పుష్యభూతి రాజ్యము
మహారాజ పుష్యభూమి : ఇతనే పుష్యభూతి వంశ స్థాపకుడు. ఇతను గుప్తులకు సామంతుడిగా పాలించాడు.
ప్రభాకరవర్ధనుడు : ఇతను గుప్తుల నుండి స్వతంత్రాన్ని ప్రకటించుకొని మహారాజాధిరాజు అనే బిరుదును తీసుకున్నారు. తన కుమార్తె రాజ్యశ్రీని మౌఖరి వంశస్థుడైన గృహవర్మకు ఇచ్చి వివాహము చేశాడు.
రాజ్యవర్ధనుడు : ఇతను ప్రభాకరవర్ధనుడి జేష్ఠపుత్రుడు. ఇతని కాలంలో గౌడ శశాంకుడు (బెంగాల్) మరియు దేవగుప్తుడు (బీహార్) కలిసి మౌఖరి రాజ్యంపై దండెత్తి గృహవర్మను చంపి కనోజ్ను ఆక్రమించుకున్నారు. తన బావకు మద్దతుగా వెళ్లిన రాజ్యవర్ధనుడు కూడా యుద్ధంలో మరణించాడు.
హర్షవర్ధనుడు (క్రీ.శ.606 – 647) :
- ఇతను ప్రభాకరవర్ధనుడి రెండవ కుమారుడు. తన అన్న రాజ్యవర్ధనుని మరణానంతరం సింహాసనాన్ని అధిష్టించాడు.
- రాజపుత్ర, శీలాదిత్య అనే బిరుదులు తీసుకున్నాడు.
- గౌడ శశాంకుడి సైన్యాన్ని తరిమివేసి కనోజ్ను ఆక్రమించుకున్నాడు. తన రాజధానిని స్థానేశ్వర్ నుంచి కనోజ్కు మార్చాడు.
- బెంగాల్, బీహార్, అస్సాం, ఒడిషా మరియు గుజరాత్ రాజ్యాలను జయించి ఉత్తర భారతదేశంలో అత్యంత బలమైన రాజ్యాన్ని నిర్మించాడు. #Harshavardhana#
- దక్కన్ను పాలిస్తున్న బాదామి చాళుక్య రాజైన పులకేశి-2తో యుద్ధం చేసి ఓడిపోయాడు. పులకేశి-2 తన ఐహోలు శాసనంలో సకలోత్తరపథేశ్వరుడైన హర్షుడిని ఓడించానని చెప్పుకున్నాడు. ఈ ఇద్దరు చక్రవర్తుల మధ్య కుదిరిన సంధి ప్రకారం నర్మద నది ఇరు రాజ్యాలకు సరిహద్దుగా గుర్తించబడింది.
- హర్షవర్ధనుడు స్వయంగా కవి మరియు కవిపోషకుడు. ఇతను సంస్కృతంలో నాగానందము, ప్రియదర్శి మరియు రత్నావళి అనబడే మూడు నాటకాలు రచించాడు. ఇతని ఆస్థాన కవియైన బాణుడు హర్షచరిత, పార్వతీ పరిణయము మరియు కాదంబరి అనే కావ్యాలు రచించాడు. #Harshavardhana#
- హర్షుడు ప్రజాసంక్షేమము కొరకు అనేక కార్యక్రమాలు చేపట్టాడు. పేదలకు వైద్యశాలలు మరియు ధర్మశాలలను నిర్మించాడు. ప్రతి ఐదేళ్ళకొకసారి ప్రయాగ నగరంలో (అలహాబాద్) మహామోక్ష పరిషత్ అనే దానధర్మ కార్యక్రమాన్ని నిర్వహించేవాడు. ఇందులో భాగంగా తన సంపదనంతా పేదలకు పంచి, కట్టుబట్టలతో కనోజ్కు తిరిగివెళ్లేవాడు.
- క్రీ.శ.643వ సంవత్సరంలో ‘కనోజ్ మహాసభ’ అనే సర్వమత సమ్మేళన సభను నిర్వహించాడు. చైనా నుంచి వచ్చిన బౌద్ధయాత్రికుడు హ్యూయాన్త్సాంగ్ దీనికి అధ్యక్షుడు. ఇతను క్రీ.శ.630-644 మధ్య భారతదేశంలో పర్యటించి సీ-యూ-కీ అనే గ్రంథాన్ని చైనీస్ భాషలో వ్రాశాడు. హ్యూయాన్త్సాంగ్ ప్రభావముతో హర్షుడు శైవమతాన్ని వీడి మహాయాన బౌద్ధమతాన్ని స్వీకరించాడు.
హర్షవర్ధనుడి తర్వాత పుష్యభూతి వంశము గురించి సమాచారము లేదు. చైనీస్ గ్రంథాల ప్రకారం అరునాశ్వ అనే అధికారి హర్షుడి వారసుల నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకోగా, చైనా చక్రవర్తి పంపించిన వ్యాన్-యువాన్-త్సె అనే సేనాని అరునాశ్వను ఓడించి హర్షుడి వారసులకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టాడు. #Harshavardhana#
అయితే క్రీ.శ.675-685 మధ్యలో భారతదేశాన్ని పర్యటించిన మరొక చైనా యాత్రికుడు ఇత్సింగ్ కూడా ఆనాటి రాజుల గురించి ఎటువంటి సమాచారమివ్వలేదు.
సాహిత్య ఆధారాల ప్రకారం క్రీ.శ.8వ శతాబ్దపు ప్రారంభములో కనోజ్ను యశోవర్మ అనే రాజు పాలించాడు. ఇతను సంస్కృతంలో రామాభ్యుదయము అనే నాటకాన్ని రచించాడు. ఇతని ఆస్థానంలో ఇద్దరు పండితులు ఉండేవారు.
- భవభూతి: మాలతీమాధవము, మహావీరచరిత్ర మరియు ఉత్తరరామచరిత అనే సంస్కృత కావ్యాలు రచించాడు.
- వాక్పతి: ఇతను ప్రాకృతంలో గౌడవాహో అనే కావ్యమును రచించాడు. ఇందులో యశోవర్మ గౌడ రాజ్యాన్ని (బెంగాల్) జయించినట్లుగా చెప్పబడింది. #Harshavardhana#