పల్లవులు (క్రీ.శ.6 – 9వ శతాబ్దము)
కంచి రాజధానిగా దక్షిణ భారతదేశాన్ని మూడు శతాబ్దములు అప్రతిహజంగా పాలించిన ఘనత పల్లవులకు దక్కుతుంది. ఈ వంశంలోని ముఖ్యమైన రాజులను క్లుప్తంగా చర్చించడమైనది. #Pallavas of Kanchipuram#
సింహవిష్ణు
- ఈ వంశ స్థాపకుడు. అవనిసింహ అనే బిరుదును స్వీకరించాడు. ఇతను వైష్ణవుడు.
మహేంద్రవర్మ – 1
- ఇతను తిరునవక్కరసు ప్రభావంతో జైనమతాన్ని వీడి శైవమతాన్ని స్వీకరించాడు. సంస్కృతంలో మత్తవిలాసప్రహసనము అనే హాస్యనాటికను రచించాడు.
- గుణభద్ర, మత్తవిలాస, విచిత్రచిత్ర, చిత్తకారపులి, శత్రుమల్ల అనే బిరుదులను తీసుకున్నాడు.
- క్రీ.శ.630లో పుల్లలూరు యుద్ధంలో పులకేశి-2 చేతిలో మరణించాడు.
నరసింహవర్మ – 1
- ఇతని కాలంలో హ్యూయాన్‌త్సాంగ్ కంచిని సందర్శించాడు.
- వాతాపికొండ మరియు మహామల్ల లేదా మహాబలి అనే బిరుదులను తీసుకున్నాడు.
- మహాబలిపురం లేదా మహామల్లపురము అనే కొత్త రాజధాని నగరాన్ని నిర్మించాడు.
- క్రీ.శ.642లో జరిగిన మణిమంగళ యుద్ధంలో పులకేశి-2ను అంతం చేశాడు.
మహేంద్రవర్మ – 2
- ఇతను కేవలం రెండేళ్ళు మాత్రమే పాలించాడు. బాదామి చాళుక్య రాజైన విక్రమాదిత్య-1 చేతిలో మరణించాడు.
నరసింహవర్మ – 2
- ఇతనికి రాజసింహ మరియు ఆగమప్రియ అనే బిరుదులున్నాయి.
- ద్వైపాక్షిక వ్యాపారాభివృద్ధి కొరకు చైనాకు దౌత్య బృందాన్ని పంపించాడు.
- ద్రావిడ శైలిలో ఆలయాల నిర్మాణము ఇతని కాలంలోనే ప్రారంభమయింది.
- ఇతను అనేక ఘటికలను నిర్మించాడు. దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాలకు అనుబంధంగా పనిచేసే వేదపాఠశాలలను ఘటికలు అంటారు.
నందివర్మ – 2
- ఇతను వైష్ణవుడు (పల్లవ వంశంలో సింహవిష్ణు మరియు నందివర్మ-2 మాత్రమే వైష్ణవ మతాన్ని స్వీకరించారు. మిగిలిన వారందరూ శైవమతస్థులు).
- ఇతను అశ్వమేధయాగము చేశాడు.
- గాంగ రాజైన శ్రీపురుషను ఓడించి ఉగ్రోదయ అనే వజ్రాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
అపరాజితవర్మ
- పల్లవుల్లో ఇతను చివరివాడు. తంజావూర్ సామంతుడైన ఆదిత్య చోళ ఇతన్ని అంతం చేసి చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
పల్లవుల కాలం నాటి సాహిత్యము
- పల్లవులు సంస్కృత సాహిత్యాన్ని ఆదరించారు. వీరి రాజభాష కూడా సంస్కృతమే. వీరి కాలంలో ఇద్దరు సుప్రసిద్ధ సంస్కృత కవులు ఉన్నారు. #Pallavas of Kanchipuram#
- దండి: నరసింహవర్మ-2 ఆస్థానంలో ఉన్నాడని చరిత్రకారుల అభిప్రాయం. ఇతను దశకుమార చరిత మరియు అవంతిసుందరికథాసార అనే కావ్యాలు రచించాడు.
- భారవి: నందివర్మ-2 ఆస్థానంలో ఉండేవాడు. కిరాతార్జునీయం అనే పౌరాణిక గ్రంథాన్ని రచించాడు.
- పల్లవుల కాలంలో తమిళ సాహిత్యము కూడా అభివృద్ధి చెందింది.
- పెరుందేవనార్ అనే కవి తమిళంలో మహాభారతాన్ని రచించాడు.
- తమిళ శైవమతాచార్యులైన 63 మంది నాయనార్లు తేవరం లేదా తిరుమురైను రచించారు. దీనిని ద్రావిడ వేదము అంటారు. ఇది నేటికీ తమిళ శైవులకు పవిత్ర గ్రంథము.
- తమిళ వైష్ణవ మతాచార్యులైన 12 మంది ఆళ్వారులు ప్రబంధము రచించారు. ఇది నేటికీ తమిళ వైష్ణవులకు ఆరాధ్య గ్రంథం.
పల్లవుల కాలం నాటి వాస్తు శిల్పకళలు
భారత వాస్తుశిల్పకళ చరిత్రలో పల్లవులు ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించారు. హిందూ దేవాలయ నిర్మాణంలో వీరు ప్రారంభించిన ద్రావిడ శైలి దక్షిణ భారతదేశంలో నేటికీ కొనసాగుతోంది. తొలి పల్లవ రాజులు కేవలం గుహాలయాలను మాత్రమే నిర్మించగా, చివరి రాజులు ద్రావిడ శైలిలో దేవాలయాల నిర్మాణము చేపట్టారు. #Pallavas of Kanchipuram#
మహేంద్ర వర్మ – 1 నిర్మించిన ఆలయాలు
ఇతను రెండు శైవ గుహాలయాలను నిర్మించాడు. మొదటి గుహాలయము భైరవకొండలోనూ, రెండవ గుహాలయం సిత్తనావసల్‌లో నిర్మించాడు. సిత్తనావసల్ గుహాలయము కుడ్యచిత్రాలతో (mural paintings) అలంకరించబడింది. వీటతో పాటుగా గుంటూరు జిల్లాలోని ఉండవల్లిలో (ఆంధ్రప్రదేశ్) అనంతశయనస్వామి గుహాలయాన్ని ఇతనే నిర్మించాడని కొంతమంది చరిత్రకారులు భావిస్తున్నారు. ఇది నాలుగు అంతస్థుల వైష్ణవ గుహాలయము.
నరసింహవర్మ-1 నిర్మించిన ఆలయాలు
ఇతని కాలంలో మహాబలిపురంలో ఆదివరాహ గుహాలయము, పంచపాండవ గుహాలయము మరియు దుర్గ గుహాలయములు నిర్మించబడ్డాయి. వీటితో పాటు ఐదు ఏకశిలా రథాలు (monolithic chariots) కూడా నిర్మించబడ్డాయి. వీటిని స్థానికులు పాండవరథాలు అని పిలుస్తారు.
నరసింహవర్మ – 2/ రాజసింహ నిర్మించిన ఆలయాలు
ఇతని కాలంలో ద్రావిడ శైలి ప్రారంభమయ్యింది. ఇతను నిర్మించిన రెండు ముఖ్యమైన ఆలయాలు:
తీర దేవాలయం:
మహాబలిపురంలో సముద్రతీరాన ఇది నిర్మించబడింది. ఈ ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడిన తొలి ఆలయంగా భావించబడుతుంది. అందుకే చరిత్రకారులు మహాబలిపురమును ద్రావిడశైలికి జన్మస్థలంగా గుర్తిస్తారు. ఇందులో శివుడు మరియు విష్ణువుకు గర్భగుడులున్నాయి. UNESCO మహాబలిపురమును ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది.
కైలాసనాథ ఆలయం:
కంచిలో నిర్మించబడిన కైలాసనాథ ఆలయము లేదా రాజసింహేశ్వర ఆలయము ప్రాచీన భారతదేశంలోనే అత్యంత గొప్ప ఆలయంగా గుర్తింపు పొందింది.
నందివర్మ-2 నిర్మించిన ఆలయాలు
ఇతను కంచిలో ముక్తేశ్వర ఆలయము, మాతంగేశ్వర ఆలయము మరియు వైకుంఠ పెరుమాళ్ ఆలయములను నిర్మించాడు. వీటితో పాటుగా చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం (ఆంధ్రప్రదేశ్)లో పరుశురామేశ్వర ఆలయాన్ని నిర్మించాడు.
పల్లవుల కాలం నాటి అత్యంత సుప్రసిద్ధమైన అర్జునుని తపస్సు శిల్పము లేదా గంగావతరణ శిల్పము మహాబలిపురంలో కలదు. ఇది భారతదేశంలోనే అత్యంత గొప్ప శిల్పంగా ప్రసిద్ధి. #Pallavas of Kanchipuram#