క్రీ.పూ.600-300 మధ్య ఉన్న మౌర్యుల పూర్వ యుగాన్ని బుద్ధుని యుగమని మరియు షోడష మహాజనపదాల యుగమని కూడా అంటారు. ఈ కాలానికి గౌతమ బుద్ధుడు యుగపురుషుడు కాబట్టి దీనిని బుద్ధుని యుగమని, ఈ కాలంలోనే 16 గొప్ప రాజ్యాలు అవతరించడము వలన షోడష మహాజనపదాల యుగమని చరిత్రకారులు అభివర్ణించారు.
షోడష మహాజనపదాలు
పాళీ భాషలో వ్రాయబడిన అంగుత్తరనికయ అనే బౌద్ధ గ్రంథము షోడష మహాజనపదాలు అనబడే 16 రాజ్యాల యొక్క సమాచారాన్ని ఇస్తుంది. వీటిలో పది రాజ్యాలు గంగా మైదానంలోనూ, రెండు వాయువ్య భారతదేశంలోనూ, ఒకటి పశ్చిమ భారతదేశంలోనూ, రెండు మధ్య భారతదేశములోనూ మరియు ఒక రాజ్యము దక్షిణ భారతదేశంలోనూ వెలిశాయి.
రాజ్యం పేరు | రాజధాని |
మగధ | రాజగృహము లేదా గిరివ్రజము (బీహార్‌లోని రాజ్‌గిర్), తరువాత పాటలీపుత్రము (బీహార్‌లోని పాట్నా) |
అంగ | చంపానగరి (తూర్పు బీహార్) |
కాశీ | వారణాసి (ఉత్తరప్రదేశ్) |
కోసల | శ్రావస్తి (ఉత్తరప్రదేశ్) |
వత్స | కౌశాంబి (ఉత్తరప్రదేశ్) |
కురు | హస్తినాపురం (ఉత్తరప్రదేశ్), ఇంద్రప్రస్థ (ఢిల్లీ) |
పాంచాల | అహిచ్ఛత్రం (ఉత్తరప్రదేశ్) |
శౌరసేన | మధుర (ఉత్తరప్రదేశ్) |
మల్ల | పావ (బీహార్) మరియు కుశి (ఉత్తరప్రదేశ్). ఇది గణతంత్ర రాజ్యం (Republican state). |
వజ్జి | వైశాలి (బీహార్) (ఈ రాజ్యాన్ని అష్టకులిక అని అంటారు. ఎందుకంటే ఇది 8 గణతంత్ర రాజ్యాల కూటమి. లిచ్ఛావి రాజ్యము ఈ కూటమికి నాయకత్వం వహించింది. అందుకే లిచ్ఛావిల రాజధాని అయిన వైశాలి, వజ్జి రాజ్యానికి రాజధాని అయ్యింది.) |
అవంతి | ఉజ్జయిని & మాహిష్మతి (మధ్యప్రదేశ్) |
ఛేది | సుక్తిమతి (మధ్యప్రదేశ్) |
మత్స్య | విరాట నగరము (రాజస్థాన్‌లోని జైపూర్) |
గాంధార | తక్షశిల మరియు పుష్కలావతి (పాకిస్థాన్‌లోని పెషావర్) |
కాంభోజ | రాజపురము (పాకిస్థాన్) |
అస్మక/అస్సక | పోదన (తెలంగాణలోని బోధన్). ఇది దక్షిణ భారతదేశంలోని ఏకైక మహాజనపదము. |
నోట్: మరొక బౌద్ధ గ్రంథమైన మహావస్తు మరియు జైన గ్రంథమైన భాగవతిసూత్ర ఇచ్చిన షోడష మహాజనపదాల జాబితా భిన్నంగా ఉండడం గమనార్హము.
మౌర్యుల పూర్వయుగంలో గణతంత్ర రాజ్యాలు
క్రీ.పూ.6వ శతాబ్దంలో గణతంత్ర మరియు రాచరిక వ్యవస్థలు కలిగిన రాజ్యాలు అనేకం వెలిశాయి. గణతంత్ర రాజ్యాల్లో ప్రజాస్వామ్యయుతమైన పాలన కొనసాగి, పాలకుడు ప్రజల ద్వారా ఎన్నుకోబడేవాడు. రాచరిక రాజ్యాలో మాత్రమే నిరంకుశ పాలన కొనసాగి పాలకులు వంశపారపర్యంగా అధికారానికి వచ్చేవారు.
ఆనాటి పాళి గ్రంథాల్లో పది గణతంత్ర రాజ్యాల ప్రస్తావన ఉంది. రామ గ్రామాన్ని పాలించిన కోలియ, పిప్పలివాహనను పాలించిన మొరియ, పావను పాలించిన మల్ల, కుంద గ్రామాన్ని పాలించిన జ్ఞాత్రిక లేదా న్యాయ, వైశాలిని పాలించిన వజ్జి మరియు కపిలవస్తును పాలించిన శాక్య రాజ్యాలు అతి ముఖ్యమైన గణతంత్ర రాజ్యాలు. ఈ గణతంత్ర రాజ్యాల్లోనే అవైదిక మతాలైన బౌద్ధము మరియు జైనము ఆవిర్భవించడము విశేషము. గౌతమబుద్ధుడు (శాక్య రాజ్యము) మరియు 24వ తీర్థంకరుడైన మహావీరుడు (జ్ఞాత్రిక రాజ్యము) గణతంత్ర రాజ్యాలకు చెందినవారు. గణతంత్ర రాజ్య ప్రజలు ఈ మతాలను విశేషంగా ఆదరించారు.
వైశాలి రాజధానిగా పాలించిన వజ్జి లేదా లిచ్ఛావి రాజ్యం గణతంత్ర రాజ్యాల్లో అత్యంత ప్రముఖమైనది. గౌతమబుద్ధునికి సమకాలికుడైన చేతకుడు ఈ రాజ్యానికి సుప్రసిద్ధ పాలకుడు. ఇతను తన సోదరి త్రిశాల మహాదేవిని (మహావీరుని తల్లి) జ్ఞాత్రిక పాలకుడైన సిద్ధార్థుడికి మరియు తన కుమార్తె చెల్లనను మగధరాజు బింబిసారుడికిచ్చి వివాహము చేశాడు.
మౌర్యుల పూర్వ యుగంలో ముఖ్యమైన రాచరిక రాజ్యాలు
కోసల: క్రీ.పూ.6వ శతాబ్దపు అగ్రరాజ్యాల్లో కోసల రాజ్యం ఒకటి. దీనికి శ్రావస్తి రాజధాని కాగా అయోధ్య మరియు సాకేత ఇతర ముఖ్య నగరాలు. ఈ రాజ్యాన్ని ఇక్ష్వాకు వంశం పాలించింది. (భారతదేశంలోని చాలా మంది రాజులు తాము శ్రీరాముడి యొక్క ఇక్ష్వాకు వంశానికి చెందినవారమని ప్రకటించుకొన్నారు). కోసల రాజ్య ప్రస్తావనలు బౌద్ధ సాహిత్యంలో ఎక్కువగా ఉంటాయి. గౌతమ బుద్ధుడు కూడా ఎక్కువ బోధనలు శ్రావస్తి నగరంలోనే చేశాడు. పాళి గ్రంథాలు బుద్ధుడిని ‘కోసలన్’ అని పిలిచాయి.
కోసలను పాలించిన రాజుల్లో ప్రసేనజిత్తు అత్యంత ప్రముఖుడు. ఇతను తన సోదరియైన కోసల మహాదేవిని మగధరాజు బింబిసారుడుకిచ్చి వివాహం చేసి, తాను జయించిన కాశీ రాజ్యాన్ని వరకట్నంగా ఇచ్చాడు. తన కుమార్తె వజ్జిరను బింబిసారుడి కుమారుడైన అజాతశత్రువుకిచ్చి వివాహం జరిపించాడు.
వత్స: ఈ రాజ్యాన్ని కురువంశం పరిపాలించింది. పురాణాల ప్రకారం, హస్తినాపురం వరదల్లో అంతమైన తర్వాత కౌశాంబి వీరికి రాజధాని అయినది. బుద్ధునికి సమకాలీనుడైన ఉదయనుడు ఈ వంశంలో అత్యంత గొప్ప రాజు. బాసుడు వ్రాసిన స్వప్నవాసవదత్త మరియు హర్షుడు వ్రాసిన నాటకాల్లో ఇతనే కథానాయకుడు.
అవంతి: ఉజ్జయిని మరియు మాహిష్మతి రాజధానులుగా ప్రద్యోద వంశము అవంతి రాజ్యాన్ని పాలించింది. మహాసేనుడు ఈ వంశంలో గొప్పరాజు.
మగధ రాజ్య విజృంభణ
క్రీ.పూ.6వ శతాబ్దంలో విరాజిల్లిన 16 మహాజనపదాలన్నింటిలోనూ మగధ అత్యంత గొప్పది. ఇది ఇతర జనపదాలను జయించి క్రీ.పూ.4వ శతాబ్దానికల్లా భారతదేశంలోనే తొలి సామ్రాజ్యంగా అవతరించింది. మగధ గొప్ప సామ్రాజ్య శక్తిగా ఎదగడానికి భౌగోళిక అంశాలతో పాటుగా మగధ చక్రవర్తుల సమర్థత దోహదపడింది.
మగధ ఒక సామ్రాజ్య శక్తిగా ఎదగడానికి ఈ క్రింది భౌగోళిక పరిస్థితులు అనుకూలించాయి.
- మగధ రాజ్యం అత్యంత సారవంతమైన గంగా మైదాన ప్రాంతములో ఉండటము వలన పటిష్టమైన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ ఏర్పడి సుసంపన్నమైన రాజ్యంగా అవతరించింది.
- మగధ సామ్రాజ్యంలో విరివిగా ముడి ఇనుము లభించడము వలన వ్యవసాయ పనిముట్లు మరియు ఆయుధాల తయారీ సులభతరమైనది.
- మగధ సామ్రాజ్యంలోని అడవులలో విస్తారమైన కలప లభించడముతో రథాల తయారీ జరిగి సైన్యంలో రథ బలము బలోపేతమైంది. ఈ అడవుల్లో ఏనుగులు అధిక సంఖ్యలో ఉండటము వలన గజదళము కూడా బలోపేతమై మగధ విజయాల్లో కీలకపాత్ర పోషించింది.
- మగధ రాజధాని పాటలీపుత్రం నదుల మధ్య వ్యూహాత్మక ప్రాంతంలో ఉండి శత్రుదుర్భేద్యంగా ఉండేది.
సమర్థులైన మగధ చక్రవర్తులు
మగధ విజృంభణకు దోహదపడిన మరొక అంశం బలమైన మరియు సమర్థవంతులైన మగధ చక్రవర్తులు. వీరు ఒక్కొక్కటిగా ఇతర జనపదాలన్నింటినీ జయించి మగధను ఒక సామ్రాజ్య శక్తిగా తీర్చిదిద్దారు. ఈ కాలంలో మగధను హర్యాంక, శిశునాగ మరియు నంద వంశాలు పరిపాలించాయి. ఈ మూడు వంశాలకు చెందిన మగధ చక్రవర్తులు మరియు వారి విజయాలను క్లుప్తంగా చర్చిద్దాం.
I. హర్యాంక వంశము:
బింబిసారుడు: ఇతను హర్యాంక వంశ స్థాపకుడు. మగధను సామ్రాజ్య శక్తిగా తీర్చిదిద్దడములో కీలకపాత్ర పోషించాడు. మగధను బలోపేతము చెయ్యడానికి బహుముఖ వ్యూహాన్ని పాటించాడు. యుద్ధాలు ఇతని మొదటి వ్యూహము. ఇందులో భాగంగా అంగ రాజ్యాన్ని జయించి మగధలో విలీనం చేశాడు. ఇతని వ్యూహాల్లో రెండవది వైవాహిక సంబంధాలు. అనాటి ప్రధాన రాజ్యాలతో వైవాహిక సంబంధాలు ఏర్పరచుకొని వారి మద్ధతును కూడగట్టుకున్నాడు.
ఉదాహరణకు కోసల యువరాణి మహాదేవిని వివాహము చేసుకొని కాశీ రాజ్యాన్ని వరకట్నంగా పొందాడు. బింబిసారుడి వ్యూహాల్లో చివరిది మరియు ముఖ్యమైనది దౌత్యనీతి.
అవంతి రాజు మహాసేనుడికి కామెర్ల వ్యాధి సోకిందని తెలుసుకొని, తన ఆస్థాన వైద్యుడు జీవకుడిని అవంతి రాజ్యానికి పంపించి, చికిత్స చేయించాడు. ఈ వైద్య దౌత్యం ఫలించి మహాసేనుడు బింబిసారుడి మద్ధతుదారుడయ్యాడు.
అజాత శత్రువు: హర్యాంక వంశంలో రెండవ రాజు. ఇతను పితృహంతకుడని, తండ్రిని చంపి రాజ్యానికి వచ్చాడని బౌద్ధ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఇతను 16 సంవత్సరాలు వజ్జి రాజ్యంతో పోరాడి జయించాడు. కోసల మరియు మల్ల రాజ్యాలను కూడా జయించి మగధలో విలీనం చేశాడు.
ఉదయనుడు: ఇతను అజాత శత్రువు యొక్క వారసుడని జైన గ్రంథాలు తెలియజేస్తున్నాయి. సేనాపతి శిశునాగుడు ఇతనిని చంపి హర్యాంక వంశాన్ని అంతం చేశాడు.
II. శిశునాగ వంశము:
శిశునాగుడు: ఇతనే ఈ వంశ స్థాపకుడు. ఇతను అవంతి రాజ్యాన్ని జయించి, మగధలో విలీనం చేశాడు.
కాలాశోకుడు: ఇతను ఈ వంశంలో రెండవ మరియు చివరి రాజు. ఇతను రాజధానిని పాటలీపుత్రానికి మార్చాడు. సేనాపతి మహాపద్మనందుడు ఇతనిని అంతం చేసి నంద వంశాన్ని స్థాపించాడు.
III. నందవంశము:
మహాపద్మనందుడు: మగధను పాలించిన చక్రవర్తుల్లో అందరికంటే గొప్పవాడు. ఇతను శూద్రకులానికి చెందినవాడు. భారతదేశ చరిత్రలోనే తొలి క్షత్రియేతర రాజు. ఇతను జైనమతాన్ని ఆదరించాడు. వాయువ్య భారతదేశంలోని గాంధార మరియు కాంభోజ రాజ్యాలు మినహా మిగిలిన జనపదాలన్నింటిని జయించారు. అస్మక రాజ్యంతో సహా కురు, పాంచాల, శౌరసేన, కళింగ రాజ్యాలను జయించాడు. వింధ్యపర్వతాలు దాటి దక్షిణ భారతదేశాన్ని జయించిన తొలి చక్రవర్తిగా చరిత్రలో స్థానం సంపాదించాడు. ఎకరాట్, పరశురామ, సర్వక్షత్రాంతక, మహాపద్మపతి అనే బిరుదులు తీసుకున్నాడు.
ధననందుడు: మహాపద్మనందుడి కుమారుడైన ధననందుడు నందవంశంలో చివరివాడు. ఇతని అసలు పేరు ఉగ్రసేననంద. గ్రీకు గ్రంథాల్లో అగ్రామ్స్ అని పిలువబడ్డాడు. క్రీ.పూ.321లో చంద్రగుప్త మౌర్యుడు ఇతన్ని ఓడించి మగధను ఆక్రమించుకున్నాడు. దీంతో నంద వంశము అంతమై మౌర్య వంశ పాలన ప్రారంభమయింది.
మౌర్యుల పూర్వ యుగ ఆర్థిక వ్యవస్థ
మౌర్యుల పూర్వ యుగ ఆర్ధికవ్యవస్థలో అనూహ్యమైన మార్పులు సంభవించాయి. వ్యవసాయము, పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. తద్వారా వ్యాపార వాణిజ్యాలు కూడా గొప్ప అభివృద్ధిని సాధించాయి.
సారవంతమైన గంగా మైదాన ప్రాంతాల్లో ఇనుము సాంకేతిక పరిజ్ఞానమును విరివిగా వినియోగించడము వలన వ్యవసాయ అభివృద్ధి జరిగింది. పాణిని వ్రాసిన అష్టాధ్యాయి గ్రంథంలో నారువేసి, వరి పండించే విధానం (transplantation of paddy) గురించి వివరించబడింది.
దిగనికయ అనే బౌద్ధ గ్రంథము ఆ కాలం నాటి 24 రకాల పరిశ్రమలను ప్రస్తావిస్తుంది. వస్త్ర పరిశ్రమ, ఆభరణాల పరిశ్రమ, లోహ పరిశ్రమ, చర్మ పరిశ్రమ, వడ్రంగి పరిశ్రమ, కుండల పరిశ్రమ మొదలైనవి అభివృద్ధి చెందాయి. గహపతి అనే పెట్టుబడిదారులు పరిశ్రమలపైన ఆధిపత్యం చెలాయిస్తున్నట్టుగా బౌద్ధ గ్రంథాలు తెలియజేస్తాయి.
శ్రేణులు (guilds) అనే వ్యాపార సంఘాలు అవతరించాయి. ఒకే వృత్తి మరియు వ్యాపారానికి సంబంధించిన వర్తకులు శ్రేణులుగా ఏర్పడ్డారు. కులల శ్రేణి (కుండలు తయారుచేసేవారు), తెలిక శ్రేణి (నూనెలు తయారుచేసేవారు), గంధిక శ్రేణి (సుగంధ పరిమళాలు తయారుచేసేవారు) మొదలైన శ్రేణులు ఆవిర్భవించాయి. ఈ శ్రేణులు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి వాటిపైన ప్రజలకు వడ్డీ చెల్లించి, ఈ ధనాన్ని తమ సభ్యులకు ఋణాలుగా అందజేసేవి.
క్రీ.పూ.6వ శతాబ్దంలో భారతదేశంలో లోహపు నాణేలు ప్రవేశపెట్టబడ్డాయి. ఇది ఆర్థిక వ్యవస్థలో అత్యంత గొప్ప పరిణామము. ఈ కాలం నాటి నాణెములను పండితులు విద్దాంక నాణెములు (Punch Marked Coins) అని పిలిచారు. ఈ నాణెములు వెండి మరియు రాగితో చేయబడ్డాయి. వీటిపైన ఎటువంటి లిపి ఉండదు. కొన్ని బొమ్మలను వీటిపైన ముద్రించారు. పాణిని తన అష్టాధ్యాయి గ్రంథంలో వీటిని పన, రూపయ, నిష్క మరియు కర్షాపణ అనే పేర్లతో పిలిచాడు.
పరిశ్రమలు మరియు వ్యాపార వాణిజ్యాలు అద్భుత ప్రగతి సాధించడముతో అనేక గొప్ప నగరాలు అభివృద్ధి చెందాయి. పాణిని వ్రాసిన అష్టాధ్యాయి ఆనాటి అనేక నగరాలను ప్రస్తావిస్తుంది. చరిత్రకారులు ఈ కాలాన్ని రెండవ పట్టణీకరణ (second urbanisation) యుగమని పిలిచారు. (భారతదేశంలో సింధు నాగరికత కాలాన్ని మొదటి నగరీకరణ యుగమని అని పిలుస్తారు). బుద్ధుని ప్రియశిష్యుడైన ఆనందుడు, తన గురువు నిర్యాణము కొరకు చంప, రాజగృహ, సాకేత, కౌశాంబి, వారణాసి మరియు సంకిస్స అనే ఆరు మహానగరాలను ఎంపిక చేయగా, బుద్ధుడు కుశి అనే చిన్న పట్టణంలో మరణించాడని బౌద్ధ గ్రంథాలు తెలియజేస్తున్నాయి.