శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో శత్రువుల బెడద ఎక్కువగా ఉండేది. రాజధాని నగరాన్ని శత్రువుల బారినుంచి రక్షించేందుకు తగిన సలహాలు ఇవ్వాలని మంత్రులనూ, సైన్యాధికారులనూ కోరారు రాయలవారు. నగరం చుట్టూ ఎత్తైన రాతి గోడను నిర్మించాలని అందరూ అభిప్రాయపడ్డారు. అది రాయలవారికీ నచ్చడంతో దాన్ని అమలుపరిచి, బలమైన గోడలను నిర్మించారు. # ఏది అసలైన బలం? #
ఒక రోజు రాయలవారి సమక్షంలో, సైన్యాధికారి గోడను ఫిరంగి గుళ్లతో కొట్టించాడు. అయినా గోడకు ఏమీ కాలేదు. ఆ దృఢత్వం రాయలవారికి నచ్చింది. దాంతో “శత్రువులు ఎవరూ దాన్ని పగలగొట్టి లోనికి ప్రవేశించలేరు. మన రాజ్యభద్రతకు ఢోకాలేదు” అని ప్రశంసించారు. కానీ ఆ మాటలు, ఎందుకో తెనాలి రామలింగడికి అంతగా రుచించలేదు.
ఒక రోజు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడానికి రాయలవారు, తెనాలి రామలింగడు మారువేషాల్లో బయలుదేరారు. నగరంచుట్టూ కట్టిన రక్షణ గోడ ప్రవేశం ద్వారం దగ్గర సాయుధులైన కాపలాదార్లు ఉన్నారు. రామలింగడు వారి దగ్గరకు వెళ్లి ‘అత్యవసర వ్యాపార పనులమీద పక్క రాజ్యం నుంచి వచ్చాం, రాయలవారిని వెంటనే కలవాలి” అని అడిగాడు.
కాపాలాదారులు “పై అధికారుల అనుమతి లేనిదే లోపలికి పంపడం కుదరదు” అన్నారు. రామలింగడు పై అధికారిని కలిసి బంగారు నాణేల మూట లంచంగా ఇచ్చి, లోపలికి వెళ్లడానికి అనుమతి ఇవ్వమని కోరాడు. దానితో ఆ అధికారి మారువేశాల్లో ఉన్న రాయలవారిని, రామలింగడిని లోపలికి పంపించాడు.
ఈ తతంగం అంతా చూసిన శ్రీకృష్ణదేవరాయలు చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడు రామలింగడు, రాయలవారితో, “ప్రభూ! అధికారులు లంచగొండులైతే, రక్షణ గోడలు ఎంత దృఢంగా ఉన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. నిజాయితీపరులైన అధికారులే మన రాజ్యానికి అసలైన బలం” అని అన్నాడు. # ఏది అసలైన బలం? #
ఆ తర్వాత నుంచీ రాయలవారు అధికారులను నియమించేటప్పుడు శారీరక దారుఢ్యంతోపాటు, వారి నిజాయితీని కూడా కచ్చితంగా పరీక్షించడం మొదలుపెట్టాడు.
ఇదీ చూడండి: వికటకవి తెనాలి రామకృష్ణ కథలు
ఇదీ చూడండి: మా అమ్మమ్మ