ఆ యువరాణి అలా చేయగా ఆమె భర్త నిండు యవ్వనస్తుడిగా మారిపోయాడంట. ఇదీ మనవాళ్లు చెప్పుకునే కథ. ఔను మీ అక్కకు మొన్ననే పెళ్లి అయిందిగా ఈ ఏడాది ఆయనాలు తీర్చుతున్నారా..?

పార్వతి: వాయినాలా అంటే ఏమిటి గౌరి?

గౌరి: నువ్వొకదానివి ఏది అడిగినా అలా నోరు వెళ్లబెడతావేమిటే.. వాయినాలు తెలీదా.. సర్లే చెబుతాలే విను. పెళ్లి అయిన తొలి ఏడాది అమ్మాయికి పుట్టింట్లో వాయినాలు తీర్చుతారు. మంచి సంతానం కలగాలని. గర్భ దోషాలు రాకుండా ఉండాలని… సౌభాగ్యం కలగాలని అమ్మాయికి వాయినాలు చీర్చుతారు. పెళ్లి తర్వాత నుంచి మూడేళ్ల పాటు తదియ రోజున ఉపవాసం ఉంటారు. వాయినాల రోజున అమ్మాయితో గౌరీదేవి పూజ చేయించి. తద్ది ఉంచి సాయంత్రం అమ్మాయిని మంచం మీద నుంచే పెట్టి పదకొండు అట్లు. ఫలాలు, గుమ్మడి ఆకులతో తాంబూలం చేయించి ముత్తైదువులకు వాయినం ఇప్పిస్తారు. దీనినే వాయినాలు తీర్చడం అంటారు. మీ అక్కకు ఇవాళ తీర్చుతున్నారంటగా.. మీ అమ్మ పొద్దునే వచ్చి మా బామ్మకు చెబుతుంటే విన్నానులే…

పార్వతి: అవునవును గౌరి నువ్వు చెప్పింది నిజమే.. మా అమ్మ వాళ్లు అనుకుంటున్నారు. మొత్తానికి ఏమైతేనేమి.. అట్ల తదియ గురించి ఎంత బాగా చెప్పావే గౌరి. చాలా బాగుంది. పద మన మిగతా స్నేహితులు కూడా వచ్చారు. అందరం సరదాగా వెళ్లి ఉయ్యాల ఊగుదాం…

                                                 రచయిత – అమ్ము (ఆర్‌.కె)

ఇదీ చదవండి: ధరణి పోర్టల్ సమగ్ర సమాచారం మీ అరచేతిలో

ఇదీ చదవండి: మా అమ్మమ్మ

 

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?