మౌర్యుల రాజకీయ చరిత్ర
చంద్రగుప్త మౌర్యుడు (క్రీ.పూ.321 – 297)
చంద్రగుప్త మౌర్యుడు వాయువ్య భారతదేశంపై దండెత్తి అలెగ్జాండర్ నియమించిన గవర్నర్లను అంతం చేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంతో సెల్యూకస్ నికేటర్‌తో ఘర్షణ ప్రారంభమైంది. సెల్యూకస్ నికెటర్‌ను ఓడించి చంద్రగుప్తమౌర్యుడు అతని కుమార్తె హెలెనాను వివాహము చేసుకొన్నాడు. వారిద్దరి మధ్య జరిగిన సంధి ప్రకారం సెల్యూకస్ నికేటర్ పరోపనిసద్ (కాబుల్), అరకోసియ (కాందహార్), గెడ్రొసియ (బెలుచిస్థాన్) మరియు అరియ (హీరట్) లాంటి వాయువ్య ప్రాంతాలను చంద్రగుప్తుడికి ఇవ్వగా, చంద్రగుప్త మౌర్యుడు 500 ఏనుగులను సెల్యూకస్ నికెటర్‌కు ఇవ్వడము జరిగింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య స్నేహ సంబంధాలు మరియు దౌత్య సంబంధాలు ప్రారంభమయ్యాయి.
సెల్యూకస్ నికేటర్ తన రాయబారిగా మెగస్తనీస్‌ను చంద్రగుప్తమౌర్యుని ఆస్థానానికి పంపించాడు. మౌర్యులకు సెల్యుసిడ్ వంశస్థుల మధ్య స్నేహసంబంధాలు మరియు దౌత్య సంబంధాలు వారి వారసుల కాలంలో కూడా కొనసాగాయి.
హేమచంద్రుని పరిశిష్టపర్వన్ (జైన గ్రంథము) ప్రకారం చంద్రగుప్తమౌర్యుడు సామ్రాజ్యాన్ని తన కుమారుడైన బిందుసారుడికి అప్పగించి, దక్షిణ భారతదేశంలోని శ్రావణబెళగొళకు వెళ్ళి సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించాడు. #Political History of the Mauryas#
బిందుసారుడు (క్రీ.పూ.297 – 272)
- ఇతను అజీవిక మతాన్ని ఆదరించాడు.
- అమిత్రఘాత అనే బిరుదు వలన గ్రీకు గ్రంథాల్లో అమిట్రకేటస్ అని పిలువబడ్డాడు. జైన గ్రంథాల్లో ఇతను సింహసేనగా సుప్రసిద్ధుడు.
- 16వ శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన టిబెటన్ బౌద్ధ గురువు లామతారనాథ్ తాను వ్రాసిన “History of Tibet” అనే గ్రంథంలో బిందుసారుడు రెండు సముద్రాల మధ్య ఉన్న ప్రాంతాన్ని జయించాడని తెలియజేశాడు. దీని ప్రకారం దక్షిణ భారతదేశాన్ని బిందుసారుడు జయించి ఉండవచ్చు.
- ఇతని ఆస్థానంలో ఇద్దరు గ్రీకు రాయబారులు ఉండేవారు.
- డైమకస్ – ఇతనిని సిరియా పాలకుడైన అంటియొకస్-1 పంపించాడు.
- డయనోసియస్ – ఇతనిని ఈజిప్టు పాలకుడైన టాలమి ఫిలడెల్ఫస్ పంపించాడు.
- గ్రీకు చరిత్రకారుల ప్రకారం సిరియా పాలకుడైన ఆంటియొకస్-1 బిందుసారుని కోరిక మేరకు మత్తుపానీయాలు మరియు అత్తిపండ్లను (dry figs) పంపించాడు. అయితే గ్రీకు తత్వవేత్తను పంపించడానికి అంగీకరించలేదని తెలుస్తుంది.
- టిబెటన్ బౌద్ధ గ్రంథమైన దివ్యవదన ప్రకారం బిందుసారుని కాలంలో తక్షశిలలో తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటును అణచి వెయ్యడానికి ఉజ్జయినికి గవర్నర్‌గా పనిచేస్తున్న తన కుమారుడు అశోకుడిని పంపించాడు. అశోకుడు తక్షశిల తిరుగుబాటును సమర్థవంతంగా అణిచివేశాడని దివ్యవదన తెలియజేస్తుంది.
అశోకుడు (క్రీ.పూ.268 – 232)
- బిందుసారుని మరణం తర్వాత నాలుగేళ్ళు వారసత్వ యుద్ధము కొనసాగింది. ఈ వారసత్వ యుద్ధంలో అశోకుడు తన సోదరులందరినీ చంపి రాజ్యానికి వచ్చాడని శ్రీలంక బౌద్ధ గ్రంథమైన మహావంశ తెలియజేస్తుంది.
- అశోకుడికి అనేక మంది భార్యలు ఉన్నట్లుగా సాహిత్యం మరియు శాసనాల ద్వారా తెలుస్తుంది. వీరు:
- అసంధి మిత్ర – ఈమె పట్టమహిషి
- తిస్పరక్షిత – ఈమె బౌద్ధమత వ్యతిరేకి. గయలోని బోధి వృక్షాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది.
- పద్మావతి – అశోకుడి వారసుడైన కునాలకు తల్లి
- విదీశ మహాదేవి – శ్రీలంకలో బౌద్ధమతాన్ని ప్రచారం చేసిన మహేంద్ర మరియు సంఘమిత్రలకు తల్లి
- కౌరువాకి – అలహాబాద్ శాసనంలో కౌరువకి మరియు ఆమె కుమారుడు తివార గురించి ప్రస్తావన ఉంది. అశోకుని శాసనాల్లో కౌరువాకి మరియు తివార మినహా ఇతర కుటుంబ సభ్యుల ప్రస్తావన లేదు.
- కల్హణుడి రాజతరంగిణి ప్రకారం జలౌక అశోకుని కుమారుడు మరియు అతని తర్వాత చక్రవర్తి అయ్యాడు. అయితే పురాణాల్లో మరియు ఇతర ఆధారాల్లో ఇతని ప్రస్తావన లేదు.
- అశోకుని ఇంకొక కుమార్తె చారుమతి. ఈమె నేపాల్‌కు చెందిన దేవపాలను వివాహము చేసుకొని అక్కడే స్థిరపడింది.
- అశోకుని సుదీర్ఘ పాలన కాలంలో జరిగిన ఏకైక ప్రముఖ సంఘటన కళింగ యుద్ధం. అశోకుని 13వ ప్రధాన శిలాశాసనములో దీని వివరాలున్నాయి. అశోకుడు తన 8వ రాజ్య సంవత్సరములో అంటే క్రీ.పూ.261 లేదా క్రీ.పూ.260 కాలంలో కళింగతో యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో లక్షమందికిపైగా చనిపోగా, లక్షయాభైవేల మంది బానిసలుగా చిక్కారు. ఈ హింసతో కలత చెందిన అశోకుడు యుద్ధాలను త్యజించి ధర్మప్రచారాన్ని చేపట్టాడని ఈ శాసనం తెలియజేస్తుంది.
అశోకుని వారసులు
అశోకుని తర్వాత మౌర్యసామ్రాజ్యం బలహీన వారసులు రావడంతో 50 ఏళ్ళలోనే అంతమైంది. పురాణాల ప్రకారం అశోకుడు తన చివరి రోజుల్లో సామ్రాజ్యాన్ని రెండుగా విభజించి, తూర్పు రాజ్యాన్ని తన మనవడైన దశరథుడికి మరియు పశ్చిమ రాజ్యాన్ని తన కుమారుడైన కునాలకు ఇచ్చాడు.
దశరథుడు వేసిన నాగార్జుని గుహాలయ శాసనం (బీహార్) ప్రకారం ఇతను నాగార్జుని కొండల్లో మూడు గుహాలయాలను నిర్మించి అజీవికులకు కానుకగా ఇచ్చాడు.
కునాల కుమారుడైన సంప్రతి రాజ్యానికొచ్చి రెండు రాజ్యాలను ఏకం చేశాడు. ఇతను జైన మతాన్ని ఆచరించాడని ప్రస్తావనలున్నాయి. మౌర్య సామ్రాజ్యంలో చివరి వాడైన బృహద్రదుడిని అతని సేనాపతి పుష్యమిత్రశుంగ హత్య చెయ్యడంతో మౌర్య సామ్రాజ్యం అంతం అయింది. #Political History of the Mauryas#
అశోకుని ధమ్మ
అశోకుడు కళింగ యుద్ధానంతరము శాశ్వతంగా యుద్ధాలకు స్వస్తి పలికి, అత్యున్నతమైన నైతిక విలువలతో కూడిన ధమ్మ (సంస్కృతంలో ధర్మ)ను రూపొందించి, శేష జీవితాన్ని ధమ్మ ప్రచారానికి అంకితం చేశాడు. శాసనాల్లో తాను భేరిఘోషను వీడి ధమ్మఘోషను మరియు విహారయాత్రలను వీడి ధమ్మయాత్రలను చేపట్టానని స్పష్టంగా తెలియజేశాడు. ఈ ధమ్మమే అశోకుడిని ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన చక్రవర్తిగా నిలబెట్టింది. తన రాజ్యంలో ప్రజలు సుఖసంతోషాలతో పాటు నైతిక విలువలతో జీవించాలని భావించాడు.
తన శాసనాల్లో అశోకుడు అస్పష్టంగానే ధమ్మని నిర్వచించాడు. పదవ ప్రధాన శిలాశాసనంలో చెడు నుండి విముక్తి పొందడమే ధమ్మ అని తెలియజేశాడు. అదేవిధంగా రెండవ స్తంభ శాసనంలో చెడును తగ్గించి మంచిని పెంచడము ధమ్మ అని పేర్కొన్నాడు. ధమ్మలోని ప్రధాన సూత్రాలను పరిశీలిస్తే ఇది ఒక నైతిక ప్రవర్తన నియమావళి (code of conduct) అని, ఏ మతానికీ చెందని విశ్వజనీన సిద్ధాంతమని స్పష్టంగా తెలుస్తుంది.
ఆనాటి సమాజంలోని అశాంతిని, వివిధ మతాల మధ్య నెలకొన్న ఘర్షణలను నివారించి శాంతియుత సహజీవనం కోసం అశోకుడు ధమ్మను రూపొందించాడని చెప్పవచ్చు. భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి ధమ్మ ఒక వినూత్న ప్రయోగమని తెలుస్తుంది. అనేక జాతులు, కులాలు, వర్గాలు మరియు మతాలతో కూడిన భారత సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు అశోకుని ధమ్మ ఒక పరిష్కార మార్గాన్ని చూపించింది.
ధమ్మలోని ప్రధాన సూత్రాలు
అశోకుడు తన శాసనాల్లో ధమ్మ యొక్క ప్రధాన సూత్రాలను తెలియజేశాడు. కుటుంబంలో మరియు సమాజంలో ఒక వ్యక్తి యొక్క నడవడిక మరియు మానవ సంబంధాలను ధమ్మ తెలియజేస్తుంది. పన్నెండవ ప్రధాన శిలాశాసనంలో ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను మరియు పెద్దలను గౌరవించాలని, అన్ని జీవుల పట్ల దయను కలిగి అహింస విధానాన్ని చేపట్టాలని తెలియజేశాడు. తొమ్మిదవ శిలాశాసనంలో యజ్ఞయాగాలు మూర్ఖత్వానికి నిదర్శనమని వాటిని విడనాడాలని ప్రజలను కోరాడు.
ఒకటవ శిలాశాసనంలో జంతుబలులను నిషేధిస్తున్నట్లు ప్రకటించి తాను కూడా వంటశాలలో మాంసాహారము కోసం జంతువులను వధించడాన్ని నియంత్రించినట్లుగా తెలియజేశాడు. బహుశ ప్రపంచములోనే శాఖాహారాన్ని ప్రచారం చేసిన తొలి చక్రవర్తి అశోకుడే కావచ్చు.
సమాజంలోని అందరితో (ముఖ్యంగా బంధువులతో, స్నేహితులతో, ఇరుగుపొరుగువారితో) సత్సంబంధాలను కొనసాగించాలని తన పదకొండవ శిలాశాసనంలో తెలియజేశాడు. సమాజంలోని అన్ని మతాలకు సంబంధించిన సన్యాసులను బ్రాహ్మణులైనా లేదా శ్రమణులైనా గౌరవించాలని తన మూడవ శిలాశాసనంలో తెలియజేశాడు. బానిసలపట్ల దయతో వ్యవహరించాలని, దుర్గుణాలను వీడి సుగుణాలను అలవర్చుకోవాలని, ఇతర మతాల పట్ల సామరస్య భావాలు కలిగి ఉండాలని అశోకుని ధమ్మ కోరుతుంది. #Political History of the Mauryas#
ధమ్మ ప్రచారం
కళింగ యుద్ధము తర్వాత అశోకుడు తన శేష జీవితాన్ని ధర్మ ప్రచారం కోసం వినియోగించాడు. యుద్ధాలకు స్వస్తి పలికి ధమ్మఘోషను వినిపించాడు. విహారయాత్రలు మాని ధమ్మయాత్రలు చేపట్టాడు. తనతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా ధర్మ ప్రచారానికి వినియోగించాడు. శిలలపై శాసనాలను చెక్కించి ప్రజలకు ధమ్మను బోధించాడు.
ధమ్మలో భాగంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజలను ధమ్మ వైపు ఆకర్షింపజేశాడు. చివరగా ధమ్మమహామత్తర అనే ప్రత్యేక అధికారులను ప్రచార నిమిత్తం నియమించాడు. ముఖ్యమైన ధమ్మమహామత్తరలను మరియు వారు ప్రచారం చేసిన ప్రాంతాలను ఇవ్వడమైనది.
ధమ్మమహామత్తర పేరు | ప్రచారం చేసిన ప్రాంతము |
మజ్జిమ | హిమాలయ ప్రాంతము |
మజ్జౌతిక | కాశ్మీర్ మరియు గాంధార |
మహాదేవ | మహిశమండల (మైసూర్) |
రక్షిత | బనవాసి (కర్ణాటక) |
యోన ధర్మరక్షిత | అపరాంత (కొంకన్) |
మహాధర్మరక్షిత | మహారాష్ట్ర |
అశోకుని ధమ్మ – ప్రభావం
సమాజంలోని అశాంతిని, మతాల మధ్య ఉన్న పరస్పర ద్వేష భావాలను నిర్మూలించి, ప్రజలకు ఉన్నతమైన నైతిక విలువలను కల్పించాలనే బృహత్తర లక్ష్యాలతో అశోకుడు ప్రారంభించిన ధమ్మ ఎంత వరకు విజయాన్ని సాధించిందనే అంశముపైన చరిత్రకారుల మధ్య ఏకాభిప్రాయం లేదు.
అశోకుని ధమ్మ ప్రభావం వలన వేటగాళ్ళు మరియు మత్స్యకారులు జీవహింసతో కూడిన తమ వృత్తిని మానేసి వ్యవసాయాన్ని స్వీకరించారని కాందహార్‌లో లభించిన ద్విభాష శాసనము చెపుతుంది. దేశవ్యాప్తంగా దీని ప్రభావం ఇలాగే ఉందని చెప్పలేము.
కులాలు, మతాల ఆధారంగా విడిపోయి పరస్పర విద్వేషాలతో జీవించే భారతీయులకు ఇలాంటి గొప్ప సిద్ధాంతాలు మింగుడుపడవు. అందుకే ప్రజలు ధమ్మ వైపు పెద్దగా ఆకర్షితులు కాలేదు. అశోకుడి తర్వాత వచ్చిన వారసులు కూడా దీనిని పట్టించుకోకపోవడంతో, అశోకుడితో పాటు అతని ధమ్మ కూడా అంతమైంది.
అశోకుని ధమ్మ – బౌద్ధ ధమ్మ
అశోకుడు రూపొందించిన ధమ్మ మరియు బౌద్ధమతము యొక్క ధమ్మ మధ్య సంబంధాల గురించి చాలా కాలం నుండి పండితుల మధ్య చర్చ జరుగుతోంది. తన ధమ్మలో అశోకుడు వైదిక యజ్ఞయాగాలను మరియు జంతుబలులను ఖండించాడు.
బభ్రు శాసనంలో బౌద్ధమతం యందు తనకున్న విశ్వాసాన్ని అశోకుడు వ్యక్తపరిచాడు. బౌద్ధ సంఘాన్ని విచ్ఛిన్నము చేసే ప్రయత్నాలు చేస్తే తీవ్రంగా శిక్షిస్తానని బౌద్ధ వ్యతిరేకులకు హెచ్చరిక జారీ చేశాడు.
బౌద్ధమత ప్రచారం కోసం తన కుమారుడైన మహేంద్రను మరియు కుమార్తె సంఘమిత్రను శ్రీలంకకు పంపించాడని సింహళ బౌద్ధ గ్రంథాలు తెలుపుతున్నాయి. ఈ అంశాల ఆధారంగా బౌద్ధ ధమ్మము మరియు అశోకుని ధమ్మము రెండు ఒక్కటే అని కొంతమంది పండితులు వాదిస్తున్నారు.
అయితే ఆధునిక చరిత్రకారులు ఈ వాదనతో ఏకీభవించడము లేదు. అశోకుని ధమ్మను విమర్శనాత్మకంగా పరిశీలించి, ఇది ఏ మతానికీ సంబంధము లేని లౌకిక మరియు విశ్వజనీన సిద్ధాంతమని తేల్చిచెప్పారు. అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించినప్పటికీ, తన మతాన్ని ధమ్మతో ఏనాడూ కలపలేదని తెలుస్తుంది. ఈ వాదనను ఈ క్రింది అంశాల ద్వారా సమర్థించవచ్చు.
- అశోకుడు కళింగ యుద్ధము జరిగిన తర్వాత అంటే తన ఎనిమిదవ రాజ్య సంవత్సరంలోనే ధమ్మను ప్రవేశపెట్టాడని తెలుస్తుంది. అయితే తాను బౌద్ధమతాన్ని స్వీకరించినట్లుగా చెప్పే బభ్రు శాసనము మాత్రము తన 21 ½ రాజ్య సంవత్సరంలో వేశాడు. అంటే ధమ్మను ప్రవేశపెట్టిన అనేక సంవత్సరాల తర్వాత అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించాడని తెలిస్తుంది.
- ధమ్మను పాటిస్తే స్వర్గప్రాప్తి కలుగుతుందని అశోకుడు ప్రచారం చేశాడు. బౌద్ధమతంలో స్వర్గం మరియు నరకము అనే భావనలు లేవు. (నోట్: తరువాత కాలంలో వచ్చిన మహాయానమతం బౌద్ధంలో ఈ స్వర్గం మరియు నరకం అనే భావనలను ప్రవేశపెట్టింది).
- అశోకుడు తన ధమ్మలో ఎక్కడా బౌద్ధ సిద్ధాంతాలైన ఆర్య సత్యాలను కానీ, అష్టాంగ మార్గాలను కాని ప్రస్తావించలేదు.
- ధమ్మను ప్రచారం చెయ్యడానికి వేసిన శాసనాల్లో అశోకుడు తన పేరును కాకుండా దేవానాంపియ మరియు పియదస్సి మహారాజ అనే బిరుదాలను ఉపయోగించాడు. దేవానాంపియ అనగా దేవతలకు ప్రియమైనవాడు అని అర్థం. అయితే బౌద్ధమతము దేవతలను పూర్తిగా తిరస్కరిస్తుందనే విషయాన్ని మనం గమనించాలి.
- అశోకుడు ధమ్మ ప్రచారం కోసం ధమ్మమహామత్తర అనే అధికారులను నియమించాడే కాని బౌద్ధ భిక్షువుల సహకారాన్ని తీసుకోలేదు.
- ధమ్మలో శ్రామణులతో పాటు బ్రాహ్మణులను గౌరవించాలని సూచించడము జరిగింది. అయితే బౌద్ధమతం పూర్తిగా బ్రాహ్మణ వ్యతిరేక మతం.
- చివరిగా అశోకుడు ధమ్మకు చిహ్నంగా 24 ఆకులు కలిగిన ధర్మచక్రాన్ని రూపొందించాడు. ధర్మాన్ని అందరూ 24 గంటలు ఆచరించాలని దీని అర్థం. అయితే 8 ఆకులు కలిగిన ధర్మచక్రము బౌద్ధానికి చిహ్నంగా ఉంటుంది.
పై అంశాలను పరిశీలించిన తర్వాత అశోకుని ధమ్మము మరియు బౌద్ధ ధమ్మము భిన్నమైనవని తెలుస్తుంది. అశోకుని ధర్మము విశ్వజనీనమని, కాలాలకు, మతాలకు మరియు ప్రాంతాలకు అతీతమని అర్థమవుతుంది. #Political History of the Mauryas#
అశోకుని ధమ్మ – ఆవశ్యకత
క్రీ.పూ.3వ శతాబ్దంలో అశోకుడు ఆనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ధమ్మను రూపొందించాడు. అతనితో పాటు అతని ధమ్మ కూడా కాలగర్భంలో కలిసిపోయింది. ఆనాటి ధమ్మ నేటి భారతదేశానికి అవసరమా? అనే చర్చ పండితుల మధ్య కొనసాగుతోంది.
అశోకుని ధమ్మ భిన్న సంస్కృతులు, మతాలు మరియు కులాలతో కూడిన అనాటి భారత సమాజము యొక్క సమస్యలను పరిష్కరించి భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి ఉద్దేశించబడినది. ఇది కులం ఆధారంగా కొనసాగుతున్న సామాజిక అసమానతలు మరియు మతం ఆధారంగా కొనసాగుతున్న పరస్పర విద్వేషాలను రూపుమాపి శాంతియుత సహజీవనాన్ని బోధిస్తుంది. ప్రస్తుత భారతదేశానికి దీని ఆవశ్యకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అశోకుని ధమ్మ కుటుంబ మరియు సామాజిక సంబంధాలను నిర్వచిస్తుంది. కుటుంబ సభ్యులతో మరియు బంధుమిత్రులతో, ఇరుగుపొరుగువారితో ఏ రకమైన సత్సంబంధాలను కలిగి ఉండాలో తెలుపుతుంది. నేటి భారత సమాజంలో కుటుంబ మరియు సామాజిక సంబంధాలు బలహీనపడిన నేపథ్యంలో అశోకుని ధర్మము యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది.
నైతిక విలువలు దిగజారి హింసా ప్రవృత్తి మరియు పరమత ద్వేషము పెరిగిపోతున్న మన సమాజానికి అశోకుని ధమ్మము మాత్రమే పరిష్కారం కాగలదు. ఈ విషయాన్ని గుర్తించిన భారత ప్రభుత్వము అశోకుని ధమ్మానికి చిహ్నమైన 24 ఆకులు కలిగిన అశోకచక్రాన్ని జాతీయ చిహ్నములోను మరియు జాతీయ పతాకములోను స్వీకరించింది.
కాలాలకు, మతాలకు, వర్గాలకు మరియు ప్రాంతాలకు అతీతంగా ఆచరించదగిన అశోకుని ధమ్మము విశ్వజనీనమైనది. ఆనాటి సమాజం కంటే నేటి సమాజానికే దీని ఆవశ్యకత ఎక్కువగా ఉండని ఖచ్చితంగా చెప్పవచ్చు.