ఏటా వచ్చే 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి ఎంతో విశిష్టమైనది. ఆ రోజున వైంకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ఆరోజు స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తారు. శ్రీ మహావిష్ణవు గరుడ వాహనదారుడై భూలోకానికొచ్చిన ముక్కోటి మంది దేవతలకు దర్శనమిచ్చిన రోజునే ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి మూడుకోట్ల ఏకాదశులతో సమానమని పండితులు చెబుతారు. వైకుంఠ ఏకాదశి రోజున కుభేర స్వరూపుడై కొలువుదీరిన స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించికుని వ్రతమాచరించనవారికి వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని ప్రతీతీ. ఉత్తర ద్వారాన్నే స్వర్గద్వారం అంటారు. ముక్కోటి దేవతలు స్వామివారిని అర్చించేందుకు ఈ ద్వారం నుంచే వెళతారు. అందువల్ల వేకువ జామునే వారితోపాటే వెళ్లి స్వామిని అర్చిస్తే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం.
భద్రాద్రిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి అధ్యనోత్సవాలు
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కొలువై ఉన్న భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఈనెల 15 నుంచి 25 వరకు పగలు పత్తు ఉత్సవాలు… 25 నుంచి జనవరి 4 వరకు రాపత్తు ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో స్వామివారు మత్స్య, కూర్మ, వరాహా, నరసింహ, వామన, పరశురామ, శ్రీకృష్ణ, బలరామునిగా రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
ఈ నెల 24న సాయంత్రం దేవాలయం ప్రాంగణంలోని పుష్కరిణిలో లక్షణ సమేత శ్రీ సీతారామచంద్రనికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. 25 తెల్లవారు జామున వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో 25 వరకు నిత్య కల్యాణాలు నిలిపివేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా స్వామివారి తిరువీధి సేవలు, భారీ సంఖ్యలో భక్తులకు అనుమతి రద్దు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. బేడా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మధ్యాహ్నం మహారాజ భోగం అనంతరం మేళతాళాలతో చిత్రకూటమండపానికి తీసుకొచ్చి స్వామివారి అవతారాలను భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.
అవతార విశిష్టతలు
మత్య్సావతారం:
శ్రీమహా విష్ణువు అవతారాల్లో మత్య్సావతారం మొదటిది. వేదాలను బ్రహ్మ నుంచి అపహరించి సముద్రంలో దాగిన సోమకాసురుడనే అసురుడిని సంహరించడానకి స్వామి మత్య్సావతారం ఎత్తారు. ఈ అవతారంలో స్వామిని పూజించడం వల్ల కేతు గ్రహ బాధలు తొలగుతాయి.
కూర్మావతారం:
పూర్వకాలంలో దేవదానవులు అమృతం కోసం మందర పర్వాతాన్ని సముద్రంలో చిలుకుతున్నప్పుడు పర్వతం కిందికి దిగిపోతుంది. ఆ సమయంలో దేవతల అభ్యర్థనపై శ్రీమహావిష్ణువు కూర్మావతారమెత్తి సముద్ర గర్భంలో చేరి పర్వతాన్ని వీపుపై పెట్టి పైకి లేపుతాడు. ఈ అవతారంలో స్వామిని దర్శించడం వల్ల శనిగ్రహ బాధలు తొలగుతాయని అర్చకులు చెబుతున్నారు.
వరాహ అవతారం:
ఈ అవతారంలో స్వామివారు హిరణ్యాక్షుడిని అంతమొందించి… భూమిని ఉద్ధరిస్తాడు.
నరసింహావతారం:
శ్రీమహా విష్ణువు నాలుగో అవతారమే నరసింహా అవతారం. అవతార గర్వంతో దేవతలను ఇబ్బంది పెట్టిన హిరణ్యకశిపుని సంహరించుటకు ప్రహ్లాదుని ప్రార్థనపై స్వామి నరసింహ అవతారమెత్తాడు.
వామన అవతారం:
దేవతల సర్వ సంపదలు తన స్వాధీనం చేసుకున్న రాక్షస రాజైన బలి చక్రవర్తి వద్దకు శ్రీహరి వామనరూపంలో వెళ్లి మూడడుగులు దానంగా ఇవ్వమని కోరతాడు. బలి నుంచి మూడడగులు దానంగా స్వీకరించి ఓక అడుగుతో భూమిని, రెండో అడుగుతో ఆకాశాన్ని, మూడో అడుగుతో బలి తలపై మోపి అతన్ని పాతాళానికి తొక్కేస్తాడు. ఈ అవతారంలో స్వామిని దర్శించుకుంటే గురు గ్రహ బాధలు తొలగుతాయి.
పరశురామ అవాతారం:
శ్రీమహావిష్ణువు జమదగ్ని మహార్షి కుమానునిగా జన్మించి పరశురాముడని పిలవబడతాడు. ఈ అవతారంలో కార్తవీర్యార్జుడుని, దుర్మార్గులైన రాజులపై 21 సార్లు దండెత్తి అంతం చేస్తాడు.
శ్రీ రామావతారం:
త్రేతాయుగంలో అతివీర భయంకురులైన రావణ, కుంభకర్ణాది రాక్షసులను అంతం చేసేందుకు స్వామివారు మానవరూపమెత్తిన అవతారమే శ్రీ రామావతారం. ఒకే మాట, ఒకే బాణం, ఒకే సతి అనే నినాదం ఈ అవతారం నుంచే వచ్చింది. పరిపూర్ణమైన మానవుడు ఎలా ఉండాలో భగవంతుడు ఆచరించి మానవాళికి చూపిన అవతారమే శ్రీరామావతారం.
బలరామావతారం:
శ్రీ లక్ష్మీనాథుడి శయనమైన ఆదిశేషుడి అంశతో జన్మించిన అవతారమే బలరామావతారం. నాగలిని ఆయుధంగా ధరించి శ్రీ కృష్ణుడికి సోదరునిగా… ధర్మస్థాపనలో తోడుగా నిలిచాడు. ఈ అవతారంలో ప్రలంబాసురుడనే అసురుడిని బలరాముడు అంతమొందిస్తాడు.
శ్రీ కృష్ణావతారం:
ద్వాపరయుగంలో దుష్ట శిక్షణ, శిష్టణ కోసం దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా జన్మిస్తాడు. ఈ అవతారంలోనే మేనమామ అయిన కంసుడిని, నరకాసురుడిని, శిశుపాలుడిని వధిస్తాడు. కురుక్షేత్రంలో పాండవుల పక్షాన నిలిచి భగవద్గీతను బోధిస్తాడు. కౌరవులను అంతంలో పాండవులకు అండగా నిలిచి ధర్మస్థాపన చేస్తాడు.
– అమ్ము (writer)
Click here: శ్రీ కృష్ణుడు అన్ని కష్టాలు పడ్డాడా?
Click here: IPO, NFO మధ్య తేడా ఏమిటి?