మౌర్యానంతర యుగంలో విదేశీ వాణిజ్యము
క్రీ.పూ.200 – క్రీ.శ.300 మధ్యకాలంలో భారతదేశంలో కనివినీ ఎరుగని విదేశీ వాణిజ్యము కొనసాగింది. చరిత్రకారులు ఈ కాలాన్ని వ్యాపార యుగము (Mercantile Age) అని కూడా అంటారు. చైనా, ఇరాన్, ఆగ్నేయాసియా, రోమన్ సామ్రాజ్యాలతో అత్యద్భుతమైన నౌకా వ్యాపారం జరిగింది. తత్ఫలితంగా ఈ కాలం సిరిసంపదలతో తులతూగింది.
- చైనాతో వ్యాపారం: క్రీ.శ.2వ శతాబ్దంలో టాలమి అనే గ్రీకు పండితుడు వ్రాసిన జియోగ్రఫీలో చైనాకు భారతదేశానికి మధ్య ఉన్న రహదారులు గురించి సమాచారం ఉంది. చైనా నుండి పట్టువస్త్రాలు మరియు పింగాణి పాత్రలు భారతదేశానికి దిగుమతయ్యేవి. క్రీ.పూ.రెండవ శతాబ్దానికి చెందిన చైనా నాణెములు మైసూరు ప్రాంతంలో లభించాయి.
- ఆగ్నేయాసియాతో వ్యాపారం: ప్రాచీన భారత సాహిత్యంలో ఆగ్నేయాసియాను సువర్ణభూమి లేదా సువర్ణద్వీప అని పిలిచారు. ఆగ్నేయాసియా నుండి చందనము, సుగంధ ద్రవ్యాలతో నౌకలు భారతదేశానికి వస్తున్నాయని శిలప్పాదికారం అనే తమిళ గ్రంథము తెలియజేస్తుంది. ఇక్కడి నుండి ఇవి రోమన్ సామ్రాజ్యానికి ఎగుమతి అయ్యేవి.
- ఆఫ్రికా ఖండముతో వ్యాపారము: ఈజిప్ట్ మరియు అబిసీనియా (ఇథియోపియా)కు భారత వస్తువులు ఎగుమతి అయ్యేవని సాహిత్య ఆధారాలున్నాయి.
- ఇండో-రోమన్ వ్యాపారము: ప్రాచీన కాలంలో యావత్తు ఐరోపాను పాలించిన రోమన్ సామ్రాజ్యంతో భారతీయులు అత్యధికంగా వ్యాపారం కొనసాగించారు. దీని గురించి ఈ క్రింది రెండు విదేశీ గ్రంథాలు సమాచారాన్ని ఇస్తున్నాయి.
- ప్లీని వ్రాసిన న్యాచురల్ హిస్టరీ (క్రీ.శ.ఒకటవ శతాబ్దము) భారతదేశపు ఎగుమతులను తెలియజేస్తుంది. చోళ మరియు శాతవాహన రాజ్యాల నుండి మస్లీన్ వస్త్రాలు, చేర రాజ్యము నుండి సుగంధ ద్రవ్యాలు, పాండ్య రాజ్యం నుండి ముత్యాలు ఎగుమతయ్యాయి. దీనికి ప్రతిఫలముగా కోట్లాది బంగారు, వెండి నాణెములు భారతదేశానికి తరలివెళ్తున్నాయని ప్లీని తెలియజేశాడు. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో పురావస్తు త్రవ్వకాల్లో భారీగా రోమన్ నాణెములు లభించాయి.
- అలెగ్జాండ్రియా (ఈజిప్ట్)కు చెందిన అజ్ఞాత గ్రీకు నావికుడు వ్రాసిన పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ (క్రీ.శ.ఒకటవ శతాబ్దము) అనే గ్రంథంలో భారతదేశంలోని అనేక ఓడరేవుల ప్రస్తావన ఉంది. అందులో ముఖ్యమైనవి:
- బార్యగజ (బరుకచ్చ – గుజరాత్)
- కల్లిణ (కళ్యాణ్ – మహారాష్ట్ర)
- సుప్పర (సోపార – మహారాష్ట్ర)
- తిండీస్ (క్యాలికట్ – కేరళ)
- ముజురీస్ (కొచ్చిన్ – కేరళ): ఇక్కడ రోమన్ వర్తకుల స్థావరము బయల్పడింది.
- పొదుక (అరికమేడు – పాండిచ్చేరి): ఇక్కడ రోమన్ వర్తకుల స్థావరము బయల్పడింది.
- మసుల (మచిలీపట్నం – ఆంధ్రప్రదేశ్)
- గ్యాంగ్ (తామ్రలిప్తి – బెంగాల్)
క్రీస్తు శకము తొలి శతాబ్దాల్లో అత్యంత గొప్ప నౌకా వ్యాపారము కొనసాగడానికి ఈ క్రింది అంశాలు దోహదపడ్డాయి.
- క్రీ.శ.46లో హిప్పాలస్ అనే గ్రీకు నావికుడు ఋతుపవనాలను కనుక్కోవడముతో నౌకాయానములో విప్లవాత్మక మార్పులు సంభవించాయి.
- చైనా నుండి రోమన్ సామ్రాజ్యానికి వెళ్ళే ‘సిల్క్ రూట్’ భారతదేశం గుండా మరలడము ఈ వ్యాపారాభివృద్ధికి ఇంకొక కారణము. భూమార్గం ద్వారా చైనా నుండి పట్టువస్త్రాలు భారతదేశానికి వచ్చి, ఇక్కడ నుండి నౌకల ద్వారా రోమన్ సామ్రాజ్యానికి చేరేవి. భారతదేశ చరిత్ర
మతపరిస్థితులు
మౌర్యానంతర యుగములో మతరంగంలో అనేక మార్పులు సంభవించాయి.
- క్రీ.శ.ఒకటవ శతాబ్దములో కాశ్మీర్‌లో నిర్వహించబడిన నాలుగవ బౌద్ధ సమావేశంలో హీనయాన మరియు మహాయాన శాఖలు ఆవిర్భవించాయి. మహాయాన ఆవిర్భావముతో బౌద్ధమతంలో విగ్రహారాధన లాంటి కీలకమైన మార్పులు సంభవించాయి.
- ఈ కాలంలో వైదికమత పునరుద్ధరణ జరిగింది. ఉత్తర భారతదేశాన్ని పాలించిన శుంగులు, కణ్వులు మరియు దక్కన్‌ను పాలించిన శాతవాహనులు వైదికమతాన్ని ఆదరించారు. మౌర్యుల కాలంలో ఆదరణ కోల్పోయిన యజ్ఞయాగాలు మౌర్యానంతరయుగంలో ఊపందుకొన్నాయి.
- భాగవత మతము అనే నూతన మత ఆవిర్భావము ఈ కాలంలోని ఇంకొక గొప్ప పరిణామము. ఇది అవైదిక మతము. ఈ మతం యజ్ఞయాగాలను తిరస్కరించి భక్తిని బోధిస్తుంది. ఈ మతంలో ఐదుగురు దేవతలను పూజిస్తారు. దీన్ని పంచరాత్రపూజ లేదా పంచవీర పూజ అంటారు. ఈ ఐదుగురు దేవతలు యదు తెగ మరియు వ్రిష్ని వంశానికి చెందినవారు. వీరు:
- వాసుదేవ కృష్ణుడు – వాసుదేవ కృష్ణుని గురించి ప్రాచీన గ్రంథాలలో అనేక ప్రస్తావనలు ఉన్నాయి. కృష్ణుడు గురించి తొలి ప్రస్తావన చాందోగ్య ఉపనిషత్తులో ఉంది. ఇందులో కృష్ణుడు దేవకి మరియు వాసుదేవులకు జన్మించాడని, నందుడు మరియు యశోదల దగ్గర పెరిగాడని చెప్పబడింది. పాణిని తన అష్టాధ్యాయిలో కృష్ణుడికి మరియు అర్జునుడికి మధ్య సంబంధాలను వివరించాడు. బౌద్ధ గ్రంథమైన ఘటజాతకలో వాసుదేవ కృష్ణుడు మధురకు చెందిన రాజకుటుంబీకుడని తరువాత ద్వారకలో స్థిరపడ్డాడని చెప్పబడింది. పతంజలి రాసిన మహాభాష్యంలో కృష్ణుడు కంసుడిని సంహరించే కథ ఉంది. ఉత్తరాధ్యాయనసూత్ర అనే జైన గ్రంథము వాసుదేవ కృష్ణుడు మరియు 22వ తీర్థంకరుడైన అరిష్టనేమి సమకాలికులనీ, వీరిరువురూ సొరియపుర అనే నగరంలో జీవించారని చెబుతుంది.
- సంకర్షణ లేదా బలరామ: కృష్ణుని సోదరుడు
- సాంబ: కృష్ణుని కుమారుడు
- ప్రద్యుమ్న: కృష్ణుని కుమారుడు
- అనిరుద్ధుడు: ప్రద్యుమ్న కుమారుడు మరియు కృష్ణుని మనవడు
శుంగ రాజైన భాగభద్రుని ఆస్థానంలో ఉన్న హీలియోడోరస్ అనే గ్రీకు రాయబారి భాగవత మతాన్ని స్వీకరించాడు. తాను వేసిన బేసనగర్ శాసనంలో కృష్ణున్ని దేవదేవ అని, తనను తాను పరమభాగవత అని హీలియోడోరస్ పిలుచుకున్నాడు. దీని ద్వారా ఆనాటి విదేశీయులు భాగవత మతం పట్ల ఆకర్షితులయ్యారని చెప్పవచ్చు.