భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్ర

మగధ చక్రవర్తులు భారతదేశంలోని ఇతర జనపదాలను  జయిస్తున్న కాలంలో వాయువ్య భారతదేశంపై (గాంధార రాజ్యం) విదేశీ దాడులు జరిగి, క్రమంగా ఆ ప్రాంతం విదేశీ పాలనలోకి వెళ్ళిపోయింది. ముందుగా పర్షియన్లు, ఆ తరువాత గ్రీకులు గాంధార ప్రాంతాన్ని జయించి పాలించారు.

I. పర్షియన్/ ఇరానియన్‌ ఆక్రమణలు

క్రీ.పూ.6 మరియు క్రీ.పూ.5 శతాబ్దాల్లో ఇరాన్ పాలకులు వాయువ్య భారతదేశంపైకి దండెత్తి వచ్చారు. సైరస్ అనే ఇరాన్ చక్రవర్తి వాయువ్య భారతంలోని కొన్ని ప్రాంతాలు జయించగా, అతని మనవడైన డేరియస్-I మిగతా ప్రాంతాలను జయించాడు. భారతదేశ వాయువ్య భాభాగాలను జయించిన తొలి విదేశీయుడిగా సైరస్‌ను పేర్కొనవచ్చు. చరిత్ర పితామహుడైన హెరిడోటస్ (క్రీ.పూ.5వ శతాబ్దం) తన హిస్టరీస్ అనే గ్రీకు గ్రంథంలో వాయువ్య భారతదేశం పర్షియన్ సామ్రాజ్యంలో ఒక (సాత్రపి) రాష్ట్రంగా కొనసాగిందని పేర్కొన్నాడు. కనీసం రెండు శతాబ్దాలపాటు వాయువ్య భారతదేశంపైన పర్షియన్ల ఆధిపత్యం కొనసాగింది. పర్షియన్లు ‘సింధు’ అనే పదాన్ని ‘హిందూ’ అని పిలవడంతో మన దేశానికి హిందూదేశం అనే పేరు వచ్చింది.

II. గ్రీకుల ఆక్రమణలు (అలెగ్జాండర్ దండయాత్ర)

అలెగ్జాండర్ ది గ్రేట్ క్రీ.పూ. 334లో మాసిడోనియా రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. ఆయన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ శిష్యుడు. ప్రపంచ చరిత్రలోనే గొప్ప యోధునిగా, ప్రపంచ విజేతగా ప్రసిద్ధి పొందాడు.

భారతదేశంపై దండయాత్ర

  • క్రీ.పూ. 327లో అలెగ్జాండర్, తక్షశిల పాలకుడు అంభి (ఒంఫిస్) ఆహ్వానంతో కైబర్ కనుమల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించాడు.
  • సుమారు 19 నెలలపాటు (క్రీ.పూ. 327 – 325) నిరంతరం యుద్ధాలు చేసి వాయువ్య భారతదేశంలోని అనేక రాజ్యాలను జయించాడు.

హైడాస్పస్ (జీలం) యుద్ధం – క్రీ.పూ. 326
  • అలెగ్జాండర్ పోరస్ అనే రాజుతో జీలం నది తీరంలో యుద్ధం చేశాడు.

  • పోరస్ ఓడిపోయినా, అతని ధైర్యం, వీరత్వం చూసి అలెగ్జాండర్ ముగ్ధుడై, అతనికి తిరిగి రాజ్యాన్ని పాలించే అధికారం ఇచ్చాడు.

మగధపై దాడి చేయలేకపోవడం

  • అలెగ్జాండర్ బియాస్ నది దాటి మగధపై దండెత్తాలని అనుకున్నాడు.

  • కానీ అతని సైన్యం మగధ చక్రవర్తి ధననందుడి బలమైన సైన్యం (2 లక్షల సైనికులు ఉన్నారని గ్రీకు రచయితలు చెబుతారు) గురించి విని ముందుకు వెళ్ళడానికి నిరాకరించింది.

  • దీంతో అలెగ్జాండర్ వెనుదిరిగి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు.

అలెగ్జాండర్ మరణం

  • క్రీ.పూ. 323లో బాబిలోనియాలో (నేటి ఇరాక్‌లో బగ్దాద్ సమీపంలో) అలెగ్జాండర్ మరణించాడు.

  • అతని మరణం తర్వాత, అతని సేనాధిపతి సెల్యూకస్ నికేటర్ సెల్యూసిడ్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.

Leave a Comment

error: Content is protected !!