చారిత్రక పూర్వయుగ సంస్కృతులు
లిపి ఆధారంగా ప్రాచీన కాలాన్ని మూడు యుగాలుగా విభజించారు.
- చారిత్రక పూర్వయుగం (Pre-historic Age): లిపి లేని కాలము మరియు చరిత్ర అధ్యయనము చేయలేని కాలమును చారిత్రక పూర్వయుగం అంటారు.
- చారిత్రక సంధి యుగం: ఇది లిపి ఉండి, ఆ లిపిని చదవలేని కాలము.
(నోట్: చారిత్రక పూర్వ యుగం మరియు చారిత్రక సంధి యుగ కాలాలను అధ్యయనము చెయ్యడానికి పురావస్తుశాస్త్రముపై ఆధారపడాల్సి ఉంటుంది.)
- చారిత్రక యుగం: చరిత్ర అధ్యయనము చేయగల కాలమును చారిత్రక యుగము అంటారు.
చారిత్రక పూర్వ యుగం మానవ ఆవిర్భావముతో ప్రారంభమై, లిపి వాడుకలోకి వచ్చేంత వరకు కొనసాగింది. భారతదేశములో మానవ ఆవిర్భావము ఎప్పుడు జరిగిందో ఖచ్చితంగా చెప్పడము కష్టతరము. 14 లక్షల సంవత్సరాల క్రితం తొలి మానవుడు మహారాష్ట్రలోని బోరి గుహల్లో జీవించాడని ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ తొలి మానవుడు ఆఫ్రికా ఖండము నుంచి వలస వచ్చాడనే అభిప్రాయం ఉంది.
చారిత్రక పూర్వ యుగానికి చెందిన నాలుగు ప్రధాన సంస్కృతులు
- ప్రాచీన శిలాయుగ సంస్కృతి / Palaeolithic Culture (ఆది నుండి క్రీ.పూ.10,000):
ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన తొలి ప్రదేశము (site)ను రాబర్ట్ బ్రూస్ పూటె 1863లో తమిళనాడులోని పల్లవరము (చెన్నై) దగ్గర కనుగొన్నాడు. సోన్ లోయ (పంజాబ్), నర్మద లోయ (మధ్యప్రదేశ్), బెలాన్ లోయ (ఉత్తరప్రదేశ్) మరియు దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో పురావస్తుశాఖ నిర్వహించిన త్రవ్వకాల్లో ప్రాచీన శిలాయుగ పనిముట్లు అధికంగా దొరికాయి.
నోట్: 1861లో ఆంగ్లేయులు Archaeological Survey of Indiaను స్థాపించారు. దీని తొలి డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ను భారత పురావస్తుశాఖ పితామహుడు (Father of Indian Archaeology) అని అంటారు. ఇతని తర్వాత పురావస్తుశాఖ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. 1904లో వైస్రాయి లార్డ్ కర్జన్ పురావస్తు శాఖను పునరుద్ధరించి సర్ జాన్ మార్షల్‌ను డైరెక్టర్ జనరల్‌గా నియమించాడు.
- ప్రాచీన శిలాయుగ సంస్కృతికి చెందిన మానవుడు స్పటికశిల (quartazite) అనే రాయితో అనేక పనిముట్లు తయారుచేశాడు. అందులో ముఖ్యమైనవి hand axes, flakes, blades, choppers, cleavers మొదలైనవి.
- ప్రాచీన శిలాయుగ మానవుడు హోమోసేపియన్ (homosapien) జాతి కంటే ముందున్న జాతికి చెందినవాడు. రామాపిథికస్ (ramapithecus) జాతికి చెందిన మానవ అవశేషాలు శివాలిక్ ప్రాంతములో, నియాండర్తల్ (neanderthal) జాతికి చెందిన అవశేషాలు నర్మద ప్రాంతములో లభించాయి. ప్రాచీన శిలాయుగ అంతంలో (క్రీ.పూ.10,000) ఆధునిక మానవుడైన హోమోసేపియన్ (homosapien) ఆవిర్భవించాడు. హోమోసేపియన్ అనే లాటిన్ పదానికి వివేకవంతుడు మరియు ఆలోచన పరిజ్ఞానము కలిగిన మానవుడని అర్థం.
- ఈ కాలంలోని మానవుడు జంతువులను వేటాడుతూ మరియు పండ్లు, కాయలు, ఆకులు సేకరిస్తూ ఆహారాన్ని సమకూర్చుకునేవాడు. అందుకే ఈ కాలం నాటి ఆర్థికవ్యవస్థను hunting and gathering economy అంటారు.
- ప్రాచీన శిలాయుగంలో ప్రజలు చిన్న చిన్న గుంపులుగా (bands) జీవిస్తూ సంచార జీవితమును గడిపారు.
- ప్రాచీన శిలాయుగము ప్లీస్టోసిన్ (Pleistocene) లేదా మంచుయుగానికి చెందినది. భూగోళము మంచుతో కప్పబడి అతిశీతల వాతావరణము కొనసాగడముతో జంతుజాలము మరియు వృక్షజాలము అభివృద్ధికి ఆటంకము ఏర్పడింది. క్రీ.పూ.10,000 కాలంలో ప్లీస్టోసిన్ యుగం అంతమై హోలోసిన్ (holocene) యుగం ప్రారంభం కావడముతో పరిస్థితులు చక్కబడ్డాయి.
2) మధ్య శిలాయుగ సంస్కృతి / Mesolithic Culture (క్రీ.పూ.9000 – 4000)
మధ్య శిలాయుగములో మానవుని జీవితంలో అనేక మార్పులు సంభవించాయి. ఆలోచన పరిజ్ఞానము కలిగిన హోమోసేపియన్ మానవుడు ఆవిర్భవించడము మరియు జంతుజాల మరియు వృక్షజాల అభివృద్ధికి అనుకూలమైన హోలోసిన్ యుగము ప్రారంభము కావడంతో గొప్ప మార్పులు ఈ కాలంలో సంభవించాయి.
- కృత్రిమ గృహ నిర్మాణము మధ్య శిలాయుగములోనే ప్రారంభమైంది. ఈ కాలంలో నిర్మించబడిన గృహాలు ఉత్తరప్రదేశ్‌లోని సరైనహార్రాయ్లో బయటపడ్డాయి. భారతదేశంలోనే ఇవి తొలి కృత్రిమ గృహాలని పండితులు అభిప్రాయపడుతున్నారు.
- భారతదేశంలో కుండల తయారీ ఈ కాలంలోనే ప్రారంభమయింది. భారతదేశంలో తయారుచేసిన తొలి కుండలు ఉత్తరప్రదేశ్‌లోని చోపానీమండోలో బయల్పడ్డాయి. ఈ కుండలు చేతితో తయారుచేశారు (handmade pottery). కుమ్మరి చక్రము నవీన శిలాయుగం నుండి వినియోగములోకి వచ్చింది.
- పశుపోషణ ఈ కాలంలో ఇంకొక ప్రధానమైన పరిణామము. మధ్య శిలాయుగానికి చెందిన బగోర్ (రాజస్థాన్) మరియు ఆదమ్ఘర్ (మధ్యప్రదేశ్)లో పశుపోషణకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి. ఇక్కడ ప్రజలు మేకలు, గొర్రెలు, ఆవులను పోషించారు. భారతదేశంలోనే తొలిసారిగా పశుపోషణ ఈ ప్రాంతాల్లోనే కొనసాగిందని భావించవచ్చు.
- ఈ కాలానికి చెందిన ప్రజలు క్వార్టజైట్, చెర్ట్ అనే శిలలతో పనిముట్లను తయారుచేశారు. మధ్య శిలాయుగానికి చెందిన పనిముట్లు పరిమాణంలో చిన్నవిగా ఉండటంతో వీటిని సూక్ష్మశిలలు (microliths) అని పిలుస్తారు. భారతదేశంలో తొలి సూక్ష్మశిలలను క్యార్లిల్ (Carlyle) అనే పురావస్తు శాస్త్రవేత్త వింధ్య ప్రాంతాల్లో కనుగొన్నాడు.
- మధ్య శిలాయుగంలోనే తెగల మధ్య ఘర్షణ చెలరేగి తొలిసారిగా యుద్ధాలు జరిగాయి. దీనికి సంబంధించిన ఆధారాలు సరైనహర్రాయ్ అనే ప్రాంతంలో లభించాయి.
3) నవీన శిలాయుగ సంస్కృతి / Neolithic Culture (క్రీ.పూ. 7000-1000)
సర్ జాన్ లుబ్బాక్ ‘neolithic’ అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించాడు. గార్డన్ చైల్డ్ (Gordon Childe) తాను వ్రాసిన What Happened in History అనే పుస్తకములో ఈ సంస్కృతిని ‘Neolithic Revolution’గా అభివర్ణించాడు. విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకోవడంతో ఈ కాలాన్ని ‘నవీన శిలాయుగ విప్లవము’ అని సంభోధించాడు. ఈ కాలంలోనే మానవుడు వ్యవసాయమును ప్రారంభించాడు. శిలాపనిముట్లు ఉపయోగించే మానవుడు వ్యవసాయము చేపట్టడముతో నవీన శిలాయుగము ప్రారంభమైనదని చెప్పవచ్చు. అంటే ఆహారాన్ని వేటాడే దశ నుండి ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునే దశకు చేరుకోవడము, దీంతో సంచార జీవితము అంతమై స్థిర నివాసము ప్రారంభమయ్యింది. మొట్టమొదటిసారిగా గ్రామీణ వ్యవస్థలు ఏర్పడ్డాయి. రాబోయే నాగరికతకు ఈ కాలంలోనే పునాదులు పడ్డాయి. ఈ యుగము భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు కాలాల్లో ప్రారంభమయిందని గమనించాలి. వాయువ్య భారతదేశములో సుమారుగా క్రీ.పూ.7000; గంగా మైదాన ప్రాంతాల్లో క్రీ.పూ.5000; కాశ్మీర్ లోయలో క్రీ.పూ.2500; దక్షిణ భారతదేశంలో క్రీ.పూ.2000; ఈశాన్య రాష్ట్రాల్లో క్రీ.పూ.1000 కాలంలో నవీన శిలాయుగం ప్రారంభమయింది. ఇది భారతదేశంలో మధ్య శిలాయుగానికి, తామ్ర శిలాయుగానికి మరియు సింధు నాగరికతకు సమకాలీనంగా కొనసాగిందని భావించవచ్చు.
నవీన శిలాయుగం నాటి ప్రధాన ప్రదేశాలు :
- మెహర్‌ఘర్ (క్రీ.పూ.7000): వాయువ్య భారతదేశంలోని (ప్రస్తుత పాకిస్థాన్) బెలూచిస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది. భారత ఉపఖండంలోనే తొలిసారిగా మెహర్‌ఘర్ ప్రజలు వ్యవసాయాన్ని చేపట్టారు. అంటే భారత ఉపఖండంలోనే మెహర్‌ఘర్ తొలి నవీన శిలాయుగ ప్రాంతమని అర్థము. ఇక్కడి ప్రజలు గోధుమలు, బార్లీ, ప్రత్తి పండించారు. ప్రపంచంలోనే ప్రత్తి పండించిన తొలి ప్రజలు వీరే. (నోట్: ఈజిప్టు, పాలస్తీన ప్రాంతాల్లో గోధుమలు మరియు బార్లీ క్రీ.పూ.9000లోనే పండించారు). భారతదేశంలోని తొలి కుమ్మరి చక్రము (potter’s wheel) ఇక్కడే లభించింది. JF.Jarriage అను పురావస్తు శాస్త్రవేత్త ఈ ప్రదేశాన్ని కనుగొని త్రవ్వకాలు నిర్వహించారు.
- కొల్దీవ (క్రీ.పూ.5000): ఉత్తరప్రదేశ్‌లో బయల్పడిన నవీన శిలాయుగ ప్రాంతము. ఇక్కడి ప్రజలు క్రీ.పూ.5000 లోనే వరి పండించారు. ప్రపంచంలోనే మొదటిసారిగా వరి పండించిన ఘనత ఈ ప్రజలకే దక్కుతుంది.
- మహాగర (క్రీ.పూ.5000): ఉత్తరప్రదేశ్‌లోని ఈ నవీన శిలాయుగ ప్రాంత ప్రజలు బార్లీని ఎక్కువగా పండించారు.
- బూర్జహాం (క్రీ.పూ.2500): కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు సమీపంలో జీలం నది ఒడ్డున ఉన్న బూర్జహాంలో నవీన శిలాయుగ అవశేషాలు లభ్యమయ్యాయి. బూర్జహాం అంటే జన్మస్థలం అని అర్థం. వీరు గుంతలు తవ్వి నివాస గృహాలను నిర్మించుకున్నారు. వీటిని ‘pit dwellings’ అంటారు. బహుశ చలి తీవ్రత నుండి కాపాడుకోవడానికి ఇలాంటి ఇళ్ళను నిర్మించుకొని ఉండవచ్చు. ఇక్కడ ఎముకలతో చేసిన అనేక పనిముట్లు లభించాయి. యజమానితో పాటు కుక్కను ఖననము చేసిన సమాధి ఇక్కడే లభ్యమయ్యింది. బూర్జహంలోని నవీన శిలాయుగ ప్రజలు సింధు నాగరికత ప్రజలతో వ్యాపార సంబంధాలను కలిగి ఉన్నారు. దీనికి సమీపంలోని గుఫ్క్రల్ కూడా నవీన శిలాయుగానికి చెందిన ప్రాంతం.
- ఛిరాండ్ (క్రీ.పూ.1600): బీహార్‌లోని సారన్ జిల్లాలో ఛిరాండ్ ఉంటుంది. ఇక్కడి నవీన శిలాయుగ ప్రజలు గోధుమలు, బార్లీ, వరి పండించారు. పామును పూజించిన ఆధారాలు లభ్యమయ్యాయి. ఎముకతో చేసిన సూది లభించడము వలన వస్త్రాలను కుట్టుకునేవారని తెలుస్తుంది.
దక్షిణ భారతదేశం (క్రీ.పూ.2000): దక్షిణ భారతదేశంలో వ్యవసాయం లేదా నవీన శిలాయుగము క్రీ.పూ.2000లో ప్రారంభమయింది. ఇక్కడ రాగులు, ఉలువలను ఎక్కువగా పండించారు. దక్షిణ భారతదేశంలోని నవీన శిలాయుగ ప్రజలు సింధు నాగరికతకు సమకాలీకులు మరియు వారితో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నారు. దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన నవీన శిలాయుగ ప్రాంతాలు:
- కర్ణాటక: సంగనకల్లు, పిక్లిహాల్, బ్రహ్మగిరి, మస్కి, టెక్కెలకోట
- తెలంగాణ: ఉట్నూరు
- ఆంధ్రప్రదేశ్: నాగార్జునకొండ, పాలవాయి
- తమిళనాడు: పియాంపల్లి
ఈశాన్య భారతదేశం (క్రీ.పూ.1000): ఈశాన్య భారతదేశంలో వ్యవసాయము లేదా నవీన శిలాయగము ఆలస్యంగా (క్రీ.పూ.1000) ప్రారంభమయ్యింది. బ్రహ్మపుత్ర లోయలోని ప్రాంతాల్లో వర్షపాతము అధికంగా ఉండి దట్టమైన అడవులు ఉండటము వలన వ్యవసాయము కష్టతరమై నవీన శిలాయుగం ఆలస్యంగా ప్రారంభమయ్యింది. అస్సాం మరియు మేఘాలయలోని గారో కొండల్లో నవీన శిలాయుగ ప్రాంతాలు లభించాయి. దావోజలిహదింగ్ మరియు మెహర్ల్యాండ్ వీటిలో ముఖ్యమైనవి.
-
తామ్ర శిలాయుగ సంస్కృతి / Chaleolithic Culture (క్రీ.పూ.3000 – 700)
అనేక లక్షల సంవత్సరాలు శిలాయుగంలో జీవించిన మానవుడు క్రమంగా లోహాలను ఉపయోగించడము నేర్చుకొన్నాడు. శిలాయుగం నుండి లోహయుగానికి మారడానికి మానవుడికి లక్షల సంవత్సరాలు పట్టింది. తామ్ర శిలాయుగంలోని మానవుడు శిలా పనిముట్లను మరియు రాగి పనిముట్లను రెండింటిని ఉపయోగించాడు. మానవుడు ఉపయోగించిన తొలి లోహము రాగి.
భారతదేశంలో తామ్ర శిలాయుగానికి చెందిన ముఖ్య సంస్కృతులు మరియు ప్రదేశాలు:
- ఆహార్ సంస్కృతి (క్రీ.పూ.2100 – 1500): రాజస్థాన్‌లోని ఆహార్ అనే ప్రాంతంలో మొట్టమొదటిగా ఈ సంస్కృతి అవశేషాలు లభించాయి. (పురావస్తుశాస్త్ర సాంప్రదాయము ప్రకారము ఒక సంస్కృతి లేదా నాగరికతలో బయల్పడిన తొలి ప్రదేశమును ‘type site’ అంటారు. దీని పేరును ఆ సంస్కృతి లేదా నాగరికతకు ఇవ్వడము జరుగుతుంది). రాజస్థాన్‌లోని ఖేత్రి ప్రాంతంలోని రాగి నిక్షేపాలను ఈ కాలం నాటి ప్రజలు ఉపయోగించారు. ఈ సంస్కృతిలో గిలుండ్ ముఖ్యమైన ప్రాంతం. గిలుండ్ ప్రజలు కాల్చిన ఇటుకలు మరియు రాళ్ళతో ఇళ్ళను నిర్మించుకున్నారు. తాంబవతి, బాలాథాల్ ఈ సంస్కృతిలోని ఇతర ప్రాంతాలు.
- మాల్వ సంస్కృతి (క్రీ.పూ.1700 – 1200): మధ్యప్రదేశ్‌లోని మాల్వ ప్రాంతంలో ఈ సంస్కృతి బయల్పడింది. కాయత, నవదతోలి, మహేశ్వర్, ఎరాన్ ముఖ్యమైన ప్రాంతాలు. ఈ సంస్కృతికి సంబంధించి ధన్వాడలో లింగము, ఎద్దును పూజించడము మరియు యజ్ఞయాగాలకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి.
- జోర్వే సంస్కృతి (క్రీ.పూ.1400 – 700): మహారాష్ట్రలోని జోర్వే ఈ సంస్కృతిలో బయబడిన తొలి ప్రవేశము. మహారాష్ట్రలో ఈ సంస్కృతికి సంబంధించి 200 ప్రదేశాలు కనుగొన్నారు. అందులో జోర్వే, ఇనాంగావ్, ఛాందోలి, దైమాబాద్ ముఖ్యమైనవి.
OCP సంస్కృతి (క్రీ.పూ.2000 – 1500): గంగా – యమున అంతర్వేది ప్రాంతంలోని తామ్ర శిలాయుగ ప్రజలు ochre coloured pottery (OCP) అనే ప్రత్యేక కుండ పాత్రలను ఉపయోగించారు. ఈ సంస్కృతికి చెందిన ప్రదేశాల్లో OCP తో పాటుగా భారీ సంఖ్యలో రాగి పనిముట్లు లభించాయి. అందుకే OCP సంస్కృతిని ‘Copper Hoard Culture’ అని కూడా అంటారు. గుంగెరియ (మధ్యప్రదేశ్), హస్తినాపూర్ (ఉత్తరప్రదేశ్) మొదలైనవి ఈ సంస్కృతికి చెందిన ముఖ్యమైన ప్రాంతాలు.