ఆర్య నాగరికత పార్ట్‌ 3

Vedic civilization part 3

భారతదేశంలో ఒక మహానాగరికతను నిర్మించిన ఆర్యుల జన్మస్థలం గురించి చరిత్రకారుల్లో ఒక కచ్చితమైన ఏకాభిప్రాయం లేదు. వేద సాహిత్యంలోనూ వీరి జన్మస్థలం గురించి ఎక్కడా ప్రస్తావనలేదు. అందుకే ఆర్యులు స్వదేశీయులని కొందరు, విదేశీయులని మరికొందరు విభిన్నమైన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. # ఆర్య నాగరికత పార్ట్‌ 3 #

స్వదేశీ సిద్ధాంతం:

అవినాష్‌ చంద్రదాస్‌, డా.సంపూర్ణానంద్‌, గంగానాథ్ ఝా మరియు డి.యస్‌.త్రివేది లాంటి పండితులు ఆర్యులు స్వదేశీయులని, సప్తసింధు ప్రాంతము వీరి జన్మస్థలమని వాదించారు. సప్తసింధు అంటే ఏడు నదుల ప్రాంతము. ఇది ప్రధానంగా సరస్వతి మరియు సింధులోయ ప్రాంతము.

నదుల ప్రస్తుత పేర్లు వేదాల్లోని పేర్లు గ్రీకు గ్రంథాల్లోని పేర్లు
సరస్వతి సరస్వతి హర్కావతి

(జొరాష్ట్రియన్ల పవిత్ర గ్రంథమైన జెండ్‌ అవెస్తాలో సరస్వతి నది “హర్కావతి”గా పేర్కొనబడింది.)

సింధు సింధు ఇండస్‌ (Indus)
సట్లెజ్‌ సతుద్రి జెరాడ్రస్‌ (Zeradrus)
రావి పరుష్ని హైడ్రోట్స్‌ (Hydrotes)
చీనాబ్‌ అసికిని అకెసిన్స్‌ (Akesins)
బియాస్‌ విపస హైపసిస్‌ (Hypases)
జీలం వితస హైడాస్పస్‌ (Hydaspus)
విదేశీ సిద్ధాంతం:
  • మ్యాక్స్‌ముల్లర్‌ (Max Muller) అనే జర్మన్‌ ఇండాలజిస్ట్‌ ఆర్యులు మధ్యఆసియా నుంచి భారతదేశానికి వలస వచ్చి క్రీ.పూ.1500 కాలంలో సప్తసింధు ప్రాంతంలో స్థిరపడ్డారని అభిప్రాయపడ్డారు. మ్యాక్స్‌ముల్లర్‌ అభిప్రాయాన్ని ఎక్కువ మంది పండితులు ఆమోదిస్తున్నారు. ఆర్యులు మధ్యఆసియా నుంచి వలస వచ్చారని అక్కడ లభించిన భోగజ్‌కొయి శాసనం కూడా పరోక్షంగా తెలియజేస్తుంది. ఈ శాసనం క్రీ.పూ.1400 లో క్యూనిఫాం లిపిలో వెయ్యబడింది. ఈ శాసనము హిటైట్‌ మరియు మిత్తని అనే రెండు ఆర్య తెగల మధ్య యుద్ధం గురించి తెలియజేస్తోంది. అలాగే ఆర్య దేవతలైన ఇంద్ర, వరుణ, మిత్ర, నసత్యల గురించి ఇందులో పేర్కొనబడింది.
  • మ్యాక్‌ డొనాల్డ్‌ మరియు డా.పెంక అనే పండితులు ఆర్యులు జర్మనీ-ఆస్ట్రియా ప్రాంతం వారని అభిప్రాయపడ్డారు.
  • దయానంద సరస్వతి ప్రకారం ఆర్యులు టిబెట్‌ నుంచి భారతదేశానికి వలస వచ్చారు.
  • బాలగంగాధర తిలక్‌ ఆర్యులు ఉత్తరధృవ ప్రాంతమైన ఆర్కిటిక్‌ నుంచి భారతదేశానికి వలస వచ్చారని అభిప్రాయపడ్డారు. ఈయన “The Arctic home in the vedas”అనే గ్రంథాన్ని వ్రాశారు.

*****************************************************************************

ఇండాలజీ

భారతదేశాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని “ఇండాలజీ” అంటారు. భారతదేశ చరిత్ర, సంస్కృతి మొదలైన అంశాలను ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. దీనిని 18వ శతాబ్దములో ఐరోపాకు చెందిన చరిత్ర పండితులు అభివృద్ధి చేశారు.

ప్రముఖ ఇండాలజిస్ట్‌లు :

విలియం జోన్స్‌: ఇతను ఇంగ్లాండ్‌కు చెందిన ఇండాలజిస్ట్‌. 1784లో కలకత్తాలో “Asiatic Society of Bengal” అనే సంస్థను స్థాపించాడు. కాళిదాసు రచించిన ‘అభిజ్ఞానశాకుంతలము’ను ఇంగ్లీషులోకి అనువధించాడు.

ఛార్లెస్‌ వికిన్స్‌: ఇతను బ్రిటీష్‌ ఇండాలజిస్ట్‌, భగవద్గీతను ఇంగ్లీషులోకి తర్జుమా చేశారు.

Note: విలియంజోన్స్‌, ఛార్లెస్‌ వికిన్స్‌లను ఇండాలజీ పితామహులు (Fathers of Indology) అని అంటారు.

మ్యాక్స్‌ముల్లర్‌: ఇతను జర్మన్‌ ఇండాలజిస్ట్‌, ఋగ్వేదాన్ని ఆంగ్లంలోకి అనువధించాడు.

ఏ.యల్‌.భాషం: ఈయన ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్. ప్రాచీన భారతదేశ చరిత్ర, సంస్కృతిపైన “The wonder that was India” అనే సుప్రసిద్ధ గ్రంథాన్ని రచించారు.

**************************************************************************************

ఆర్యుల నాగరికతను అధ్యయన సౌలభ్యం కొరకు రెండు దశలుగా విభజించివచ్చు. అవి:

  1. ఋగ్వేద నాగరికత
  2. మలివేద నాగరికత

ఋగ్వేద నాగరికత (క్రీ.పూ.1600 – 1000): ఈ కాలాన్ని తొలివేదయుగమని లేదా ఋగ్వేద యుగమని పిలుస్తారు.

మలివేద నాగరికత (క్రీ.పూ.1000 – 600) : ఈ కాలాన్ని మలివేదయుగము అని అంటారు.

ఋగ్వేద నాగరికత

ఋగ్వేద కాలంలో ఆర్యులు భారతదేశంలోని సప్తసింధు ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యారు. తూర్పున యమున, దక్షిణాన ఆరావళి ప్రాంతం వరకే వీరి భౌగోళిక పరిజ్ఞానం పరిమితమైంది. ఈ కాలం నాటి ఆర్యులకు సముద్రము తెలియదు. ఋగ్వేదంలో సముద్రము అనే పదము ప్రస్తావించబడినప్పటికీ అది నదుల సంగమ ప్రాంతాలను మాత్రమే తెలియజేస్తుంది. బుగ్వేదంలోని శ్లోకాలలో గంగానది ‘ప్రస్తావించబడినప్పటికీ, ఆర్యులకు గంగానది పరిజ్ఞానం లేదు. ఇది తర్వాత కాలంలో వ్రాయబడ్డ శ్లోకాల్లో చెప్పబడింది (Later interpolation). ఋగ్వేదకాలం నాటి ఆర్యులు తూర్పువైపున యమునా నది దాటి వెళ్లలేదు కాబట్టి వీరికి గంగానది తెలిసే అవకాశం లేదు అని పండితుల అభిప్రాయం.

Note: ఋగ్వేదకాలం నాటి ఆర్యులు సింధు నాగరికత వెలిసిన ప్రాంతాల్లోనే జీవించారు.

మలివేదకాలం

క్రీ.పూ.1000 కాలంలో మలివేదకాల ఆర్యులు సప్తసింధు ప్రాంతం నుంచి గంగామైదాన ప్రాంతాలకు వలస వెళ్ళారు. శతపత బ్రాహ్మణము ఈ విషయాన్ని తెలియజేస్తూ, వైదేగమాధవ అనే ఒక తెగ నాయకుడు తన తెగతో కలిసి సరస్వతి నుంచి వలసవెళ్ళి సదానీర (గంగానదికి ఉపనది అయిన గండక్‌)నది తీర ప్రాంతంలో స్థిరపడ్డాడని చెబుతుంది.

ఐతరేయ బ్రాహ్మణము దక్షిణ భారతదేశంలోని సముద్రాలను మరియు అక్కడ నివసిస్తున్న తెగల గురించి సమాచారాన్ని ఇస్తుంది. మలివేద ఆర్యులకు భారతదేశంలోని అన్ని ప్రాంతాల భౌగోళిక పరిజ్ఞానము ఉన్నట్లుగా దీని ద్వారా తెలుస్తోంది.

ఆర్యుల ఆర్థిక వ్యవస్థ

ఋగ్వేదకాలంలో పశుపోషణ ఆర్థికవ్యవస్థ (Pastoral economy) కొనసాగింది. ఋగ్వేదంలో ఆవు 176 సార్లు, గుర్రం 215 సార్లు ప్రస్తావించబడింది.

ఈ కాలం నాటి ఆర్యుల సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత పరిస్థితులు గోవు చుట్టూ అల్లుకున్నాయి. రాజును గోప లేదా గోపతి అని, ధనవంతుడిని గోమత్‌ అని, యుద్ధాన్ని గవిస్తి అని, అతిథిని గోఘన అని అన్నారు.

ఋగ్వేద ఆర్యులు చాలా పరిమితంగా వ్యవసాయము చేశారు. గోధుమలు, బార్లీని పండించారు. వీటిని యవలుగా పేర్కొన్నారు. అయితే వరి ప్రస్తావన లేదు. వ్యవసాయంలో నాగలి (సిర/లంగాల)ని ఉపయోగించారు. దున్నిన భూమిని సీత అని, పంట కాలువలను కుల్య అని పేర్కొన్నారు.

తొలివేద కాలం నాటి ప్రధాన పరిశ్రమలు

కుండల పరిశ్రమ: కుండలను తయారుచేసే వారిని కులల/కులారిక అన్నారు.

వస్త్ర పరిశ్రమ: వస్త్రాలను నేసేవారిని వ్యాయ/కోలికులు అంటారు. వస్త్ర పరిశ్రమలో స్త్రీలు ప్రధాన భూమిక పోషించేవారు.

లోహపరిశ్రమ: ఋగ్వేదంలో రాగి మరియు కాంస్యమును ‘ఆయ’ అని పిలిచారు. వాస్తవానికి ఋగ్వేద కాలంలో ఇనుము వాడకం ప్రారంభం కాలేదు.

వడ్రంగి పరిశ్రమ: వడ్రంగులను తక్షణ్‌ అన్నారు.

ఆభరణాల పరిశ్రమ: బంగారు, వెండి ఆభరణాలు తయారు చేసేవారు.

ఋగ్వేద కాలంలో వ్యాపార వాణిజ్యాలు నామమాత్రంగా కొనసాగాయి. సాధారణంగా పశుపోషణ సమాజాల్లో వ్యాపారాభివృద్ధి అంతగా ఉండదు. క్రయ విక్రయాలలో ‘సువర్ణనిష్క’ను ఉపయోగించారు. ఆర్యుల నాగరికతలో నాణెములు ఎక్కడా లభ్యం కాలేదు. కాబట్టి నిష్కను నిర్ణీత విలువ కలిగిన ఒక బంగారు ఆభరణముగా పండితులు భావిస్తున్నారు.

మలివేదకాలం

ఆర్యుల ఆర్థిక వ్యవస్థలో క్రీ.పూ.1000 తర్వాత పెనుమార్పులు సంభవించాయి. తొలివేద కాలం నాటి పశుపోషణ ఆర్థిక వ్యవస్థ స్థానంలో వ్యవసాయ ఆధారిత ఆర్థికవ్యవస్థ ఆవిర్భవించింది. ఆర్యులు అత్యంత సారవంతమైన గంగా మైదాన ప్రాంతాలకు వలస రావడం, సమర్థవంతమైన ఇనుము సాంకేతిక పరిజ్ఞానమును ఉపయోగించడం వలన ఈ మార్పు సంభవించింది. భారతదేశంలో ఆర్యులు గంగామైదాన ప్రాంతాల్లోనే తొలిసారిగా ఇనుమును ఉపయోగించారు. వేదసాహిత్యములో ఇనుమును శ్యామఆయ, కృష్ణఆయ అని పిలిచారు. మలివేద కాలంలో వరిని విస్తారంగా పండించారు. వేద సాహిత్యంలో వరిని ‘వ్రిహి’  అని పిలిచారు. భారతదేశంలో పప్పు దినుసులు, చెరకు ఈ కాలంలోనే ప్రవేశపెట్టారు.

వేదసాహిత్యంలో ఐదు రకాల భూములను గురించి ప్రస్తావించారు. అవి:

  1. క్షేత్ర: సారవంతమైన భూములు
  2. ఖిల్వ క్షేత్ర: బీడు భూములు
  3. అప్రతిహత: అటవీ భూములు
  4. వస్తి: నివాసయోగ్యమైన భూములు
  5. గోపథసార: పచ్చికబయళ్ల భూములు

ఋగ్వేదకాలంతో పోలిస్తే మలివేద కాలంలో వ్యాపార,వాణిజ్యాలు మరియు హస్తకళా పరిశ్రమలు కొంత మేరకు అభివృద్ధి చెందాయి. కుండల పరిశ్రమ, వస్త్రపరిశ్రమ, వడ్రంగి పరిశ్రమ, లోహపరిశ్రమ, ఆభరణాల పరిశ్రమ, చర్మ పరిశ్రమ మొదలైనవి బాగా అభివృద్ధి చెందాయి.

మలివేద కాలంలోనే గంగామైదాన ప్రాంతాల్లో తొలిసారిగా నగరాలు వెలిసాయి. ఈ కాలంలో అభివృద్ధి చెందిన హస్తినాపురం, కౌశాంబి, అహిఛ్చాత్రంలను గంగా మైదాన ప్రాంతంలోని తొలి నగరాలుగా పండితులు గుర్తించారు. # ఆర్య నాగరికత పార్ట్‌ 3 #

సామాజిక వ్యవస్థ

ఋగ్వేదకాలం

ఆర్‌.యస్‌.శర్మ అభిప్రాయం ప్రకారం ఋగ్వేద కాలంలో సమానత్వంతో కూడిన గిరిజన సామాజిక వ్యవస్థ (Tribal and egalitarian society) కొనసాగింది. తొలివేదకాలంలోని ఆర్యులు పితృస్వామ్య, సమిష్టి కుటుంబ వ్యవస్థ కలిగి ఉండేవారు. కుటుంబ యజమానిని కులప (Patriarch) అని పిలిచారు.

వర్ణ వ్యవస్థ గురించి పేర్కొంటున్న పురుషసూక్తము తరువాత కాలంలో వ్రాయబడి, ఋగ్వేదానికి జోడించబడింది అని పండితులు స్పష్టం చేస్తున్నారు.

Note: వేదకాలంలో కులవ్యవస్థ లేదు.

ఋగ్వేద సమాజంలో ప్రధానంగా 3 వర్గాలుండేవి. అవి:

పురోహిత వర్గం: మతపరమైన కార్యకలాపాలు నిర్వహించేవారు

యుద్ధవీరుల వర్గం: యుద్ధాల్లో పాల్గొనేవారు

సామాన్యవర్గం: పశుపోషణ, వ్యవసాయం లాంటి కార్యకలాపాలు నిర్వహించేవారు.

ఋగ్వేద సమాజంలో వివిధ వర్గాలున్నప్పటికీ వివక్షతలు లేవు. సామాజిక చలనము (Social mobility) అంటే ఒక వర్గం నుంచి మరొక వర్గానికి మారే స్వేచ్ఛ ఉండేది. అనులోమ వివాహాలు (Hypergamous), ప్రతిలోమ వివాహాలు (Hypogamy) మరియు సహపంక్తి భోజనాలు (Inter-dining) అనుమతించబడ్డాయి.

ఋగ్వేదకాలం నాటి సమాజంలో లింగ వివక్షత లేదు. స్రీలకు సంపూర్ణమైన స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్ర్యం ఉన్నాయి. బాల్యవివాహాలు లేవు. స్త్రీలు పురుషులతో సమానంగా విద్యను అభ్యసించారు. ఋగ్వేదంలో 20 మంది వరకు మహిళా మేధావుల ప్రస్తావన ఉంది. వీరిలో గోష, లోపాముద్ర, విశ్వవర, స్వయంవర, అపల మొదలైన వారు ముఖ్యులు. గోష జీవితకాలమంతా విద్యను అభ్యసిస్తూ బ్రహ్మచారిణిగానే ఉండిపోయి, సమాజంలో “ఋషిణిగా” గౌరవించబడింది.

నియోగ (levirate): సంతానం లేని వితంతువు, చనిపోయిన భర్త యొక్క సోదరుడి ద్వారా సంతానం పొందడాన్ని నియోగ అంటారు.

ఋగ్వేదంలో బానిస వ్యవస్థ, సతీ సహగమనము గురించి ప్రస్తావన ఉంది. అయితే సతీ సహగమనం కేవలం నామమాత్రంగానే (Symbolic) ఉండేది. బహుభార్యత్వం (Polygamy) ఆచరణలో ఉండేది.

మలివేదకాలం

ఋగ్వేదకాలం నాటి సామాజిక పరిస్థితులు మలివేదకాలంలో సంపూర్ణమైన మార్పులకు లోనయ్యాయి. సరళమైన వివక్షతలు లేని వర్గవ్యవస్థ (Class divided) స్థానంలో సంక్లిష్టమైన వివక్షతలతో కూడిన వర్ణవ్యవస్థ (Caste divided) ఆవిర్భవించింది. సామాజిక చలనం, సహపంక్తి భోజనాలు నిషేధించబడ్డాయి. అనులోమ వివాహాలు అనుమతించబడి, ప్రతిలోమ వివాహాలు నిషేధించబడ్డాయి.

Note:

అనులోమ వివాహము: ఉన్నత వర్గం లేదా ఉన్నత వర్ణానికి/కులానికి చెందిన పురుషుడు దిగువ వర్గం లేదా దిగువ వర్ణం/కులానికి చెందిన స్త్రీని వివాహం చేసుకోవడం.

ప్రతిలోమ వివాహము: దిగువ వర్గము లేదా దిగువ వర్ణము/కులానికి చెందిన పురుషుడు ఉన్నత వర్గము లేదా ఉన్నత వర్ణము/కులానికి చెందిన స్త్రీని వివాహం చేసుకోవడం.

సామాజిక, మత మరియు లింగ వివక్షతలకు ఈ మలివేద కాలంలోనే బీజాలు పడ్డాయి. ఉపనయనం చేసుకున్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య పురుషులను ద్విజులని పేర్కొన్నారు. ఉపనయనానికి అర్హత లేని శూద్ర మరియు అన్ని వర్ణాల మహిళలను ఏకజులు అని పేర్కొన్నారు.

మహిళలు క్రమంగా తమ గౌరవస్థానాన్ని కోల్పోయారు. బాల్యవివాహాలు, బహుభార్యత్వం, సతీసహగమనం లాంటి దురాచారాలు కొనసాగాయి. వితంతు వివాహాలను నిషేధించారు. ఐతరేయ బ్రాహ్మణము ఆడపిల్లలు పుట్టడమే సర్వ దుఃఖాలకు కారణమని పేర్కొంది. చట్టబద్దమైన వారసులను కని వంశాన్ని వృద్ధి చేయడానికి, మరియు కుటుంబ సేవలకు మాత్రమే స్త్రీలను పరిమితం చేయడం జరిగింది.

వేద సాహిత్యములో ప్రస్తావించబడిన 8 రకాల వివాహాలు

బ్రహ్మ వివాహము: అత్యంత ఆదర్శవంతమైన వివాహం. పెద్దలు నిర్ణయించి శాస్త్రాల ప్రకారం నిర్వహించబడుతుంది.

దైవ వివాహము: ఇది పురోహితులకు మాత్రమే వర్తిస్తుంది. ఒక యాగాన్ని నిర్వహించిన తర్వాత పురోహితుడికి ఇవ్వవలసిన దక్షిణకు బదులుగా ఇంట్లో ఉన్న అమ్మాయినిచ్చి వివాహం చెయ్యడము.

ఆర్ష వివాహము: ఒక ఎద్దును, ఆవును వధువుకు కన్యాశుల్కంగా ఇచ్చి నిర్వహించే వివాహము.

ప్రజాపత్య వివాహము: ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేకుండా జరిపే వివాహము. అంటే కన్యాశుల్కము గాని వరకట్నము గాని లేకుందా జరిగే వివాహము.

గాంధర్వ వివాహము: ఇది క్షత్రియులకు మాత్రమే వర్తిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే పెద్దలను సంప్రదించకుండా, ఎటువంటి వివాహ సంప్రదాయాలను పాటించకుండా, పరస్పర అంగీకారంతో చేసుకునే ప్రేమ వివాహం.

అసుర వివాహము: ఇది వైశ్యులకు సూచించబడిన వివాహము. వధువును గాని, వరుడిని గాని కొనుక్కొని వివాహము చేసుకోవడము.

రాక్షస వివాహము: ఈ వివాహము క్షత్రియులకు మాత్రమే వర్తిస్తుంది. పెద్దలను వ్యతిరేకిస్తూ (ప్రేమించిన అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళి వివాహము చేసుకోవడము.)

ఉదాహరణ: శ్రీకృష్ణుడు సత్యభామను రాక్షస వివాహం చేసుకున్నాడు.

పైశాచ వివాహము: అన్నింటికంటే నికృష్టమైన వివావామిది. వధువును బలవంతంగా ఎత్తుకొని వెళ్ళి వివాహము చేసుకోవడము.

వేదసాహిత్యంలో చెప్పబడిన నాలుగు ఆశ్రమాలు

ఒక వ్యక్తి తన జీవితాన్ని నాలుగు దశల్లో జీవించాలని నిర్దేశించబడింది. వీటినే ఆశ్రమాలు అంటాము. అవి:

బ్రహ్మచర్య: ఈ దశ ఉపనయనముతో ఆరంభమవుతుంది. గురుకులానికి వెళ్ళి విద్యనభ్యసించాలి.

గృహస్తాశ్రమము: ఈ దశ వివాహముతో ప్రారంభమవుతుంది. కుటుంబ బాధ్యతలు నెరవేర్చాలి.

వానప్రస్తాశ్రమము: కుటుంబాన్ని వీడి సమీపంలోని వనాలకెళ్ళి జ్ఞానాన్ని ఆర్జించాలి. ఈ దశలో వ్యక్తి సమాజములో సభ్యుడిగానే కొనసాగుతాడు.

సన్యాసాశ్రమం: వ్యక్తి జీవితంలో ఇది చివరిదశ. ప్రాపంచిక మరియు సంసార జీవితాన్ని త్యజించి సన్యాసమును స్వీకరించడము. మోక్షం ఈ దశలోనే సాధ్యమవుతుంది.

చాందోగ్య ఉపనిషత్‌ ఆశ్రమ వ్యవస్థ గురించి తెలియజేసే తొలిగ్రంథం. అయితే ఇందులో మొదటి మూడు ఆశ్రమాలే చర్చించబడ్డాయి. సన్యాసాశ్రమ వ్యవస్థ ప్రస్తావన లేదు. జబలోపనిషత్‌ తొలిసారిగా నాలుగు ఆశ్రమాల గురించి వివరంగా పేర్కొంది. # ఆర్య నాగరికత పార్ట్‌ 3 #

చతుర్విధ పురుషార్థాలు

వేదసాహిత్యంలో ఒక వ్యక్తి యొక్క నాలుగు జీవిత లక్ష్యాల గురించి ప్రస్తావన ఉంది. వీటినే పురుషార్థాలు అంటారు. అవి: ధర్మార్థకామ మోక్షాలు.

ధర్మం: ధర్మాన్ని పాటించాలి.

అర్థం: న్యాయబద్ధంగా సంపదను ఆర్జించాలి.

కామం: ధర్మబద్ధంగా కోరికలను నెరవేర్చుకోవాలి.

మోక్షం: జన్మ పునర్జన్మ బంధనాలను వీడి ఆత్మను పరమాత్మలో లీనం చేయడం.

రాజకీయ వ్యవస్థ

ఋగ్వేద కాలం: ఈ కాలంలో గిరిజన సంబంధమైన రాజకీయ వ్యవస్థ (Tribal polity) ఉండేది. ప్రతి తెగకు రాజన్‌ అనే అధిపతి ఉండేవాడు. రాజన్‌ను తెగలోని ప్రజలే స్వయంగా ఎన్నుకునేవారు. అంటే ఆ కాలంలో గణతంత్ర వ్యవస్థ (Republic) ఉండేదని మనకు అర్థమవుతోంది. రాజన్‌ నిరంకుశుడు కాదు. ఎందుకంటే అతనికి పరిమితమైన అధికారాలు మాత్రమే ఉండేవి. ప్రతి తెగలో నాలుగు అసెంబ్లీలు ఉండేవి. వీటి నియంత్రణలోనే రాజన్‌ పనిచేసేవాడు.

సభ:  తెగలోని పెద్దలు ఇందులో సభ్యులు. ఇందులో మహిళలకు స్థానముండేది. దీని తీర్మానాలను నరిష్త అని అంటారు.

సమితి: తెగలోని ప్రజలందరు ఇందులో సభ్యులుగా ఉండేవారు.

విధాత: వివాదాలు పరిష్కరించడము దీని ప్రధాన విధి. ఇందులోనూ మహిళలకు స్థానం కల్పించబడింది.

గణ: దీని గురించి కచ్చితమైన సమాచారం లేదు.

రాజన్‌కు పరిమితమైన విధులుండేవి. జన (తెగ) మరియు పశువులను (గోవులు) కాపాడటము రాజన్‌ యొక్క ప్రధానమైన విధి. ఈ కాలంలో జనపదాలు లేదా రాజ్యాలు ఏర్పడలేదు.

రాజన్‌కు పరిపాలనలో సహకరించడానికి కొంత మంది అధికారులు ఉన్నారు.

పురోహిత: పరిపాలనలో రాజన్‌ తర్వాత న్థానం పురోహితుడిదే.

సేనాపతి: ఇతర తెగలతో యుద్ధాలు చేయడంలో ఇతను కీలకపాత్ర పోషించాడు.

వ్రజపతి: పశువులకు కావాల్సిన పచ్చికబయళ్ళను అభివృద్ధి చేసే అధికారి.

గ్రామణి: గ్రామాధికారి

స్పాస: ఇతను గూఢచారి. శత్రు తెగల రహస్య సమాచారాన్ని రాజన్‌కు చేరవేసేవాడు.

జీవగ్రిభ లేదా ఉగ్ర: పోలీస్‌ అధికారి.

రాజన్‌కు ఆదాయ వనరులు పరిమితంగా ఉండేవి. ఋగ్వేద కాలంలో పన్నులు లేనప్పటికీ, రాజన్‌కు రెండు ప్రధాన ఆదాయమార్గాలు ఉండేవి. అవి:

  1. యుద్ధాల్లో జయించిన సంపద
  2. బలి

“బలి” అనేది పన్ను కాదు. ప్రజలు స్వచ్ఛందంగా రాజన్‌కి ఇచ్చే విరాళము. అందుకే రాజన్‌ను ‘బలిహర్త’ అని అంటారు. అంటే ప్రజల నుంచి బలిని పొందేవాడు అని అర్థం.

ఋగ్వేద కాలంలోని ఆర్య తెగల మధ్య అనేక యుద్ధాలు జరిగేవి. ఈ కాలంలో యుద్దాలన్నీ గోవుల కోసం జరిగాయి కాబట్టి ఈ యుద్ధాలను ‘గవిష్తి’ అని పిలిచారు. బుగ్వేద కాలంలో జరిగిన యుద్ధాల్లో ‘దశరజన్య యుద్ధం’ (Battle of ten kings) అత్యంత ముఖమైనది. ఈ యుద్ధం పరుష్ని (రావి) నది ఒడ్డున జరిగింది. భరత తెగకు చెందిన రాజన్‌ సుదామ, పది తెగల కూటమిని ఓడించాడు. ఈ కూటమికి పురు తెగకు చెందిన రాజన్‌ పురుకుత్స నాయకత్వం వహించాడు. ఈ దశ రాజుల యుద్ధంలో భరత తెగకు పురోహితుడైన వశిష్టుడు మరియు పురు తెగకు పురోహితుడైన విశ్వామిత్రడు కీలకపాత్ర పోషించారు. సుదాముడి తాతగారైన దివోదాసుడు కూడా అనేక విజయాలు సాధించినట్లుగా ఋగ్వేదం తెలుపుతుంది.

మలివేద కాలం: ఈ కాలంలో రాజకీయ, పరిపాలన వ్యవస్థల్లో సమూల మార్పులు సంభవించాయి. సంచార జీవితాన్ని గడుపుతూ, పశుపోషణపైన ఆధారపడి ఉన్న ఋగ్వేద ఆర్యులు సప్తసింధు ప్రాంతమును వీడి గంగామైదాన ప్రాంతాలకు వలస రావడంతో అనేక మార్పులు సంభవించాయి. ఈ కాలంలోనే గంగా మైదాన ప్రాంతాల్లో జనపదాలు (నిర్ధిష్ట భూభాగం కలిగిన రాజ్యాలు) అవతరించాయి. మలివేద ఆర్యులు సారవంతమైన గంగామైదాన ప్రాంతాల్లో వ్యవసాయము చేపట్టడముతో స్థిర నివాసము సాధ్యమై తద్వారా రాజ్యాలు ఏర్పడటానికి మార్గం ఏర్పడింది.

మలివేద కాలం నాటి ముఖ్యమైన రాజ్యాలు:

మగధ: బార్హద్రద వంశము పాలించింది. బృహద్రధుడు మరియు జరాసంధుడు ఈ వంశంలోని ముఖ్యమైన రాజులు.

కాశి: ఈ రాజ్యాన్ని పాలించిన అజాతశత్రువు గొప్పతత్వవేత్త. ఇతని ఆస్థానంలో బాలాకి గార్గెయ అనే తత్వవేత్త ఉండేవాడు.

కురురాజ్యం: దీనికి హస్తినాపురం రాజధాని. పురాణాల ప్రకారం కలియుగంలోని తొలి రాజు పరీక్షితుడు ఈ రాజ్యాన్ని పరిపాలించాడు.

వైదేహ రాజ్యం: మిథిలానగరం రాజధాని. క్రీ.పూ.8వ శతాబ్ధంలో జనకుడు అనే తత్వవేత్త ఈ రాజ్యాన్ని పాలించాడు. (రామాయణం ప్రకారం ఇతను సీతకు తండ్రి). ఇతను తన రాజ్యంలో ‘బ్రహ్మోదయ’ అనే తత్వవేత్తల పోటీని నిర్వహించాడు. ఇతని ఆస్థానంలోని యజ్ఞావల్క్యుడు ఈ పోటీలలో ఉద్దాలకఅరుణితో సహా తత్వవేత్తలందరిని ఓడించాడు. ఉద్ధాలకఅరుణి గురించి చాందోగ్య ఉపనిషత్తులోనూ ప్రస్తావన ఉంది. యజ్ఞావల్క్య స్మృతి అనే ధర్మశాస్త్ర గ్రంథము ఈ కాలంలోనే రాయబడింది. బృహదారణ్యక ఉపనిషత్తులో యజ్ఞావల్క్యుడు తన ఇద్దరు భార్యలతో జరిపిన తాత్విక చర్చ రాయబడింది.

పాంచాల రాజ్యం: ప్రవహనజైవాలి అనే తత్వవేత్త పాలించాడు. ఇతని ఆస్థానంలో శ్వేతకేతుఅరుణెయ అనే తత్వవేత్త ఉన్నాడు.

కోసల రాజ్యం: అయోధ్య రాజధానిగా ఇక్ష్వాకు వంశం పరిపాలించింది.

మలివేద కాలంలో నిరంకుశ రాచరిక వ్యవస్థలు ఆవిర్భవించాయి. ఋగ్వేద కాలం నాటి రాజన్‌ ఇప్పుడు చక్రవర్తి అయ్యాడు. చక్రవర్తులు తమ పదవిని వంశపారంపర్యము చేసుకోవడము వలన రాచరిక వ్యవస్థలు ఆవిర్భవించాయి. యజ్ఞయాగాల వలన చక్రవర్తి అధికారాలు గణనీయంగా పెరిగి నిరంకుశ రాచరిక వ్యవస్థ ఏర్పడింది. బుగ్వేదకాలం నాటి గోపాలుడు (గోవులను కాపాడే రాజన్‌) మలివేదకాలంలో భూపాలుడు (రాజ్యాన్ని/ భూభాగాన్ని పాలించే చక్రవర్తి) అయ్యాడు.

ఈ మలివేద కాలంలోనే పన్నుల వ్యవస్థ ప్రవేశపెట్టబడింది. ‘భాగ’ అనే పన్నును ప్రవేశపెట్టారు. మన భారతదేశంలో వసూలు చేయబడిన తొలి పన్ను ‘భాగ’ అని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఒక వ్యక్తి తాను ఉత్పత్తి చేసిన ధాన్యంలోను మరియు వస్తువుల్లోను కొంత భాగాన్ని చక్రవర్తికి పన్నుగా చెల్లించాలి.

పరిపాలనలో చక్రవర్తికి సహాయకులుగా 12 మంది అధికారులు ఉండేవారు. వీరిని ‘ద్వాదశ రత్నిన్‌’ అంటారు. అందులో ముఖ్యమైనవారు పురోహితుడు, సేనాపతి, గ్రామణి, సూత (రథసారధి), భాగదూగ (పన్నులు వసూలు చేసే అధికారి), సంగ్రహిత్రి (కోశాధికారి), స్తపతి (గవర్నర్‌/ న్యాయమూర్తి), పురపతి (కోటలు / నగరాలకు రక్షకుడు). శతపత బ్రాహ్మణము సూత మరియు గ్రామణిని ‘రాజకార్తె (రాజును నిర్ణయించేవారు)’ అని పేర్కొంది. # ఆర్య నాగరికత పార్ట్‌ 3 #

మత పరిస్థితులు

ఋగ్వేదకాలం

ఈ నాటి మతంలో ప్రకృతి శక్తుల ఆరాధన జరిగింది. ఋగ్వేదంలో పేర్కొనబడిన 33 మంది దేవతలు అందరూ ప్రకృతి శక్తులే. అంటే ఆర్యులు ప్రకృతి శక్తులకు మానవ రూపాన్ని ఇచ్చి పూజించారు. విధ్వంసాన్ని సృష్టించే ఉగ్రప్రకృతి శక్తులకు పురుష దేవతల రూపాన్ని, ప్రశాంతంగా ఉండే ప్రకృతి శక్తులకు స్త్రీ దేవతల రూపాన్ని ఇచ్చి పూజించారు.

ఋగ్వేద కాలం నాటి దేవతలు

ఇంద్రుడు వాతావరణ దైవం, యుద్ధాల్లో విజయాల కోసం ఆర్యులు ఇంద్రుడిని

పూజించారు. ఋగ్వేదంలోని 1028 శ్లోకాల్లో 250 శ్లోకాలు ఇంద్రునివే.

ఇంద్రుడిని జితేంద్ర, పురంధర, శతక్రతు, సోమప, అప్సుజిత్‌, రథేష్ట, మాఘవన్‌, వ్రిత్రాహమ్‌ అని కూడా అంటారు.

అగ్ని ఋగ్వేదంలో 200 శ్లోకాలు అగ్నికి అంకితమవ్వబడ్డాయి. దేవతలకు భక్తులకు మధ్యవర్తిగా అగ్నిదేవుడిని పూజిస్తారు. అగ్ని దేవుని హవ్యవాహనుడు అని కూడా అంటారు.
వరుణుడు ఋగ్వేదంలోని 20 శ్లోకాల్లో వరుణ దేవుడిని కీర్తించారు. ఇతను 1000

స్తంభాలు మరియు 1000 ద్వారాలు కలిగిన భవంతిలో నివసిస్తాడు. తన

పాశముతో పాపులను శిక్షిస్తాడు.

త్వస్త్రి అగ్ని పర్వతాలను త్వస్త్రిగా పూజించారు.
మారుత్‌ పిడుగులను మారుత్‌ దేవతగా పూజించారు.
అశ్వినీ దేవతలు ఔషధ వృక్షములను అశ్వినీ దేవతలుగా భావించారు.
వాయు గాలిని వాయుదేవుడు అని అన్నారు.
పుషాన్‌ శూద్రుల దేవుడు
సోమ సోమ అనే మొక్కను దేవుడిగా పూజించారు. ఋగ్వేదములోని తొమ్మిదవ మండలంలోని 114 శ్లోకాలతో సహా మొత్తం 120 శ్లోకాలు సోమదేవుడికి అంకితం ఇవ్వబడ్డాయి.
ఉషస్‌ ఉషోదయమును (Dawn) ఉషస్‌ దేవతగా పూజించారు.
అదితి భూమాత
అరణ్యయని  అరణ్యాల దేవత
సావిత్రి వెలుగును సావిత్రి దేవతగా పూజించారు. ఋగ్వేదంలోని ప్రసిద్ధ గాయత్రి మంత్రం ఈ దేవత యొక్క ప్రార్థన.

ఋగ్వేదకాలం నాటి ఆర్యులు ప్రార్థనలు మరియు నైవేద్యంతో తమ దేవతలను ఆరాధించారు. సోమ అనే మొక్క నుండి తయారుచేసిన సోమ పానీయాన్ని దేవతలకు నైవేద్యంగా పెట్టారు. ఈ కాలంలోని ఆర్యులు ఇహలోక సౌకర్యాల కోసమే దేవుళ్ళను ఆరాధించారు. పరలోక చింతన, ఆధ్యాత్మికత భావనలు అనేవి వీరిలో లేవు. యుద్ధాల్లో విజయాల కోసం, సంతానం కోసం మరియు పశుసంపద కోసం మాత్రమే దేవతలను ఆరాధించారు.

మలివేదకాలం

మలివేదకాలంలో మతవ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. 33 మంది ప్రధాన ప్రకృతి దేవతలు తమ ప్రాధాన్యతను కోల్పోయారు.  ప్రజాపతి లేదా బ్రహ్మ (సృష్టికర్త), విష్ణువు (లోక రక్షకుడు), రుద్ర (చెడును నాశనము చేసేవాడు) అనబడే త్రిమూర్తులు మలివేద కాలంలో ప్రధాన దైవాలుగా అవతరించారు.

ఋగ్వేదకాలంనాటి ప్రధాన  దైవాల్లో కొందరు అష్టదిక్పాలుగా (ఎనిమిది దిక్కులకు అధిపతులు) నియమించబడ్డారు.

తూర్పు దిక్కు: ఇంద్రుడు

పశ్చిమ దిక్కు: వరుణుడు

ఉత్తర దిక్కు: కుబేరుడు

దక్షిణ దిక్కు: యముడు

ఆగ్నేయ దిక్కు: అగ్ని

నైఋతి దిక్కు: సూర్యుడు

వాయువ్య దిక్కు: వాయువు

ఈశాన్య దిక్కు: సోముడు

మలివేద కాలంలో సంక్షిష్టమైన, వ్యయ ప్రయాసలతో కూడిన యజ్ఞయాగాలు ప్రాధాన్యత సంతరించుకొన్నాయి. మతంలో ఆధ్యాత్మిక భావనలు, పరలోక చింతన ఎక్కువైంది. తాత్వికపరమైన చర్చలు కొనసాగాయి.

ఆత్మ – పరమాత్మ, జన్మ – పునర్జన్మ, మోక్షము లాంటి అంశాలకు ప్రాధాన్యత పెరిగింది.

సింధు నాగరికత మరియు వైదిక నాగరికతలకు మధ్య వ్యత్యాసాలు

భారతదేశంలో క్రీ.పూ.2500 – 1750ల మధ్య విరాజిల్లిన సింధూనాగరికత మరియు క్రీ.పూ.1500 – 600ల మధ్య అభివృద్ధి చెందిన వైదిక నాగరికతల మధ్య పోలికల కంటే వ్యత్యాసాలే ఎక్కువగా ఉన్నాయి.

సింధూ నాగరికత పూర్తిగా స్వదేశీయమైనది మరియు ద్రావిడులకు చెందినది. వైదిక నాగరికతకు ఆద్యులైన ఆర్యులు స్వదేశీయులా లేదా విదేశీయులా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

సింధూ నాగరికతను అధ్యయనం చేయడానికి పూర్తిగా పురావస్తు శాస్త్రంపై ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు వైదిక నాగరితను మాత్రం వేద సాహిత్యం ద్వారా అధ్యయనం చేయవచ్చు.

సింధూ నాగరికత పట్టణ నాగరికత కాగా వైదిక నాగరికత గ్రామీణ నాగరికత.

సింధు ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ఆధారితమైనది. బార్లీ, గోధుమలు ఈ కాలం నాటి ప్రధాన ఆహారధాన్యాలు. ఆర్యులు ప్రధానంగా పశుపోషకులు, మలివేద కాలంలో వీరికి వ్యవసాయం ప్రధానవృత్తిగా మారింది. ఆర్యులకు వరి ప్రధాన ఆహారమయింది.

సింధు ప్రజలు అనేక రకాల పరిశ్రమలను అభివృద్ధి చేసి దేశ విదేశాలతో వ్యాపార,వాణిజ్యాలు నిర్వహించారు. ఇలాంటి అభివృద్ధి ఆర్యుల నాగరికతలో అరుదుగా కనిపిస్తుంది.

సింధు ప్రజలు కేవలం రాగి మరియు కాంస్యమును ఉపయోగించగా, మలివేద ఆర్యులు ఇనుమును విరివిగా ఉపయోగించారు.

మతరంగంలో కూడా ఈ రెండు నాగరికతల మధ్య అనేక వ్యత్యాసాలు కనిపిస్తాయి. సింధు ప్రజలకు మాతృదేవత మరియు పశుపతి మహాదేవుడు ప్రధాన దైవాలు. వీరు లింగాలను, ఎద్దులను, పాములను మరియు చెట్లను పూజించారు. ప్రారంభంలో ఆర్యులు ప్రకృతి శక్తులైన ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, వాయుదేవుళ్ళను పూజించారు. మలివేద కాలంలో మాత్రం త్రిమూర్తులను ప్రధాన దైవాలుగా పూజించారు. జంతుబలులతో కూడా యజ్ఞయాగాలను ఆచరించారు. సింధు నాగరికత కాలం నాటి విగ్రహరాధన ఆర్యుల నాగరికతలో ఏ మాత్రమూ కనిపించదు.

సింధు నాగరికత మరియు వైదిక నాగరికతలు పరస్పర భిన్నమైన నాగరికతలైనప్పటికీ, ప్రస్తుత భారత నాగరికతకు ఈ రెండు కలిసి పునాదులు వేసాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఇదీ చూడండి: ఆర్య నాగరికత పార్ట్‌ 2

ఇదీ చూడండి: చరిత్ర అధ్యయనం – ఆధారాలు

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?