హరప్పా నాగరికత : సామాజిక, రాజకీయ, ఆర్థిక, మత వ్యవస్థలు
హరప్పా నాగరికత కేవలం పట్టణ నిర్మాణంలోనే కాదు, సామాజిక వ్యవస్థ, పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, మత విశ్వాసాలు, కళలు మొదలైన అన్ని రంగాలలోనూ విశిష్ట స్థానాన్ని సంపాదించింది. త్రవ్వకాల్లో బయటపడిన ఆధారాలు ఈ నాగరికత ప్రజల జీవన విధానం, వృత్తులు, మతాచారాలు, ఆచార వ్యవహారాలు గురించి విలువైన సమాచారం అందిస్తున్నాయి.
చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ద్వారా సింధు నాగరికతలోని మాతృస్వామ్య భావాలు, పట్టణ పాలన పద్ధతులు, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు, మాతృదేవత – పశుపతి మహాదేవుని పూజలు మొదలైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ అధ్యాయంలో మనం హరప్పా నాగరికతలోని సామాజిక పరిస్థితులు, రాజకీయ – పరిపాలన వ్యవస్థలు, ఆర్థిక కార్యకలాపాలు, మత విశ్వాసాలు, నాగరికత పతనం కారణాలు మరియు సంస్కృతి కొనసాగింపు వంటి అంశాలను వివరంగా అధ్యయనం చేయబోతున్నాం.
సింధు నాగరికత సామాజిక వ్యవస్థ
సింధు నాగరికత యొక్క సామాజిక పరిస్థితులు తెలియజేసే ఖచ్చితమైన ఆధారాలు లభ్యం కాలేదు. చరిత్రకారులు మరియు పురావస్తు శాస్త్రవేత్తలు సామాజిక వ్యవస్థకు సంబంధించి కొన్ని అభిప్రాయాలను తెలియజేశారు.
జాన్ మార్షల్ అభిప్రాయం ప్రకారం సింధు నాగరికతలో మాతృస్వామ్య (matriarchy) వ్యవస్థ కొనసాగింది. సింధు ప్రజల ప్రధాన దైవం మాతృదేవత కావడము మరియు త్రవ్వకాల్లో స్త్రీమూర్తుల బొమ్మలే అధికంగా లభించడంతో సింధు నాగరికతలో మహిళ ఆధిపత్యం ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తపరిచాడు.
ఆనాటి సమాజములో వర్ణవ్యవస్థ మరియు కులవ్యవస్థ కనిపించదు. (వర్ణవ్యవస్థను ఆర్యులు తర్వాత కాలంలో ప్రవేశపెట్టారు. కుల వ్యవస్థ మరికొంత కాలం తరువాత రూపుదిద్దుకుంది). అయితే సమాజంలో తీవ్రమైన సామాజిక, ఆర్థిక వ్యత్యాసాలు మరియు వివక్షతలు కొనసాగాయి. ధనికులందరు కోటతో రక్షితమైన ఎగువ నగరంలో జీవించగా, సామాన్యులు దిగువ నగరంలో జీవించారు. దీనిని బట్టి వీరి మధ్య సామాజిక సంబంధాలు బలహీనంగా ఉండేవని తెలుస్తోంది.
ఆనాటి ప్రజలు నూలు మరియు ఉన్ని దుస్తులను ధరించారు. పట్టువస్త్రాలకు సంబంధించి ఆధారాలు లభ్యం కాలేదు. మాంసాహారులు చేపలు మరియు అనేక రకాల జంతువుల మాంసాన్ని భుజించగా, శాకాహారులు పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకునేవారు. గోధుమలు, బార్లీ ఆ కాలం నాటి ప్రధాన ఆహార ధాన్యాలు.
సింధు ప్రజలు అలంకార ప్రియులు కావడంతో అలంకరణకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. దువ్వెనలు, దర్పణాలు, కాటుక, పెదవులకు వేసుకునే రంగులు (lipsticks) మొదలైన సౌందర్య సాధనాలు త్రవ్వకాల్లో లభించాయి. బంగారు, వెండి, వివిధ రంగుల వైఢూర్యాలు (gem stones) మరియు సముద్రపు గవ్వల shellsతో కూడిన ఆభరణాలను ఉపయోగించారు.
సింధు నాగరికత రాజకీయ మరియు పరిపాలన వ్యవస్థ
పురావస్తు త్రవ్వకాల్లో లభించిన వస్తు అవశేషాలు వారి పరిపాలన వ్యవస్థ గురించి సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో పండితులు వివిధ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.
డి.డి.కౌశాంబి అనే చరిత్రకారుడు సింధు నాగరికత ఒక మతపరమైన రాజ్యమని (theocratic state), పురోహితులు పాలించారని అభిప్రాయపడ్డారు. సమకాలీన మెసపుటేమియాను పురోహితులే పరిపాలించారు.
డి.డి.కౌశాంబి అభిప్రాయాన్ని ఆర్.యస్.శర్మ తిరస్కరించాడు. సింధు పాలకులు మతానికి కాకుండా వ్యాపార వాణిజ్యాలకు ప్రాధాన్యతనిచ్చారు. కాబట్టి వర్తకులు పాలించి ఉండవచ్చని మరియు ఇది పూర్తిగా లౌకిక రాజ్యమని (secular state) ఆర్.యస్.శర్మ అభిప్రాయపడ్డాడు.
సింధునాగరికతలో బలమైన కేంద్రీకృత పరిపాలన వ్యవస్థ కొనసాగి ఉండవచ్చని ఏ.యల్. భాషం అభిప్రాయపడ్డాడు.
సింధు నాగరికత పట్టణాల్లో స్థానిక ప్రభుత్వాలు (మున్సిపల్ పాలన) ఉండవచ్చని గార్డెన్ చైల్డ్ అభిప్రాయపడ్డాడు. పారిశుద్ధ్యం, వీధి దీపాలు, అద్భుతమైన నగర నిర్వహణ స్థానిక ప్రభుత్వాలతోనే సాధ్యమైనదని అనుకోవచ్చు.
సింధు నాగరికత ఆర్థిక వ్యవస్థ
సింధు నాగరికత కాలంలో బలమైన మరియు అత్యంత సంపన్నమైన ఆర్థిక వ్యవస్థ కొనసాగింది.
వ్యవసాయం:
సింధు నాగరికత వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ (agrarian economy) కావడంతో వ్యవసాయం ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముకగా ఉండేది. గోధుమలు, బార్లీ, ప్రత్తి, ఆవాలు, నువ్వులు, వివిధ రకాలైన పండ్లు మరియు కూరగాయలను పండించారు.
వరికి సంబంధించిన ఆధారాలు లభించినప్పటికినీ విస్తారంగా పండించబడలేదు. లోథాల్‌లో బియ్యపుగింజ మరియు రంగపూర్ (గుజరాత్)లో వరి పొట్టు లభ్యమయ్యాయి. అయితే ఈ కాలంలో పప్పుదినుసులు మరియు చెఱకు పండించిన ఆధారాలు లేవు.
సింధు ప్రజలకు నాగలి పరిజ్ఞానం ఉందని త్రవ్వకాల్లో నిరూపించబడింది. బనవాలిలో టెర్రకోట (కాల్చిన బంకమట్టి)తో చేసిన నాగలి బొమ్మ మరియు కాలిబంగన్‌లో నాగలితో దున్నిన భూమి (furrows) బయల్పడ్డాయి.
భారతీయులకు గుర్రం తెలియదని, ఆర్యులే గుర్రాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టారనే అభిప్రాయముండేది. సింధు త్రవ్వకాల్లో గుర్రానికి సంబంధించిన ఆధారాలు బయల్పడటముతో ఈ వాదన తప్పని ఋజువైంది. లోథాల్‌లో టెర్రకోటతో చేసిన గుర్రపు బొమ్మ మరియు సర్కొటడ (గుజరాత్)లో గుర్రపు అస్థిపంజరము బయల్పడ్డాయి.
సింధు నాగరికత పరిశ్రమలు:
సింధు నాగరికత కాలంలో వివిధ రకాలైన చేతివృత్తులు అభివృద్ధి చెందాయి. వస్త్ర పరిశ్రమ, కుండల పరిశ్రమ, తోలు పరిశ్రమ, ఇటుకల పరిశ్రమ, లోహ పరిశ్రమ, నౌకా పరిశ్రమ, ఆభరణాల పరిశ్రమ మొదలైన పరిశ్రమలు సింధు నాగరికత కాలంలో అభివృద్ధి చెందాయి. నౌక పరిశ్రమ లోథాల్‌లో బయల్పడింది. పూసలు, గవ్వలతో ఆభరణాలు తయారుచేసే పరిశ్రమలు లోథాల్, చాన్హుదారో మరియు ధోలవీరలో బయల్పడ్డాయి. సింధు ప్రజలు రాగి మరియు కాంస్యముతో అనేక రకాలైన ఆయుధాలు మరియు పనిముట్లను తయారుచేశారు. వీరికి ఇనుము తెలియదు.
సింధు నాగరికత వ్యాపార వాణిజ్యములు:
సింధు ప్రజలు కొనసాగించిన అంతర్గత మరియు అంతర్జాతీయ వ్యాపారము సింధు నాగరికత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతము చేశాయి.
అంతర్గత వ్యాపారము ప్రధానంగా ఎడ్ల బండ్లు మరియు నదులపైన పడవల ద్వారా కొనసాగింది. ప్రధాన నగరాలన్నీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండటముతో నదీ వ్యాపారము బాగా అభివృద్ధి చెందింది.
ఆనాటి సమకాలీన నాగరికతల్లో మెసపుటేమియాతో మాత్రమే సింధు ప్రజలు వ్యాపార సంబంధాలను కొనసాగించారు. (ఈజిప్టు నాగరికత మరియు చైనా నాగరికతతో సంబంధాలున్నట్లు ఆధారాలు లభించలేదు). విదేశీ వాణిజ్యములో సింధు నాగరికత ప్రధాన రేవు పట్టణమైన లోథాల్ కీలకపాత్ర పోషించింది. ఈ రెండు నాగరికతల మధ్య వ్యాపార సంబంధాలు కొనసాగాయి అని చెప్పడానికి తిరుగులేని ఆధారాలు లభ్యమయ్యాయి. సింధు నాగరికత యొక్క చిత్రలిపి కలిగిన ముద్రికలు మెసపుటేమియాలోని అనేక నగరాల్లోను మరియు మెసపుటేమియాకు చెందిన ముద్రికలు మొహంజొదారోలోను లభ్యమయ్యాయి. అంతేకాకుండా క్యూనిఫాం లిపిలో వ్రాయబడిన మెసపుటేమియా శాసనాల్లో వారు ‘సింధన్’ (ప్రత్తి)ని, ‘మెలుహ’ (భారతదేశము) నుంచి దిగుమతి చేసుకున్నారనే సమాచారముంది.
సింధు ప్రజలు ప్రధానంగా ప్రత్తి, నూలు వస్త్రాలు, ఆహారధాన్యాలు, పూసలు మరియు గవ్వలతో చేసిన ఆభరణాలు, ఏనుగు దంతాలతో చేసిన వస్తువులు (Ivory products) మొదలైనవి ఎగుమతి చేశారు. అలాగే బంగారు, వెండి, రాగి, తగరము మరియు విలువైన వైఢూర్యాలను దిగుమతి చేసుకున్నారు.
సింధు నాగరికత మత విశ్వాసాలు
సింధు ప్రజల మత విశ్వాసాలను ముద్రికలు, టెర్రకోట బొమ్మలు మరియు త్రవ్వకాల్లో బయల్పడిన వస్తు అవశేషాల ద్వారా తెలుసుకోవచ్చు.
వీరి ప్రధాన దైవము మాతృదేవత లేదా అమ్మతల్లి (Mother Goddess). టెర్రకోటతో చేసిన మాతృదేవత విగ్రహాలు అనేక చోట్ల లభ్యమయ్యాయి.
పశుపతి మహాదేవుడు సింధు ప్రజలు పూజించిన మరొక దైవము. మొహంజొదారోలో లభ్యమైన ఒక చతురస్రాకార ముద్రికపైన మూడు తలలు కలిగిన ఈ దేవుని ప్రతిమ ఉంటుంది. పశుపతి మహాదేవుని ఇరువైపుల ఏనుగు, బర్రె, పులి, ఖడ్గమృగపు బొమ్మలు ఉండగా, పాదాల దగ్గర రెండు జింకలు చూపించబడ్డాయి. ఈ దైవమే తర్వాత హిందు మతంలో శివుడయ్యాడని (Proto Shiva) జాన్‌మార్షల్ అభిప్రాయపడ్డారు.
సింధు ప్రజలు స్త్రీ, పురుష జననాంగాలను పూజించారు. రాళ్ళతో చేసిన యోనిలు హరప్పాలోను, లింగాలు మొహంజొదారోలో బయల్పడ్డాయి.
వీరు ఎద్దు, పాము, చెట్లు మరియు పావురాలను పూజించారు. జంతుబలులతో కూడిన యజ్ఞయాగాలు కూడా సింధు ప్రజలు నిర్వహించారని ఆధారాలు లభ్యమయ్యాయి. అనేక చోట్ల లభించిన తాయెత్తులు సింధు ప్రజల మూఢ నమ్మకాలను తెలియజేస్తాయి.
సింధు నాగరికత అంతం
ఆర్.యస్.శర్మ ప్రకారము సింధు నాగరికత క్రీ.పూ.2500లో ప్రారంభమై క్రీ.పూ.1750లో అంతమైంది. అయితే సింధు నాగరికత అంతానికి ఖచ్చితమైన కారణాలు మాత్రము లభించడము లేదు. పండితులు అనేక అభిప్రాయాలు వెలిబుచ్చారు.
మార్టిమర్ వీలర్ (Mortimer Wheeler): ఈయన ప్రకారం ఆర్యుల దండయాత్రల వలన సింధు నాగరికత అంతమైంది. సింధు నాగరికత చివరి కాలంలో ఆర్యులు భారతదేశంలో ప్రవేశించి సింధు ప్రజలను ఓడించి నగరాలను ధ్వంసం చేశారని మార్టిమర్ వీలర్ అభిప్రాయపడ్డారు. యుద్ధప్రియులైన ఆర్యులు శాంతికాముకులైన సింధు ప్రజలను సునాయాసంగా ఓడించారు. సింధు ప్రజలు రక్షణ ఆయుధాలను (కవచము, డాలు, శిరస్త్రాణము మొదలైనవి) ఉపయోగించకపోవడము వలన ఓటమి పాలయ్యారని అభిప్రాయముంది.
జి.ఎఫ్. (G.F.Dales): ఇతని ప్రకారం తరచుగా సంభవించే వరదల వలన సింధు నాగరికత అంతమయింది. ప్రకృతి సింధు నాగరికత యొక్క ప్రధాన శత్రువని ఇతను వ్యాఖ్యానించాడు. మొహంజొదారో నగరము ఏడు సార్లు సింధు నది వరదల్లో ధ్వంసమై తిరిగి పునర్నిర్మించబడింది. చాన్హుదారో కూడా వరదల్లో ధ్వంసమైన ఇంకొక ప్రధాన నగరము.
రాబర్ట్ ఎల్ రైక్స్ (Robert L Raikes): ఇతని ప్రకారము భూకంపాల వలన (tectonic upliftment) నదుల్లో ప్రవహించే నీరు శాశ్వతంగా నగరాల్లోకి చేరి నగరాలను అంతం చేసింది.
హెచ్.టి.ల్యాంబ్రిక్ (H.T.Lambrick): ఈయన ప్రకారం నదులు తమ ప్రవాహదిశను మార్చుకోవడం వలన అనేక నగరాలు నీటి ఎద్దడికి గురై ఖాళీ చెయ్యబడ్డాయి.
డా॥అగర్వాల్: ఈ పండితుడి అభిప్రాయం ప్రకారం నదులు ఎండిపోయి, నీటికొరత వలన ప్రజలు నగరాలు విడిచి వెళ్ళిపోయారు. ముఖ్యంగా సరస్వతి పరివాహక ప్రాంతంలోని నగరాలు ఈ కారణం వలన అంతమయ్యాయి. (సరస్వతి నది ఎండిపోయి ప్రస్తుతం రాజస్థాన్‌లోని థార్ ఎడారిగా మారింది.
ఫెయిర్‌సర్వీస్ (Fairservice): తాను వ్రాసిన Pre-Historic India అనే గ్రంథంలో పర్యావరణ కారణాల వలన సింధు నాగరికత అంతమైందని అభిప్రాయపడ్డారు. సింధు నాగరికత చివరి కాలంలో జనాభా అనూహ్యంగా పెరిగి సహజ వనరులపైన ఒత్తిడి పెరిగింది. అడవులను నరికి వెయ్యడము వలన నేల క్రమక్షయం (soil erosion) జరిగి నదుల్లో పూడిక పెరిగి తరచుగా వరదలు సంభవించాయి. చెట్లను నరికి వెయ్యడము వలన వర్షపాతము క్రమంగా తగ్గుతూ ఆ ప్రాంతము నిస్సారంగా మారింది. పర్యావరణ సమతౌల్యం దెబ్బతినడము వలననే ఈ నాగరికత అంతమైనదని ఫెయిర్‌సర్వీస్ అభిప్రాయం. సింధు నాగరికత అభివృద్ధి చెందిన సింధు లోయ ప్రస్తుతము అత్యంత తక్కువ వర్షపాతముతో నిస్సారంగా మారింది. సరస్వతి లోయ మాత్రము థార్ ఎడారిగా మారిపోయింది. సింధు ప్రజలు సహజ వనరులను విచక్షణా రహితంగా వాడుకుని పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీయడమే దీనికి కారణమని భావించవచ్చు.
క్రీ.పూ.1750 తర్వాత సింధు నాగరికత
క్రీ.పూ.1750లో సింధు నాగరికత అంతమైందని చరిత్రకారులు విశ్వసిస్తున్నారు. ఆర్యుల దండయాత్రలు, వరదలు, భూకంపాల వలన సింధు నాగరికత అకస్మాత్తుగా అంతమయిందని కొందరు అభిప్రాయపడగా, ఒక పరిణామ క్రమంలో పర్యావరణ సమతౌల్యం దెబ్బతిని ఈ నాగరికత ముగిసిందని మరికొందరు వాదిస్తున్నారు. అయితే సింధు నగరాలు అంతమైన తర్వాత కూడా సింధు ప్రజలు గ్రామీణ ఆవాసాలను ఏర్పాటు చేసుకొని కొన్ని శతాబ్దాలు జీవించారని ఆధారాలు లభ్యమవుతున్నాయి.
క్రీ.పూ.1750 నుంచి క్రీ.పూ.1200 వరకు కొనసాగిన ఈ సంస్కృతిని sub-indus culture అని నామకరణం చేశారు. ఇది పూర్తిగా గ్రామీణ నాగరికత. ఈ కాలంలో సింధు ప్రజలు, భారతదేశానికి వలస వచ్చిన తొలి ఆర్యులతో కలిసి జీవించారని పురావస్తు ఆధారాలు లభ్యమయ్యాయి. హర్యానాలోని భగవాన్‌పుర, పంజాబ్‌లోని కట్పలన్ మరియు జమ్ములోని మండ దగ్గర జరిగిన త్రవ్వకాల ద్వారా తొలి ఆర్యులు, మలికాలం నాటి సింధు ప్రజలు ఒకే ప్రాంతంలో నివసించారని తెలుస్తుంది. తొలి ఆర్యులు రచించిన ఋగ్వేదంలో కూడా లింగారాధకులైన సింధు ప్రజలతో ఆర్యులకున్న ఘర్షణ గురించి ప్రస్తావన ఉంది.
సింధు సంస్కృతి కొనసాగింపు
సింధు నాగరికత అంతానికి గల వివిధ కారణాలను కొంతమంది పండితులు అన్వేషిస్తుంటే, మరికొంతమంది అసలు సింధు నాగరికత అంతమయ్యిందా? అని ప్రశ్నిస్తున్నారు. క్రీ.పూ.1750లో అంతమైంది కేవలం సింధు నగరాలే కాని సింధు సంస్కృతి కాదనే వాదన సమంజసంగా అనిపిస్తుంది. నాటి సంస్కృతి మరియు సాంప్రదాయాలు నేటికి కొనసాగుతూ భారతదేశ జీవనవిధానంలో అంతర్భాగమయ్యాయి.
మత రంగాన్ని పరిశీలిస్తే, సింధు ప్రజలు పూజించిన పశుపతి మహాదేవుడిని మరియు మాతృదేవతను భారతీయులు నేటికీ పూజిస్తున్నారు. అదేవిధంగా లింగారాధన, పాములను పూజించడం, ఎద్దును పూజించడము మరియు చెట్లను పూజించే సాంప్రదాయాలు నిరంతరంగా కొనసాగుతూ ఉన్నాయి. భూత, ప్రేత, పిశాచాలను అంతం చెయ్యడానికి సింధు ప్రజలు ఉపయోగించిన తాయెత్తులు, దేవతలను తృప్తి పరచడానికి చేపట్టిన యజ్ఞాలు మరియు జంతుబలులు నేడు భారతదేశమంత కనిపిస్తాయి.
ఆర్థికరంగంలో కూడా సింధు నాగరికత కాలం నాటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. సింధు నాగరికత కాలం నుంచి నేటి వరకు భారత ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపైన ఆధారపడి ఉంది. ఖరీఫ్ మరియు రబీ కాలంలో పంటలను పండించే సాంప్రదాయం కొనసాగుతోంది. సింధు కాలం నాటి ప్రధాన ఎగుమతులైన ఆహారధాన్యాలు, వస్త్రాలు, ఆభరణాలు నేటికీ మన ముఖ్యమైన ఎగుమతులుగా కొనసాగుతున్నాయి. ఎంతో సాంకేతిక ప్రగతి సాధించిన ఆధునిక యుగంలో కూడా సింధు నాగరికత కాలం నాటి ఎడ్లబండ్లను రవాణా కోసం ఉపయోగించడము జరుగుతోంది.
సింధు కాలం నాటి సామాజిక సాంప్రదాయాలు, వ్యవస్థలు నేటికీ చెక్కుచెదరలేదు. ధనవంతులు మరియు సామాన్యులు నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో నివసించడము, ధనవంతులు అత్యంత విలాసవంతమైన భవనాల్లోనూ, పేదవారు ఇరుకైన గృహాల్లోనూ నివసించడము నేటికీ కొనసాగుతోంది. ఆనాటి ఆహారపు అలవాట్లు, దుస్తులు, అలంకరణలు, ఆభరణాలు ఇత్యాది అంశాల్లో ఎటువంటి మార్పులేదు. ఆనాటి నగరాల్లోని భూగర్భ మురికి కాలువల నిర్మాణము, వీధి దీపాలు మరియు చెత్తకుండీలను ఏర్పాటు చెయ్యడము మొదలైనవి నేటి నగరాల్లో కూడా కనిపిస్తుంది. తూనికలు మరియు కొలతలకు 16 ప్రామాణికం కావడము కూడా నేటికి కొనసాగుతుంది.
పై అంశాలను పరిశీలించడము ద్వారా సింధు నగరాలు అంతమైనప్పటికీ సింధు నాగరికత మాత్రము నేటికీ సజీవంగా కొనసాగుతుందని అర్థమవుతుంది. ప్రముఖ చరిత్రకారుడు A.L.Basham చెప్పినట్లుగా భారత సంస్కృతి నిరంతరంగా కొనసాగే ఒక విశిష్టమైన సంస్కృతి. నాటి సింధు సంస్కృతి నేటి భారతదేశ సంస్కృతికి పునాదిగా మారింది.
సింధు నాగరికత కాలం నాటి వాస్తు, శిల్ప కళలు
భారతదేశంలోని మొట్టమొదటి శిల్పకళ సింధు నాగరికత కాలానికి చెందినది. సింధు ప్రజలు, స్నానవాటికలు, నివాస గృహాలు, ధాన్యాగారాల వంటి అవసరమైన కట్టడాలు మాత్రమే నిర్మించారు. అంతేకానీ అద్భుత కళాసౌందర్యమున్న కట్టడాలు మాత్రము నిర్మించలేదు. వీరు నిర్మించిన కట్టడాల్లో మొహంజొదారోలోని మహాస్నానవాటిక అత్యంత ముఖ్యమైనది. 39 అడుగుల పొడవు, 23 అడుగుల వెడల్పు మరియు 8 అడుగుల లోతు కలిగిన దీని నిర్మాణానికి కాల్చిన ఇటుకలు మరియు జిప్సంను ఉపయోగించారు. సింధు ప్రజలు స్నానవాటికలను బహుశా పవిత్ర స్నానాల కోసం ఉపయోగించి ఉండవచ్చు.
సింధు నాగరికత కాలంలో బలమైన రాచరిక వ్యవస్థ లేకపోవడము, దేవాలయాలు మరియు విగ్రహారాధన లాంటి మత సాంప్రదాయాలు పరిపూర్ణంగా అభివృద్ధి కాకపోవడం వలన చెప్పుకోదగిన గొప్ప కట్టడాలు నిర్మించబడలేదు. సింధు ప్రజలకు కళా నైపుణ్యం లేదని కూడా చెప్పలేము. వివిధ ప్రాంతాల్లో జరిగిన త్రవ్వకాల్లో సింధు కాలం నాటి గొప్ప కళాసౌందర్యమున్న అనేక వస్తువులు బయల్పడ్డాయి. అందులో ముఖ్యమైనవి:
1) ముద్రికలు: స్టియటైట్‌తో చేసిన సుమారు 4000 ముద్రికలు సింధు త్రవ్వకాల్లో బయల్పడ్డాయి. అత్యంత చిన్న పరిమాణంలో ఉన్న ముద్రికలపైన దేవతలు, మనుషులు, జంతువుల చిత్రాలతో పాటు చిత్ర లిపి కూడా చెక్కడము వారి కళా నైపుణ్యానికి నిదర్శనము. మొహంజొదారోలో లభించిన ఒక ముద్రికపైన వారి దైవమైన పశుపతి మహాదేవుడితో పాటు ఏనుగు, పులి, ఎద్దు మరియు ఖడ్గమృగముతో పాటు క్రింది భాగంలో రెండు జింకలను కూడా చిత్రీకరించారు. దీని పైభాగంలో చిత్రలిపి కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కేవలం ఒక అంగుళం పరిమాణంలోని ముద్రికపైన చిత్రీకరించడము చాలా గొప్ప విషయము. మొహంజొదారోలో లభ్యమయిన ఒక ముద్రికపైన చెక్కిన ఎద్దు బొమ్మలో దాని యొక్క జాతి లక్షణాలు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
2) మనుషుల బొమ్మలు: సింధు నాగరికత త్రవ్వకాల్లో అనేక చోట్ల టెర్రకోట మరియు లోహాలతో తయారుచేసిన బొమ్మలు లభించాయి. టెర్రకోటతో చేసిన మాతృదేవత విగ్రహాలు, మొహంజొదారోలో లభ్యమైన కాంస్యపు నాట్యగత్తె విగ్రహము మరియు స్టియటైట్‌తో చేసిన గడ్డపు మనిషి బొమ్మ, హరప్పాలో లభ్యమైన నృత్యం చేస్తున్న నగ్నపురుషుడి శిల్పం మొదలైనవి ఆనాటి శిల్పకళ నైపుణ్యానికి నిదర్శనాలు.
3) జంతువుల బొమ్మలు: రాగి, కాంస్యము మరియు మట్టితో చేసిన బొమ్మలు సింధు త్రవ్వకాల్లో విరివిగా లభ్యమయ్యాయి. దైమాబాద్ త్రవ్వకాల్లో కాంస్యముతో చేసిన ఏనుగు, ఖడ్గమృగము మరియు రథసారథితో పాటు రథము యొక్క బొమ్మలు బయల్పడ్డాయి. మట్టితో చేసిన జంతువుల బొమ్మలు, ఎడ్లబండ్లు ఆనాటి ప్రజల శిల్పకళా చాతుర్యాన్ని తెలియజేస్తాయి.
సింధునాగరికత శిల్పకళ భారతదేశంలో తర్వాతి కాలాల్లో అభివృద్ధి చెందిన అత్యద్భుతమైన శిల్పకళకు మార్గదర్శకమైనదని చెప్పవచ్చు.