మౌర్యానంతర యుగంలో కొనసాగిన ఆర్థికాభివృద్ధి, మతరంగంలో సంభవించిన మార్పుల కారణంగా వాస్తు శిల్పకళారంగంలో అత్యద్భుతమైన ప్రగతి కనిపిస్తుంది. ఈ కాలంలో ప్రధానంగా గాంధార శిల్పకళ, మధుర శిల్పకళ మరియు అమరావతి శిల్పకళ అనే మూడు విభిన్నమైన కళా రీతులు ప్రారంభమయ్యాయి.
I. గాంధార శిల్పకళ
గాంధార శిల్పకళ వాయువ్య భారతదేశంలో వికసించింది. ఇండో-గ్రీకుల కాలంలో ప్రారంభమై కుషాణుల ఆదరణలో ఉచ్ఛస్థితికి చేరుకుంది. గాంధార ప్రాంతంలోని పుష్కలావతి మరియు తక్షశిల ఈ శిల్పకళకు ప్రధాన కేంద్రాలుగా మారాయి. గాంధార శిల్పకళ ప్రధాన లక్షణాలు :
- గాంధార శిల్పకళ మిశ్రమ శైలితో కూడిన శిల్పకళ. భారత సాంప్రదాయాలు మరియు గ్రీకు సాంప్రదాయాల కలయికతో ఆవిర్భవించింది. దీనిని ఇండో-గ్రీకు శిల్పకళ అని కూడా అనవచ్చు.
- గాంధార శిల్పకళ పూర్తిగా బౌద్ధమతానికి చెందిన శిల్పకళ. గాంధార శిల్పులు బుద్ధుడు మరియు బోధి సత్వ విగ్రహాలను మాత్రమే తయారుచేశారు. ఇతర మతాల విగ్రహాలు ఇందులో కనిపించవు.
- గాంధార శిల్పులు తాము చెక్కిన శిల్పాల్లో శారీరక సౌందర్యానికి ప్రాధాన్యతను ఇచ్చి ఆధ్యాత్మికతను మరిచారు. పొడవాటి రింగుల జుత్తు, పెద్ద మడతలతో కూడిన దుస్తులు, బలమైన కండలు, అందమైన శరీరంతో బుద్ధుని శిల్పాలను చెక్కారు. ఈ శిల్పాల్లో ఆధ్యాత్మికత కనిపించదు.
- గాంధార శిల్పులు ఎక్కువగా నల్లటిరాయిని (black stone) ఉపయోగించారు.
గాంధార శిల్పులు బమియాన్ (ఆఫ్ఘనిస్తాన్)లో నిర్మించిన బుద్ధుని శిల్పాలు ప్రపంచంలోనే అత్యంత పెద్దవి. ఇందులో 175 అడుగుల బుద్ధుని శిల్పం అత్యంత సుప్రసిద్ధమైనది. UNESCO దీనిని ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది. 2001లో తాలిబన్లు ఈ శిల్పాలను ధ్వంసం చేశారు. పెషావర్ (పాకిస్తాన్) సమీపంలోని షాజి-కి-ధేరి వద్ద కనిష్కుడు నిర్మించిన స్తూపము బుద్ధుడితో పాటు ఇంద్ర, బ్రహ్మ శిల్పాలు బయల్పడ్డాయి.
II.మధుర శిల్పకళ
గంగా-యమున మైదాన ప్రాంతంలో మధుర కేంద్రంగా ఈ శిల్పకళ అభివృద్ధి చెందింది. శకుల ఆదరణలో ప్రారంభమైన మధుర శిల్పకళ కుషాణుల కాలంలో అత్యున్నత శిఖరాలకు చేరుకొంది. గాంధార మరియు మధుర శిల్పకళలు రెండూ కుషాణుల ఆదరణలో అభివృద్ధి చెందినప్పటికీ ఇవి పూర్తిగా భిన్నమైనవి.
- గాంధార శిల్పకళపైన గ్రీకు ప్రభావము ఎక్కువగా ఉంటే, మధుర శిల్పకళ పూర్తిగా స్వదేశీయమైనది. దీనిపైన ఏ రకమైన విదేశీ ప్రభావము ఉండదు.
- గాంధార శిల్పకళ కేవలము మహాయాన బౌద్ధమతానికి మాత్రమే పరిమితమైతే, మధుర శిల్పులు అన్ని మతాల దేవుళ్ళ విగ్రహాలను రూపొందించారు. మధుర శిల్పకళలో నగ్న తీర్థంకరుల విగ్రహాలు, బుద్ధ మరియు బోధిసత్వ విగ్రహాలు, త్రిమూర్తులు మరియు వారి భార్యలు, అర్ధదేవతల విగ్రహాలు తయారు చేయబడ్డాయి. వీటితోపాటుగా అనేక లౌకిక విగ్రహాలు కూడా తయారుచేశారు. మధుర ప్రాంతంలో లభించిన తలలేని కనిష్కుని విగ్రహము మధుర శిల్పకళ నైపుణ్యానికి తార్కాణం.
- గాంధార శిల్పులు శారీరక సౌందర్యానికి ప్రాధాన్యత కల్పిస్తే, మధుర శిల్పులు ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతనిచ్చారు.
- మధుర శిల్పకళలో ప్రధానంగా ఎర్రని ఇసుక రాయిని వాడారు.
III. అమరావతి శిల్పకళ
మౌర్యుల అనంతర యుగంలో కృష్ణా – గోదావరి దిగువ లోయల్లో అమరావతి కేంద్రంగా, ఈ శిల్పకళ ఆవిర్భవించింది. ప్రాచీన కాలంలో ధాన్యకటకంగా పిలవబడే అమరావతి నగరము గుంటూరు జిల్లాలో కృష్ణానది ఒడ్డున ఉంటుంది. శాతవాహనులు మరియు వారి వారసులైన ఇక్ష్వాకుల ఆదరణలో అమరావతి శిల్పకళ అభివృద్ధి చెందింది.
- బుద్ధుని జీవిత విశేషాలను చెక్కిన పాలరాతి లేదా సున్నపురాయి పలకలు అమరావతి శిల్పుల నైపుణ్యాన్ని తెలియజేస్తున్నాయి. ఈ పలకలను ఆయకపతములు అంటారు. క్రీ.శ.రెండవ శతాబ్దము కంటే ముందు (మహాయానం ఆవిర్భవించక ముందు) శిల్పకళలో బుద్ధునికి మానవరూపం ఇవ్వబడలేదు. పద్మము, రౌతు లేని గుర్రము, స్థూపము, బోధివృక్షము, ఖాళీ సింహాసనము, చెప్పులు, గొడుగు లాంటి గుర్తులతో గౌతమబుద్ధుడిని చూపించడం జరిగింది.
- అమరావతి శిల్పులు చెక్కిన బుద్ధ మరియు బోధిసత్వ విగ్రహాలు అమరావతి, జగ్గయ్యపేట, భట్టిప్రోలు, నాగార్జునకొండ మొదలైన ప్రాంతాల్లో లభించాయి.
- అమరావతిలో నిర్మించిన భారీ స్థూపం అమరావతి శిల్పుల పనితనాన్ని తెలియజేస్తుంది. అయితే దురదృష్టవశాత్తు క్రీ.శ.14వ శతాబ్దంలో ఈ స్థూపము కూలిపోయింది.