ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతల్లో సింధూ నాగరికత ఒకటి. అయితే భారతదేశంలోని తొలినాగరికత అయిన ఈ సింధు నాగరికత కాలం గురించి చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు. ఇది సుమారుగా క్రీ.పూ.2500 నుంచి క్రీ.పూ.1750 మధ్యలో విరాజిల్లి ఉంటుందని R.S.శర్మ అభిప్రాయపడుతున్నారు. # హరప్పా నాగరికత #
1826లో మాసన్ (Mason) అనే పురావస్తుశాస్త్రవేత్త ఈ నాగరికత అవశేషాలను మొదటిసారిగా గుర్తించారు. కానీ బ్రిటీష్ ప్రభుత్వం ఉదాసీనత వహించి ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
1921లో హరప్పా త్రవ్వకాలతో ఈ సింధూ నాగరికత అధ్యయనము ప్రారంభమయింది. 1921 కంటే పూర్వము ఆర్యుల నాగరికతతోనే మనదేశంలో నాగరికత ప్రారంభమయిందని అందరూ భావించేవారు. సింధు నాగరికత బయల్పడడంతో అత్యంత ప్రాచీన నాగరికతలు కలిగిన దేశాల జాబితాలో భారతదేశము చేరింది.
సమకాలీన నాగరికతలు
భారతదేశంలో సింధు మరియు సరస్వతి లోయల్లో సింధు నాగరికత అభివృద్ధి చెందిన కాలంలోనే ప్రపంచములో మరో మూడు గొప్ప నాగరికతలు విరాజిల్లాయి.
I. సుమేరియ/ మెసపుటేమియా నాగరికత:
ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నాగరికత. ప్రస్తుత ఇరాక్‌లోని టైగ్రిస్ మరియు యూప్రటీస్ నదీ లోయల్లో ఈ నాగరికత అభివృద్ధి చెందింది. “మెసపుటేమియా” అనేది ఇరాక్ యొక్క ప్రాచీన నామము. “మెసపుటేమియా” అంటే రెండు నదుల మధ్య ప్రాంతము (అంతర్వేది) అని అర్థము.
నోట్: సింధు నాగరికత ప్రజలు, సుమేరియ నాగరికతతో సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలను కొనసాగించారని చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు ఉన్నాయి.
II. చైనా నాగరికత:
చైనాలోని హోయాంగ్ హో (Hwang Ho) నది లోయలో అభివృద్ధి చెందింది. హోయాంగ్ హో అంటే (పసుపు పచ్చని నది) ‘Yellow river’ అని అర్థం. తరచుగా వరదలు వచ్చి విధ్వంసం సృష్టిస్తుండడం వల్ల ఈ నదిని చైనా దుఃఖదాయని (Sorrow of China) అని అంటారు.
III. ఈజిస్ట్ నాగరికత
ఆఫ్రికా ఖండంలోని నైలునది లోయలో ఈ నాగరికత అభివృద్ధి చెందింది.
నోట్: సింధు నాగరికత ప్రజలు, చైనా నాగరికతతో కానీ, ఈజిప్ట్ నాగరికతతో కానీ, సంబంధాలు కొనసాగించారని చెప్పడానికి సరైన ఆధారాలు లభించలేదు.
సింధు నాగరికత యొక్క వివిధ పేర్లు
- సింధు నాగరికత: ఈ నాగరికత ప్రధానంగా సింధూలోయలో కేంద్రీకృతము కావడం వల్ల దీనిని సింధు నాగరికత అని పిలుస్తున్నారు.
- హరప్పా నాగరికత: ఈ నాగరికత అవశేషాలు మొట్టమొదటగా హరప్పా(Type site)లోనే కనుగొనబడ్డాయి. పురావస్తు శాస్త్రములో ఒక సంప్రదాయం ఉంది. మొదటిగా కొనుగొనబడిన type site పేరు మీదుగానే ఆ ప్రాంతానికి నామకరణం చేస్తారు. అందుకే ఇది హరప్పా నాగరికత అయ్యింది.
- కాంస్యయుగ నాగరికత: సింధు నాగరికత కాంస్య యుగానికి (Bronze Age) చెందినది. సింధు ప్రజలే భారతదేశంలో మొదటిసారిగా కాంస్యంను ఉపయోగించినవారు. రాగి మరియు తగరమును కలిపి ఈ మిశ్రమ లోహాన్ని తయారుచేశారు.
- చారిత్రక సంధియుగం: సింధూ నాగరికత ప్రజలకు లిపి తెలుసు. సింధూ ప్రజల ముద్రికలలో ఈ లిపి స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అయితే ఈ లిపిని నేటివరకు ఎవ్వరూ చదవలేకపోయారు. అందుకే ఈ కాలాన్ని చారిత్రక సంధి యుగమని పేర్కొంటున్నారు. S.R.రావ్, ఫాదర్ హీరాస్, రాజారాం, నట్వర్ జా లాంటి పండితులు సింధులిపిని చదివేందుకు ప్రయత్నించారు కానీ సఫలీకృతం కాలేకపోయారు.
చిత్రలిపి
సింధూ ప్రజలు వాడిన లిపి చిత్ర లిపి (Pictographic Script). ఇది స్టీటైట్ (Steatite)తో చేసిన ముద్రికలపైన (Seals) కనిపిస్తుంది. సింధు నాగరికత త్రవ్వకాల్లో 4000 పైగా ముద్రికలు లభించాయి.
సింధు ముద్రికలు చతురస్రాకారము (Square), దీర్ఘచతురస్రాకారము (Rectangular), వృత్తాకారము (Circular) ఆకారాల్లో ఉన్నాయి.
కాలిబంగన్‌లో దొరికిన ఒక ముద్రిక ఆధారంగా సింధు లిపిని ‘సర్పలేఖన లిపి’ (Boustrophedon Script) గా గుర్తించారు. దీనిలో మొదటి వాక్యం కుడి నుంచి ఎడమకు మరియు రెండవ వాక్యం ఎడమ
నుంచి కుడికి రాయబడింది. ఈ లిపి నుంచే తర్వాతి కాలంలో బ్రాహ్మీ లిపి ఆవిర్భవించిందని అలెగ్జాండర్ కన్నింగ్ హామ్ అభిప్రాయపడ్డారు.
సింధూ నాగరికత విస్తీర్ణం
సమకాలీన నాగరికతలన్నింటి కంటే సింధు నాగరికత చాలా విశాలమైనది. ఇది ఈజిప్ట్ కంటే 20 రెట్లు; మెసపుటేమియా, ఈజిప్ట్ నాగరికతల సంయుక్త విస్తీర్ణం కంటే 12 రెట్లు పెద్దది.
సింధూ నాగరికత సరిహద్దులు:
ఉత్తర సరిహద్దు: జమ్మూ & కశ్మీర్‌లోని ‘మండ’. ఇది సింధు ఉపనది అయిన చీనాబ్ ఒడ్డున ఉంది.
దక్షిణ సరిహద్దు: మహారాష్ట్రలోని దైమాబాద్. గోదావరికి ఉపనది అయిన ప్రవర నది ఒడ్డున ఇది వెలసింది.
తూర్పు సరిహద్దు: ఉత్తరప్రదేశ్‌లోని అలంగీర్‌పూర్. ఇది యమున ఉపనది అయిన హింధాన్ నది ఒడ్డున అభివృద్ధి చెందింది.
పశ్చిమ సరిహద్దు: పాకిస్థాన్ – బెలూచిస్థాన్ రాష్ట్రంలోని సత్కజెన్‌దారో. ఇది దస్త్ నది ఒడ్డున ఉంది.
పై నాలుగు సరిహద్దుల మధ్య విరాజిల్లిన సింధు నాగరికత దాదాపుగా 13,00,000 చ.కి.మీల విస్తీర్ణమును కలిగి ఉంది. # హరప్పా నాగరికత #
సింధు నాగరికత నిర్మాతలు
సింధు నాగరికత ప్రజల గురించి కచ్చితమైన సమాచారము లేదు. అయితే వారు వివిధ జాతులకు చెందినవారని పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని ప్రకారం, సింధు ప్రజల సంస్కృతిని మిశ్రమ సంస్కృతిగా (Cosmopolitan Culture) మనం భావించవచ్చు.
సింధు ప్రజలు ప్రధానంగా నాలుగు జాతులకు చెందినవారు.
1.మంగోలాయిడ్ జాతి (Mongoloids): మొహంజొదారోలో లభించిన గడ్డపు మనిషి శిల్పంలో మంగోలాయిడ్ జాతి లక్షణాలు ప్రస్పష్టంగా కనిపిస్తున్నాయి.
2 ప్రోటో-ఆస్ట్రోలాయిడ్ జాతి (Proto-Australoid): మొహంజొదారోలో లభించిన కాంస్యముతో చేసిన నాట్యగత్తె విగ్రహములో (Bronze dancing girl) జాతి లక్షణాలు కనిపిస్తాయి.
3.ఆల్పినాయిడ్ జాతి (Alpinoids): పురావస్తు త్రవ్వకాలలో ఈ జాతికి సంబంధించిన ఆనవాళ్ళు లభించాయి.
4.మెడిటేరినియన్ జాతి (Mediterranean): సింధునాగరికతలో ఈ జాతి ప్రజలే అత్యధిక సంఖ్యాకులు.
వీరు ద్రావిడ భాషలు మాట్లాడారని, అందువల్లనే వీరిని ద్రావిడులు అని కూడా పిలువవచ్చునని చరిత్రకారులు భావిస్తున్నారు.
నోట్: మెడిటేరినియన్ అనేది జాతి పదం. ద్రావిడ అనేది భాష పదం. భాష పేరు మీదుగానే సింధు నాగరికతను ద్రావిడ నాగరికత అని కూడా అంటున్నారు.
సింధూ నాగరికత ఆవిర్భావము
సింధు నాగరికత ఆవిర్భావము గురించి స్పష్టమైన సమాచారం లేదు. వారి లిపిని చదవలేకపోవడం వల్ల ఇది మరింత సంక్లిష్టంగా మారింది. మరోవైపు పురావస్తు త్రవ్వకాల్లో బయల్పడిన వస్తు అవశేషాలు కూడా సంపూర్ణ సమాచారాన్ని ఇవ్వలేకపోయాయి. ఈ పరిస్థితుల్లో చరిత్రకారులు కొన్ని పరికల్పనలు (Hypothesis) చేశారు.
నోట్: నిర్ధిష్టమైన ఆధారాలు లేనప్పుడు, పండితులు తెలివైన ఊహాగానాల మీద సిద్ధాంతాలు రూపొందించడాన్ని పరికల్పనలు చేయడం అని అంటారు.
మార్టిమర్ వీలర్: ఇతని ప్రకారం సింధు ప్రజలు విదేశీయులు. మెసపుటేమియా నాగరికతకు చెందిన ప్రజలు, భారత్‌కు వలసవచ్చి, సింధు నాగరికతను అభివృద్ధి చేశారని వీలర్ అభిప్రాయపడ్డాడు.
నాగరికతకు రెక్కలుంటాయని, నాగరికత అనే భావన మెసపుటేమియాలో పుట్టి సింధు ప్రాంతానికి ఎగురుతూ వచ్చిందని వీలర్ వ్యాఖ్యానించాడు. సింధు నాగరికతకు మరియు మెసపుటేమియా నాగరికతల మధ్య ఉన్న సారూప్యతల ఆధారంగా వీలర్ ఈ పరికల్పనను ప్రతిపాదించాడు.
మాతృదేవతను ఆరాధించడం, నగర జీవితం గడపడం, స్నానవాటికలు, ధాన్యాగారాలు నిర్మించుకోవడము, స్టీటైట్‌తో చేసిన ముద్రికలను ఉపయోగించడం మొదలైన అంశాలు రెండు నాగరికతల్లోనూ కనిపిస్తున్నాయని వీలర్ చెప్పారు.
ఆధునిక చరిత్రకారులు మాత్రం వీలర్ పరికల్పనను తిరస్కరిస్తున్నారు. ఈ రెండు నాగరికతల మధ్య స్పష్టమైన బేధాలు ఉన్నాయని వారు గుర్తుచేస్తున్నారు.
సింధు నాగరికతలోని శాస్త్రీయ పట్టణ నిర్మాణము, భూగర్భ మురికి కాలువలు మెసపుటేమియా నగరాల్లో కనిపించవు. మెసపుటేమియా ప్రజలు క్యూనిఫాం లిపిని ఉపయోగించగా, సింధు ప్రజలు మాత్రము
చిత్రలిపిని వాడారు. ముద్రికల్లో కూడా స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది. మెసపుటేమియా ప్రజలు స్తూపాకారపు ముద్రికలు తయారు చేసుకోగా, సింధు ప్రజలు మాత్రము చతురస్రాకారము, దీర్ఘచతురస్రాకారము, వృత్తాకారపు ముద్రికలను ఉపయోగించారు. ఈ వ్యత్యాసాల ఆధారంగా వీలర్ పరికల్పనను ఆధునిక చరిత్రకారులు తిరస్కరిస్తున్నారు.
ప్రొ॥ రఫిఖ్ మొఘల్: ఇతను పాకిస్థాన్‌కు చెందిన పురావస్తు శాస్త్రవేత్త. రఫిఖ్ ప్రకారము బెలూచిస్తాన్‌లోని జోబ్ సంస్కృతి, కుల్లి సంస్కృతి, నల్ సంస్కృతి, క్వెట్ట సంస్కృతులకు చెందిన తామ్రశిలాయుగ ప్రజలు సింధులోయకు వలస వచ్చి ఈ నాగరికతను నిర్మించారు.
సింధు నాగరికతకు బెలూచిస్థాన్‌లోని తామ్రశిలాయుగ సంస్కృతలకు మధ్య ఉన్న సారూప్యత ఆధారంగా ఈ సిద్ధాంతాన్ని రఫిఖ్ మొఘల్ రూపొందించారు.
జోబ్ సంస్కృతికి చెందిన ప్రజలు లింగాలను, ఎద్దును ఆరాధించడం, కోటలు నిర్మించుకోవడము లాంటి అంశాలు సింధు నాగరికతలో కూడా కనిపిస్తాయి. నల్, కుల్లి, క్వెట్టకు చెందిన ప్రజల దహన సంస్కారాలు పూర్తిగా సింధు దహన సంస్కారాలను పోలి ఉన్నాయి. అయితే ఆధునిక చరిత్రకారులు ఈ వాదనతో ఏకీభవించడము లేదు. తామ్రశిలాయుగానికి చెందిన ప్రజలు గ్రామాల్లో నివసించేవారు. వీరికి మిశ్రమ లోహ పరిజ్ఞానము లేదు. అలాగే లిపి కూడా తెలియదు. శాస్త్రీయంగా మరియు సాంకేతికంగా ఎంతో వెనుకబడిన తామ్ర శిలాయుగ ప్రజలు అత్యంత అభివృద్ధి చెందిన సింధు నాగరికతను నిర్మించారని చెప్పడం సహేతుకంగా లేదు.
ఎ.ఘోష్, హెచ్.డి.శంకాలియ: వీరి అభిప్రాయము ప్రకారము, సింధు నాగరికత సంపూర్ణంగా స్వదేశీయమైనది. వీరు సింధు ప్రజలు విదేశీయులనే సిద్దాంతాలను ఖండించారు.
సింధు మరియు సరస్వతి లోయల్లో అభివృద్ధి చెందిన సింధూ పూర్వయుగ సంస్కృతులు (Pre Harappan Cultures) క్రమంగా అభివృద్ధి చెంది సింధు నాగరికతగా ఆవిర్భవించాయి. భారతదేశంలో అనేక నవీన శిలాయుగ సంస్కృతులు మరియు తామ్ర శిలాయుగ సంస్కృతులు పరిణామక్రమంలో గణనీయమైన ప్రగతిని సాధించి సింధు నాగరికతకు బాటలు వేసాయి.
నవీనశిలాయుగానికి చెందిన మెహర్‌ఘర్‌లో తయారు చెయ్యబడిన టెర్రకోట బొమ్మలు, వైఢూర్యాలతో చేసిన పూసలు, స్టీటైట్‌తో చేసిన ముద్రికలు సింధు నాగరికత కాలంలో కూడా కొనసాగాయి. తామ్రశిలాయుగానికి చెందిన అమ్రి సంస్కృతి (సింధ్), కోట్‌డిజి సంస్కృతి (సింధ్) మరియు సోధి సంస్కృతి (రాజస్థాన్)లలో కూడా సింధు నాగరికత లక్షణాలు కనిపిస్తాయి.
ఈ సంస్కృతులు క్రీ.పూ.3000లో అభివృద్ధి చెందాయి. అమ్రిలోని ధాన్యాగారము, కోట్‌డిజీలోని కోట నిర్మాణము సింధు నాగరికత కాలంలో కూడా కనిపిస్తుంది. దీనిని బట్టి సింధునాగరికత పూర్తిగా స్వదేశీయమైనదని, సింధు నాగరికత కంటే పూర్వమున్న సంస్కృతులు అభివృద్ధిని సాధించి, సింధు నాగరికతకు పునాదులు వేసాయని అర్థమవుతుంది.
ఇదీ చదవండి: ఆర్య నాగరికత
ఇదీ చదవండి: Pre-Historic Cultures