Pre-Historic Cultures

Pre-Historic Cultures

చారిత్రక పూర్వయుగ సంస్కృతులను (Pre-Historic Cultures) అధ్యయనం చేయాలంటే కొన్ని కీలక పదాలపై, అంశాలపై కచ్చితమైన అవగాహన ఉండాలి.

సంస్కృతి (Culture): సంస్కృతి అంటే ఒక జీవన విధానం.

నాగరికత (Civilization): సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన అభివృద్ధి సాధించిన పరిణామ దశను నాగరికత అంటారు.

ఇండాలజీ: భారతదేశ చరిత్ర, సంస్కృతులను అధ్యయనం చేసే శాస్త్రాన్నే ఇండాలజీ అంటారు.

Note: ఇండాలజీ పితామహుడు – సర్‌ విలియం జోన్స్‌

Archaeological Survey of India: ఆంగ్లేయులు 1861లో Archaeological Survey of Indiను స్థాపించారు. దీని మొదటి డైరెక్టర్‌ జనరల్‌ అలెగ్జాండర్‌ కన్నింగ్‌హామ్‌. ఇతనినే భారత పురావస్తుశాఖ పితామహుడు (Father of Indian Archaeology) అని అంటారు. తరువాత ఈ పురావస్తు శాఖ చాలా కాలంపాటు స్తబ్ధుగా ఉండిపోయింది. 1904లో అప్పటి వైస్రాయి లార్డ్‌ కర్జన్‌ ఈ పురావస్తుశాఖను పునరుద్ధరించి సర్‌ జాన్ మార్షల్‌ను  డైరెక్టర్‌ జనరల్‌గా నియమించాడు.  ఈ పురావస్తుశాఖ యొక్క కృషి ఫలితంగానే నేడు మనం మన భారతదేశ ఘన చరిత్రను పునర్నించుకోగలిగాము.

ప్రాచీన ప్రపంచ నాగరికతలు

మెసపటోమియా:

ప్రపంచంలోనే మొట్టమొదటి నాగరికత మెసపటోమియా నాగరికత. మెసపటోమియా అనగా రెండు నదుల మధ్య ప్రాంతం అని అర్థం. మెసపటోమియా టైగ్రిస్‌, యూఫ్రటీస్‌ నదుల మధ్య ఉన్నది. మెసపటోమియా అంటే ప్రస్తుతం ఇరాక్‌ ప్రాంతం.

ఈజిప్ట్‌ నాగరికత:

ఈ నాగరికత నైలు నది పరీవాహక ప్రాంతంలో వెలసింది. అందుకే దీనిని ‘నైలు నదీ వరప్రసాదం’ అని అంటారు.

చైనా నాగరికత:

ఈ చైనా నాగరికత హొయాంగ్‌ హో నది ఒడ్డున వెలసింది.

సింధు నాగరికత: భారతదేశంలో సింధు నది పరీవాహక ప్రాంతంలో ఈ మహోన్నత నాగరికత వెలసింది.

చారిత్రక పూర్వయుగ సంస్కృతులు (Pre-Historic Cultures)

Note: చారిత్రక పూర్వయుగ సంస్కృతులను, భారతదేశ చరిత్రను దృష్టిలో ఉంచుకుని మాత్రమే మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

లిపి ఆధారంగా ప్రాచీన కాలాన్ని మూడు యుగాలుగా విభజించారు.

  1. చారిత్రక పూర్వయుగం (Pre-Historic Age)
  2. చారిత్రక సంధియుగం (Proto-Historic Age)
  3. చారిత్రక యుగం (Historic Age)

I.చారిత్రక పూర్వయుగం (Pre-Historic Age)

లిపి లేని కాలము మరియు లిపి లేకపోవడం వలన చరిత్రను అధ్యయనము చెయ్యలేని కాలమును చారిత్రక పూర్వయుగం అంటారు.

II.చారిత్రక సంధియుగం (Proto-Historic Age):

లిపి ఉన్నప్పటికీ, ఆ లిపిని చదవలేని కాలము. ఉదాహరణకు సింధూ నాగరికత.

Note: చారిత్రక పూర్వయుగం మరియు చారిత్రక సంధియుగాలను పురావస్తుశాస్త్రము ద్వారా అధ్యయనము చేస్తారు.

III. చారిత్రక యుగం (Historic Age):

లిపి ఉండి చరిత్ర అధ్యయనము చెయ్యగల కాలమును చారిత్రక యుగము అంటారు.

చారిత్రక పూర్వయుగం మానవ ఆవిర్భావముతో ప్రారంభమై, లిపి వాడుకలోకి వచ్చేంత వరకు కొనసాగింది. అయితే భారతదేశములో మానవ ఆవిర్భావము ఎప్పుడు జరిగిందో చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. భారత్‌లో 14 లక్షల సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోని బోరి గుహల్లో తొలి మానవుడు జీవించినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బహుశా ఈ తొలి మానవుడు ఆఫ్రికా ఖండము నుంచి వలస వచ్చి ఉంటాడని వారు అభిప్రాయపడుతున్నారు.

చారిత్రక పూర్వయుగానికి చెందిన నాలుగు ప్రధాన సంస్కృతులు
  1. ప్రాచీన శిలాయుగ సంస్కృతి (Paleolithic Culture)
  2. మధ్య శిలాయుగ సంస్కృతి (Mesolithic Culture)
  3. నవీన శిలాయుగ సంస్కృతి (Neolithic Culture)
  4. తామ్ర శిలాయుగ సంస్కృతి (Chalcolithic Culture)

Note: చారిత్రక పూర్వయుగ సంస్కృతులకు సంబంధించిన తేదీలు లేదా కాలాలు కచ్చితమైనవి కావు. వివిధ గ్రంథాల్లో వాటిని వివిధ రకాలుగా పేర్కొన్నారు. కనుక ఇక్కడ ఇస్తున్న కాలాలు రమారమిగా పేర్కొన్నవని మీరు గమనించాలి.

Note: చారిత్రక పూర్వయుగ సంస్కృతులకు సంబంధించిన కాలాలను పోటీ పరీక్షల్లో అడగరు. కనుక మీరు వీటిని గురించి భయపడాల్సిన పనిలేదు. # Pre-Historic Cultures #

  1. ప్రాచీన శిలాయుగ సంస్కృతి (ఆది నుండి క్రీ.పూ.10,000)

ఈ ప్రాచీన శిలాయుగమును మరలా 3 కాలములుగా వర్గీకరించారు. అవి:

  1. దిగువ ప్రాచీన శిలాయుగం (Lower Paleolithic Age))
  2. మధ్య ప్రాచీన శిలాయుగం (Middle Paleolithic Age)
  3. ఎగువ ప్రాచీన శిలాయుగం (Upper Paleolithic Age))

ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన తొలి ప్రదేశమును రాబర్ట్‌ బ్రూస్‌ ఫూటె 1863లో తమిళనాడులోని పల్లవరము (చెన్నై) దగ్గర కనుగొన్నాడు. సోన్‌ లోయ (పంజాబ్‌), నర్మద లోయ (మధ్యప్రదేశ్‌), బెలాన్‌ లోయ (ఉత్తరప్రదేశ్‌) మరియు దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో పురావస్తుశాఖ నిర్వహించిన త్రవ్వకాల్లో ప్రాచీన శిలాయుగ పనిముట్లు దొరికాయి.

ప్రాచీన శిలాయుగ సంస్కృతికి చెందిన మానవుడు స్పటికశిల (Quartazite) అనే రాయితో అనేక పనిముట్లు తయారు చేశాడు. అవి Hand axes, Flakes, blades, choppers, cleavers మొదలుగునవి.

ప్రాచీన శిలాయుగ మానవుడు హోమోసేపియన్‌ (Homosapien) జాతి కంటే ముందున్న జాతికి చెందినవాడు. రామపిథికస్‌ (Ramapithecus) జాతికి చెందిన మానవ అవశేషాలు శివాలిక్‌ ప్రాంతములో, నియాండర్తల్‌ (Neanderthal) జాతికి చెందిన మానవ అవశేషాలు నర్మద నది పరివాహక ప్రాంతంలో లభించాయి. ప్రాచీన శిలాయుగ అంతంలో (క్రీ.పూ.10,000) ఆధునిక మానవుదైన హోమోసేపియన్‌ (Homosapien) ఆవిర్భవించాడు. హోమోసేపియన్‌ అనే లాటిన్‌ పదానికి వివేకవంతుడు మరియు ఆలోచన పరిజ్ఞానము కలిగిన మానవుడని అర్థం.

ఈ కాలంలోని మానవుడు జంతువులను వేటాడుతూ మరియు పండ్లు, కాయలు, ఆకులు సేకరిస్తూ ఆహారాన్ని సమకూర్చుకునేవాడు. అందుకే ఈ కాలం నాటి ఆర్థికవ్యవస్థను Hunting and Gathering economy అనవచ్చు.

ప్రాచీన శిలాయుగంలో ప్రజలు చిన్న చిన్న గుంపులుగా (Bands) జీవిస్తూ సంచార జీవితమును గడిపేవారు.

ప్రాచీన శిలాయుగము ప్లిస్టోసిన్‌ (Pleistocene) లేదా మంచుయుగానికి చెందినది. భూగోళము పూర్తిగా మంచుతో కప్పబడి, అతిశీతల వాతావరణము ఉండడం వలన జంతు, వృక్షజాల అభివృద్ధి అంతగా జరగలేదు. క్రీ.పూ. 10,000 కాలంలో ప్లిస్టోసిన్‌ యుగం అంతమై హోలోసిన్‌ (Holocene) యుగం ప్రారంభం కావడముతో మంచు కరిగి, వృక్ష, జంతుజాలము నిరాటంకంగా అభివృద్ధి చెందడానికి అవకాశం లభించింది.

మధ్య శిలాయుగ సంస్కృతి (క్రీ.పూ.9000-4000)

మధ్య శిలాయుగములో మానవుని జీవితంలో అనేక మార్పులు సంభవించాయి. ఆలోచన

పరిజ్ఞానము కలిగిన హోమోసేపియన్‌ మానవుడు ఆవిర్భవించడము మరియు జంతుజాల మరియు వృక్షజాల అభివృద్ధికి అనుకూలమైన హోలోసిన్‌ యుగము ప్రారంభము కావడంతో గొప్ప మార్పులు ఈ కాలంలో సంభవించాయి.

కృత్రిమ గృహ నిర్మాణము మధ్య శిలాయుగములోనే ప్రారంభమైంది. ఈ కాలంలో నిర్మించబడిన గృహాలు ఉత్తరప్రదేశ్‌లోని సరైనహార్‌రాయ్‌లో బయటపడ్డాయి. భారతదేశంలోనే ఇవి తొలి గృహాలని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

భారతదేశంలో కుండల తయారీ ఈ కాలంలోనే ప్రారంభమయింది. భారతదేశంలో తయారుచేసిన తొలి కుండలు ఉత్తరప్రదేశ్‌లోని చోపానిమండోలో బయల్పద్దాయి. ఈ కుండలు చేతితో (Handmade pottery) తయారు చేయబడ్డాయి.

Note: కుమ్మరి చక్రము నవీన శిలాయుగం నుండి వినియోగములోకి వచ్చింది.

పశుపోషణ ఈ కాలంలో ఇంకొక ప్రధానమైన పరిణామము. మధ్య శిలాయుగానికి చెందిన బగోర్‌ (రాజస్థాన్‌) మరియు ఆదమ్‌ఘర్‌ (మధ్యప్రదేశ్‌)లో పశుపోషణకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి. అందువల్ల భారతదేశంలో తొలి పశుపోషణ ఈ ప్రాంతాల్లోనే కొనసాగిందని భావించవచ్చు. ఇక్కడి ప్రజలు మేకలు, గొర్రెలు, ఆవులను పోషించారు.

ఈ కాలానికి చెందిన ప్రజలు క్వార్టజైట్‌, ఛెర్ట్‌ అనే శిలలతో పనిముట్లను తయారుచేశారు. మధ్య యుగానికి చెందిన పనిముట్లు పరిమాణంలో చిన్నవిగా ఉండటంతో వీటిని సూక్ష్మశిలా పరికరాలు (Microliths) అని పిలిచారు. భారతదేశంలో తొలి సూక్ష్మశిలలను కార్లైల్‌ (Carlyle) అనే పురావస్తు శాస్త్రవేత్త వింధ్య ప్రాంతాల్లో కనుగొన్నాడు.

మధ్య శిలాయుగంలోనే తెగల మధ్య ఘర్షణ చెలరేగి తొలిసారిగా యుద్దాలు జరిగాయి. దీనికి సంబంధించిన ఆధారాలు సరైనహర్‌రాయ్‌ అనే ప్రాంతంలో లభించాయి.

నవీన శిలాయుగ సంస్కృతి (క్రీ.పూ.7000 – 1000)

సర్‌ జాన్‌ లుబ్బాక్‌ ‘Neolithic’ అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించాడు. గార్డన్‌ ఛైల్డ్‌ (Gordon Child) రాసిన What happened in History అనే పుస్తకములో ఈ సంస్కృతిని ‘Neolithic Revolution’గా పేర్కొన్నాడు. విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకోవడంతో ఈ కాలాన్ని ‘నవీన శిలాయుగ విప్లవము’ అని ఆయన అభిప్రాయపడ్డాడు.

ఎందుకంటే, ఈ నవీన శిలాయుగంలోనే మొదటిసారిగా మానవుడు (ఈజిప్ట్‌లో) వ్యవసాయాన్ని ప్రారంభించాడు. వాస్తవానికి శిలాపనిముట్లు ఉపయోగించే మానవుడు వ్యవసాయము చేపట్టడముతో నవీన శిలాయుగము ప్రారంభమైనదని చెప్పవచ్చు. అంటే ఆహారాన్ని వేటాడే దశ నుండి ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునే దశకు మానవుడు చేరుకున్నాడు. ఫలితంగా సంచార జీవితం అంతమై స్థిర నివాసము ఏర్పరుచుకోవడం ప్రారంభమయ్యింది. దీనితో మొట్టమొదటిసారిగా గ్రామీణ వ్యవస్థలు ఏర్పడ్డాయి. అంటే రాబోయే నాగరికతకు ఈ కాలంలోనే పునాదులు పడ్డాయి.

Note: ఈ నవీన శిలాయుగము భారతదేశమంతటా ఒకే సారి ప్రారంభం కాలేదు. వివిధ ప్రాంతాల్లో వేర్వేరు కాలాల్లో ప్రారంభమయ్యింది. వాయువ్య భారతదేశములో క్రీ.పూ.7000; గంగా మైదాన ప్రాంతాల్లో క్రీ.పూ.5000; కాశ్మీర్‌ లోయలో క్రీ.పూ. 2500; దక్షిణ భారతదేశంలో క్రీపూ.2000; ఈశాన్య రాష్ట్రాల్లో క్రీ.పూ.1000 కాలంలో నవీన శిలాయుగం ప్రారంభమయింది.

వాస్తవానికి ఈ నవీన శిలాయుగం భారతదేశంలో మధ్య శిలాయుగానికి, తామ్ర శిలాయుగానికి మరియు సింధు నాగరికతకు సమకాలీనంగా కొనసాగింది.

నవీన శిలాయుగం నాటి ప్రధాన ప్రదేశాలు:
మెహర్‌గర్‌ (క్రీ.పూ.7000):

భారత ఉపఖండంలోని తొలి నవీన శిలాయుగ ప్రాంతం మెహర్‌గర్‌. ఇది ప్రస్తుతం పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్‌ రాష్ట్రంలో ఉంది. ఈ ప్రదేశాన్ని కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్త J.F.Jarriage.

ఈ మెహర్‌గర్‌ ప్రజలు భారత ఉపఖండంలోనే తొలిసారిగా వ్యవసాయాన్ని చేపట్టి, గోధుమలు, బార్లీ, ప్రత్తి పండించారు.

Note: ప్రపంచంలోనే మొదటిసారిగా ప్రత్తి పండించినవారు మన భారతీయులే.

ఈజిప్ట్‌, పాలస్తీనాల్లో క్రీ.పూ.9000లోనే గోధుమలు మరియు బార్లీ పండించారు).

భారత ఉపఖండంలో తొలి కుమ్మరి చక్రము (Potter’s wheel) ఈ మెహర్‌గర్‌లోనే లభించింది.

కొల్ధివ (క్రీ.పూ.5000)

ఉత్తరప్రదేశ్‌లో బయల్పడిన నవీన శిలాయుగ ప్రాంతము కొల్ధివ. ఇక్కడి ప్రజలు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా క్రీ.పూ.5000లో వరిని పండించారు.

మహాగర (క్రీ.పూ.5000)

ఉత్తరప్రదేశ్‌లోని ఈ నవీన శిలాయుగ ప్రాంత ప్రజలు బార్లీని ఎక్కువగా పండించారు.

బూర్జహాం (క్రీ.పూ.2500)

కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు సమీపంలో జీలం నది ఒడ్డున ఉన్న బూర్జహాంలో నవీన యుగ అవశేషాలు లభ్యమయ్యాయి. బూర్జహాం అంటే జన్మస్థలం అని అర్థం. ఇక్కడి ప్రజలు గుంతలు తవ్వి నివాస గృహాలను నిర్మించుకున్నారు. అందుకే వీటిని “Pit dwellings” అంటారు. బహుశ హిమాలయాల శీతల గాలుల నుంచి రక్షణకోసం ఇలాంటి ఇళ్ళను నిర్మించుకొని ఉండవచ్చు. బూర్జహాంకు సమీపంలోనే గుఫ్‌క్రల్‌ అనే నవీన శిలాయుగానికి చెందిన ప్రాంతం ఉంది.

బూర్జహాంలో ఎముకలతో చేసిన అనేక పనిముట్లు లభించాయి. యజమానితో పాటు కుక్కను ఖననము చేసిన సమాధి కూడా ఇక్కడే లభ్యమయ్యింది.

Note: బూర్జహంలోని నవీన శిలాయుగ ప్రజలు సింధు నాగరికత ప్రజలతో వ్యాపార సంబంధాలను కలిగి ఉన్నారు.

ఛిరాండ్‌ (క్రీ.పూ.1600)

బీహార్‌లోని సారన్‌జిల్లాలో ఛిరాండ్‌ ఉంది. ఇక్కడి నవీన శిలాయుగ ప్రజలు గోధుమలు, బార్లీ, వరి పండించారు. వీరు పాములను ఆరాధించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఇక్కడ ఎముకతో చేసిన సూది కూడా లభ్యమయ్యింది.

దక్షిణ భారతదేశం (క్రీ.పూ.2000)

దక్షిణ భారతదేశంలో వ్యవసాయం లేదా నవీన శిలాయుగము క్రీ.పూ.2000లో ప్రారంభమయింది. ఇక్కడి ప్రజలు రాగులు, ఉలువలను పండించారు.

Note: దక్షిణ భారతదేశంలోని నవీన శిలాయుగ ప్రజలు సింధునాగరికత ప్రజలకు సమకాలీకులు మరియు వారితో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నారు.

దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన నవీన శిలాయుగ ప్రాంతాలు:

కర్ణాటక: సంగనకల్లు, పిక్లిహాల్‌, బ్రహ్మగిరి, మస్కి, టెక్కలకోట తెక్కెలకోట

ఆంధ్రప్రదేశ్‌: నాగార్జునకొండ, పాలవాయి

తెలంగాణ: ఉట్నూరు

తమిళనాడు: పియాంపల్లి

ఈశాన్య భారతదేశం (క్రీ.పూ.1000)

ఈశాన్య భారతదేశంలో వ్యవసాయము లేదా నవీన శిలాయగము ఆలస్యంగా క్రీ.పూ.1000లో ప్రారంభమయ్యింది. బ్రహ్మపుత్ర లోయ పరీవాహక ప్రాంతాల్లో వర్షపాతము అధికంగా ఉండి దట్టమైన అడవులు ఉండటము వలన భూములను చదునుచేయడం కష్టతరమై వ్యవసాయం ఆలస్యంగా ప్రారంభమయ్యింది. అస్సాం మరియు మేఘాలయలోని గారో కొండల్లో నవీన శిలాయుగ ప్రాంతాలను కనుగొన్నారు. దావోజలిహదింగ్‌ మరియు మెహర్‌ల్యాండ్‌ వీటిలో ముఖ్యమైనవి.

 తామ్ర శిలాయుగ సంస్కృతి (క్రీ.పూ.3000 – 700)

శిలాయుగం నుండి లోహయుగానికి మారడానికి మానవుడికి లక్షల సంవత్సరాలు పట్టింది.

తామ్ర శిలాయుగంలోని మానవుడు శిలాపనిముట్లను మరియు రాగి పనిముట్లను రెండింటిని ఉపయోగించాడు.

Note: మానవుడు ఉపయోగించిన తొలి లోహము రాగి. సాంకేతిక పరిభాషలో రాగిని Chalco అని అంటారు.

భారత్‌లో తామ్ర శిలాయుగంలో వర్థిల్లిన మహోన్నత నాగరికత హరప్పా నాగరికత. దీని తరువాత హరప్పానంతర సంస్కృతులు (Late Harappan Cultures) కొనసాగాయి. ఇవి సుమారుగా క్రీ.పూ.2000 నుంచి క్రీ.పూ.500 వరకు కొనసాగాయి. ఈ హరప్పానంతర సంస్కృతుల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకొనుటకు, ఆయా సంస్కృతుల ప్రజలు ఉపయోగించిన రాగి వస్తువులు, కుండలు చాలా ఉపయోగపడతాయి.

భారతదేశంలో తామ్ర శిలాయుగానికి చెందిన ముఖ్య సంస్కృతులు మరియు ప్రదేశాలు:

(ఫురావస్తుశాస్త్ర సాంప్రదాయము ప్రకారము ఒక సంస్కృతి లేదా నాగరికతలో బయలప్పడిన తొలి ప్రదేశమును ‘Type site’ అంటారు. ఆ type site పేరునే ఆ సంస్కృతికి లేదా నాగరికతకు ఇవ్వడము జరుగుతుంది).

అహార్‌ సంస్కృతి (క్రీ.పూ.2100-1500)

రాజస్థాన్‌లోని ఆహార్‌ అనే ప్రాంతంలో మొట్టమొదటిగా ఈ సంస్కృతి అవశేషాలు లభించాయి. రాజస్థాన్‌లోని ఖేత్రి ప్రాంతంలోని రాగి నిక్షేపాలను ఈ కాలం నాటి ప్రజలు ఉపయోగించారు. ఈ సంస్కృతిలో ‘గిలుండ్‌’ ఒక ముఖ్యమైన ప్రాంతం. గిలుండ్‌ ప్రజలు కాల్చిన ఇటుకలు మరియు రాళ్ళతో ఇళ్ళను నిర్మించుకున్నారు. తాంబవతి, బాలాథాల్‌ ఈ సంస్కృతిలోని ఇతర ప్రాంతాలు.

మాల్వా సంస్కృతి (క్రీ.పూ.1700-1200)

మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతంలో ఈ సంస్కృతి బయల్పడింది. కాయత, నవదతోలి, మాహేశ్వర, ఎరాన్‌ ముఖ్యమైన ప్రాంతాలు. ఈ సంస్కృతికి సంబంధించిన ధన్వాడలో లింగము, ఎద్దును పూజించడము మరియు యజ్ఞయాగాలకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి.

జోర్వే సంస్కృతి (క్రీ.పూ.1400-700)

మహారాష్ట్రలోని జోర్వే ఈ సంస్కృతిలో బయల్పడిన తొలి ప్రదేశము. మహారాష్ట్రలో ఈ సంస్కృతికి సంబంధించిన 200 ప్రదేశాలు కనుగొన్నారు. అందులో జోర్వే, ఇనాంగావ్‌, ఛాందోలి, దైమాబాద్‌ ముఖ్యమైనవి.

OCP సంస్కృతి (క్రీపూ.2000-1500)

గంగా-యమున అంతర్వేది ప్రాంతంలోని తామ శిలాయుగ ప్రజలు Ochre colored Pottery (OCP) అనే ప్రత్యేక కుండ పాత్రలను ఉపయోగించారు. ఈ సంస్కృతికి చెందిన ప్రదేశాల్లో OCPతో పాటుగా భారీ సంఖ్యలో రాగి పనిముట్లు లభించాయి. అందుకే OCP సంస్కృతిని Copper Hoard Culture అని కూడా అంటారు. గుంగెరియ (మధ్యప్రదేశ్‌) హస్తినాపూర్‌ (ఉత్తరప్రదేశ్‌) మొదలైనవి సంస్కృతికి చెందిన ముఖ్యమైన ప్రాంతాలు.

చారిత్రక పూర్వయుగ చిత్రలేఖనము (Pre-Historic Rock Paintings)

శిలాయుగాలకు చెందిన మానవుడు వేసిన చిత్రాలు భారతదేశంలో అనేక చోట్ల బయల్పడ్డాయి. అందులో భీంబెట్క (మధ్యప్రదేశ్‌) అత్యంత ముఖ్యమైనది. ఇది UNESCO ద్వారా ప్రపంచ వారసత్వ కేంద్రముగా (World Heritage Site) గుర్తింపు పొందింది.

bhimbetka rock cut paintings
Bhimbetka rock cut paintings

భీంబెట్కలో ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం మరియు తామ్రశిలాయుగానికి చెందిన చిత్రాలు ఉన్నాయి. వీటిలో మధ్యశిలాయుగానికి చెందిన చిత్రాలు అధికము.

భీంబెట్క గుహలను 1957-58 లో V.S.వాకంకార్‌ అనే పురావస్తు శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఇక్కడ లభ్యమైన చిత్రలేఖనములో తొలి చిత్రాలు క్రీ.పూ.10,000 కాలం నాటివి. ఈ చిత్రలేఖనములు ఆ కాలం నాటి మానవుని సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవనానికి అద్దం పడతాయి. లిపి లేని ఈ కాలాన్ని అధ్యయనము చెయ్యడానికి ఇవి అత్యంత ముఖ్యమైన ఆధారములు. # Pre-Historic Cultures #

భీంబెట్క గుహలలో అనేక రకాల జంతువులతో పాటు, వాటిని వేటాడే మనుషుల దృశ్యాలు చిత్రీకరించబడ్డాయి. ఏనుగులు, పులులు, చిరుతలు, ఖడ్గమృగాలు, జింకలు, అడవి బర్రెలు, అడవి పందులతో పాటు అనేక రకాల పక్షులు, చేపలను శిలలపై అత్యద్భుతంగా చిత్రీకరించారు. మనుషులు జంతువులను మరియు జంతువులు మనుషులను తరుముతున్న దృశ్యాలు కూడా కనిపిస్తాయి. ఒక గుహలో అడవి పంది ఒక వ్యక్తిని చంపుతున్న దృశ్యముంది. దీనిని బట్టి ఆనాటి మానవుడు ఆహార సేకరణ కోసం ఎంతగా శ్రమించాడో తెలుస్తుంది. జంతువులను వేటాడటానికి విల్లు, బాణం, ఈటెలు మరియు కత్తులు ఉపయోగించారని ఈ చిత్రాల ద్వారా తెలుస్తుంది. తామ్ర శిలాయుగానికి చెందిన ఒక చిత్రంలో గుర్రాలను అధిరోహించి వేటాడే పురుషుల దృశ్యాలున్నాయి. అలాగే మహిళలు నృత్యం చేస్తున్న చిత్రాలు; తేనెను సేకరించే దృశ్యాలు కూడా అత్యంత సుందరంగా చిత్రీకరించబడ్డాయి. రకరకాల రంగురాళ్ళను సేకరించి వాటిని పొడిగా మార్చి రంగులను తయారు చేసుకునేవారు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఈ రంగులు చెక్కుచెదరకుండా కొనసాగుతుండడం విశేషం.

చారిత్రక పూర్వయుగానికి చెందిన చిత్రలేఖనము భీంబెట్కతో పాటు యావత్‌ భారతదేశంలో కనిపిస్తుంది. కర్ణాటకలోని కుప్గల్‌, పిక్లిహాల్‌, టెక్కలకోటలో కూడా ప్రాచీన చిత్రాలు బయల్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా అనేక ప్రాంతాల్లో శిలాయుగానికి చెందిన చిత్రలేఖనములను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ఇనుప యుగం (Iron Age)

భారతదేశంలో ఇనుప యుగం సుమారుగా క్రీ.పూ.1000 నుంచి ప్రారంభం అయ్యింది. ఆర్యులే మొదటిసారిగా భారత్‌లో ఇనుము లోహమును వాడారు.

Note: ఇనుప యుగ నాగరికతా, సంస్కృతులకు వేద సంస్కృతి చక్కని ఉదాహరణ.

1946లో భారత్‌లో తొలిసారిగా ఇనుప యుగ సంస్కృతికి సంబంధించిన స్థావరం (Site) బయల్పడింది. అదే అహిచ్ఛత్రము. ఇక్కడ బయల్పడిన సంస్కృతినే Painted Gray Ware Pottery (PGW) సంస్కృతి అంటారు.

మెగాలిత్‌ సంస్కృతులు (Megalithic Culture)

దక్షిణ భారతదేశంలో తామ్రశిలాయుగ సంస్కృతుల తరువాత మెగాలితిక్‌ సంస్కృతి వర్ధిల్లించింది. స్థానికంగా ఈ మెగాలిత్‌లను ‘రాక్షస గుళ్లు’ అంటారు. వాస్తవానికి ఇవి పెద్ద రాళ్లు. అందుకే ఈ మెగాలిత్‌ సంస్కృతిని ‘బృహత్‌శిలా యుగం’ అని కూడా అంటారు.

దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిగా వరిని పండించింది ఈ మెగాలిత్‌ ప్రజలే. వీరు 12 రకాల మెగాలిత్‌లను నిర్మించారు. వాటిలో డాల్మెన్‌, సిస్త్‌ మొదలైనవి కలవు.

ఇనుప యుగానికి సంబంధించి బయల్పడిన మొదటి స్థావరాలు: కర్ణాటకలోని పిక్లిహాల్‌, హల్లూరు.

చారిత్రక పూర్వయుగ సంస్కృతులపై భౌగోళిక అంశాల ప్రభావం

ఒక దేశ చరిత్ర, సంస్కృతిపైన ఆ దేశ భౌగోళిక పరిస్థితుల ప్రభావం కచ్చితంగా ఉంటుంది. నదులు, పర్వతాలు, ఎడారులు, సముద్రాలు, వర్షపాతము, అడవులు శీతోష్ణస్థితి, నేలలు, మొదలైన భౌగోళిక అంశాలు, ఒక దేశ చరిత్ర మరియు సంస్కృతులను నిర్దేశిస్తాయి. దీనినే geographical determinism అంటారు. ఒక నాగరికత ఆవిర్భావము మరియు అంతము లేదా ఒక రాజ్య ఆవిర్భావము మరియు దాని అంతమును కూడా ఆ దేశ భౌగోళిక పరిస్థితులే నిర్ణయిస్తాయి.

భారతదేశంలోని చారిత్రక పూర్వయుగానికి చెందిన శిలాయుగ సంస్మ్మృతులపైన కూడా

భౌగోళిక అంశాల ప్రభావము స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాచీన శిలాయుగ మానవుడు మంచుయుగంలో జీవించడము వలన పశుపోషణ కానీ, వ్యవసాయం కానీ సాధ్యపడలేదు. ఆనాటి మానవుడు జంతువులను వేటాడుతూ, నిరంతర సంచార జీవితాన్ని గడపాల్సి వచ్చింది. క్రీ.పూ.10,000 తర్వాత మంచుయుగం అంతం కావడంతో భూగోళం వేడెక్కి అతి శీతల పరిస్థితులు అంతమై, జీవజాలం మరియు వృక్షజాలం

అభివృద్ధి చెందడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫలితంగా మధ్య శిలాయుగ మానవుడు పశుపోషణను మరియు నవీన శిలాయుగ మానవుడు వ్యవసాయమును ఆరంభించగలిగారు. భారతదేశంలో పశ్చిమ ప్రాంతములో వ్యవసాయము త్వరగాను, తూర్పు ప్రాంతాల్లో ఆలస్యంగాను ప్రారంభం కావడాన్ని మనం గమనించవచ్చు. సింధు లోయలో క్రీ.పూ.7000లో, గంగా మైదానంలో క్రీ.పూ.5000లో, బ్రహ్మపుత్ర లోయలో క్రీ.పూ.1000 లో వ్యవసాయం ప్రారంభమయింది. ఫలితంగా నవీన శిలాయుగ సంస్కృతులు తూర్పు ప్రాంతాల్లో చాలా ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. భౌగోళిక అంశాలైన వర్షపాతము మరియు అడవులే దీనికి ప్రధాన కారణం. సింధులోయతో పోలిస్తే గంగా మైదాన ప్రాంతాల్లో అధిక వర్షపాతము మరియు దట్టమైన అడవులు కనిపిస్తాయి. బ్రహ్మపుత్ర లోయలో ప్రపంచములోనే అధిక వర్షపాతము నమోదు కావడం వలన అడవులు మరింత దట్టంగా ఉంటాయి. సాధారణంగా దట్టమైన అడవులను నరికి వ్యవసాయం చేపట్టడము క్లిష్టమైన పని కనుక వ్యవసాయము సహజంగానే ఆలస్యమవుతుంది.

కాశ్మీర్‌లోని బూర్జహాంలో నవీన శిలాయుగ ప్రజలు భూమిలో గుంతలను త్రవ్వి అందులో నివసించారు. వీటినే Pit dwellings అంటారు. హిమాలయ ప్రాంతంలోని తీవ్రమైన చలి నుండి కాపాడుకోవటానికి అక్కడి ప్రజలు ఇటువంటి ప్రత్యేక ఇళ్ళ నిర్మాణాన్ని చేపట్టారు. రాజస్థాన్‌లోని ఖేత్రి గనుల్లో రాగి నిక్షేపాలుండుట వలన, ఆ ప్రాంతంలో ఎక్కువగా తామ్ర శిలాయుగ సంస్కృతులు విరాజిల్లాయి. దీనిని బట్టి ప్రజల జీవన విధానము, ఆహార ఉత్పత్తి, నివాస గృహాలు, ఆవాసాలు మొదలైనవి భౌగోళిక అంశాలపైన ఆధారపడి ఉంటాయనే విషయము స్పష్టమవుతోంది.

Read This: ఆర్య నాగరికత

Read This: చరిత్ర అధ్యయనం – ఆధారాలు

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?