మొసలి మరియు కోతి కథ (పంచతంత్రం)

The Crocodile and the Monkey

చాలా కాలం క్రితం ఒక పెద్ద నది ఒడ్డున జంబుక అనే కోతి నివసించేది. అది ఒక జామ చెట్టుపై కూర్చుని జామపండ్లు తింటూ కాలం గడిపేది. ఆ జామకాయలు చాలా తియ్యగా ఉండేవి.

ఆ నదిలో ఒక మొసలి ఉండేది. అది తరచూ కోతి దగ్గరికి వచ్చి జామకాయలు అడిగేది. కోతి కూడా ఉదారంగా పండ్లు ఇచ్చేది. అలా వారిద్దరూ క్రమంగా మంచి స్నేహితులయ్యారు.

ఒక రోజు కోతి ఇచ్చిన జామకాయలు తీసుకొని మొసలి తన ఇంటికి తీసుకెళ్ళింది. దాని భార్య ఆ పండ్ల రుచి చూసి ఆశ్చర్యపోయింది. “ఈ పండ్లే ఇంత మధురంగా ఉంటే, ఇంత తియ్యని పండ్లు తింటున్న ఆ కోతి గుండె ఇంకెంత మధురంగా ఉంటుందో! నాకు ఆ కోతి గుండె కావాలి” అని తన భర్తను అడిగింది.

దీనితో ఆ భర్త మొసలి భయపడి, “కోతి జంబుక నా స్నేహితుడు. దానికి హాని చేయడం సరైంది కాదు” అని చెప్పింది. కానీ భార్య ఒత్తిడి చేయడంతో చివరికి అంగీకరించింది.

తర్వాత మొసలి తన స్నేహితుడైన కోతి దగ్గరికి వెళ్లి, “మిత్రమా! నా భార్య నీవు ఇచ్చిన పండ్లు తిని ఎంతో సంతోషించింది. నిన్ను విందుకు తీసుకురమ్మని నన్ను పంపించింది. నీవు నాతో కలిసి మా ఇంటికి వస్తే చాలా సంతోషిస్తుంది” అని అంది.

కోతి కూడా సంతోషంగా అంగీకరించింది. కానీ నదిని దాటాల్సి రావడంతో మొసలి వీపుపై ఎక్కి ప్రయాణమయ్యింది. మధ్యలో మొసలి తన ఆలోచనను బయటపెట్టేసింది.

“నిజానికి నా భార్య నీ గుండె తినాలని కోరుకుంది. అందుకే నిన్ను తీసుకెళ్తున్నాను” అని చెప్పేసింది. దీనితో కోతి ఒక్కసారిగా కంగుతింది. ఏం చేయాలి దేవుడా అని ఆలోచించింది. వెంటనే తెలివిగా, సమయస్ఫూర్తితోఱఫఫ మొసలితో ఇలా అంది.

“మిత్రమా! ఆ సంగతి ముందే చెప్పి ఉండాల్సింది. నేను ఎప్పుడూ నా గుండెను చెట్టు మీదే వదిలి వస్తాను. కనుక ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళడం వృథా. నన్ను వెంటనే తిరిగి చెట్టు దగ్గరకు తీసుకెళ్ళు. నేను నీ భార్య కోసం నా గుండెను తీసుకువస్తాను” అని చెప్పింది.

మొసలి ఆ మాటలు నమ్మి కోతిని తిరిగి చెట్టు దగ్గరికి తీసుకొచ్చింది. కోతి వెంటనే చెట్టుపైకి ఎక్కి సురక్షితంగా కూర్చుంది. తరువాత మొసలితో, “ నువ్వు నన్ను మోసం చేశావు. మిత్ర ద్రోహం చేశావు. కానీ నేను నీ వలలో పడలేదు” అని అన్నది. దీనితో మొసలి తన తప్పును తెలుసుకొని, సిగ్గుతో తలవంచుకొని, అక్కడి నుంచి వెళ్లిపోయింది.

నీతి: స్నేహంలో ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. మోసం చేసినవాడు చివరికి అవమానమే పొందుతాడు. తెలివిగా ఆలోచించినవాడు ఎప్పుడూ ప్రమాదం నుంచి బయటపడతాడు.

Note : ఈ కథ పంచతంత్రంలోని “మిత్రబేధ” విభాగానికి చెందినది. మిత్రబేధ కథలు స్నేహితుల మధ్య కలహాలు, అపోహలు, తప్పుడు సలహాలు ఎలా మిత్రత్వాన్ని నాశనం చేస్తాయో చూపిస్తాయి.

 

Leave a Comment

error: Content is protected !!