పంచతంత్రం

Panchatantra stories

విష్ణుశర్మ అనే పండితుడు “పంచతంత్రం”ను సంస్కృతంలో రచించాడు. క్రీ.శ 5వ శతాబ్ధంతో రచించబడిన ఈ గ్రంథం అనేక ప్రపంచ భాషల్లోకి అనువదించబడింది. నిజానికి పంచతంత్రం సంస్కృతంలో ఐదు విభాగాలుగా ఉంది. అయితే తెలుగులో మాత్రం దీన్ని మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం అనే నాలుగు విభాగాలుగా అనువదించడం జరిగింది. # పంచతంత్రం #

మన తెలుగు భాషా ప్రియుల కోసం, ఆ కథలను సరళమైన తెలుగు భాషలో అందిస్తున్నాము. ఈ ప్రయత్నంతో ఏమైనా తప్పులు దొర్లితే, దానికి బాధ్యత మాది. మంచి మాత్రం పూర్తిగా ఈ గొప్ప సారస్వతాన్ని మనకందించిన మహనీయుడు విష్ణుశర్మకే దక్కుతుంది.

పంచతంత్రం కథా ప్రారంభం

అనగనగా ఓ రాజు. ఆ రోజు పేరు సుదర్శనుడు. అతనికి నలుగురు కుమారులు. వారికి చదువు సంధ్యల కన్నా ఆటలు, పాటలు అంటే చాలా ఇష్టం. అయితే వారు బాగా చదువుకుని, శాస్త్రాలు ఒంటబట్టించుకుంటేనే కదా, రేపు రాజులై రాజ్యాన్ని ఏలగలిగేది.

యువరాజులు నలుగురూ మంచివాళ్లే. కానీ వారికి చదువంటే ఏ మాత్రం ఇష్టం లేదు. దీనితో తన పిల్లల భవిష్యత్‌ ఏమవుతుందోనని సుదర్శనుడికి భయం పట్టుకుంది.

దీనితో రాజుగారు సభలో కొలువుతీరి ఉన్నా, తన పిల్లల భవిష్యత్‌పై బంగతో ఎప్పుడూ ముభావంగానే ఉండేవారు.

ఓసారి రాజసభలో పండితులు, విద్వంసుల మధ్య రసవత్తరమైన చర్చాగోష్ఠి జరుగుతోంది.

అందులో ఓ పండితుడు, “ మనిషి సంపద, అధికారం, యవ్వనం, అవివేకం అనే నాలుగు విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నాలుగింటిలో ఏదో ఒకదానితో మనిషి చెడిపోయే ప్రమాదం ఉంది. ఈ నాలుగూ కలగలిసి ఉన్నవాళ్లు మాత్రం ఇట్టే చెడిపోతారు. అందుకే మనిషి అన్న ప్రతి ఒక్కడూ బాగా చదువుకోవాలి. అప్పుడే వివేకం, విజ్ఞానం కలిగుతాయి. ఫలితంగా చెడిపోకుండా ఉంటాడు. అందువల్ల మనిషికి విద్య అనే నేత్రం చాలా ముఖ్యమైనది. అది లేకపోతే బతుకంతా చీకటిమయం అవుతుంది” అని చెప్పాడు.

పండితుని మాటలతో రాజుగారి బాధ రెట్టింపు అయ్యింది. కొలువు చాలిస్తున్నామని చెప్పి, ఆయన అంతఃపురానికి వెళ్లిపోయారు. రాజుగారి పరిస్థితిని అర్థం చేసుకున్న మంత్రి రాజదత్తుడు కూడా చాలా బాధపడ్డాడు.

తరువాత అంతఃపురంలో ఉన్న రాజుగారికి యువరాజుల అరుపులు, కేకలు వినిపించాయి. ఏమిటా అని కిటికీలో నుంచి చూశాడు రాజు. ఉద్యానవనంలో అల్లరిచిల్లరిగా తన నలుగురు కుమారులు ఆడుకోవడం చూశాడు. దీనితో ఆయనకు ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది.

ఏమిటీ ఈ పిల్లలు! ఎందుకూ పనిరాకుండా పోతారా ఏమిటి? అని బాధపడ్డాడు. కానీ అంతలోనే తేరుకుని బాగా ఆలోచించాడు. “బాధపడి లాభం లేదు. ఈ సమస్యకు ఓ పరిష్కారం కనుక్కోవాలి. నిజానికి నా నలుగురు కుమారులు మంచి వాళ్లే. నేనే అతి గారాబం చేశాను. అందుకే వారు చదువుసంధ్యలు లేకుండా అలా చెడిపోతున్నారు. సరైన గురువు దగ్గర విద్య నేర్పిస్తే వారు కచ్చితంగా బాగుపడతారు కదా!” అనుకున్నాడు. యువరాజుల కోసం త్వరలోనే ఓ మంచి గురువుని వెదకాలని సుదర్శనుడు నిర్ణయించుకున్నాడు.

మరుసటి రోజు రాజసభలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నాడు సుదర్శనుడు. సభలోని పండితులతో, “ మహాత్ములారా… ఆటపాటలతో మునిగి తేలుతూ, విద్యను నిర్లక్ష్యం చేస్తున్న నా బిడ్డలకు విద్యాబుద్ధులు నేర్పాలి. వారిని నన్ను మించిన వారిగా తీర్చిదిద్దాలి. అలా నా బిడ్డలను తీర్చిదిద్దే సమర్థత కలవారు మీలో ఎవరైనా ఉన్నారా? ” అని అడిగాడు.

దీనితో సభలోని వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు. అంతలోనే ఓ పండితుడు లేచి నిల్చున్నాడు. అతనే విష్ణు శర్మ. “మహారాజా, నేను మీ బిడ్డలకు విద్యాబుద్ధులు నేర్పుతాను. వారిని ఉత్తమ పౌరులుగా, భావి రాజులుగా దీర్చిదిద్దుతాను. మహారాజా… యువరాజులు నలుగురు వజ్రాలు లాంటి వారు. అయితే ఎంతంటి వజ్రాన్ని అయినా సానబెడితేనే కదా ప్రకాశించేది. అందుకే చెబుతున్నాను. మీ బిడ్డలు నలుగురికి సరైన విద్య అవసరం. అది నేను అందిస్తాను. కానీ ఓ షరతు ఉంది. మీరు ఓ ఆరు నెలలపాటు యువరాజులు నలుగురిని నాతో పాటు అరణ్యానికి పంపించాలి. అక్కడ నా ఆశ్రమంలో వారికి శిక్షణను ఇస్తాను.” అన్నాడు విష్ణు శర్మ.

మహారాజు సుదర్శనుడు మహదానందపడిపోయాడు. సింహాసనం మీద నుంచి లేచి, విష్ణుశర్మ వద్దకు గబగబా వచ్చాడు. మహానుభావా, “ మీలాంటి గురువు దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకుంటే… నా కుమారులు తప్పకుండా యోగ్యులుగా తయారవుతారు. పూలు కట్టిన దారానికి ఆ పూల సుగంధం అబ్బినట్లుగా, మీ శిక్షణలో వారికి కచ్చితంగా విద్యాబుద్ధలు కలుగుతాయని నేను నమ్ముతున్నాను. అందుకే నా బిడ్డలను ఈ క్షణం నుంచే మీకు అప్పగిస్తున్నాను.” అన్నాడు సుదర్శనుడు.

తప్పకుండా మీ ఆశయం నెరవేరుస్తాను మహారాజా అని విష్ణుశర్మ మాట ఇచ్చాడు. ఓ శుభ ముహూర్తాన రాకుమారులు నలుగురిని వెంటబెట్టుకొని తన ఆశ్రమానికి వెళ్లాడు విష్ణుశర్మ.

                          * అసలు కథలు ఇకపైనే ప్రారంభమవుతాయి.*

ఇదీ చూడండి: ప్రజాకవి వేమన పద్యరత్నాలు

ఇదీ చూడండి: ఏమిటి ఈ ‘మనిషి’ బ్రతుకు?

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?