అనగనగా ఒక పెద్ద గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతని వద్ద ఒక గాడిద, ఒక కోతి ఉండేవి. ఆ గాడిదకు రాత్రిపూట పొలాలను కాపాడటం, బరువైన వస్తువులు మోసుకెళ్లడం వంటి పనులు అప్పగించేవాడు. అందువల్ల అది బాగా అలసిపోయేది. దీనితో అది పగటి సమయంలో చెట్టు కింద విశ్రాంతి తీసుకునేది.
కానీ కోతి ఎప్పుడూ అల్లరి చేస్తూ గాడిదను ఆటపట్టించేది.
ఒకసారి గాడిద పొలంలో గడ్డి తింటూ, “నేను రాత్రంతా కష్టపడి పని చేస్తూ యజమానికి సాయం చేస్తున్నాను. కానీ అతను నన్ను పొగడకపోగా, కనీసం నా శ్రమను గుర్తించడంలేదు” అనుకుని బాధపడింది.
ఒక రోజు రైతు పొలంలో దొంగలు పడ్డారు. దీనితో ఆ గాడిద తన యజమానికి ఈ విషయం చెప్పి, తన గొప్పతనాన్ని, పనితనాన్ని చాటి చెప్పాలని అనుకుంది. దీని వల్ల తన యజమాని తనను పొడుగుతాడని ఆశించింది. దీనితో అందరికీ వినిపించేలా గట్టిగా అరవడం మొదలుపెట్టింది.
దీనితో అక్కడే ఉన్న కోతి, అలా అరవవద్దని గాడిదకు సలహా ఇచ్చింది. “స్నేహితుడా! నీ గాత్రం చాలా భయంకరంగా ఉంది. నీవు ఇలా అరుస్తే అది విని దొంగలు పారిపోతారు. మన యజమాని కూడా చిరాకుపడి నిన్నే కొడతాడు. కనుక నీవు మౌనంగా ఉంటే మంచిది” అని చెప్పింది.
కానీ గాడిద ఆ మాట వినిపించుకోలేదు. అది కోతి మాటలను తేలిగ్గా తీసేసి మరింత గట్టిగా అరిచింది. దీనితో దొంగలు పారిపోయారు. మరోవైపు మంచి నిద్రలో ఉన్న రైతు గాడిద అరుపులు విని మేల్కొన్నాడు. అప్పటికే దొంగలు పారిపోయారు కనుక, అతనికి గాడిద ఎందుకు అరిచిందో తెలియలేదు. దీనితో కోపంతో ఒక కర్ర తీసుకుని, గాడిదను చితకబాదాడు.
అప్పుడు గాడిద బాధతో, “అయ్యో! నేను కోతి మాట వినుంటే ఇంత శిక్ష పడేది కాదు. తెలియని పనులు చేయడం ఎప్పుడూ మనకు నష్టమే కలిగిస్తుంది” అని అనుకుంది.
నీతి: మనది కాని పని చేయడం, మనకు తెలియని పని చేయడం ఎప్పడూ నష్టాన్నే కలిగిస్తుంది.
Note : ఈ కథ పంచతంత్రంలోని “మిత్రబేధ” విభాగానికి చెందినది. మిత్రబేధ కథలు స్నేహితుల మధ్య కలహాలు, అపోహలు, తప్పుడు సలహాలు ఎలా మిత్రత్వాన్ని నాశనం చేస్తాయో చూపిస్తాయి.