ఆర్య నాగరికత పార్ట్‌ 2

Vedic civilization

వైదిక సాహిత్యం శృతి, స్మృతి సాహిత్యం రెండు భాగాలుగా ఉంది. ఇప్పుడు ఆర్య నాగరికత పార్ట్‌ 2లో భాగంగా మనం స్మృతి సాహిత్యం గురించి తెలుసుకుందాం.

వేదాంగాలు

ఇవి వేదాలకు అంగములవంటివి. వేదపండితులకు వేదాంగములు వచ్చి తీరాలి. వేదాంగాలు ఆరు. అవి:

1. శిక్ష పద ఉచ్ఛారణకు సంబంధించినది (Phonetics)
2. నిరుక్త పద ఆవిర్భావమునకు సంబంధించినది (Etymology)
3. ఛందస్సు Metrics
4. వ్యాకరణం Grammar
5. జోతిష్యం Astrology
6. కల్ప యఙ్ఞయాగాలకు  సంబంధించిన వేదాంగం.

కల్పలో గృహసూత్ర, శ్రౌత సూత్ర, సుళువ సూత్ర అనే మూడు భాగాలు ఉన్నాయి.

I.గృహసూత్ర:

ఒక వ్యక్తి తన మోక్షము కొరకు నిర్వహించాల్సిన 16 యజ్ఞాలను షోడశ కర్మలు అంటారు. అవి:

1) గర్భాదానము: వివాహిత స్త్రీ గర్భం దాల్చడానికి చేసే యజ్ఞం.

2) పుంశవనం: పురుష సంతానం కోసం చేసే యజ్ఞం.

నోట్‌: స్త్రీ సంతానం కోసం చేసే యజ్ఞాన్ని “స్త్రీయాషం” అంటారు.

3) సీమంతోన్నయనం: సుఖప్రసవము కొరకు చేసే క్రతువు.

4) జాతకర్మ: శిశువు తల్లి గర్భం నుంచి  వెలువడగానే, నాభి నాళం ఛేదించకపూర్వమే పవిత్ర వేద మంత్రాలను శిశువు చెవిలో చెప్పి, తేనె, నెయ్యి కలిపిన ద్రవాన్ని శిశివు నాభిలో ఉంచి, శిశువు పేరును ఉచ్ఛరించడాన్ని జాతకర్మ సస్కారంగా పేర్కొంటారు.

5.నామకరణం: శిశువు జన్మించిన 10 రోజుల వరకు తల్లిదండ్రులకు అశుచి ఉంటుంది. అందువల్ల 10 రోజుల తరువాత శిశువుకు నామకరణం చేస్తారు. తరువాత కొన్ని సాధారణ సంస్కారాలు చేస్తారు. అవి కర్ణచ్ఛేదం (చెవులు కుట్టడం), నిష్క్రమణం (శిశువును ఇంటి నుంచి తెచ్చి సూర్యుడిని దర్శింపజేయడం) మొదలుగునవి.

6.అన్నప్రాసన: తొలిసారిగా శిశువుకు ఆహారాన్ని తినిపించే యాగము.

7.చూడాకర్మ: తొలిసారి కేశ ఖండనము చేసే క్రతువు. ఈ కర్మ చేయడానికి వచ్చిన మంగలిని సవితృదేవతగా భావించాలని ‘ఆయమగాత్‌ సవితా క్షురెణీ’ అనే మంత్రం ద్వారా తెలుస్తుంది.

8.ఉపనయనం: ఆ సాధారణంగా ఇది ఎనిమిదేళ్ళ వయస్సులో బ్రాహ్మణులకు, 11 ఏళ్ల వయస్సులో క్షత్రియులకు మరియు 12 ఏళ్ల వయస్సులో వైశ్యులకు ఉపనయనం చేస్తారు.

నోట్‌: జొరాష్ట్రియన్లు కూడా ఉపనయనం లాంటి ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు.

ఉపనయనం చేసేటప్పుడు, పవిత్ర గాయత్రి మంత్రం చదువుతూ పవిత్ర జంధ్యంను ధరింపజేస్తారు. ఉపనయనమును పుట్టిన రోజుగా భావిస్తారు. అంటే ఉపనయనము చేసుకునే వారు రెండు సార్లు జన్మిస్తారని భావించబడుతుంది. (తల్లిగర్భము నుంచి ఒకసారి ఉపనయనము ద్వారా రెండవసారి) అందుకే వీరిని ద్విజులు (twice-born) అంటారు. శూద్రులు మరియు అన్ని కులాలకు చెందిన మహిళలు ఉపనయనము చేసుకోవడానికి అనర్హులు. అందుకే వీరిని ‘ఏకజులు”(Once-born) అంటారు.

నోట్‌: ఋగ్వేద కాలంలో కొన్ని సందర్భాల్లో ఆడ పిల్లలకు కూడా ఉపనయనం చేసినట్లు ఆధారాలు ఉన్నాయి.

9.ప్రాజాపత్యం: ఉపనయనం అయిన తరువాత బ్రహ్మచారిగా ఉంటూ చేయాల్సిన వ్రతాల్లో ప్రజాపత్యం మొదటిది. వేదాలను అధ్యయనం చేసే సమయంలో ఎలాంటి ప్రతిబంధాలు ఏర్పడకుండా ఈ వ్రతాన్ని ఆచార్యులు, శిష్యులు కలిసి చేస్తారు.

10.సౌమ్యం: ఆచార్య దంపతులు శిష్యునితో కలిసి ఈ వ్రతం చేస్తారు. సర్వప్రాణులను, ఋషీశ్వరులను, ఓషధులను గౌరవించాలనే భావనను శిష్యులలో కలిగించుటకు ఈ వ్రతం చేస్తారు.

11.ఆగ్నేయం: ఋషులను పూజించి, అగ్ని హోమాది కార్యక్రమాలు నిర్వహిస్తారు.

12.వైశ్వదేవం: ఆయా ఋతువులలో వచ్చే రుగ్మతల నివారణ కోసం ఈ వ్రతాన్ని చేస్తారు.

13.గోదాన వ్రతం: షోడశ వర్షప్రాయుడైన కుమారుని ఆయుష్యాభివృద్ధి కోసం తల్లిదండ్రులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ముఖ్యంగా గోవును పూజిస్తారు. వ్రతం ముగిసిన తరువాత పిలక  మాత్రం మిగిల్చి, శిరోముండనం  చేస్తారు.

14.సమావర్తనం: విద్యాభ్యాసం ముగిసిన తరువాత జరిగే సంస్కారం ఇది.. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత శిష్యుడు తన గురువులకు యథాశక్తి గురుదక్షిణ చెల్లించి, తన ఇంటికి తిరిగి చేరుకుంటాడు. ఈ రోజుల్లో విశ్వవిద్యాలయాల్లో జరిగే స్నాతకోత్సవం లాంటిదే ఇది.

15.వివాహం: ధర్మాచరణ కోసం, వంశాభివృద్ధి కోసం వివాహం చేసుకుంటారు. ధర్మాచరణలో భార్యకు కీలక స్థానం ఉంది. అందుకే భార్యను సహధర్మచారిణి అని అన్నారు. భార్యలేని వాడు యజ్ఞార్హుడు కాడని తైత్తరీయ బ్రాహ్మణం స్పష్టం చేస్తోంది.

16.అంత్యేష్ఠి:  మానవ జీవితంలోని చివరి సంస్కారం అంత్యేష్ఠి. పార్థివ దేహాన్ని దహనం చేసి, అస్తికలను పవిత్ర నదీ జలాల్లో నిమజ్జనం చేస్తారు. తరువాత పిండ ప్రధానం చేస్తారు. ఆర్యుల్లో అపుత్రస్య గతిర్నాస్తి అని నమ్మేవారు.

II.శ్రౌతసూత్ర

ఇందులో ఒక రాజు తన రాజ్యం మరియు ప్రజల సంక్షేమము గురించి చెయ్యవలసిన యజ్ఞయాగాలు వివరించబడ్డాయి. శౌతసూత్రంలో చెప్పబడిన యాగాలను సామాన్య ప్రజలు చెయ్యడానికి వీలుపడదు.

అశ్వమేధ యాగం: ఒక రాజు ఇతర రాజ్యాలను జయించి తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి అశ్వమేధ యాగం చేస్తాడు.

రాజసూయ: దైవత్వం పొందడం కోసం చక్రవర్తులు (పాలకులు) చేసే యజ్ఞం.

వాజపేయం: నడివయస్సులో ఉన్న రాజు నూతన శక్తిని పొంది ఉత్తేజితుడు కావడం కోసం ఈ యాగమును నిర్వహిస్తాడు. వాజపేయ యాగంలో భాగంగా రథాల పోటీ నిర్వహిస్తారు. ఇందులో రాజు పాల్గొని గెలుపొందాల్సి ఉంటుంది. వాజపేయ యాగంలో భాగంగా రత్నవంశి అనే క్రతవును నిర్వహిస్తారు. ఇందులో రాజు తన పన్నెండు మంది రత్నిన్‌లతో కలిసి దేవతలను ప్రార్ధిస్తాడు. ఈ యాగం తర్వాత రాజు “సామ్రాట్‌” అవుతాడు.

సుళువ సూత్ర

ఇందులో అద్భుతమైన రేఖాగణిత (Geometry) పరిజ్ఞానం ఉంది. ముఖ్యంగా యజ్ఞగుండాలను (Fire altars) శాస్త్రీయంగా ఎలా నిర్మించాలో సుళువ సూత్ర తెలుపుతుంది. అంటే వివిధ యజ్ఞాలకు అవసరమైన వివిధ రకాల హోమగుండాలు, వాటి ఆకారాలు, పరిమాణాలు, కోణాలు ఇత్యాది అంశాలు ఇందులో ఉంటాయి.

పురాణాలు

పురాణాలు పౌరాణిక కథల (Mythology)తో పాటు ప్రాచీన చరిత్ర అధ్యయనానికి అత్యంత ఉపకరించే సమాచారాన్ని అందిస్తాయి. ముఖ్యంగా రాజుల వంశాల చరిత్రను తెలియజేస్తాయి. కలియుగంలో తొలిరాజైన పరీక్షితుని నుంచి గుప్తల వరకు ప్రాచీన భారత రాజుల వంశావళిని వురాణాలు తెలియజేస్తాయి. మొత్తం 18 పురాణాలు ఉన్నాయి. అవి:

బ్రహ్మపురాణం వాయుపురాణం వామన పురాణం
మత్స్యపురాణం లింగ పురాణం వరాహ పురాణం
భాగవత పురాణం అగ్నిపురాణం కూర్మ పురాణం
మార్కండేయ పురాణం స్కంధ పురాణం బ్రహ్మాండ పురాణం
పదపురాణం భవిష్యపురాణం పద్మ పురాణం
విష్ణుపురాణం బ్రహ్మవైవర్త పురాణం గరుడ పురాణం

ఎఫ్‌.ఇ.పార్గిటర్‌ అనే పండితుడు పురాణాలను Dynasties of Kali Age అనే పేరుతో ఆంగ్లంలో అనువదించాడు.

ఉపవేదాలు

నాలుగు వేదాలకు అనుబంధంగా నాలుగు ఉపవేదాలు ఉన్నాయి. అవి:

ఆయుర్వేదం  వైద్యశాస్త్రము (ఋగ్వేదానికి అనుబంధం)
ధనుర్వేదం విలువిద్య (యజుర్వేదానికి అనుబంధం)
గాంధర్యవేదం సంగీతం (సామవేదానికి అనుబంధం)
శిల్పవేదం శిల్పకళ (అధర్వణ వేదానికి అనుబంధం)

ఇతిహాసాలు

రామాయణం, మహాభారతంలను ఇతిహాసాలు అని అంటారు. ఇవి కూడా వేదసాహిత్యంలో భాగమే.

రామాయణం: వాల్మీకిన సంస్కృతములో రాసిన రామాయణాన్ని ఆదికావ్యం అని అంటారు. వాల్మీకిని ఆది కవి అని అంటారు. ఇందులో ఏడు కాండములు (ఉత్తరకాండముతో కలిపి) ఉన్నాయి. మరియు 24,000 శ్లోకాలున్నాయి.

మహాభారతము: వ్యాసుడు ‘జయసంహిత’ అనే పేరుతో రాసిన మహాకావ్యమే మహాభారతం. ఇందులో 18 పర్వాలుంటాయి. ఆరవ పర్వమైన భీష్మపర్వానికి అనుబంధంగా భగవద్గీత ఉంటుంది. మహాభారతంలో 1,00,000 శ్లోకాలు ఉండడం వల్ల దీనిని శతసహస్రసంహిత అని కూడా అంటారు.

నోట్‌: ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంథం మహాభారతం.

వేదసాహిత్యంలో అరణ్యకాలు మరియు ఉపనిషత్తులు యజ్ఞయాగాలను ఖండించి పురోహిత ఆధిపత్యాన్ని నిరసిస్తాయి. వీటిని శ్రమణులు (బ్రాహ్మణేతర మరియు అవైదిక పండితులు) రచించారని విశ్వసిస్తారు. యజ్ఞయాగాలను సమర్థించే వేదాలు, (బ్రాహ్మణాలు, వేదాంగాలు మొదలైనవి బ్రాహ్మణ పండితుల రచనలుగా పరిగణిస్తారు.

నోట్‌: ప్రపంచంలోనే మొదటి ఇతిహాసాలు – ఇలియట్‌, ఒడిస్సి (క్రీ.పూ.9వ శతాబ్దం). వీటిని రాసినది గ్రీక్‌ పండితుడైన హోమర్‌.

ఇదీ చదవండి: ఆర్యనాగరికత పార్ట్‌ 1

ఇదీ చదవండి: చరిత్ర అధ్యయనం – ఆధారాలు

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?