మా అమ్మమ్మ

grandma love

హైదరాబాద్ మహా నగరం.. చారిత్రక చార్మినార్, గోల్కొండ అందాలు, నిత్యం ట్రాఫిక్ తో తల్లడిల్లిపోయే బిజీ బిజీ రోడ్లు. ఈ భాగ్యనగరంలో వేటికవే ప్రత్యేకం. ఈ మహా నగరమే నా గూడు, నా నీడ. చిన్నప్పుడు చూసిన టామ్ అండ్ జెర్రీ నుంచి పెద్దయ్యాక స్నేహితులతో కొట్టిన దమ్ము వరకు.. భాగ్యనగరం సాక్ష్యంగా నిలిచింది. # మా అమ్మమ్మ #

ఎంత పెద్ద అలజడి వచ్చినా.. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా పరిగెత్తే  నగరంలో నాకంటూ ఉన్నది అమ్మ.. నాన్న.. నా స్నేహితులు. హైదరాబాద్ అందాలకు ఎంత ఫిదా అయినా… నేను పుట్టింది మాత్రం తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ.

సహజంగా కాకినాడ అనగానే ఎవరికైనా ఇట్టే గుర్తొచ్చేది కాజా. కాని నాకు మాత్రం గుర్తొచ్చేది మా అమ్మమ్మ. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి మా కుటుంబానికి పెద్ద దిక్కు మా అమ్మమ్మే. గౌతమీ ఎక్స్ ప్రెస్ కూతలు.. ప్రశాంతమైన గోదారి పరవళ్లు.. అందమైన ద్వారపుడి గుళ్లు.. సామర్లకోట చెరుకు ఫాక్టరీ.. ఇవీ కాకినాడ రైలు ప్రయాణంలో నిత్యం దర్శనమిచ్చేవి.

నాకిప్పుడు 25ఏళ్లు.. అయినా జీవితాంతం ఇవి గుర్తుండిపోయేవే. ఇక కాకినాడలో అమ్మమ్మ ఇల్లు అంటే.. ఆ ఫీలింగే వేరు. మా అమ్మ ఏడో తరగతిలోనే తాతయ్య కాలంచేశారు. భర్తను కాన్సర్ మింగేసినా. . చిన్న ప్రభుత్వ ఉద్యోగంతో ముగ్గురు కూతుళ్ల పెళ్లిళ్లు చేసింది మా అమ్మమ్మ.  చిన్న తలనొప్పి వచ్చినా.. అల్లాడిపోయే ఈ తరానికి.. అన్ని కష్టాలు వస్తే ఏమైపోతుందోనన్న భయం నాకు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అమ్మకి చెప్పకుండా నేనూ.. పిన్ని తాగిన గోల్డ్ స్పాట్ డ్రింకు, తిన్న పిడతకంది పప్పు.. ఆ తర్వాత అమ్మమ్మ చేసి పెట్టిన వేడివేడి అట్టు, ఇడ్లీలు..  ఏడేళ్ల వయసులోనే ఇవన్నీ నన్ను భోజన ప్రియుడిని చేసేశాయి. భానుగుడిలోని ఆనంద్ టాకీస్, ఉడిపీ హెటల్.. నా చిన్ననాటి అల్లరికి సాక్షాలు. అమ్మమ్మ చేతితో చేసి పెట్టే సున్నండ రూచి ఇప్పటికీ గుర్తొస్తే.. అది ఆమె చేతికున్న మహిమో.. లేదా అంతటి స్వచ్ఛమైన మనసుతో పెట్టడం వల్ల వచ్చిందో ఆర్థంకాదు. # మా అమ్మమ్మ #

‘అందరం సరదాగా సినిమాకి వెళ్దాం.. నువ్వూ రా లక్ష్మి’ అని అడిగితే.. ‘మీరెళ్లండి కన్నబాబూ’ అని ముద్దుగా చెప్పేది. అమ్మమ్మ పాతకాలం మనిషి.. సినిమాలేం ఎక్కుతాయని అప్పుడు అనిపించినా.. ఐదుగురు వెళ్తే డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుందని.. తాను ఉండిపోయి.. మమ్మల్ని పంపేదని.. 15 ఏళ్లు వచ్చే వరకు నా మట్టి బుర్రకు అర్థం కాలేదు.

మా అమ్మమ్మ చేతుల్లో పట్టుతగ్గిపోవడం.. నా జీవన శైలిలో మార్పు రావడం చకచకా జరిగిపోయాయి. పండుగనో, వ్రతమనో, అమ్మ డిగ్రీ పరీక్షలనో.. ఏదో ఒక అవకాశంతో బ్యాగు చంకలో పెట్టుకుని ఊరెళ్లిపోయే నేను.. డబ్బు అనే బ్లాక్ హోల్ లో పడిపోయాను. విచిత్రం ఏంటంటే.. ఆ విషయం మా లక్ష్మిని కోల్పోయేంత వరకూ అర్థం కాకపోవడం. ఫలితం ఏంటంటే.. ఆ విషయం తెలిసొచ్చినా మా లక్ష్మిని నేను చూడలేకపోవడం. వెళ్లి కనీసం ..సారీ అమ్మమ్మ అని చెప్పలేకపోవడం.

డబ్బు చాలా తెలివైనది… ‘నీకు నేనున్నాను…’ అని భరోసా ఇస్తూనే.. ‘మన..’ అనుకునే వాళ్లని దూరం చేస్తుంది. మనిషికి డబ్బంటే పిచ్చి.. కానీ ఆ డబ్బుకు మనిషంటే అలుసు. దాని కోసం పరిగెత్తి.. పరిగెత్తి అలసిపోయినా.. దారి మధ్యలో అది తారసపడుతుందనే ఆశ. కానీ ఎలాంటి గమ్యస్థానం లేని ప్రయాణం ఆ వెర్రి మనిషిది.

అమ్మమ్మ చివరి చూపు కూడా దక్కకపోవడం.. నా తెలివితక్కువ తనానికి దేవుడు వెసిన కఠిన శిక్షేమో. నా అనే వాళ్లకు నేను ఎంత దూరంగా ఉంటున్నానో తెలిసేలా చేసింది ఆ ఒక్క సంఘటనే. చిన్నప్పుడు ఆర్థరాత్రి వేళ పీడకలతో ఉలిక్కిపడితే.. నన్ను తన దగ్గరికి తీసుకుని బాబా విభూధి రాసి జోకొట్టేది లక్ష్మి. ఇప్పుడు నా ఉలికిపాటుకు కారణం కూడా లక్ష్మియే. # మా అమ్మమ్మ #

దీనికంతటికీ కారణం డబ్బు ఒక్కటేనా.. అని అడిగితే.. సిగ్గుతో తలదించుకునే పరిస్థితి నాది. ఎందుకింత నిర్లక్ష్యం.. ఆ వయస్సు వాళ్లంటే ఎందుకింత చిన్న చూపు? అని నా మనసు అడిగితే.. ఏం జవాబు చెప్పాలో తెలియని స్థితి.

వృద్ధాప్యంలో వారు కోరుకునేది… నా అన్న వాళ్లు పక్కన ఉండాలనే కదా! వాళ్లతో కొద్దిసేపు గడపాలనే కదా! మన జీవితాలని తీర్చిదిద్దిన వాళ్లకి ఆ మాత్రం చేయలేమా? మనతో ఉన్నంత కాలం.. వాళ్ల విలువ తెలియకపోవడం.. వాళ్లు వెళ్లిపోయాక వారి గురించి ఆలోచించి కుమిలి పోవడం… ఇదేనా ఈ మాయా ప్రపంచంలో మనిషికి మిగిలేది?

ఏదో బాధ.. గుండెను తొలిచేస్తున్న వ్యధ.. అమ్మమ్మ ఒక్కసారి కనపడితే.. తన ఒడిలో పడుకోవాలని కోరిక.  ఈ అంతర్యుద్ధం ఇంకెన్నాళ్లు? నాలా  ఇంకెంతమంది? లక్ష్మిలా ఇంకెంత మంది?

మరో మంచి కథ: సెకెండ్ ఛాన్స్‌

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?