హాయ్ ఫ్రెండ్స్! welcome to masterfm.
ఈ ఆర్టికల్‌లో మనం డొల్ల కంపెనీలు అంటే ఏమిటో తెలుసుకుందాం!
వాస్తవానికి డొల్ల కంపెనీలకు సంబంధించి ఎలాంటి ప్రత్యేక నిర్వచనం లేదు. సాధారణంగా హవాలా సొమ్మును ప్రభుత్వం కళ్లుగప్పి, గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు ఈ డొల్ల కంపెనీలను సృష్టిస్తుంటారు.
చాలా డొల్ల కంపెనీలు ఉత్పత్తులను తయారు చేయడంకానీ, సేవలు అందించడం కానీ చేయవు. కాగితంపైన తప్ప వాస్తవానికి అవి ఎలాంటి కార్యకలాపాలను నిర్వహించవు.
అంతా డొల్లేనా?
ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకారం, మన దేశంలో సుమారు 15 లక్షల కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. వీటిలో కేవలం 6 లక్షల కంపెనీలు మాత్రమే ఏటా వార్షిక రిటర్నులను దాఖలు చేస్తున్నాయి. దీనిని బట్టి చాలా సంస్థలు ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ గుర్తించింది.
భరతం పట్టేందుకు?
డొల్ల కంపెనీల భరతం పట్టేందుకు కార్పొరేట్ మంత్రిత్వశాఖ (MCA), కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) కలిసి ఓ అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఆయా పర్యవేక్షక బోర్డుల సమాచారాన్ని పరస్పరం అందిపుచ్చుకునేలా ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఈ ఒప్పందం ద్వారా డొల్ల కంపెనీలను గుర్తించి, హవాలా విధానాన్ని రూపుమాపేందుకు కృషి చేయాలని నిర్ణయించాయి.
కంపెనీల రిజిస్టర్ నుంచి తొలగించవచ్చు..
ఏదైనా సంస్థ స్థాపించబడిన ఒక ఏడాదిలోపు వ్యాపారాన్ని ప్రారంభించకపోయినా లేదా రెండేళ్లలో ఎలాంటి వ్యాపార నిర్వహణ చేయకపోయినా లేదా ఆరు నెలల దాకా తన చందాదారులకు చెల్లింపులు చేయకపోయినా…. అలాంటి సంస్థల పేర్లను కంపెనీల రిజిస్టర్ నుంచి తొలగించేందుకు అవకాశం ఉంది.
కంపెనీల చట్టం సెక్షన్ 248ను అనుసరించి… ఇలాంటి డొల్ల కంపెనీల పేర్లను రిజిస్టర్ నుంచి తొలగించే అధికారం కంపెనీల రిజిస్ట్రార్‌కు ఉంది.
అన్ని సంస్థలను ఒక్కగాటన కట్టేయకూడదు
మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే… అన్ని కంపెనీలు హవాలా విధానాన్ని వాడుకునే ఉద్దేశంతో సృష్టించినవి కాకపోవచ్చు. నిజానికి కొన్ని కంపెనీలు తమ చట్టబద్ద పరిమితుల మేరకు పనిచేస్తూ ఉండవచ్చు. అవి నిజానికి ఎలాంటి ఆర్థిక అవకతవకలకు పాల్పడి ఉండకపోవచ్చు.
ఉదాహరణకు ఒక సంస్థ తన మానవ వనరుల విభాగం కోసం అనుబంధ సంస్థను ఏర్పాటుచేయవచ్చు. ఆ అనుబంధ సంస్థ చట్టబద్ధంగా అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండవచ్చు.
ఇన్వెస్టర్లు… జర జాగ్రత్త!
మీరు ఓ ఇన్వెస్టర్ అయితే… షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతూ ఉంటే… కచ్చితంగా ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్న డొల్ల కంపెనీలకు దూరంగా ఉండడం చాలా మంచింది. మీరు ఏదైనా కంపెనీ షేర్లు కొనాలనుకుంటే.. ముందుగా ఆ సంస్థ కార్యకలాపాలను, వ్యాపార నిర్వహణను, ఆర్థిక అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మొత్తానికి డొల్ల కంపెనీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
Click here: పబ్లిక్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అంటే ఏమిటి?
Click here: WHAT ARE THE FINANCIAL INSTRUMENTS TRADED IN INDIAN STOCK MARKET?