గుప్తుల యుగము – భారతదేశపు నిజమైన గోల్డెన్ ఏజ్ (Part-1)

గుప్తుల తొలి చరిత్రకు సంబంధించిన ఆధారాలు లభ్యము కావడం లేదు. ఈ వంశంలోని తొలిరాజులు మహారాజ అనే బిరుదాన్ని తీసుకోవడముతో వారు సామంతులుగా పాలించారని తెలుస్తోంది. అయితే గుప్తులు ఎవరికి సామంతులో తెలియడం లేదు. గుప్తులు కుషాణులకు సామంతులుగా ప్రయాగ నుండి పాలిస్తూ తర్వాత స్వతంత్రులై పాటలీపుత్రము నుంచి పాలించారని కొంతమంది చరిత్రకారులు అభిప్రాయం.

గుప్తుల చరిత్రకు ఆధారాలు

సాహిత్య ఆధారాలు: గుప్తుల చరిత్ర తెలుసుకోవడానికి క్రింది గ్రంథాలు తోడ్పడుతున్నాయి. ఈ గ్రంథాలన్నీ సంస్కృత భాషలోనే వ్రాయబడ్డాయి.

గ్రంథం రచయిత సమాచారము
నీతిసారము కామాంధకుడు గుప్తుల పరిపాలన
కౌముదిమహోత్సవము వజ్జికుడు చంద్రగుప్త పట్టాభిషేకము
దేవీచంద్రగుప్తము విశాఖదత్తుడు రెండవ చంద్రగుప్తుడు ధృవాదేవిని వివాహం చేసుకోవడం
మృచ్ఛకటికము శూద్రకుడు చారుదత్త అనే బ్రాహ్మణుడు వసంతసేన అనే వేశ్యను వివాహం చేసుకోవడం
కథాసరిత్సాగరము సోమదేవుడు భారతీయ సంస్కృతి ఆగ్నేయాసియా దేశాలకు విస్తరించడం
పురాణాలు గుప్తుల వంశావళి

 

వీటితో పాటుగా ఫాహియాన్ రచన కూడా గుప్తుల గురించి విలువైన సమాచారాన్ని ఇస్తుంది. ఇతను చైనా నుండి భారతదేశానికి వచ్చిన బౌద్ధసన్యాసి. క్రీ.శ.399 నుండి 414 వరకు చంద్రగుప్త-2 పాలనాకాలంలో భారతదేశాన్ని పర్యటించారు. ఇతను మనదేశంలోని అస్పృశ్యత గురించి తెలియజేసిన తొలి విదేశీ యాత్రికుడు. అస్పృశ్య కులాలకు చెందినవారు అనుభవిస్తున్న సామాజిక, మత, ఆర్థిక మరియు విద్యాపరమైన వివక్షతల గురించి సంపూర్ణ సమాచారాన్ని అందజేశాడు.

శాసనాధారాలు

గుప్తులకు సంబంధించిన 42 శాసనాలు లభ్యమయ్యాయి. ఇందులో ప్రశస్తిలు మరియు దానశాసనాలున్నాయి. అందులో ముఖ్యమైనవి:

సముద్రగుప్తుడు చేసిన నాలుగు శాసనాలు:
  1. ఎరాన్ ప్రశస్తి (మధ్యప్రదేశ్): ఇందులో సముద్రగుప్తుని విజయాలు లిఖించబడ్డాయి.
  2. అలహాబాద్ ప్రశస్తి: ఈ శాసనాన్ని సముద్రగుప్తుని దగ్గర సంధి విగ్రాహకుడు అయిన హరిసేనుడు రచించాడు. సముద్రగుప్తుడు జయించిన రాజ్యాలను ఈ శాసనం తెలియజేస్తుంది. ఈ శాసనం అలహాబాద్‌లోని అశోకుని స్తంభంపైన లిఖించబడింది.
  3. నలంద తామ్రశాసనము (బీహార్): ఇది దానశాసనము. సముద్రగుప్తుడు ఒక బ్రాహ్మణుడికి అగ్రహారాన్ని ఇచ్చినట్లుగా తెలియజేస్తుంది. బ్రాహ్మణులకు భూములను దానం చేసే పద్ధతి శాతవాహనుల కాలంలోనే ప్రారంభమైనప్పటికీ, వాటికి అగ్రహారాలనే పేరు గుప్తుల కాలంలో ఇవ్వబడింది. అగ్రహార అనే పదము తొలిసారిగా సముద్రగుప్తుని నలంద తామ్ర శాసనం (copper plate inscription)లోనే కనిపిస్తుంది.
  4. గయ తామ్ర శాసనం (బీహార్): సముద్రగుప్తుడు గయలోని ఒక బౌద్ధ విహారానికి గ్రామాన్ని దానం ఇచ్చినట్లుగా ఈ శాననం తెలియజేస్తుంది. గయలోని ఈ బౌద్ధవిహారాన్ని శ్రీలంక రాజైన మహామేఘవర్మ నిర్మించాడని కూడా ఈ దానశాసనము తెలియజేస్తుంది.
చంద్రగుప్త-2 వేసిన మెహ్రాలి ఇనుపస్తంభ శాసనము (ఢిల్లీ):

ఇతని యొక్క సైనిక విజయాలను తెలియజేస్తుంది. ఈ శాసనము వేయబడిన ఇనుప స్తంభము దాదాపుగా 6 టన్నుల బరువు మరియు 23 అడుగుల ఎత్తు కలిగి ఉంది. గత 1500 ఏళ్ళుగా వర్షాలకు తడుస్తూ, ఎండలకు ఎండుతూ తుప్పు పట్టకుండా ఉండటము దీని విశేషము.

స్కంధ గుప్తుడు వేసిన రెండు ప్రశస్తి శాసనాలు:
  1. జునాఘర్ శాసనము: ఈ శాసనములో ప్రాచీనమైన సుదర్శన తటాకానికి మరమ్మత్తులు చేయించినట్లుగా స్కంధ గుప్తుడు తెలియజేశాడు. (ఇంతకు ముందు శకరాజు రుద్రదమనుడు కూడా తన జునాఘర్ శాసనములో సుదర్శన తటాకము గురించి సమాచారమిచ్చాడు).
  2. భితారి శాసనము (మధ్యప్రదేశ్): స్కంద గుప్తుడు హూణులతో (Huns) యుద్ధాలు చేసినట్లుగా ఈ శాసనము తెలియజేస్తుంది. మధ్య ఆసియాకు చెందిన గిరిజనులైన హూణులు భారతదేశంపై పలుమార్లు దండెత్తి గుప్త సామ్రాజ్యాన్ని అంతం చేశారు. తోరమానుడు మరియు అతని కుమారుడు మిహిరకులుడు హూణులకు నాయకత్వం వహించారు.
  3. పూనా తామ్రశాసనము (మహారాష్ట్ర): ఈ దాన శాసనాన్ని రెండవ చంద్రగుప్తుని కుమార్తె ప్రభావతిగుప్త వేయించింది. ఇందులో భూసర్వే విధానము గురించి సమాచారముంది.
భానుగుప్తుడి ఎరాన్ శాసనము (మధ్యప్రదేశ్):

క్రీ.శ.510లో ఈ ప్రశస్తి వేయబడింది. ఇది సతీసహగమనం సాంప్రదాయాన్ని ప్రస్తావిస్తున్న తొలి శాసనం.

యశోవర్మ వేసిన మాండసోర్ శాసనము (మధ్యప్రదేశ్):

మాండసోర్ రాజధానిగా పాలించిన యశోవర్మ అనే రాజు క్రీ.శ.532 వేసిన ప్రశస్తి శాసనమిది. ఇందులో యశోవర్మ గుప్తులపై దండెత్తి వారిని ఓడించినట్లుగా సమాచారముంది.

నాణెములు

గుప్తుల చరిత్ర తెలుసుకోవడంలో నాణెములు కీలకపాత్ర పోషిస్తాయి. గుప్తచక్రవర్తులు దినార్‌లు అనబడే బంగారు నాణెములను ‘రుపయ’ అనబడే వెండి నాణెములను ముద్రించారు. సామాన్య ప్రజలు సముద్రపు గవ్వలను నాణెములుగా ఉపయోగించారని ఫాహియాన్ తెలియజేశాడు.

  • చంద్రగుప్త-1 ముద్రించిన నాణెములపైన అతని భార్య కుమారదేవి కూడా కనిపిస్తుంది. అంతఃపుర స్త్రీలను నాణెములపైన ముద్రించడము అసాధారణమైన సాంప్రదాయము.
  • సముద్రగుప్తుడు అనేక రకాల బంగారు నాణెములను ముద్రించాడు. అందులో ముఖ్యమైనవి.
  1. వీణవాయిస్తూ, కవిరాజు అనే బిరుదుతో ఉన్న నాణెములు
  2. అశ్వమేధయాగం చేస్తూ, అశ్వమేధపరాక్రమ అనే బిరుదు గల నాణెములు
  3. పులిని వేటాడుతూ, వ్యాఘ్రపరాక్రమ అనే బిరుదు గల నాణెములు
  • రెండవ చంద్రగుప్తుడు శకులను ఓడించి వారి రాజధాని ఉజ్జయిని ఆక్రమించుకొని వెండి నాణెములు ముద్రించాడు. ఇతని వెండి నాణెములపైన శకుల ప్రభావము ఉంటుంది. ఈ నాణెములపైన సింహచంద్ర, నరేంద్రసింహ, సింహవిక్రమ అనే బిరుదులు కనిపిస్తాయి.
  • కుమారగుప్తుని 1395 వెండి నాణెములు మహారాష్ట్రలోని సమంద్ అనే ప్రాంతంలో లభించాయి. ఈ నాణెములపైన ఇతను అశ్వమేధయాగము చేస్తున్న దృశ్యము మరియు అశ్వమేధమహేంద్ర అనే ఇతని బిరుదు కనిపిస్తుంది.

గుప్తుల రాజకీయ చరిత్ర

 

శ్రీగుప్తుడు (క్రీ.శ.275 – 300)

ఇతను గుప్తవంశ స్థాపకుడు. మహారాజు అనే బిరుదాన్ని తీసుకోవడముతో ఇతను సామంతుడై ఉంటాడని చరిత్రకారుల అభిప్రాయం. చైనా యాత్రికుడైన ఇత్సింగ్ ప్రకారం శ్రీగుప్తుడు మృగశిఖవనములో ఒక బౌద్ధ విహారాన్ని నిర్మించాడు.

చంద్రగుప్త – 1 (క్రీ.శ320 – 335)

మహారాజాధిరాజ అనే బిరుదాన్ని తీసుకోవడముతో ఇతను స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడని అనుకోవచ్చు. లిచ్చవి రాకుమార్తె కుమారదేవిని వివాహము చేసుకొని వారి మద్ధతు ద్వారా స్వతంత్రుడై ఉండవచ్చు.

సముద్రగుప్తుడు (క్రీ.శ.335 – 380)

గుప్తుల్లో అందరికంటే గొప్పవాడు. ఇతని విజయాలను అలహాబాద్ ప్రశస్తి వివరంగా తెలియజేస్తుంది. ఈ శాసనము ప్రకారం సముద్రగుప్తుడు ఈ క్రింది రాజ్యాలను జయించాడు.

  • ఎనిమిది ఆర్యావర్త రాజ్యాలు: ఉత్తర భారతదేశంలోని 8 రాజ్యాలను జయించాడు. ఇందులో పద్మావతి (గ్వాలియర్) పాలకుడైన గణపతినాగను ఓడించడము ఇతని యొక్క గొప్పవిజయము.
  • ఐదు ప్రత్యాంత రాజ్యాలు: కామరూప (అస్సాం), ధవక (అస్సాం), కార్తిపుర (కాశ్మీర్), సమతట (బెంగాల్) మరియు నేపాల్ అనే 5 సరిహద్దు రాజ్యాలను జయించాడు.
  • 18 ఆటవిక రాజ్యాలు: వింధ్యా పర్వతాల్లోని 18 గిరిజన రాజ్యాలను జయించాడు.
  • తొమ్మిది గణ రాజ్యాలు: ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాలు కలిగిన 9 గణతంత్ర రాజ్యాలను జయించాడు. మాళవ రాజ్యము, అభీర రాజ్యము, యౌధేయరాజ్యము, అర్జునాయన రాజ్యాలు ఇందులో ముఖ్యమైనవి.
  • 12 దక్షిణాపథ రాజ్యాలు: మహానది మరియు కావేరి నది మధ్యలోని 12 రాజ్యాలను సముద్రగుప్తుడు జయించాడని అలహాబాద్ శాసనం తెలియజేస్తుంది. సముద్ర గుప్తుడు ఓడించిన దక్షిణాది రాజులలో కోసలను పాలించే మహేంద్ర (ఒడిషా), వేంగిని పాలించే హస్తివర్మ (కోస్తాంధ్ర), కంచిని పాలించే విష్ణుగోప (తమిళనాడు) ముఖ్యులు.

దక్షిణాది రాజ్యాల పట్ల సముద్రగుప్తుడు ‘గ్రహణ – మోక్ష – అనుగ్రహ’ అనే క్రొత్త విధానాన్ని అమలు జేశాడు. అంటే ఈ 12 రాజ్యాలను సామంత రాజ్యాలుగా మార్చాడు.

ఈ విధంగా ఒక చిన్న రాజ్యాన్ని మహాసామ్రాజ్యంగా తీర్చిదిద్దిన సముద్రగుప్తుడిని వి.ఏ.స్మిత్ అనే ఆంగ్లేయ చరిత్రకారుడు ‘ఇండియన్ నెపోలియన్’ అని అభివర్ణించాడు.

చంద్రగుప్త-2 (క్రీ.శ.380 – 412)

 

  • క్రీ.శ.388లో శకరాజైన రుద్రసింహ-3ను ఓడించి, వారి రాజధాని ఉజ్జయినిని ఆక్రమించుకొని, శకారి మరియు విక్రమాదిత్య అనే బిరుదులు తీసుకున్నాడు. ఉజ్జయిని గుప్తులకు రెండవ రాజధానిగా మారింది. రుద్రసింహ-3ను భారతదేశంలోని చివరి శకరాజుగా గుర్తించవచ్చు.
  • చంద్రగుప్త-2 వైవాహిక సంబంధాల ద్వారా గుప్త సామ్రాజ్యాన్ని బలోపేతము చేశాడు. పద్మావతి పాలకుడైన గణపతినాగుని కుమార్తె అయిన కుబేరనాగను వివాహము చేసుకొని, తన కుమార్తె అయిన ప్రభావతిగుప్తను వాకాటక రాజు రుద్రసేన – 3కు ఇచ్చి వివాహం చేశాడు.
  • ఒక సాంప్రదాయం ప్రకారం నవరత్నాలు అనబడే ఈ క్రింది 9 మంది పండితులు ఇతని ఆస్థానంలో ఉన్నారు.
1. కాళిదాసు:

ఈ మహాకవి మూడు నాటకాలను, నాలుగు కావ్యాలను రచించాడు. అవి:

అభిజ్ఞాన శాకుంతలము – ప్రపంచములోని అత్యంత గొప్ప నాటకాల్లో ఇదొకటి. మేనక మరియు విశ్వామిత్రుని కుమార్తె అయిన శకుంతలను దుష్యంతుడు వివాహాం చేసుకునే కథాంశంతో ఈ నాటకము వ్రాయబడింది.

మాళవికాగ్నిమిత్రము – శుంగరాజైన అగ్నిమిత్రుడు మాళవికను ప్రేమించి పెళ్ళిచేసుకోవడము ఈ నాటక ఇతివృత్తము.

విక్రమోర్వశీయము – విక్రమాదిత్యుడనే వీరుడు అప్సరసయైన ఊర్వశిని వివాహము చేసుకునే కథతో ఈ నాటక రచన జరిగింది.

(నోట్‌: పై మూడు నాటకాలను నాటకత్రయము అంటారు.)

కుమారసంభవం – శివపార్వతులకు కుమారస్వామి జన్మించే కథాంశముతో ఈ కావ్య రచన జరిగింది.

మేఘదూతము – వింధ్య పర్వతాల్లోని ఒక యక్షుడు హిమాలయాల్లో ఉన్న తన ప్రేయసికి మేఘాన్ని దూతగా చేసుకొని తన విరహ వేదనను పంపించే కథ ఈ కావ్యంలో ఉంటుంది.

ఋతుసంహారం – భారతదేశంలోని భిన్న ఋతువులను తెలియజేసే కావ్యం.

రఘువంశం – శ్రీ రామచంద్రుడి గాథ ఇందులో ఉంటుంది. ఈ కావ్యం పూర్తి చేయబడలేదు.

2. విష్ణుశర్మ:

చిన్న, చిన్న కథలతో కూడిన పంచతంత్రంను రచించాడు. ఈ కథలను ‘ఇబ్న్‌-అల్‌-ముఖప్ఫ’ అరబిక్ భాషలో ‘కలిల-ఎ-దిమ్న’ (Calila-e-Dimna) అనే పేరుతో అనువదించాడు.

3. అమరసింహ:

అమరకోశము అనే సంస్కృత నిఘంటువును రచించాడు.

4. వరరుచి/ వజ్రరుచి:

నవరత్నాలలో ఏకైక ప్రాకృత కవి. ప్రాకృతప్రకాశ అనే వ్యాకరణ గ్రంథము వ్రాశాడు.

5. ధన్వంతరి:

ఆయుర్వేదానికి సంబంధించిన ‘నిఘంటు’ను రచించాడు.

6. శుశృత:

శస్త్రచికిత్సలపైన శుశృత సంహిత అనే గ్రంథాన్ని రచించాడు.

7. ఆర్యభట్ట:

ఖగోళశాస్త్రముపైన సూర్య సిద్దాంతం మరియు గణితశాస్త్రముపైన ఆర్యభట్టీయము రచించాడు. ఆర్యభట్టీయములో దశాంశ పద్ధతి మరియు ‘0’ను విరివిగా ఉపయోగించాడు. సూర్య సిద్దాంతములో సూర్యకేంద్రక సిద్ధాంతము (helio-centric theory), భూభ్రమణము (rotation), భూపరిభ్రమణము (revolution), సూర్య మరియు చంద్ర గ్రహణాలకు గల శాస్త్రీయ కారణాలను మరియు ఇతర ఖగోళశాస్త్ర అంశాలు చర్చించబడ్డాయి.

8. వరాహమిహిరుడు:

ఈయన రెండు కావ్యాలు రచించాడు.

  1. బృహత్సంహిత – ఇది భారతీయ శాస్త్రాల విజ్ఞాన సర్వస్వము.
  2. పంచసిద్ధాంతిక – ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ఐదు సిద్ధాంతాలు ఇందులో ఉంటాయి.
9. బ్రహ్మగుప్తుడు:

‘ఖండఖాడ్య’ అనే గ్రంథాన్ని రచించాడు. గురుత్వాకర్షణ గురించి తెలియజేసినందుకుగాను ఇతన్ని ‘ఇండియన్ న్యూటన్’ అని పిలుస్తారు.

కుమారగుప్త (క్రీ.శ.412 – 455)

 

  • ఇతని కాలంలోనే తొలి హూణుల దాడి జరిగింది.
  • ఇతను సుప్రసిద్ధ మహాయాన మతానికి చెందిన నలంద విశ్వవిద్యాలయమును స్థాపించాడు. ఈ విశ్వవిద్యాలయానికి దేశ,విదేశాల నుంచి విద్యార్థులు వచ్చేవారు. చైనా యాత్రీకుడైన హ్యుయాన్‌త్సాంగ్ ప్రకారము 8500 మంది విద్యార్ధులు మరియు 1500 మంది ఉపాధ్యాయులు ఇక్కడ ఉండేవారు. రత్నధది, రత్నరంజక, మరియు రత్నసాగర అనబడే మూడు గ్రంథాలయాలుండేవి. ధర్మపాల, శీలభద్ర, ధర్మకీర్తి లాంటి గొప్ప బౌద్ధపండితులు ఈ విశ్వవిద్యాలయానికి అధిపతులుగా పనిచేశారు. 12వ శతాబ్దంలో తురుష్కుల దాడిలో ఈ విశ్వవిద్యాలయము అంతమైంది.
నరసింహగుప్త బాలాదిత్య

చివరి గుప్త చక్రవర్తుల్లో ఒకడు. హ్యుయాన్‌త్సాంగ్‌ ప్రకారము ఇతను బౌద్ధమతాన్ని స్వీకరించారు. ఒడిషాలోని రత్నగిరిలో ఒక మహావిహారాన్ని నిర్మించాడు. హూణుల నాయకుడైన మిహిరకులను ఓడించి విడిచిపెట్టాడు.

విష్ణుగుప్తుడు:

గుప్తుల్లో చివరి చక్రవర్తి. ఇతని మరణంతో 6వ శతాబ్దపు మధ్యలో గుప్త సామ్రాజ్యము అంతమైంది.

Leave a Comment

error: Content is protected !!