అర్జున x ఆదియోగి: గెలుపెవరిదో తెలుసా?

siva arjuna war

అర్జునుడు… తిరుగులేని పోరాట యోధుడు. 18 రోజుల కురుక్షేత్ర సంగ్రామంలో అతిరథ మహారథులైన భీష్మ, ద్రోణ, కర్ణుల వంటి వారిని ఓడించిన మహాయోధుడు. సమస్త ధనుర్వేదం తెలిసిన సవ్యసాచి. మరి అలాంటి వీరుడు ఒకరి చేతిలో ఓడిన విషయం చాలా మందికి తెలియదు.

ఎంతటి వీరుడికైనా గర్వం తలకెక్కితే ఓటమి తప్పదు అంటారు. మానవమాత్రులకే అంత ఉన్నప్పుడు.. సకల జగత్తును కాపాడే దేవాదిదేవుడికి ఎంత ఉండాలి. లోకంలో నన్ను మించిన విలుకాడు లేడు అనుకున్న అర్జునుడికి అదే గుణపాఠం ఎదురైంది.

యుద్ధానికి ముందు..

కోట్ల మంది కౌరవసైన్యాన్ని, కురుకుల పితామహుడైన భీష్ముడ్ని యుద్ధంలో గెలవడం అంత సులువు కాదు. ఈ విషయం అర్జునుడికి బాగా తెలుసు. అందుకే మహాదేవుడైన శివుణ్ని ప్రసన్నం చేసుకుని అమేయమైన పాశుపతాస్త్రాన్ని సంపాదించాలనుకున్నాడు.

శివ తపస్సు కోసం హిమలయాలకు వెళ్లే క్రమంలో ఎందరో సాధువులు, పుంగవులు, మహర్షుల ఆశీర్వాదంతో ఎన్నో అస్త్రశస్త్రాలను సొంతం చేసుకున్నాడు. వరుణ దేవుడి కృపతో వరుణాస్త్రం సాధించాడు. చివరికి హిమాలయలకు చేరుకొని ఘోర తపస్సు చేశాడు.

గర్వభంగం…

ఎన్నో రోజులు గడిచాయి..కానీ శివ దర్శనం దొరకలేదు. ఓ రోజు ఆకలిగా అనిపించిన అర్జునుడు.. అటుగా వెళ్తున్న ఓ జంతువుకు బాణం వేశాడు. బాణం దెబ్బకు గిలగిలలాడుతూ అది మరణించింది. అయితే ఆ జంతువు దగ్గరకు వెళ్లిన అర్జునుడికి దాని శరీరంలో మరో బాణం కనిపించింది. అది ఎవరు వేశారని చూసిన అర్జునుడికి ఓ బోయవాడు భార్యా సమేతంగా కనిపించాడు.

అర్జునుడి దగ్గరకు వచ్చిన ఆ బోయవాడు “ఆ జంతువుకు నేనే ముందు బాణం వేశా.. కావాలంటే చూడు నా బాణం దాని గుండెల్లో దిగింది” అన్నాడు. అది విన్న అర్జునుడు కోపంతో “వీరాధివీరుడైన క్షత్రియ పుత్రుడినే సవాల్ చేస్తున్నావా” అన్నాడు.

దానికి ఆ బోయవాడు నీ వీరత్వం ఏంటో చూపించు అన్నాడు. అర్జునుడు ఆగ్రహంతో ఆ బోయవాడితో యుద్ధం చేశాడు. అయితే ఎంతో శక్తిమంతుడైన అర్జునుడ్ని ఆ బోయవాడు అవలీలగా జయించాడు. అర్జునుడి అస్త్రశస్త్రాలు ఎందుకూ పనిచేయలేదు.

చిన్నతనంగా భావించిన అర్జునుడు.. ఆ బోయవాడితో ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడతాడు. అప్పుడు కూడా అర్జునుడు పరాజయం పాలవుతాడు.

ఏమి చేయలేని అర్జునుడు నిస్సహాయంగా శివలింగం ముందు మోకరిల్లి శివుడ్ని ప్రార్థించి ఓ పుష్పాన్ని శివలింగంపైన ఉంచుతాడు. విచిత్రంగా వెనక్కి తిరిగి చూసిన అర్జునుడికి తాను లింగంపైన ఉంచిన పుష్పం ఆ బోయవాడి తలపైన కనిపిస్తోంది.

అది చూసిన అర్జునుడికి ఆ బోయవాడు సాక్షాత్ ఆదియోగి అయిన శివుడని అర్థమయి కాళ్ల మీద పడి ప్రార్థిస్తాడు. ప్రసన్నుడైన శివయ్య.. అర్జునుడికి పాశుపతాస్త్రం ప్రసాదిస్తాడు.

ఆ అస్త్రంతోనే అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామంలో విజయకేతనం ఎగురవేశాడు. అయితే తిరుగులేని వీరుడైన అర్జునుడి జీవితంలోనూ ఓ ఓటమి ఉందన్నమాట.

                                              “ఓం నమః శివాయ”

                                                                                    – యుగ (కె.ఎమ్.కె)

ఇదీ చూడండి: అభిమన్యు.. ‘ది రియల్ వారియర్’

ఇదీ చూడండి: సెకెండ్ ఛాన్స్‌

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?