మహావీరుని జీవితం: జైనమతం బోధనలు మరియు ఆధ్యాత్మిక మార్గం

జైనమతం

 

జైనమతంలో 24 మంది తీర్థంకరులున్నారు. తీర్థంకర అంటే వంతెన నిర్మించువాడు (ford maker) అని అర్థం.

మొదటి తీర్థంకరుడు: ఋషభనాథ/ ఆదినాథ
  • ఇతని చిహ్నం ఎద్దు/ వృషభము.
  • సాంప్రదాయం ప్రకారం ఇతనినే జైనమత స్థాపకుడని అంటారు.
22వ తీర్థంకరుడు: ఆరిస్టనేమి/ నేమినాథ
  • ఇతని చిహ్నం శంఖం (conch shell).
  • మొదటి 22 మంది తీర్థంకరులు ఇతిహాస పురుషులు. వీరికి సంబంధించిన ఖచ్చితమైన చారిత్రక సమాచారము అందుబాటులో లేదు.
  • 23 మరియు 24వ తీర్థంకరులు మాత్రమే చారిత్రక పురుషులు.
23వ తీర్థంకరుడు: పార్శ్వనాథ
  • పాము ఇతని చిహ్నం.
  • క్రీ.పూ.8వ శతాబ్దంలో కాశీలో జీవించాడు. ఇతని తండ్రి అశ్వసేనుడు కాశీ రాజ్యానికి రాజు. వామలదేవి ఇతని తల్లి. పార్శ్వనాథుడు 30వ ఏట సన్యాసాన్ని స్వీకరించి నిగ్రంధ అనే కొత్త మతాన్ని స్థాపించాడు. నిగ్రంధుడు అంటే ప్రాపంచిక బంధాల నుంచి బయటపడినవాడని అర్థం. పార్శ్వనాధుడికి “పురుషదనియ” అనే బిరుదుంది. చారిత్రకంగా పార్శ్వనాథుడే జైనమత స్థాపకుడు. ఇతను నాలుగు సూత్రాలు చెప్పాడు. అవి:
  1. అసత్య – సత్యాన్ని పలకాలి
  2. అహింస – హింసను వీడాలి.
  3. అపరిగ్రహ – సంపదను త్యజించాలి.
  4. అస్తేయ దొంగతనాలు వీడాలి.
24వ తీర్థంకరుడు: వర్ధమాన మహావీరుడు (క్రీ.పూ.540 – 468)

 

  • సింహం ఇతని చిహ్నం.
  • బీహార్‌లోని కుంద గ్రామంలో జన్మించాడు. జ్ఞాత్రిక వంశానికి చెందిన క్షత్రియుడు.
  • మహావీరుని కుటుంబ సభ్యులు:

సిద్ధార్థ – తండ్రి

త్రిశాలదేవి – తల్లి

యశోద – భార్య

ప్రియదర్శి – కుమార్తె

జామాలి – అల్లుడు (మహావీరుడి తొలి శిష్యుడు)

మహావీరుడు 30వ ఏట తల్లిదండ్రుల మరణంతో విరక్తి చెంది సన్యాసాన్ని స్వీకరించాడు. 12 ఏళ్ళు అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ పార్శ్వనాధుడు స్థాపించిన నిగ్రంధ మతంలో చేరాడు. తన 42వ ఏట జృంభిక గ్రామంలో రిజుపాలిత నది ఒడ్డున తీర్థంకరుడయ్యాడు. మహావీరుడికి రెండు బిరుదులు ఇవ్వబడ్డాయి. అవి:

  • కేవలి: అత్యున్నతమైన కైవల్య జ్ఞానము పొందినవాడని అర్థం.
  • జిన: విజేత లేదా జయించిన వాడు అని అర్థం. మహావీరుడు పంచేంద్రియాలను జయించి ఈ బిరుదాన్ని పొందాడు. అప్పటి నుంచి నిగ్రంధులను జెనులు లేదా జైనులు అని పిలిచారు.
  • పాళి/ బౌద్ధ సాహిత్యంలో ఇతనిని నాయపుత్త, నటపుత్త, కేశవ మరియు జ్ఞానపుత్త అనే పేర్లతో పిలిచారు.
  • మహావీరుడు తన 72వ ఏట బీహార్‌లోని పావ నగరంలో సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించాడు. అన్నపానీయములను వీడి దేహాన్ని శుష్కింపజేసి మరణించడాన్ని సల్లేఖన వ్రతం లేదా సంతార అంటారు.
  • మహావీరుడి తరువాత జైనమతాన్ని ప్రచారం చెయ్యడములో 11 మంది గణాధారులు ప్రముఖ పాత్ర పోషించారు. మహావీరుడి శిష్యుడైన సుదర్మన్‌ తొలి గణాధారుడు.
జైనమత సిద్ధాంతాలు

జైనమతములో ప్రధానంగా రెండు సిద్ధాంతాలున్నాయి. అవి:

I.పంచసూత్రాలు:
  1. అసత్య, 2. అహింస, 3. అపరిగ్రహ, 4. అస్తేయ, 5. బ్రహ్మచర్య

మొదటి నాలుగు సూత్రాలను పార్శ్వనాథుడు ఇవ్వగా, ఐదవ సూత్రమైన బ్రహ్మచర్యమును మహావీరుడు జోడించాడు.

II.త్రిరత్నాలు:
  1. సమ్యక్ క్రియ (Right Action)
  2. సమ్యక్ జ్ఞానం (Right Knowledge)
  3. సమ్యక్ విశ్వాసము (Right Faith)
జైనమతంలో చీలికలు

క్రీ.పూ.300లో జైనమతం శ్వేతాంబర మరియు దిగంబర శాఖలుగా చీలింది.

  1. శ్వేతాంబర శాఖ: దీని స్థాపకుడు స్థూలబాహు. వీరు తెల్లని వస్త్రాలు ధరిస్తారు. 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడిని అనుసరిస్తారు.
  2. దిగంబర శాఖ: భద్రబాహు ఈ జైన శాఖ స్థాపకుడు. వీరు వస్త్రాలను విసర్జించి నగ్నంగా ఉంటారు. వీరు 24వ తీర్థంకరుడైన మహావీరుని అనుసరించేవారు.

క్రీ.శ.12వ శతాబ్దానికి చెందిన హేమచంద్రుడు అనే జైనకవి పరిశిష్టపర్వన్ అనే గ్రంథంలో జైనమత చీలికకు దారితీసిన పరిస్థితులను వివరంగా తెలియజేశాడు. చంద్రగుప్తమౌర్యుని పాలనాకాలంలో మగధలో తీవ్రమైన క్షామము సంభవించి ప్రజలు వలసలు వెళ్ళారని, భద్రబాహుని నాయకత్వంలో కొంతమంది జైన సన్యాసులు మైసూర్ సమీపంలోని శ్రావణబెళగొళకు వలస వెళ్లి దిగంబరులు అయ్యారని, స్థూలబాహు నాయకత్వంలో మరికొంతమంది జైన సన్యాసులు మగధలోనే ఉండిపోయి శ్వేతాంబరులయ్యారని తెలిపాడు.

శ్రావణబెళగొళ దిగంబర జైన మతానికి జన్మస్థలము అని భావించవచ్చు. ఇక్కడ క్రీ.శ.982లో మైసూర్ మహామంత్రి ఛాముండరాయులు నిర్మించిన 58 అడుగుల గోమఠేశ్వర లేదా బాహుబలి యొక్క ఏకశిలా విగ్రహము ఉంది. గోమఠేశ్వరుడు మొదటి తీర్థంకరుడైన ఋషభనాథుడి కుమారుడు. శ్రావణబెళగొళలో 12 ఏళ్ళకొకసారి మహామస్తాభిషేకం అనే జైన ఉత్సవం నిర్వహిస్తారు. క్రీ.శ.6వ శతాబ్దంలో జైనమతంలోని విగ్రహారాధనను వ్యతిరేకిస్తూ శ్వేతాంబర నుంచి థేరపంతి మరియు దిగంబర నుంచి సమయ అనే కొత్త శాఖలు ఆవిర్భవించాయి.

జైనమత పవిత్ర గ్రంథాలు

జైనమతంలోని తొలి పవిత్ర గ్రంథాలను పూర్వాలు అంటారు. క్రీ.శ.6వ శతాబ్దంలో గుజరాత్‌లోని వల్లభిలో జైన సమావేశము నిర్వహించబడింది. దేవరధిక్షమశ్రమణ దీనికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో 14 పూర్వాల స్థానంలో ద్వాదశ అంగాలను వ్రాశారు. ఈ 12 అంగాలే జైనులకు పవిత్ర గ్రంథాలయ్యాయి. ఇవి ప్రాకృత భాషలోని అర్ధమగధి మాండలికములో వ్రాయబడ్డాయి.

12 అంగాల తర్వాత జైనులకు భద్రబాహు వ్రాసిన ‘కల్పసూత్ర’ పవిత్రమైన గ్రంథము. కల్పసూత్రలో మూడు భాగాలున్నాయి. అవి:

  1. జినచరిత: 24 మంది తీర్థంకరుల జీవిత చరిత్రను తెలియజేస్తుంది.
  2. థేరవలిచరిత: 11 మంది గణధారుల చరిత్రను తెలియజేస్తుంది.
  3. సమొచారి: జైనమత ప్రవర్తన నియమావళికి సంబంధించినది.
బౌద్ధమతం మరియు జైనమతం మధ్య సారూపత్య మరియు భేదాలు

క్రీ.పూ.6వ శతాబ్దంలో ప్రారంభమైన బౌద్ధ మరియు జైన మతాల మధ్య బేధాల కంటే సారూప్యత ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ మతాలు దాదాపుగా ఒకే కాలంలో, ఒకే పరిస్థితుల్లో ఆవిర్భవించి. ఒకే రకమైన బోధనలను వినిపించడము విశేషము.

బౌద్ధ మరియు జైన మతాలు రెండు కూడా అవైదిక ఉద్యమాలే. ఇందులో బ్రాహ్మణ ఆధిపత్యము, కులం ఆధారంగా కొనసాగుతున్న సామాజిక వివక్షత, జంతుబలులతో కూడిన యజ్ఞయాగాలు పూర్తిగా తిరస్కరించబడ్డాయి. ఈ రెండు మతాలు కూడా వ్యాపార, వాణిజ్యాలను ప్రోత్సహించి వర్తకుల మద్ధతును సాధించాయి.

బౌద్ధమత స్థాపకుడైన గౌతమబుద్ధుడు మరియు జైన మతంలోని 24వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు గణతంత్ర రాజ్యాలకు చెందిన క్షత్రియులు కావడం విశేషం. ఈ రెండు మతాల బోధనలు కూడా దాదాపుగా ఒకే రకంగా ఉన్నాయి. బౌద్ధంలోని అష్టాంగ మార్గాలు మరియు జైనమతంలోని త్రిరత్నాలు, పంచసూత్రాల సారము ఒక్కటే.

రెండు మతాలు ప్రజలకు అర్థమయ్యే భాషను స్వీకరించాయి. ఉపనిషత్తుల్లోని జ్ఞానము, అహింస, కర్మ, మోక్షము, జన్మ- పునర్జన్మ లాంటి సిద్ధాంతాలను రెండు మతాలు కూడా యథాతథంగా ఆమోదించాయి. రెండు మతాలు కూడా అంతర్గత కలహాల వలన అనేక శాఖలుగా చీలిపోవడము కూడా వీటి మధ్య ఉన్న సారుప్యతను తెలియజేస్తాయి.

బౌద్ధ మరియు జైన మతాల మధ్య కొన్ని బేధాలను కూడా గమనించవచ్చు. బౌద్ధం కంటే జైనం చాలా ప్రాచీనమైనది. చారిత్రకంగా జైనమత స్థాపకుడైన పార్శ్వనాథుడు, గౌతమ బుద్దుని కంటే 200 సంవత్సరాల ముందు జీవించాడు. జైనులు ప్రాకృత భాషను స్వీకరిస్తే, బౌద్ధం పాళి భాషను కొనసాగించింది. బౌద్ధం మధ్యేమార్గాన్ని బోధిస్తే, జైన సిద్ధాంతాలు మాత్రము చాలా కఠినంగానూ, తీవ్రంగానూ ఉంటాయి.

బౌద్ధులు స్థానిక దేవతలను తిరస్కరిస్తే, జైనులు మాత్రము వారిని పూజిస్తారు. అయితే ఈ దేవతలకు తీర్థంకరుల తర్వాతి స్థానాన్ని కల్పించారు. చివరగా బౌద్ధం విదేశాలకు విస్తరించి తాను పుట్టిన భారతదేశం నుండి అంతర్థానమైతే, జైనం భారతదేశానికే పరిమితమై నేటికీ నిరంతరంగా కొనసాగుతోంది.

Leave a Comment

error: Content is protected !!