పులి – బాటసారి కథ

tiger and traveler story in panchatantra

                                                                  మిత్రలాభం

సుదర్శన మహారాజు దగ్గర సెలవు పుచ్చుకున్న విష్ణుశర్మ నలుగురు రాకుమారులతో కలిసి తన ఆశ్రమానికి చేరుకున్నాడు. మహాజ్ఞాని అయిన విష్ణుశర్మకు… ఈ నలుగురు రాకుమారులను ఎలా తన దారిలోకి తెచ్చుకోవాలో బాగా తెలుసు.

రాకుమారులు ఆటపాటలకు బాగా అలవాడు పడి ఉన్నారు. అందువల్ల సాధారణ విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్లు శిక్షణ ఇస్తే, వారు వినకపోవచ్చు. కనుక వారికి ఒక గురువుగా కంటే, ఒక సన్నిహితుడిగా ఉండాల్సిన అవసరముందని విష్ణుశర్మకు తెలుసు. అందుకే రాకుమారులతో కలిసి మెలిసి… ఆడుతూ, పాడుతూ వారికి చాలా సన్నిహితుడయ్యాడు.

ఇలా జరుగుతుండగా… ఓ రోజు బాగా ఆటలాడి అలసిపోయి, సేదతీరుతున్న రాకుమారులతో, “మనం బాగా ఆడి ఆడి అలసిపోయాం. ఇప్పుడు మనం సరదాగా మంచి కథలు చెప్పుకుందామా?” అని విష్ణుశర్మ అడిగాడు. దానికి వారు చాలా ఉత్సాహంగా, “ఊ… కథలు చెప్పుకుందాం. కానీ మాకు కథలు రావుగా.. అందుకే మీరే కథలు చెప్పండి. మేము వింటాం” అని అన్నారు.

“సరే రాకుమారులారా! నేను మీకు మంచి నీతి కథలు చెబుతాను. అందులో మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం అంటూ చాలా రకాల కథలుంటాయి. మరి అవన్నీ మీకు చెప్పమంటారా?” అని విష్ణుశర్మ మళ్లీ అడిగాడు.

దానికి రాకుమారులు చాలా ఉత్సాహంగా ఊ… చెప్పండి అన్నట్లు తలాడించారు. దీనితో విష్ణుశర్మ, “రాకుమారులారా! మీకో విషయం చెబుతాను. ఈ కథలు అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ఒక కథలో మరో కథ అందులో మరిన్ని ఉపకథలు ఉంటాయి. అలాగే ఒక కథలోని పాత్రలు మరో కథలో కూడా ఉంటాయి. అందువల్ల చాలా శ్రద్ధగా వినండి. లేకుంటే మీకు తరువాతి కథలు సరిగ్గా అర్థంకావు” అని స్పష్టంగా చెప్పాడు.

దీనితో యువరాజులు నలుగురూ, “శ్రద్ధగా వింటాం గురువుగారూ!” అని అన్నారు. చాలా సంతోషపడిన విష్ణుశర్మ కథలు చెప్పడం ప్రారంభించాడు.

                                                    పులి – బాటసారి కథ

“అనగనగా ఓ అడవి. అందులో ఓ మహావృక్షం ఉంది. దానిపై ఎన్నో పక్షులు జీవిస్తుండేవి. ఆ పక్షుల్లో లఘుపతనకం అనే ఓ కాకి కూడా ఉంది.

ఇదిలా ఉండగా… ఒక రోజు ఓ వేటగాడు పక్షులను పట్టుకునేందుకు అడవిలో వలపన్నాడు. పక్షులను ఆకర్షించేందుకు నూకలు జల్లి, ఈ లఘుపతనకం ఉన్న మహావృక్షం మాటన దాక్కున్నాడు. ఇదంతా లఘుపతనకం చూస్తోంది…

ఇదిలా ఉండగా… కొన్ని పావురాలు ఆకాశంలో ఎగురుతూ ఈ నూకల్ని చూశాయి. ఆహా! మంచి ఆహారం దొరికిందని చాలా సంతోషపడ్డాయి. కిందకు దిగడానికి సిద్ధమయ్యాయి. ఇంతలో ఆ పావురాల గుంపునకు రాజైన చిత్రగ్రీవుడు ఏదో ప్రమాదం పొంచి ఉందని గ్రహించాడు.

mitralabham stories                                                     మిత్రలాభం కథలు

 

తోటి పావురాలతో, “మిత్రులారా! కిందకు దిగవద్దు. అడవిలో సహజంగా నూకలు ఉండవు. వీటిని ఎవరో చల్లి ఉండాలి. బహుశా మన లాంటి పక్షులను వేటాడేందుకు ఓ వేటగాడు వీటిని వేసి ఉంటాడు. కనుక ఈ నూకలకు ఆశపడితే కచ్చితంగా ప్రమాదంలో పడతాము” అని హెచ్చరించాడు.

అయితే కొన్ని పక్షులు… “మహారాజా మాకు చాలా ఆకలిగా ఉంది. సులభంగా దొరికిన ఆహారాన్ని మనం ఎందుకు వదులుకోవాలి?” అని ప్రశ్నించాయి.

చిత్రగ్రీవుడు ఓ నవ్వు నవ్వి, “ఇలా ఆశపడే గతంలో … ఓ అమాయకపు బాటసారి పులి నోటికి చిక్కి మరణించాడు” అని వాటికి చెప్పాడు. దీనితో అవి ఆశ్చర్యపోయి, “చిత్రగ్రీవ రాజా, ఆ కథ ఏమిటో మాకు చెప్పండి” అని కోరాయి. సరే అని వాటికి ‘’పులి- బాటసారి కథ’’ చెప్పడం ప్రారంభించాడు చిత్రగ్రీవుడు.

“అనగనగా ఓ మహారణ్యం. అందులో ఓ కొలను ఉంది. ఆ కొలనుకు సమీపంలో ఉన్న గుహలో ఓ ముదుసలి పులి నివసిస్తోంది. అది వయస్సు మీద పడి వేటాడలేక ఆకలితో నకనకలాడుతోంది. ఇదిలా ఉండగా ఓ రోజు ఒక బాటసారి అడవిలోని మార్గం గుండా తన సొంతూరుకి వెళ్తున్నాడు. మనిషి వాసన పసిగట్టిన ఆ పులి… అతనిని చూసి “ఓ బాటసారి… ఇలా ఒకసారి వస్తావా?” అని పిలిచింది.

ఈ అడవిలో తనను పిలుస్తున్నది ఎవరా అని చూసిన బాటసారి, ఒక్కసారిగా పులిని చూసి భయంతో వణికిపోయాడు.

పులి అతనిని చూసి, “నాయనా, నన్ను చూసి భయపడకు. నేను నిన్ను ఏమీ చేయను.” అంది.

పులి మాటలు విన్న బాటసారి కాస్త తేరుకున్నాడు. “నిజంగా ఏమీ చేయవు కదా?” అన్నాడు.

దీనితో పులి… బాటసారితో, “నేను నిన్ను ఏమీ చేయను. నేను వయస్సులో ఉండగా చాలా జీవులను వేటాడి, తిని ఘోర పాపం చేశాను. ఇప్పుడు ఈ వృద్ధాప్యంలో ఆ పాపాలను తలచుకొని, చాలా బాధపడుతున్నాను. అందుకే నా దగ్గర ఉన్న ఈ బంగారు కడియాన్ని నీ లాంటి మంచివాడికి, పుణ్యాత్మునికి ఇచ్చి, కొంత మనశ్శాంతిని పొందాలనుకుంటున్నాను. అందుకే నిన్ను పిలిచాను” అని తన దగ్గర ఉన్న బంగారు కడియాన్ని అతనికి చూపించింది.

బంగారు కడియాన్ని చూసిన బాటసారికి, ఒక్కసారిగా ఆశ పుట్టుకొచ్చింది. “నిజంగా నాకు ఆ బంగారు కడియం ఇస్తావా? లేక నన్ను చంపడానికి చూస్తున్నావా?” అని అడిగాడు.

దానికి ఆ పులి, “నాయనా, నేను చాలా కాలంగా మాంసాహారం తినడం మానేశాను. ఫలాలు తింటూ జీవితాన్ని పవిత్రంగా గడుపుతున్నాను. అయినా నేను ఇప్పుడు ముసలిదాన్ని అయిపోయాను. నా ఒంట్లో ఏ మాత్రం శక్తిలేదు. ఎలాగూ పరుగెత్తి వేటాడలేను. నా కోరపళ్లు కూడా కదిలిపోతున్నాయి. కనుక నీకేం భయం లేదు. నేను కచ్చితంగా ఈ బంగారు కడియం నీకే ఇస్తాను. ముందుగా నీవు ఆ కొలనులో శుచిగా స్నానం చేసి, నా వద్దకు రా” అని నమ్మకంగా చెప్పింది.

దీనితో ఆ బాటసారి ఆశగా కొలనులో దిగాడు. కానీ దానిలోని ఊబిలో చిక్కుకున్నాడు. భయంతో, “నన్ను రక్షించండి, రక్షించండి” అని అరవడం మొదలుపెట్టాడు.

ఇంతలో పులి, “నాయనా! భయపడకు, నేను ఉన్నానుగా… నిన్ను రక్షిస్తాను” అని నెమ్మదిగా ఆ బాటసారి దగ్గరకు వచ్చింది. అంతే! ఒక్కసారిగా అతనిపై పడి పంజాతో ఒక్క దెబ్బవేసింది.

దీనితో ఆ బాటసారి, “ఇది చాలా మోసం. నాకు బంగారు కడియం ఇస్తానని నమ్మించి, ఇప్పుడు చంపడానికి చూస్తావా? నన్ను దయుంచి ప్రాణాలతో వదిలేయ్‌” అని భయంతో వణికిపోతూ, ఏడుస్తూ ప్రాధేయపడ్డాడు.

దానికి ఆ పులి, “పిచ్చివాడా! మా లాంటి క్రూరజంతువులు మాంసం కాకుండా ఫలాలు తిని బ్రతుకుతాయా? నేను ముసలిదాన్ని అయిపోయాను. పరుగెత్తి వేటాడలేను. అందుకే ఈ బంగారు కడియం చూపించి, నీ లాంటి ఆశబోతులను దగ్గరకు రప్పించుకుని… చంపి, నా ఆకలి తీర్చుకుంటూ ఉంటాను” అని చెబుతూనే… అతనిపై పడి చంపేసింది. తరువాత అతని మాంసాన్ని ఆబగా తిని, తన ఆకలి తీర్చుకుంది.” అని చిత్రగ్రీవుడు పులి-బాటసారి కథను ముగించాడు.

“చూశారా మిత్రులారా! అత్యాశకు పోతే… మన ప్రాణాలకే ముప్పు కలగవచ్చు. అందువల్ల అడవిలో పడివున్న ఆ నూకల కోసం మనం ఆశించవద్దు” అని చిత్రగ్రీవుడు తోటి పావురాలకు చెప్పాడు.

                            * మిత్రులారా కథ ఇంకా ఉంది. వేచి ఉండండి. * 

ఇదీ చదవండి: పంచతంత్రం 

ఇదీ చదవండి: శత్రువు ఎంత బలవంతుడైతే ఏంటి?

 

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?