మీరు అనుకున్నది ఎప్పుడైనా జరిగిందా?

srirama

మీరు ఎప్పుడైనా అనుకున్నది జరిగిందా? ఏదైనా విషయం జరిగి తీరుతుందని గట్టిగా నమ్మారా? ఒకవేళ జరిగితే అలా అనుకున్నది అవ్వడానికి కారణమేంటో తెలుసా? ‘లా ఆఫ్ అట్రాక్షన్’.. దీనినే ఆకర్షణ సిద్ధాంతం అంటారు.

సులభంగా చెప్పాలంటే మనకి ఏం కావాలో మనసులో ఆలోచించి దక్కించుకోవడమే. ఎందుకంటే జీవితానికి దీనికీ విడదీయలేని సంబంధం ఉంది. సరే సరదాగా ఒక కథ చెప్తా వినండి.. మనందరికీ తెలిసిన కథే.. రామాయణం.

రామాయణం  అంటే..?

రామాయణం అంటే సులభంగా చెప్పాలంటే రాముడు చేసిన ప్రయాణం. మనిషి ఎలా బతకాలో చెప్పే పౌరాణిక ఇతిహాసం. దేవుడంటే ఏదో అద్భుతాలు చేసి.. మొత్తం జీవితాన్ని మార్చేసేవాడు అని అందరూ అనుకుంటాం. అయితే ఆ దేవుడే సాధారణ మనిషిలా పుట్టి.. ఒక మనిషి ఎలా బతకాలో చెప్పడానికి ఎత్తిన అవతారమే.. ఈ రామావతారం.. అని పురాణాలు చెప్పాయి. రాముడు మనిషి రూపంలో ఉన్న దేవుడు కాబట్టి.. ఆయన నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు.

సీత కోసం…

ఇక కథలోకి వెళ్దాం. రామాయణంలో రావణుడు సీతను ఎత్తుకెళ్లిన తర్వాత.. రాముడి ధ్యాస మొత్తం సీత మీదే ఉంది. ఎలాగైనా ఆ రావణబ్రహ్మ నుంచి సీతను దక్కించుకోవాలనే ఆలోచన మాత్రమే ఉంది. ఇలా ఆలోచిస్తూ వెతకడం మొదలుపెట్టాడు. వెతికే క్రమంలో హనుమంతుణ్ని, సుగ్రీవుణ్ని కలిశాడు. సుగ్రీవుడు కూడా రాముడిలానే భార్యను పోగొట్టుకుని దీనంగా ఉన్నాడు. ఎందుకంటే అతడి భార్య రుమ.. వాలి అధీనంలో ఉంది. సుగ్రీవుడికి రాముడు సాయం చేస్తానంటాడు. కానీ రాముడి మాటలను సుగ్రీవుడు అంత సులభంగా నమ్మడు. ఎందుకంటే వాలి తపశ్శక్తి సంపన్నుడు. రావణుడి లాంటి బలశాలినే తన తోకతో చుట్టి 7 సముద్రాల్లో ముంచి తేల్చిన వీరుడు వాలి. కనుక అలాంటి వాలిని ఓడించడం అంత సులభం కాదు.

వాలిని గెలిచి…

ఇప్పుడు రాముడు.. సుగ్రీవుడి నమ్మకాన్ని గెలవాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. వాలి బలం ఎలాంటిదంటే ఒకే వేటుకు 7 బలమైన తాడిచెట్లను నేల రాల్చగలడు. రాముడు… సుగ్రీవుడికి నమ్మకం కలిగించడం కోసం  కేవలం ఒక్క బాణంతో ఏడు భారీ తాడిచెట్లను నేలకూలుస్తాడు. ఇది చూసిన సుగ్రీవుడికి రాముడిపై పూర్తిగా నమ్మకం కలుగుతుంది. తరువాత వాలిని చంపి కిష్కిందకు సుగ్రీవుడ్ని రాజును చేస్తాడు రాముడు.

తరువాత సీత లంకలో ఉందని హనుమంతుడి ద్వారా తెలుసుకుని అక్కడకు చేరుకోవడానికి వానరుల సాయంతో ఎవరూ ఊహించని విధంగా సేతువును నిర్మిస్తాడు.

రావణ సంహారం…

లంకకు చేరుకున్నాకా.. రామరావణ యుద్ధం మొదలవుతుంది. రావణుడి పద్ధతి నచ్చని విభీషణుడు రాముడి దగ్గరకు చేరతాడు. యుద్ధంలో కుంభ, నికుంభ, ఇంద్రజిత్తుడు లాంటి ఎంతోమంది మహాయోధులను యమపురికి పంపుతారు రామలక్ష్మణులు. ఆఖరిగా రావణడు యుద్ధభూమికి వస్తాడు. రావణుడు మొదటిసారి యుద్ధంలో రాముడి చేతిలో ఓడిపోయి ఒంటరిగా నిలుస్తాడు. రాముడు మరో అవకాశం ఇచ్చి మరునాడు రమ్మంటాడు. తరువాతి రాజు తన పదితలలతో రావణుడు యుద్ధం చేస్తాడు. అప్పుడు రావణుణ్ని… రాముడు గెలవలేకపోతాడు. కానీ విభీషణుడు.. రావణుడి గుట్టు చెప్పి పొట్టలోని అమృత బాండం మీద బాణం వేయమంటాడు. అలా అమృత బాండంపై రాముడు బాణం సంధించి దశకంఠుణ్ని సంహరిస్తాడు. తరువాత సీతను వెనక్కి తెచ్చుకుంటాడు. ఇప్పుడు రాముడిలో.. మనం చెప్పుకున్న ఆకర్షణ సిద్ధాంతాన్ని చూద్దాం.

లా ఆఫ్ అట్రాక్షన్…

ముందుగా రాముడిలో వచ్చిన ఆలోచన.. ఎలాగైనా సీతను వెనక్కి తెచ్చుకోవాలి. ఇది నిరంతరం ఆయన మనస్సులో ఉంది. ఈ ఆలోచన SUB CONSIOUS MINDలో రిజిస్టర్ అయిపోయింది.

లా ఆఫ్ అట్రాక్షన్లో మనకి ఏం కావాలో మన ఆలోచనల ద్వారా చెబితే.. ప్రపంచం దానికి స్పందించి మనకు ఏం కావాలో అది మనకు దక్కేలా చేస్తుంది. అలానే రాముడికి SUB CONSIOUSలో రిజిస్టర్ అయిన ఆలోచనకు అనుగుణంగా హనుమంతుడు, సుగ్రీవుడు కలుస్తారు.. సాయం చేస్తారు.

అయితే ఈ సిద్ధాంతం పనిచేయాలంటే మన ఆలోచనల మీద మనకు బలమైన నమ్మకం ఉండాలి. ముఖ్యంగా భయం ఉండకూడదు. ఇది ఓ నెగిటివ్ ఆలోచన. ఈ ఆకర్షణ సిద్ధాంతానికి ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు చాలా ప్రమాదం. కనుక రాముడు అలాంటి ఆలోచనలు ఏమీ దరిచేరనివ్వకుండా.. బలమైన విశ్వాసంతో తన పనిచేశాడు. ప్రతి చోటా రాముడు సానుకూల దృక్పథంతోనే ఉన్నాడు. లంకను చేరుకోవడం దగ్గర నుంచి భయంకర రాక్షసవీరులను వధించడం వరకూ వెనుకడుగే వేయలేదు. చివరిగా రావణుడి లాంటి మహాయోధుడ్ని కూడా ఓడించి తన భార్య సీతను దక్కించుకున్నాడు.

కనుక మనకి కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయాలంటే.. మనకు ఏం కావాలో దాన్ని ఆలోచనల ద్వారా.. మన చుట్టూ ఉన్న యూనివర్స్కు చెప్పాలి. తరువాత మనం చేసే పనుల ద్వారా ఆ ఆలోచనను మన SUB CONSIOUS MINDలో రిజిస్టర్ చేయాలి. చేసే పనిలో నేను గెలిచి తీరుతాను అనే నమ్మకంతో చేయాలి. అప్పుడు సాధారణంగానే మన మైండ్లో మనం గెలిచిన తర్వాత ఎలా ఉంటాము అనే ఒక దృశ్యం కనిపిస్తుంది. అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయడం మొదలవుతుంది. ఇది లా ఆఫ్ అట్రాక్షన్కు ఉన్న శక్తి.

                                                                            – యుగ (కె.ఆర్.కె)

Click here: అభిమన్యు.. ‘ది రియల్ వారియర్’

Click here: Google Meet వాడుతుంటే ఇది తెలుసుకోవాల్సిందే

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?