హరప్పా నాగరికత రహస్యాలు – 5000 ఏళ్ల ప్రాచీన భారత గాథ (Part-1)

Harappan Civilization

భారతదేశంలోని తొలి నాగరికత మరియు ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతల్లో ఒక్కటైన సింధు నాగరికత క్రీ.పూ.2500 నుండి క్రీ.పూ.1750 మధ్యలో విరాజిల్లినదని ఆర్.యస్.శర్మ అభిప్రాయపడ్డారు. ఈ నాగరికత అవశేషాలు మొట్టమొదటిగా 1826లో మ్యాసన్ (Mason) అనే పురావస్తుశాస్త్రవేత్త కనుగొన్నారు. 1921లో హరప్పా త్రవ్వకాలతో ఈ నాగరికత అధ్యయనము ప్రారంభమయింది. 1921 కంటే పూర్వము ఆర్యుల నాగరికతతోనే మనదేశంలో నాగరికత ప్రారంభమయిందని భావించేవారు. సింధు నాగరికత బయల్పడడముతో అత్యంత ప్రాచీన నాగరికతలు కలిగిన దేశాల జాబితాలో భారతదేశము చేరింది. #Harappan Civilization#

సమకాలీన నాగరికతలు

భారతదేశంలోని సింధు మరియు సరస్వతి లోయల్లో సింధు నాగరికత అభివృద్ధి చెందిన కాలంలోనే ప్రపంచములో మరో మూడు గొప్ప నాగరికతలు వెలిశాయి. వీటిని సింధు నాగరికతకు సమకాలీన నాగరికతలుగా పరిగణించవచ్చు.

1. సుమేరియ/ మెసపుటేమియా నాగరికత

ప్రస్తుత ఇరాక్‌లోని టైగ్రిస్ మరియు యూప్రటీస్ నదీలోయల్లో ఈ నాగరికత కొనసాగింది. మెసపుటేమియా (ఇరాక్ యొక్క ప్రాచీన నామము) అంటే రెండు నదుల మధ్య ప్రాంతము (అంతర్వేది) అని అర్థము. సింధు నాగరికత ప్రజలు, సుమేరియ నాగరికతతో సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలను కొనసాగించారని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు లభించాయి.

2. చైనా నాగరికత

చైనాలోని హోయాంగ్ హో (Hwang Ho) నది లోయలో అభివృద్ధి చెందింది. హోయాంగ్ హో అంటే ‘Yellow River’ అని అర్థం. తరచుగా వరదలు వచ్చి విధ్వంసమును సృష్టిస్తుండటము వలన ఈ నదిని చైనా దుఃఖదాయని (sorrow of china) అని పిలుస్తారు.

3. ఈజిప్ట్ నాగరికత

ఈ నాగరికత ఆఫ్రికా ఖండంలోని ఈజిప్ట్ దేశంలోని నైలు నది లోయలో అభివృద్ధి చెందింది. సింధు నాగరికత ప్రజలు ఈజిప్ట్ నాగరికతతో గాని, చైనా నాగరికతతో గాని సంబంధాలు కొనసాగించారని చెప్పడానికి ఆధారాలు లభించలేదు.

సింధు నాగరికతకు వివిధ పేర్లు

 

  1. సింధు నాగరికత: నాగరికత ప్రధానంగా సింధు లోయలో కేంద్రీకృతము కావడం వలన దీనిని సింధు నాగరికత అని పిలిచారు.
  2. హరప్పా నాగరికత: సింధు నాగరికత అవశేషాలు మొట్టమొదటగా హరప్పాలో కనుగొనబడ్డాయి. కాబట్టి హరప్పా ఈ నాగరికత యొక్క ‘type site’ గా పరిగణించవచ్చు. పురావస్తు సాంప్రదాయమును అనుసరించి ‘type site’ ఆధారంగా దీనిని హరప్పా నాగరికత అని సంబోధించవచ్చు.
  3. కాంస్య యుగ నాగరికత: సింధు నాగరికత కాంస్య యుగానికి (Bronze Age) చెందినది. సింధు ప్రజలు భారతదేశంలో కాంస్యమును ఉపయోగించిన మొట్టమొదటివారు. రాగి మరియు తగరమును కలిపి ఈ మిశ్రమ లోహాన్ని తయారుచేశారు.
  4. చారిత్రక సంధి యుగ నాగరికత: సింధు ప్రజలు ఉపయోగించిన లిపిని నేటి వరకు ఎవ్వరూ చదవలేకపోవడముతో ఈ కాలాన్ని చారిత్రక సంధి యుగమని పిలిచారు. ఎస్.ఆర్.రావు, ఫాదర్ హీరాస్, రాజారాం, నట్వర్ జా లాంటి పండితులు సింధు లిపిని చదవడానికి విఫలయత్నం చేశారు.

సింధు  ప్రజల లిపి చిత్రలిపి (pictographic script). ఇది సియటైట్ (steatite) తో చేసిన ముద్రికలు (seals) పైన కనిపిస్తుంది. సింధు నాగరికత త్రవ్వకాల్లో 4000 పైగా ముద్రికలు లభించాయి. బహుశ ఇవి వ్యాపార వాణిజ్యాల నిమిత్తము ఉపయోగించి ఉండవచ్చు. సింధు ముద్రికలు చతురస్రాకారము (square); దీర్ఘచతురస్రాకారము (rectangular) మరియు వృత్తాకారము (circular) ల్లో తయారు చెయ్యబడ్డాయి. కాలిబంగన్‌లో దొరికిన ఒక ముద్రిక ఆధారంగా సింధు లిపి సర్పలేఖన లిపి (boustrophedon script) అని తెలుస్తుంది. మొదటి వాక్యం కుడి నుంచి ఎడమకు మరియు రెండవ వాక్యం ఎడమ నుంచి కుడికి వ్రాయబడింది. ఈ లిపి నుండి తర్వాత కాలంలో బ్రాహ్మీ లిపి ఆవిర్భవించిందని అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్‌ అభిప్రాయపడ్డారు.

సింధు నాగరికత విస్తీర్ణం

ఆనాటి సమకాలీన నాగరికతల్లో అన్నింటికంటే విశాలమైనది సింధు నాగరికత. ఇది ఈజిప్టు నాగరికత కంటే 20 రెట్లు మరియు మెసపుటేమియా, ఈజిప్టు నాగరికతల సంయుక్త విస్తీర్ణం కంటే 12 రెట్లు పెద్దది. ఈ నాగరికత నాలుగు సరిహద్దులను గుర్తించడం ద్వారా విస్తీర్ణాన్ని అంచనా వేయవచ్చు.

  1. ఉత్తర సరిహద్దు: జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రంలోని మండ. సింధు ఉపనది అయిన చీనాబ్‌ ఒడ్డున ఉంది.
  2. దక్షిణ సరిహద్దు: మహారాష్ట్రలోని దైమాబాద్. గోదావరికి ఉపనది అయిన ప్రవర నది ఒడ్డున ఉంటుంది.
  3. తూర్పు సరిహద్దు: ఉత్తరప్రదేశ్‌లోని అలంగీర్‌పూర్‌. ఇది యమునకు ఉపనది అయిన హింధాన్ నది ఒడ్డున ఉంటుంది.
  4. పశ్చిమ సరిహద్దు: పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్ రాష్ట్రంలోని సత్కజెన్‌దారో. దస్త్‌ నది ఒడ్డున ఉంటుంది.

పై నాలుగు సరిహద్దుల మధ్య విరాజిల్లిన సింధు నాగరికత దాదాపుగా 13,00,000 చ.కి.మీల విస్తీర్ణమును కలిగి ఉన్నది.

సింధు నాగరికత నిర్మాతలు

సింధు నాగరికత ప్రజల గురించి ఖచ్చితమైన సమాచారము లేకపోయినప్పటికీ వారు వివిధ జాతులకు చెందినవారని చెప్పవచ్చు. సింధు ప్రజల సంస్కృతిని మిశ్రమ సంస్కృతి (cosmopolitan culture) అని వర్ణించవచ్చు. ప్రధానంగా సింధు ప్రజలు ఈ క్రింది నాలుగు జాతులకు చెందినవారని చెప్పవచ్చు.

  1. మంగోలాయిడ్ జాతి (Mongoloids): మొహంజొదారోలో లభించిన గడ్డపు మనిషి బొమ్మలో మంగోలాయిడ్ జాతి లక్షణాలు కనిపిస్తాయి.
  2. ప్రోటో-ఆస్ట్రోలాయిడ్ జాతి (Proto-Austroloids): మొహంజొదారోలో లభించిన కాంస్యముతో చేసిన నాట్యగత్తె విగ్రహము (bronze dancing girl) లో ఈ జాతి లక్షణాలు కనిపిస్తాయి.
  3. ఆల్పినాయిడ్‌ జాతి (Alpinoids): పురావస్తు త్రవ్వకాలలో ఈ జాతికి సంబంధించిన ఆనవాళ్ళు లభించాయి.
  4. మెడిటేరినియన్ జాతి (Mediterranians): ఈ జాతి ప్రజలే సింధు నాగరికతలో అత్యధిక సంఖ్యాకులు. వీరు ద్రావిడ భాష మాట్లాడడము వలన వీరిని ద్రావిడులు అని కూడా అంటారు. (మెడిటేరినియన్ అనేది జాతి పదం మరియు ద్రావిడ అనేది భాషా పదం). అందుకే సింధు నాగరికతను ద్రావిడ నాగరికత అని కూడా పిలుస్తారు.
సింధు నాగరికత ఆవిర్భావము

సింధు నాగరికత అవిర్భావము గురించి ఎలాంటి స్పష్టమైన సమాచారము లేదు. పురావస్తు త్రప్వకాల్లో బయల్పడిన వస్తు అవశేషాలు సింధు ప్రజలు ఏ ప్రాంతవాసులో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పండితులు అనేక పరికల్పన (hypothesis) లకు శ్రీకారం చుట్టారు. (నిర్దిష్టమైన ఆధారాలు లేనప్పుడు, ఊహాగానాల మీద సిద్ధాంతాలను రూపొందించడాన్ని పరికల్పన అనవచ్చు). సింధు నాగరికత ఆవిర్భావము గురించి పలువురు పండితుల అభిప్రాయాలను పరిశీలిద్దాం. #Harappan Civilization#

మార్టిమర్ వీలర్‌: ఈయన ప్రకారం సింధు ప్రజలు విదేశీయులు. మెసపుటేమియా నాగరికతకు చెందిన ప్రజలు భారతదేశానికి వలసవచ్చి సింధునాగరికతను అభివృద్ధి చేశారని వీలర్ అభిప్రాయపడ్డాడు. నాగరికతకు రెక్కలుంటాయని, నాగరికత అనే భావన మెసపుటేమియాలో పుట్టి సింధు ప్రాంతానికి ఎగురుతూ వచ్చిందని వ్యాఖ్యానించాడు. సింధు నాగరికతకు మరియు మెసపుటేమియా నాగరికత మధ్య ఉన్న సారూప్యత ఆధారంగా వీలర్ ఈ పరికల్పనను ప్రతిపాదించాడు. మాతృదేవతను పూజించడము, నగర జీవితాన్ని గడపడము, స్నానవాటికలు మరియు ధాన్యాగారాలు నిర్మించుకోవడము, స్టియటైట్‌తో చేసిన ముద్రికలను ఉపయోగించడము ఇత్యాది అంశాలు రెండు నాగరికతల్లోను ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అయితే ఆధునిక చరిత్రకారులు ఈ రెండు నాగరికతల మధ్య వ్యత్యాసాలను చూపుతూ ఈ అభిప్రాయాన్ని తిరస్కరించారు. సింధు నగరాల్లో కనిపించే శాస్త్రీయమైన పట్టణ నిర్మాణము మరియు భూగర్భ మురికి కాలువలు మెసపుటోమియా నగరాల్లో కనిపించవు. మనపుటేమియా ప్రజలు క్యూనిఫాం లిపిని ఉపయోగించగా, సింధు ప్రజలు మాత్రము చిత్రలిపిని వాడారు. ముద్రికల్లో కూడా వ్యత్యాసం కనిపిస్తుంది. మెసపుటేమియా ప్రజలు స్థూపాకారపు ముద్రికలు తయారు చేసుకోగా, సింధు ప్రజలు మాత్రము చతురస్రాకారము, దీర్ఘచతురస్రాకారము మరియు వృత్తాకారపు ముద్రికలను ఉపయోగించారు. ఈ వ్యత్యాసాల ఆధారంగా వీలర్ పరికల్పనను పండితులు తిరస్కరించారు.

ప్రొ|| రఫిఖ్‌ మొఘల్‌: ఈయన (పాకిస్థాన్‌కు చెందిన పురావస్తు శాస్త్రవేత్త) ప్రకారము బెలూచిస్తాన్‌లోని జోబ్ సంస్కృతి, కుల్లి సంస్కృతి, నల్ సంస్కృతి మరియు క్వెట్ట సంస్కృతులకు చెందిన తామ్ర శిలాయుగ ప్రజలు సింధు లోయకు వలస వచ్చి ఈ నాగరికతను నిర్మించారు. సింధు నాగరికతకు బెలూచిస్థాన్‌లోని తామ్ర శిలాయుగ సంస్కృతులకు మధ్య ఉన్న సారూప్యత ఆధారంగా ఈ సిద్ధాంతము చెప్పబడింది. జోబ్ సంస్కృతికి చెందిన ప్రజలు లింగాలను మరియు ఎద్దులను ఆరాధించడము, కోటలు నిర్మించుకోవడము లాంటి అంశాలు సింధు నాగరికతలో కూడా కనిపిస్తాయి. నల్, కుల్లి మరియు క్వెట్టకు చెందిన ప్రజల దహన సంస్కారాలు పూర్తిగా సింధు దహన సంస్కారాలను పోలి ఉన్నాయి. అయితే ఆధునిక చరిత్రకారులు ఈ వాదనతో ఏకీభవించడము లేదు. తామ్రశిలాయుగానికి చెందిన ప్రజలు గ్రామాల్లో నివసించేవారు. వీరికి మిశ్రమ లోహ పరిజ్ఞానము లేదు మరియు లిపి కూడా తెలియదు. శాస్త్రీయంగా మరియు సాంకేతికంగా ఎంతో వెనుకబడిన తామ్రశిలాయుగ ప్రజలు అత్యంత అభివృద్ధి చెందిన సింధు నాగరికతను నిర్మించారని చెప్పడము సహేతుకంగా లేదు.

ఎ.ఘోష్ మరియు హెచ్.డి.శంకాలియ: ఈ భారతీయ పురావస్తు శాస్త్రవేత్తలు సింధు ప్రజలు విదేశీయులనే సిద్ధాంతాలను ఖండించారు. వీరి అభిప్రాయము ప్రకారము, సింధు నాగరికత సంపూర్ణంగా స్వదేశీయమైనది. సింధు మరియు సరస్వతి లోయల్లో అభివృద్ధి చెందిన సింధూ పూర్వయుగ సంస్కృతులు (pre-Harappan cultures) క్రమంగా అభివృద్ధిని సాధిస్తూ సింధు నాగరికతగా ఆవిర్భవించాయి. భారతదేశంలో అనేక నవీన శిలాయుగ సంస్కృతులు మరియు తామ్ర శిలాయుగ సంస్కృతులు పరిణామక్రమంగా గణనీయమైన ప్రగతి సాధించి సింధు నాగరికతకు బాటలు వేశాయి. నవీన శిలాయుగానికి చెందిన మెహర్‌ఘర్‌లో తయారుచేయబడిన టెర్రకోట బొమ్మలు, వైఢూర్యాలతో చేసిన పూసలు, స్టియటైట్‌తో చేసిన ముద్రికలు సింధు నాగరికత కాలంలో కూడా కొనసాగాయి. తామ్రశిలాయుగానికి చెందిన అమ్రి సంస్కృతి (సింధ్), కోట్‌డిజి సంస్కృతి (సింధ్) మరియు సోథి సంస్కృతి (రాజస్థాన్)లలో సింధు నాగరికత లక్షణాలు అనేకం కనిపిస్తాయి. ఈ సంస్కృతులు క్రీ.పూ.3000లో అభివృద్ధి చెందాయి. అమ్రిలోని ధాన్యాగారము, కోట్‌డిజిలోని కోట నిర్మాణము సింధు నాగరికత కాలంలో కూడా కనిపిస్తాయి. దీనిని బట్టి సింధునాగరికత పూర్తిగా స్వదేశీయమైనదని తెలుస్తోంది. మరియు సింధు నాగరికత కంటే పూర్వమున్న సంస్కృతులు అభివృద్ధిని సాధించి సింధు నాగరికతకు పునాదులు వేశాయని స్పష్టంగా అర్థమవుతోంది.

సింధు నాగరికత ప్రధాన పట్టణాలు 

సింధు నాగరికత ప్రధానంగా పట్టణ నాగరికత. ఈ నాగరికతకు చెందిన 250కి పైగా పట్టణాలను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందులోని కొన్ని ముఖ్యమైన పట్టణాల సమాచారాన్ని క్రింది పట్టిక రూపంలో ఇవ్వడమైనది. #Harappan Civilization#

 

నగరము పేరు కనుగొన్న సంవత్సరం త్రవ్వకాలు  జరిపిన పురావస్తు శాస్త్రవేత్త నది రాష్ట్రం
హరప్పా 1921 దయారాం సహాని రావి పంజాబ్‌ (పాకిస్థాన్‌)
మొహంజొదారో 1922 ఆర్‌.డి.బెనర్జీ సింధు నది కుడి ఒడ్డున సింధ్‌ (పాకిస్థాన్‌)
సత్కజెన్‌దారో 1931 అరియల్‌స్టీన్‌ (Auriel Stein) దశ్త్‌ బెలూచిస్థాన్‌ (పాకిస్థాన్‌)
చాన్హుదారో 1931 యం.జి.మజుందార్‌ సింధు నది ఎడమ ఒడ్డున సింధ్‌ (పాకిస్థాన్‌)
రంగపూర్‌ 1953 యం.యస్‌.వాట్స్‌ భాదర్‌ గుజరాత్‌
లోథాల్‌ 1955 యస్‌.ఆర్‌.రావ్‌ భొగావో గుజరాత్‌
రొపార్‌ 1955 వై.డి.శర్మ సట్లెజ్‌ పంజాబ్‌

 

కోట్‌డిజి 1955 యఫ్‌.ఏ.ఖాన్‌ సింధు సింధ్‌ (పాకిస్థాన్‌)
కాలిబంగన్‌ 1961 బి.బి.లాల్‌ ఘగ్గర్‌ (సరస్వతి) రాజస్థాన్‌
బనవాలి 1975 ఆర్‌.యస్‌.బిస్త్‌ సరస్వతి హర్యానా
ధోలవీర 1991 జె.పి.జోషి నది లేదు గుజరాత్‌
రాఖిగర్హి 1963

1997లో త్రవ్వకాలు ప్రారంభమయ్యాయి.

సూరజ్‌బన్‌ ఘగ్గర్‌-హక్ర లేదా ద్రిషద్వతి హర్యానా

 

మొహంజొదారో:
  • సింధి భాషలో మొహంజొదారో అంటే మృతులదిబ్బ అని అర్థం.
  • ఇక్కడ త్రవ్వకాల్లో కుషాణుల కాలం నాటి బౌద్ధస్థూపం బయల్పడింది.
  • ఈ నగరము ఏడు సార్లు వరదల్లో ధ్వంసమై తిరిగి నిర్మించబడింది.
  • మహాస్నానవాటిక (great bath – 39′ × 23′ x 8′); మహాధాన్యాగారము (great granary – 150′ × 50′); అసెంబ్లీ హాల్ మరియు దేవాలయంలాంటి కట్టడము బయల్పడ్డాయి.
  • కాంస్యముతో చేసిన నాట్యగత్తె విగ్రహము (bronze dancing girl – 14cms) మరియు స్టియటైట్‌తో చేసిన గడ్డపు మనిషి బొమ్మ (బహుశ పురోహితుడు) లభించాయి.
  • మెసపుటేమియాకు చెందిన మూడు స్థూపాకారపు ముద్రికలు (cylindrical seals) లభించాయి. ఇవి రెండు నాగరికతల మధ్య వ్యాపార సంబంధాలను తెలియజేస్తాయి.
  • కాంస్యముతో చేసిన రంపము మరియు రాగితో చేసిన రెండు ఖడ్గాలు లభించాయి.
  • పశుపతి మహాదేవ ఉన్న ముద్రిక మరియు ఎద్దు బొమ్మ ఉన్న ముద్రిక బయల్పడ్డాయి.
  • రాళ్ళతో చేసిన లింగాలు లభించాయి.
హరప్పా:
  • రెండు వరుసల్లో ఆరు ధాన్యాగారాలు బయల్పడ్డాయి. ఒక్కొక్క ధాన్యాగారము విస్తీర్ణం 50′ x 20’గా ఉంది.
  • కాంస్యముతో చేసిన దర్పణాలు (mirrors), ఎడ్లబండి మరియు కొలబద్ద (scale) లభించాయి.
  • చెక్కతో చేసిన శవపేటిక లభించింది (wooden coffin) లభించింది.
  • కుమ్మరి చక్రం మరియు శ్రామికుల ఇరుకైన గదులతో కూడిన ఇళ్ళు బయల్పడ్డాయి.
  • నాట్యం చేస్తున్న పురుషుని బొమ్మ లభ్యమైంది.
చాన్హుదారో:
  • సింధు నాగరికతలో కోటలేని ఏకైక నగరము.
  • సిరాకుండ (ink pot) మరియు కాంస్యముతో చేసిన ఎడ్లబండి లభ్యమయ్యాయి.
  • పిల్లికి సంబంధించిన ఆధారాలు దొరికాయి.
లోథాల్:
  • గుజరాతీ భాషలో లోథాల్ అంటే మృతులదిబ్బ అని అర్థం.
  • ఇది సింధునాగరికత యొక్క ప్రధాన రేవు పట్టణము. ఓడరేవు (dockyard) బయల్పడింది.
  • పర్షియన్ గల్ఫ్‌కు చెందిన ముద్రిక మరియు ఓడబొమ్మ కలిగిన ముద్రిక దొరికాయి.
  • హోమగుండము (fire altar), చదరంగపు బల్ల (chess board), టెర్రకోటతో చేసిన గుర్రపు బొమ్మ, బియ్యపుగింజ, కాంస్యముతో చేసిన కొలబద్ద మొదలైనవి లభించాయి.
  • ద్విఖననము (double burial) అంటే ఒకే సమాధిలో రెండు అస్థిపంజరాలు లభ్యమయ్యాయి.
  • బంగారము మరియు ఇతర విలువైన రాళ్ళతో చేసిన పూసలు మరియు రాగి గాజులు లభించాయి.
కాలిబంగన్‌:
  • నాగలితో దున్నిన భూమి (furrows) బయల్పడింది.
  • ఏడు హోమగుండాలు మరియు జంతుబలులకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి.
బనవాలి:
  • సింధు నాగరికత యొక్క అద్భుతమైన నగర నిర్మాణశైలి బనవాలిలో కనిపించదు. రహదారులను క్రమపద్ధతిలో నిర్మించడము కాని, భూగర్భ మురికి కాలువల నిర్మాణము కాని ఈ నగరములో లేవు.
  • 11 గదులు కలిగిన ఒక భవనము బయల్పడింది.
  • టెర్రకోటతో చేసిన నాగలిబొమ్మ దొరికింది.
  • పులిబొమ్మ కలిగిన ముద్రిక లభించింది.
సర్కొటడ:
  • గుజరాత్‌లోని కఛ్‌ ప్రాంతములో ఉన్న నగరము.
  • గుర్రపు వాస్తవ అవశేషాలు లభించాయి. (ప్రారంభంలో పండితులు సింధు ప్రజలకు గుర్రం తెలియదని, ఆర్యులు గుర్రాన్ని భారతదేశానికి పరిచయము చేశారని భావించేవారు)
  • కుండల్లో శవాన్ని పెట్టి ఖననము చేసే పద్ధతి ఇక్కడ కొనసాగింది.
ధోలవీర:
  • జలాశయము (reservoir) మరియు స్టేడియం బయల్పడ్డాయి. ఈ నగరము నదీ పరివాహక ప్రాంతంలో లేనందున వీరికి రిజర్వాయర్ నిర్మించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

నగర నిర్మాణము

  • సింధు నాగరికత అభివృద్ధి చెందిన పట్టణ నాగరికత. సింధు నగరాలన్నీ దాదాపుగా ఒకే ప్రణాళిక ఆధారంగా నిర్మించబడ్డాయి. ఉన్నత శాస్త్రసాంకేతిక పరిజ్ఞానముతో ప్రణాళికబద్ధంగా కొనసాగిన నగర నిర్మాణమే సింధు నాగరికత యొక్క అత్యున్నత విశిష్ట లక్షణము.
  • ప్రతి నగరము ఎగువ మరియు దిగువ నగరాలుగా కోటగోడ ద్వారా విభజించబడ్డాయి. ఎగువ నగరంలో కులీన వర్గాలు (పాలకులు, పురోహితులు, వర్తకులు మరియు ఇతర ధనిక వర్గాలు) నివసించగా దిగువ నగరములో సామాన్యులు జీవించేవారు. దీనిని బట్టి సింధు నాగరికత ప్రజల్లో సామాజిక మరియు ఆర్థిక వ్యత్యాసాలు బలంగా ఉండేవని తెలుస్తుంది. అయితే ఈ క్రింది రెండు నగరాల్లో మాత్రము ఈ రకమైన విభజన కనిపించదు.
  1. చాన్హుదారో: ఇక్కడ నగర విభజన స్పష్టంగా జరగలేదు. ఎగువ నగరము చుట్టూ కోట నిర్మించబడలేదు. కోటలేని ఏకైక నగరము చన్హుదారో అని చెప్పవచ్చు.
  2. ధోలవీర: సింధు నగరాలన్నీ రెండు భాగాలుగా విభజించబడితే ధోలవీర మాత్రము ఎగువ నగరం, మధ్య నగరము మరియు దిగువ నగరము అనే మూడు భాగాలుగా విభజించబడింది. ఈ నగరం భిన్నమైన ప్రణాళికతో నిర్మించబడింది.
  • గ్రిడ్ పద్ధతిని అనుసరించి నగర నిర్మాణము జరిగింది. రహదారులను వంకరలు లేకుండా నిర్మించారు. అన్ని రహదారులు పరస్పరము 90° కోణంలో ఖండించుకుంటూ నగరాన్ని సమాన కొలతలు కలిగిన భాగాలుగా విభజించాయి. విహంగ వీక్షణములో ఈ నగరాలు చదరంగపు బల్ల (chess board) ను తలపిస్తాయి. హర్యానాలోని బనవాలిలో తప్ప ఈ గ్రిడ్ నిర్మాణము సింధు నగరాలన్నింటిలోనూ కనిపిస్తుంది.
  • భూగర్భ మురికి కాలువలు (underground drainage) సింధు నగర నిర్మాణంలో అత్యంత విశిష్టమైన ఇంకొక లక్షణము. ప్రతి నగరములో మురికి నీరు భూగర్భ కాలువల ద్వారా బయటకు వెళ్ళే ఏర్పాటు చేయబడింది. బనవాలి మినహా అన్ని నగరాల్లో భూగర్భ మురికి కాలువల నిర్మాణము జరిగింది.
  • సింధు ప్రజలు తమ ఇళ్ళకు కిటికీలు, తలుపులు రహదారి వైపు కాకుండా వెనుకవైపు ఏర్పాటు చేసుకున్నారు. బహుశ దుమ్ము, ధూళి ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు చేపట్టి ఉంటారు. ఒక లోథాల్‌లో మాత్రమే ఇళ్ళ తలుపులు మరియు కిటికీలు ప్రధాన రహదారి వైపు నిర్మించారు. సింధు ప్రజలు ఆరోగ్యానికి మరియు పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారని ఆర్.యస్.శర్మ అభిప్రాయపడ్డారు. #Harappan Civilization#

 

Leave a Comment

error: Content is protected !!