బద్దెన సుమతీ శతకము

సుమతీ శతకం

సుమతీ శతకమును బద్దెన కవి రచించాడు. పండితపామర జన రంజకముగా ఆ మహనీయుడు రాసిన పద్యాలు అమోఘం. వాటిలో మచ్చుకకు కొన్నింటిని స్మరించుకుందాం. # బద్దెన సుమతీ శతకము #

పద్యం:

అక్కరకు రానిచుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున తా
నెక్కిన బాఱని గుఱ్ఱము
గ్రక్కున విడువంగలయు గదరా సుమతీ!

 

తాత్పర్యం:

అవసరమునకు వచ్చి సహాయపడని చుట్టమును, పూజించిననూ కోరిక తీర్చని దైవాన్ని, తాను అధిరోహించినపుడు యుద్ధరంగమున పరుగెత్తని గుర్రమును, బద్ధిమంతుడైనవాడు వెంటనే విడిచిపెట్టాలి.

పద్యం:

అకొన్న కూడె యమృతము
తాకొందక నిచ్చువాడె దాత ధరిత్రిన్
సోకోర్చువాడె మనుజుడు
తేకువ గలవాడె వంశతిలకుడు సుమతీ!

 

తాత్పర్యం:

మంచి ఆకలి సమయమున లభించిన పదార్థమే అమృతం. యాచించిన వెంటనే కాదనకుండా దానం చేసినవాడే దాత. శ్రమను సహించువాడే మానవుడు. ధైర్యంగా ప్రవర్తించువాడే వంశోద్ధారకుడు.

పద్యం:

ఉత్తమ గుణములు నీచున
కెత్తెఱగున గలుగు నేర్చు నెయ్యెడలందా
నెత్తిచ్చి కరగపోసిన
నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ!

 

తాత్పర్యం:

నీచుడు మంచివారితో చెలిమి చేసినా, వారి యొక్క మంచి గుణములు గ్రహించజాలడు. ఎట్లాగంటే, బంగారంతో సమానమగు ఇత్తడిని తూచి, బంగారం కరిగించిపోసిన మూసలోపోసినా అది బంగారం కాజాలదు కదా!

పద్యం:

ఉపకారికి నుపకారము
విపరీతము కాదుసేయ, వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!

 

తాత్పర్యం:

మేలు చేసినవారికి మేలు చేయడం గొప్పతనం కాదు. తనకు హానిచేసినవాని తప్పులను గణింపక మేలు చేయువాడె గొప్పబద్ధిమంతుడు.

పద్యం:

ఓడల బండ్లును వచ్చును
ఓడలు నా బండ్ల మీద నొప్పుగవచ్చున్
ఓడలు బండ్లు వలెనే
వాడంబడు గలిమిలేమి వసుధను సుమతీ!

 

తాత్పర్యం:

ఓడల మీద బండ్లువచ్చును. బండ్లమీద ఓడలు కూడా వస్తుంటాయి. అలాగే ఈ భూమియందు సుఖమున్న వారికి కష్టము, దారిద్ర్యమున్నవారికి సంపద వస్తూ,పోతూ ఉంటాయి.

ఇదీ చదవండి: ప్రజాకవి వేమన పద్యరత్నాలు

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?