ఆర్య నాగరికత/ వైదిక నాగరికత (క్రీ.పూ.1500 – క్రీ.పూ.600)
సింధు నాగరికత తర్వాత భారతదేశములో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత వైదిక నాగరికత. నార్డిక్ జాతికి చెందిన ఆర్యులు ఈ నాగరికతను అభివృద్ధి చేశారు. నార్డిక్ జాతి ప్రజలు ఆర్య అనే భాషను మాట్లాడేవారు కాబట్టి వీటిని ఆర్యులు అంటాము. నార్డిక్ అనే పదము జాతి పదము కాగా, ఆర్య అనే పదము భాషా పదము. ఆర్యులు రచించిన వేద సాహిత్యము ద్వారా వీరి సంస్కృతిని అధ్యయనము చేస్తాము కాబట్టి ఈ నాగరికతను వైదిక నాగరికత అంటాము. భారతదేశ చరిత్రలో సాహిత్యము ద్వారా అధ్యయనము చేయగలిగిన తొలి యుగమిది. ఆర్యుల రాకతోనే మన దేశములో చారిత్రక యుగం ప్రారంభమయ్యింది. పురావస్తు శాస్త్రవేత్తలు ఈ నాగరికతను Painted Grey Ware (PGW) నాగరికత అంటారు. PGW అర్యులు ఉపయోగించిన ప్రత్యేక రకమైన కుండపాత్రలు.
వేద సాహిత్యము
ఈ నాగరికత కాలంలో ఆర్యులు అందించిన అద్భుతమైన సాహిత్యమే వేద సాహిత్యము, ఇది సంస్కృత భాషలో వ్రాయబడిన మత మరియు తత్వపరమైన సాహిత్యం. వేద సాహిత్యం తరతరాలుగా మౌఖికంగా వ్యాప్తిలో ఉంటూ, గుప్తుల కాలంలో వీటి వ్రాతప్రతులు వ్రాయబడ్డాయి. ఆర్యులు రచించిన ఈ అద్భుత సాహిత్యము ఈనాటి హిందూమతానికి పవిత్ర గ్రంథాలయ్యాయి. వేదసాహిత్యంలో ప్రధానంగా 8 భాగాలున్నాయి. అవి:
- వేదాలు
- బ్రాహ్మణాలు
- అరణ్యకాలు
- ఉపనిషత్తులు
పై నాలుగు భాగాలను శృతి సాహిత్యం అంటారు. ఇవి అపౌరుషేయములు. దేవతలు వ్రాసి వీటిని ఋషులకు పంపించారని విశ్వాసము. ఇవి అత్యంత పవిత్రమైన గ్రంథాలు.
- వేదాంగాలు
- పురాణాలు
- ఉపవేదాలు
- ఇతిహాసాలు
పై నాలుగు భాగాలను స్మృతి సాహిత్యం అంటారు. ఇవి ఋషులు ద్వారా వ్రాయబడిన గ్రంథాలు.
వేదాలు
వేద సాహిత్యంలో నాలుగు వేదాలు అత్యంత ప్రముఖమైనవి. అవి:
1. ఋగ్వేదము:
ఇందులో 1028 శ్లోకాలుంటాయి. (1017 ప్రధానమైనవి మరియు 17 అనుబంధమైనవి) ఇవన్నీ వివిధ దేవతల ప్రార్థనలు. అందులో అత్యంత ముఖ్యమైనది గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం అనేది సావిత్రి అనే దేవత ప్రార్థన. ఋగ్వేదంలోని 10 మండలాలలో (chapters) పురుషసూక్తం చివరిది. ఇందులోనే వర్ణవ్యవస్థ తొలిసారిగా ప్రస్తావించబడింది. సృష్టికర్త అయిన బ్రహ్మనే వర్ణవ్యవస్థను మరియు సమస్త విశ్వమును తన శరీరం నుంచే సృష్టించాడని ఈ గ్రంథం తెలియజేస్తుంది. తల నుండి బ్రాహ్మణులను, భుజాల నుండి క్షత్రియులను, తొడల నుండి వైశ్యులను, పాదాల నుండి శూద్రులను సృష్టించాడని పురుషసూక్తం తెలియజేస్తుంది.
2. యజుర్వేదం:
ఈ వేదము యజ్ఞయాగాది క్రతువులు (rituals) గురించి తెలియజేస్తుంది. ఆర్యుల మతంలో లేదా వైదిక మతంలో యజ్ఞయాగాలు కీలకపాత్రను పోషించాయి. యజుర్వేదంలో రెండు భాగాలున్నాయి. అవి:
(I) శుక్ల యజుర్వేదము: శుక్ల అంటే తెలుపు అని అర్థం. ఇది పద్యరూపములో వ్రాయబడింది. (II) క్రిష్ణ యజుర్వేదము: క్రిష్ణ అంటే నలుపు అని అర్థం. ఇది గద్యరూపంలో వ్రాయబడింది.
3. సామవేదము:
సమ అంటే సంగీతమని మరియు వేద అంటే జ్ఞానం అని అర్థం. ఇది సంగీతానికి సంబంధించిన వేదం. ఋగ్వేదంలోని శ్లోకాలు రాగయుక్తంగా సామవేదంలో వ్రాయబడ్డాయి. ఇందులో క్రొత్త సమాచారం ఏమీ ఉండదు కాబట్టి చరిత్రకారులకు ఈ వేదము ఉపయోగపడదు.
4. అధర్వణ వేదము:
ఈ వేదం 20 ఖండాలుగా విభజించబడి, 711 శ్లోకాలను కలిగి ఉంది. ఇందులో రోగాలను, భూత, ప్రేతాలను నివారించే మంత్రాలు ఉంటాయి. ఇది ఆర్యుల మూఢనమ్మకాలకు దర్పణము పడుతుంది. ప్రస్తుతం అధర్వణ వేదము పైప్పాలద సంహిత మరియు శౌనకీయ సంహిత అనే రెండు రూపాల్లో లభ్యమవుతోంది. కొంతమంది పండితుల ప్రకారం అధర్వణ వేదము అనార్యుల రచన. మొదటి మూడు వేదాలను మాత్రమే ఆర్యుల రచనలుగా పరిగణించి వీటిని ‘త్రయి వేదాలు’ అని పిలిచారు.
బ్రాహ్మణాలు
ఇవి యజ్ఞయాగాల గురించి తెలియజేసే గ్రంథాలు, గద్య రూపంలో వ్రాయబడి వేదాల అర్థాన్ని వివరిస్తాయి. నాలుగు వేదాలకు అనుబంధంగా ఏడు బ్రాహ్మణాలు వ్రాయబడ్డాయి. అవి:
ఐతరేయ బ్రాహ్మణము
కౌశితకి బ్రాహ్మణము |
ఇవి ఋగ్వేదానికి అనుబంధ గ్రంథాలు
|
శతపథ బ్రాహ్మణము | ఇది శుక్ల యజుర్వేదానికి అనుబంధ గ్రంథం |
తైత్తిరీయ బ్రాహ్మణము | ఇది కృష్ణ యజుర్వేదానికి అనుబంధ గ్రంథం |
తాండ్యమహ బ్రాహ్మణము
జైమినీయ బ్రాహ్మణము |
ఇవి సామవేదానికి అనుబంధ గ్రంథాలు |
గోపథ బ్రాహ్మణము | అధర్వణ వేదానికి అనుబంధ గ్రంథం |
- ఐతరేయ బ్రాహ్మణము దక్షిణ భారతదేశంలో కళింగ, పుళింద, మాతిబ, సవర, ఆంధ్ర ఇత్యాది తెగలు జీవిస్తున్నాయని తెలియజేస్తుంది. ఆంధ్ర అనే పదము తొలిసారిగా ఈ గ్రంథంలోనే ప్రస్తావించబడింది.
- శతపథ బ్రాహ్మణము రాజసూయ, వాజపేయ మరియు వ్యవసాయానికి సంబంధించిన యజ్ఞయాగాలను వివరిస్తుంది. వైశ్యుల్లో కుసిదిన్ అనే వడ్డీ వ్యాపారస్థులు ఉన్నారని ఈ గ్రంథం చెబుతుంది. వడ్డీ వ్యాపారాన్ని ప్రస్తావిస్తున్న తొలి గ్రంథం శతపథ బ్రాహ్మణమే.
- ఏడు బ్రాహ్మణాలలో తాండ్యమహ బ్రాహ్మణము మొట్టమొదటిది. ఇందులో ఆనార్యులు వ్రత్యస్తోమ అనే క్రతువు ద్వారా ఆర్యులుగా మారవచ్చని చెప్పబడింది.
అరణ్యకాలు
అరణ్యాల్లో నివసించే ఋషులు మరియు మునులకు సంబంధించిన గ్రంథాలివి. ఏడు బ్రాహ్మణాలకు అనుబంధంగా ఏడు అరణ్యకాలు ఉన్నాయి. అవి:
- ఐతరేయ అరణ్యకము
- కౌశితకి అరణ్యకము
- శతపథ అరణ్యకము
- తైత్తిరీయ అరణ్యకము
- జైమినీయ అరణ్యకము
- తాండ్యమహ అరణ్యకము
- గోపథ అరణ్యకము
ఉపనిషత్తులు
ఉపనిషత్తులు వేద సాహిత్యములోని చివరి భాగము కావడంతో వీటిని వేదాంతం అని అంటారు. మొత్తం 108 ఉపనిషత్తులున్నాయి. ఇందులో ముఖ్యమైనవి:
ఛాందోగ్య
ఉపనిషత్తు |
ఆశ్రమాల గురించి ప్రస్తావిస్తున్న తొలి గ్రంథం. (ఇందులో తొలి మూడు ఆశ్రమాల గురించి మాత్రమే ప్రస్తావన ఉంది). |
బృహదారణ్యక
ఉపనిషత్తు |
ఇందులో యజ్ఞవల్క్యుడు తన ఇద్దరు భార్యలైన కాత్యాయని మరియు మైత్రేయితో జరిపిన తాత్విక సంభాషణలు ఉంటాయి. |
ముండకోపనిషత్తు | భారతదేశ చిహ్నంలోని ‘సత్యమేవ జయతే’ అనే సూక్తిని ఇందులో నుంచి తీసుకున్నారు. |
జబలోపనిషత్తు | నాలుగు ఆశ్రమాలను ప్రస్తావించిన తొలి గ్రంథం. మానవ జీవితములోని నాలుగు ప్రధానమైన దశలను ఆశ్రమాలు అంటారు. అవి: బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వనప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం |
శ్వేతేశ్వతార ఉపనిషత్తు | యజ్ఞయాగాలను వ్యతిరేకించి, ‘భక్తి’ గురించి తెలియజేసిన తొలి గ్రంథం.
(వేదాలు మరియు బ్రాహ్మణాలు యజ్ఞయాగాలను సమర్థిస్తే, అరణ్యకాలు మరియు ఉపనిషత్తులు యజ్ఞయాగాలను తిరస్కరిస్తాయి. భక్తి ద్వారా మోక్షము సిద్ధిస్తుందని ఉపనిషత్తులు బోధిస్తాయి) |
ఉపనిషత్తుల్లో ఎక్కువగా తాత్విక ఊహాగానాలు ఉంటాయి. ఆత్మ – పరమాత్మ సంబంధాలు, జన్మ – పునర్జన్మ, కర్మ – మోక్షము లాంటి అంశాలు చర్చించబడ్డాయి.
వేదాంగాలు
ఇవి వేదాలకు అంగములవంటివి. వేద పండితులకు వీటి జ్ఞానము తప్పనిసరి. వేదాంగాలు ఆరు. అవి:
1. శిక్ష | పద ఉచ్ఛారణకు సంబంధించినది (Phonetics) |
2. నిరుక్త | పద ఆవిర్భావానికి సంబంధించినది (Etymology) |
3. ఛందస్సు | Metrics |
4. వ్యాకరణం | Grammar |
5. జ్యోతిషం | Astrology |
6. కల్ప | యజ్ఞయాగాలకు సంబంధించినది. కల్పలో గృహ సూత్ర, శ్రౌత సూత్ర మరియు సుళువ సూత్ర అను మూడు భాగాలున్నాయి. |
1.గృహసూత్ర:
ఒక వ్యక్తి తన మోక్షము కొరకు నిర్వహించాల్సిన షోడష కర్మలు (16 యజ్ఞాలు) ఇందులో వివరించబడ్డాయి. 16 కర్మలను తప్పకుండా నిర్వహించిన వారికి మాత్రమే మోక్షమని విశ్వాసము. ఈ 16 యజ్ఞాలు ఒక వ్యక్తి జీవితంలో తల్లి గర్భము నుండి సమాధి గర్భమునకు వెళ్ళే వరకు నిర్వహించాలి.
గర్భాదానము | వివాహిత స్త్రీ గర్భం దాల్చడానికి చేసే యజ్ఞం |
పుంశవనం | గర్భవతి మగపిల్లవాడు జన్మించాలని కోరుతూ చేసే యజ్ఞం. |
సీమంతోన్నయనం | సుఖ ప్రసవము కొరకు చేసే క్రతువు |
జాతకర్మ | శిశువు యొక్క జాతకమును తెలుసుకోవడం కోసం చేసే యజ్ఞం |
నామకరణం | శిశువుకు పేరు పెట్టే క్రతువు |
నిష్క్రమణ | తొలిసారిగా శిశువును బయటకు తీసుకువెళ్లే క్రతువు |
అన్నప్రాసన | తొలిసారిగా ఆహారాన్ని ఇచ్చే యాగము |
ఛూడాకర్మ | తొలిసారి కేశ ఖండనము చేసే క్రతువు |
కర్ణబేధం | చెవులు కుట్టే క్రతువు |
విద్యారంభం | విద్యను ప్రారంభించే క్రతువు |
ఉపనయనం | సాధారణంగా ఇది 8 ఏళ్ల వయస్సులో బ్రాహ్మణ, క్షత్రియ మరియు వైశ్య పురుషులకు మాత్రమే నిర్వహించబడుతుంది. గాయత్రి మంత్రం చదువుతూ పవిత్ర జంధ్యాన్ని వేస్తారు. ఉపనయనమును పుట్టిన రోజుగా భావిస్తారు. అంటే ఉపనయనము చేసుకునే వారు రెండుసార్లు జన్మిస్తారని భావించబడుతుంది. (తల్లిగర్భము నుంచి ఒకసారి ఉపనయనము ద్వారా రెండవసారి. అందుకే వీరిని ద్విజులు (twice – born) అంటారు. శూద్రులు మరియు అన్ని కులాలకు చెందిన మహిళలు ఉపనయనము చేసుకోవడానికి అనర్హులు. అందుకే వీరిని ‘ఏకజులు’ (once-born) అంటారు. |
వేదారంభం | వేద విద్యను అభ్యసించడానికి ఆశ్రమాలకు వెళ్ళే క్రతువు |
కేశాంత | ఆశ్రమములో కేశఖండనము చేసే క్రతువు |
సమావర్తనం | విద్యను పూర్తి చేసుకొని ఇంటికి వచ్చే క్రతువు |
వివాహం | బ్రహ్మచర్యమును వీడి వివాహం చేసుకునే క్రతువు |
అంత్యేష్టి | మరణం తరువాత చేసే చివరి కర్మ. |
- శ్రౌతసూత్ర:
ఇందులో ఒక రాజు తన రాజ్యం మరియు ప్రజల సంక్షేమము గురించి చేయవలసిన యాగాలు వివరించబడ్డాయి. శ్రౌత సూత్రంలో చెప్పబడిన యాగాలను సామాన్య ప్రజలు చేయడానికి వీలులేదు. అందులో ముఖ్యమైనవి:
- అశ్వమేధయాగం: ఒక రాజు ఇతర రాజ్యాలను జయించి తన అధీనంలో తెచ్చుకోవడానికి చేసే యాగం.
- రాజసూయ యాగం: దైవత్వం పొందడము కోసం రాజులు చేసే యజ్ఞం.
- వాజపేయ యాగం: నడివయస్సులో ఉన్న రాజు నూతన శక్తిని పొంది ఉత్తేజితుడు కావడానికి ఈ యాగమును నిర్వహిస్తారు. వాజపేయ యాగంలో భాగంగా రథాల పోటీ నిర్వహిస్తారు. ఇందులో రాజు పాల్గొని గెలుపొందుతాడు. వాజపేయ యాగంలో భాగంగా రత్నవంశీ అనే క్రతవులో రాజు పాల్గొని తన పన్నెండు మంది రత్నిన్లతో కలిసి దేవతలను ప్రార్ధిస్తాడు. ఈ యాగం తర్వాత రాజుకు ‘సామ్రాట్’ అనే బిరుదునిస్తారు.
- సుళువ సూత్ర:
ఇది యజ్ఞగుండాల (fire altars) నిర్మాణానికి సంబంధించిన గ్రంథము. వివిధ యజ్ఞాలకు అవసరమైన వివిధ రకాల హోమగుండాలు, వాటి ఆకారాలు, పరిమాణాలు, కోణాలు ఇత్యాది అంశాలు చర్చించబడ్డాయి. ఈ గ్రంథంలో అద్భుతమైన రేఖాగణిత (geometry) పరిజ్ఞానం నిక్షిప్తమై ఉంది.
పురాణాలు
పురాణాలు నమ్మశక్యం కాని పౌరాణిక గాథల (mythology) తో పాటు ప్రాచీన చరిత్ర అధ్యయనానికి అత్యంత ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తాయి. కలియుగంలోని రాజుల వంశావళుల సమాచారమును ఇస్తాయి. కలియుగంలో తొలిరాజైన పరీక్షితుని నుండి గుప్తుల వరకు ప్రాచీన రాజుల వంశావళిని పురాణాలు తెలియజేస్తాయి. 18 పురాణాల్లో వాయుపురాణం, విష్ణుపురాణం, మార్కండేయపురాణం, మత్స్యపురాణం, భాగవత పురాణం అత్యంత ముఖ్యమైనవి. వీటిని ఎఫ్.ఇ.పార్గిటర్ అనే పండితుడు Dynasties of Kali Age అనే పేరుతో ఆంగ్లంలో అనువదించాడు.
ఉపవేదాలు
నాలుగు ప్రధాన వేదాలకు అనుబంధంగా నాలుగు ఉపవేదాలున్నాయి. అవి:
1. ఆయుర్వేదము | వైద్యశాస్త్రము (ఋగ్వేదానికి అనుబంధము) |
2. ధనుర్వేదము | విలువిద్య (యజుర్వేదానికి అనుబంధము) |
3. గాంధర్వ వేదము | సంగీతము (సామవేదానికి అనుబంధము) |
4. శిల్ప వేదము | శిల్పకళ (అధర్వణవేదానికి అనుబంధము) |
ఇతిహాసాలు (Epics)
వేద సాహిత్యంలో భాగంగా రెండు ఇతిహాసాలున్నాయి. అవి:
- రామాయణము: దీనిని ఆది కావ్యమని, దీని రచయిత వాల్మీకిని సంస్కృతములో ఆదికవి అని అంటారు. ఇందులో ఏడు కాండములు (ఉత్తరకాండముతో కలిపి) మరియు 24,000 శ్లోకాలుంటాయి.
- మహాభారతము: దీని రచయిత వ్యాసమహర్షి. ఇందులో 18 పర్వాలుంటాయి. ఆరవ పర్వమైన భీష్మపర్వానికి అనుబంధంగా భగవద్గీత ఉంటుంది. మహాభారతము యొక్క అసలు పేరు ‘జయసంహిత’, ఇందులో 1,00,000 శ్లోకాలు ఉండడం వల్ల దీనిని ‘శత సహస్ర సంహిత’ అని కూడా అంటారు. (శత సహస్రం అంటే లక్ష అని అర్థం.)
వేదసాహిత్యంలో అరణ్యకాలు మరియు ఉపనిషత్తులు మాత్రమే యజ్ఞయాగాలను ఖండించి పురోహిత ఆధిపత్యాన్ని నిరసిస్తాయి. వీటిని శ్రమణులు (బ్రాహ్మణేతర మరియు అవైదిక పండితులు) రచించారని విశ్వసిస్తారు. యజ్ఞయాగాలను సమర్థించే వేదాలు, బ్రాహ్మణాలు, వేదాంగాలు మొదలైనవి బ్రాహ్మణ పండితుల రచనలుగా పరిగణిస్తారు.