అనగనగా ఒక పెద్ద అడవిలో పింగలక అనే సింహం ఉండేది. అది ఆ అడివికి రాజు. ఆ సింహం చాలా శక్తివంతమైనది. అది అంటే అడవిలోని జంతువులకు, పక్షులకు హడల్. ఆ సింహం గర్జన వింటే అవి భయంతో పారిపోయేవి.
ఆ అడవికి దగ్గరలో గోదావరి నది ప్రవహిస్తోంది. దానికి సమీపంలో ఓ గ్రామం ఉండేది. అక్కడ ఒక వ్యాపారి వద్ద సంజీవక అనే ఎద్దు ఉండేది. అతను తన ఎడ్ల బండికి ఆ ఎద్దును కట్టి దానిపై ప్రయాణించేవాడు. ఒక రోజు సంజీవక లాగుతున్న బండి బురదలో ఇరుక్కుపోయింది. అప్పటికే సంజీవక చాలా అనారోగ్యంతో బలహీనంగా ఉంది. అది బండి లాగలేకపోయింది. వాస్తవానికి అది చనిపోయే స్థితికి వచ్చేసింది. దీనితో ఆ వ్యాపారి దానిని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. కానీ అది నదీ తీరంలోని గడ్డి తింటూ తిరిగి ఆరోగ్యం పొంది, బలంగా తయారైంది. దీనితో అది ఒక రోజు ఆనందంతో గట్టిగా అరవసాగింది.
ఆ గర్జన లాంటి శబ్దం విని పింగలక (సింహం) భయపడ్డాడు. “ఇంత గట్టిగా గర్జించే జంతువు ఎవరో! అది నాకంటే బలమైనదా?” అని ఆలోచించాడు.
పింగలకకు ఇద్దరు మంత్రులు — దమనక మరియు కరాటక అనే నక్కలు ఉండేవారు. వారు రాజు దగ్గరకు వచ్చి, “రాజా! భయపడవద్దు. అది ఏమిటో మేము తెలుసుకుంటాం” అని అన్నారు.
దమనక సంజీవక దగ్గరికి వెళ్లి స్నేహం చేశాడు. తర్వాత సింహం దగ్గరికి వచ్చి, “రాజా! అది ఒక ఎద్దు. అది చాలా శక్తివంతమైంది. కానీ దాని వల్ల మీకు ఎలాంటి హానీ లేదు. కనుక దానిని మిత్రుడిగా చేసుకోండి. అది మనకు మిత్రుడైతే మీ రాజ్యం మరింత బలపడుతుంది” అని సలహా ఇచ్చింది.
దీనికి పింగలక కూడా సమ్మతించాడు. దమనక పరిచయం చేయడంతో పింగలక మరియు సంజీవక మంచి స్నేహితులయ్యారు. ఇద్దరూ కలసి చక్కగా ఉంటూ, సరదాగా మాట్లాడుకుంటూ సమయం గడపసాగారు. సంజీవకుని సలహాతో పింగలక మాంసాహారం తినడం తగ్గించాడు. దీనితో అడవిలోని జంతువులు ఆశ్చర్యపడ్డాయి.
కానీ, దమనక, కరాటక మనసులో అసూయ పెరిగింది. “ఈ ఎద్దు వల్ల రాజుగారికి మన సలహాలు అవసరం లేకుండా పోయింది. కనుక త్వరలోనే మన మంత్రి పదవులు ఊడిపోయే అవకాశం ఉంది” అని అనుకున్నాయి. దీనితో అవి ఎద్దును చంపించేందుకు ఒక పథకం వేశాయి.
ఒక రోజు ఈ రెండు నక్కలు, సింహం దగ్గరికి వెళ్లి, “రాజా! ఈ సంజీవకుడికి గర్వం పెరిగిపోయింది. అది మీ సింహాసనం కావాలని కోరుకుంటోంది” అని చాడీలు చెప్పాయి.
తరువాత ఆ రెండూ సంజీవక దగ్గరికి వెళ్లి, “మిత్రమా! పింగలక నీ శక్తిని చూసి భయపడుతున్నాడు. నిన్ను చంపాలని అనుకుంటున్నాడు” అని చెప్పాయి.
నక్కలు చెప్పిన ఈ మాయ మాటలతో సింహం, ఎద్దు మధ్య అనుమానాలు పెరిగాయి. చివరికి పింగలక కోపంతో సంజీవకను చంపేశాడు. కానీ తర్వాత ఆ జిత్తులమారి నక్కలు చెప్పినది అంతా అబద్ధమని గ్రహించాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. తన ప్రియమిత్రుడైన సంజీవకుడు మరణించాడు. దీనితో సింహం ఆ బాధ తట్టుకోలేక అరణ్యంలో ఒంటరివాడిగా మిగిలిపోయాడు.
నీతి: తప్పుడు సలహాలు వింటే స్నేహాలు నాశనం అవుతాయి. నిజమైన స్నేహాన్ని ఎప్పుడూ రక్షించుకోవాలి.
Note : ఈ కథ పంచతంత్రంలోని “మిత్రబేధ” విభాగానికి చెందినది. మిత్రబేధ కథలు స్నేహితుల మధ్య కలహాలు, అపోహలు, తప్పుడు సలహాలు ఎలా మిత్రత్వాన్ని నాశనం చేస్తాయో చూపిస్తాయి.