మిత్రలాభం – చిత్రగ్రీవుని తెలివి
మిత్రులారా! ఇంతకు ముందు మనం చెప్పుకున్న పులి-బాటసారి కథ గుర్తు ఉంది కదా! ఇప్పుడు తరువాత జరిగిన కథ ఏమిటో తెలుసుకుందాం. సరేనా!
చిత్రగ్రీవుడు చెప్పిన ‘పులి-బాటసారి’ కథ విన్న ఓ ముసలి పావురం, “ఇలాంటి పుక్కింటి పురాణాలు చాలా విన్నాం. ఓ చిత్రగ్రీవా నీవు రాజువైతే అయ్యావుగానీ… నీకన్నీ అనుమానాలే! ఇలా ప్రతిదానికీ అనుమానపడి, భయపడిపోతూ ఉంటే మన ఆకలి తీరుతుందా? ఎదురుగా ఉన్న ఆహారాన్ని వదులుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. ఇప్పటికే నూకల కోసం తిరిగి, తిరిగి మనమందరం బాగా అలసిపోయాం. నాకైతే విపరీతంగా ఆకలివేస్తోంది. ఎవరు ఏమనుకున్నా… నేను మాత్రం దొరికిన ఈ ఆహారాన్ని వదులుకోను” అని అంది. అంతటితో ఊరుకోకుండా, “మిత్రులారా నేను కిందకు దిగుతున్నాను. మరి నాతో వస్తారా? లేదా? అన్నది ఇక మీ ఇష్టం” అని కిందకు దిగడం మొదలెట్టింది. దీనితో అప్పటికే ఆకలితో అలమటిస్తున్న మిగతా పావురాలు కూడా కిందకు దిగాయి.
ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చిత్రగ్రీవుడు కూడా కిందకు దిగాల్సి వచ్చింది. అయితే చిత్రగ్రీవుడు అనుకున్నట్లే జరిగింది. పావురాలు అన్నీ వలలో చిక్కుకున్నాయి. దీనితో అవి భయంతో గజగజ వణికిపోయాయి.
కిందకు దిగుదామని సలహా ఇచ్చిన ముసలి పావురాన్ని తిట్టిపోశాయి. చిత్రగ్రీవ రాజు చెప్పినట్లు వినలేదని చాలా బాధ పడ్డాయి. క్షమించమని తమ మహారాజు చిత్రగ్రీవుని వేడుకున్నాయి.
అప్పుడు చిత్రగ్రీవుడు, “మిత్రులారా! పాపం ఆ ముసలి పావురాన్ని ఏమీ అనకండి. ఆకలి బాధ తట్టుకోలేక అది అలా చేసింది. మనమందరం కూడా అదే చేశాం. అందువల్లనే ఈ ఉచ్చులో చిక్కుకున్నాం. కనుక నింద ఒకరిపై వేయడం మంచి పనికాదు. ప్రస్తుతం మనం ఆపదలో చిక్కుకున్నాం. అయినా మరేం భయం లేదు. ఉపాయంతో మనం ఈ ఆపద నుంచి తప్పించుకోవచ్చు” అన్నాడు.
“ఎలా మహారాజా మనం తప్పించుకోవడం. ఈ భారీ వలలో మనం చిక్కుకున్నాం కదా!” అని తోటి పావురాలు అడిగాయి. దానికి చిత్రగ్రీవుడు నవ్వి, “మరేం ఫర్వాలేదు. మనమందరం ఐకమత్యంగా కలిసి పనిచేసామంటే ఈ అపాయం నుంచి సులువుగా తప్పించుకోవచ్చు. అదేలా అంటే మనమందరం ఒకేసారి ఎగిరామంటే, మనతో పాటు ఈ వల కూడా వచ్చేస్తుంది. అందువల్ల వేటగాడు మనల్ని పట్టుకోలేడు” అని ఉపాయం చెప్పాడు.
ఇంతలో ఓ పావురం, “అదిగో వేటగాడు మన వైపు వస్తున్నాడని” భయంతో గట్టిగా అరిచింది. దీనితో చిత్రగ్రీవుడు, “మిత్రులారా! భయపడకండి. అందరూ ఒకేసారి పైకి ఎగరండి. సమయం లేదు” అని ఆజ్ఞాపించాడు.
దీనితో అన్ని పక్షులు ఒక్కసారిగా పైకి ఎగిరాయి. వేటగాడు అది చూసి వాటి వెంటపడ్డాడు. కానీ వాటి వేగాన్ని అందుకోలేకపోయాడు. చివరికి అయ్యయ్యో పావురాలు దొరకకపోగా, ఉన్న వల కూడా పోయిందే అని ఊసురుమంటూ ఇంటిదారిపట్టాడు.
ఇదంతా చెట్టుపై ఉన్న లఘుపతనకుడు అనే కాకి ఓ కంట గమనిస్తూనే ఉంది. పావురాల రాజైన చిత్రగ్రీవుని తెలివిని మనస్సులో మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. ఇంతకీ ఈ పావురాలు ఎక్కడికి వెళ్తున్నాయి. అవి వల నుంచి ఎలా తప్పించుకుంటాయి? ఇదేదో చూసి తీరవలసిందే అని లఘుపతనకం నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా ఆ పావురాల గుంపును చాటుగా అనుసరించడం మొదలుపెట్టింది.
పావురం – ఎలుక కథ
ఆకాశంలో వలతో సహా ఎగురుతున్న పావురాలు… చిత్రగ్రీవునితో, “మహరాజా, ఇలా మనం ఎంత దూరం వెళ్లాలి. ఈ వల నుంచి మనం ఎలా తప్పించుకుంటాం” అని ప్రశ్నించాయి. అందుకు చిత్రగ్రీవుడు, “ మిత్రులారా, గండకీ నది ఒడ్డున విచిత్రవనమనే ఓ మహారణ్యం ఉంది. అక్కడ హిరణ్యకుడు అనే ఓ ఎలుకల రాజు ఉన్నాడు. అతను నాకు చాలా మంచి మిత్రుడు. అతని సాయంతో మనం ఈ ఆపద నుంచి తప్పించుకోవచ్చు” అని చెప్పాడు.
సరే అని పావురాలన్నీ విచిత్రవనానికి చేరుకున్నాయి. పక్షుల అరుపులు విని హిరణ్యకుడు, దాని పరివారం భయంతో తమ తమ కలుగుల్లో దాక్కొన్నాయి.
కొద్ది సేపటికే చిత్రగ్రీవుడు సహా పావురాలు అన్నీ హిరణ్యకుడి కలుగు దగ్గర వాలాయి. హిరణ్యకుడికి మరింత భయం వేసింది. ఏం ప్రమాదం ముంచుకొచ్చిందోనని గజగజ వణికిపోయాడు.
ఇంతలో చిత్రగ్రీవుడు, “మిత్రమా హిరణ్యకా! నేను నీ మిత్రుడిని… చిత్రగ్రీవుడిని… నీ కోసం, నీ సాయం కోసం వచ్చాను” అని కేక వేశాడు. ఆ మాటలు విన్న హిరణ్యకునికి ఒక్కసారిగా చెవిలో అమృతం పోసినట్లు అనిపించింది. తన చిరకాల మిత్రుడిని చూడాలని ఎంతో ఆతృతతో కలుగులోంచి బయటకు వచ్చాడు.
“ఎన్నాళ్లకెన్నాళ్లకు వచ్చావు మిత్రమా!” అంటూ కౌగిలించుకోబోయాడు. అంతలోనే తన మిత్రుడు, అతని బృందం వలలో చిక్కుకున్న విషయాన్ని గమనించి, “ఏమిటి మిత్రమా! మీరు వలలో ఎలా చిక్కుకున్నారు? అని అంటూనే, తన మిత్రుని విడిపించేందుకు వలను కొరకడం మొదలుపెట్టాడు.
వెంటనే చిత్రగ్రీవుడు, “ఆగు మిత్రమా ఆగు! ముందుగా నా తోటి పావురాలను విడిపించు, తరువాత నన్ను విడిపించుదువుగానీ” అన్నాడు.
దీనితో హిరణ్యకుడితో పాటు తోటి పావురాలు కూడా ఒక్కసారిగా అవాక్కయ్యాయి.
“అదేంటి మిత్రమా! నేను మీ అందరినీ కచ్చితంగా విడిపిస్తాను. కానీ ముందుగా పావురాల రాజువైన నిన్ను విడిపిస్తాను” అని హిరణ్యకుడు అన్నాడు.
చిత్రగ్రీవుడు చిరుమందహాసంతో, “మిత్రమా హిరణ్యకా! ఒక రాజుగా నా ప్రథమ కర్తవ్యం… నన్ను నమ్ముకున్న తోటివారిని కాపాడుకోవడం. ఆ తరువాతే నా స్వవిషయం. నా వారిని నేను రక్షించుకోలేనప్పుడు… ఇక నేను రాజుగా బ్రతికి ఉండడం కూడా అనవసరం” అని అన్నాడు.
పావురాలన్నీ చెమర్చిన కళ్లతో తమ రాజు చిత్రగ్రీవుని ఆరాధనగా చూశాయి. తమ రాజును చూసి గర్వంతో ఉప్పొంగిపోయాయి. మనస్సులోనే తమ రాజుకు జేజేలు పలికాయి.
హిరణ్యకుడు కూడా తన మిత్రుని గొప్పదనాన్ని చూసి చాలా ఆనందించాడు. తన పరివారాన్ని ఆజ్ఞాపించి, పావురాలన్నింటిని బంధవిముక్తులను చేశాడు.
అప్పుడు చిత్రగ్రీవుడు… అక్కడ ఉన్న వారందరీ ఉద్దేశించి,” ఈ లోకంలో నిస్వార్థంగా మనల్ని రక్షించేవారు ముగ్గురు ఉంటారు. ఒకరు తల్లి, మరొకరు తండ్రి. అయితే వారిద్దరూ మనకు రక్త సంబంధీకులు. అలా కాకుండా అప్పుడప్పుడు చాలా మంది ఇతరులు కూడా మనకు సాయం చేస్తూ ఉంటారు. కానీ మన అవసరం వారికి ఉన్నప్పుడు మాత్రమే అలా సాయం చేస్తుంటారు. లేకపోతే మనల్ని కన్నెత్తి కూడా చూడరు. కానీ ఏ రక్త సంబంధం లేకుండా మనల్ని నిస్వార్థంగా రక్షించేది ఒక్క నిజమైన మిత్రుడు మాత్రమే. అలాంటి మిత్రుడే నా హిరణ్యకుడు” అని గర్వంగా ప్రకటించాడు. తరువాత తమను ఆపద నుంచి రక్షించిన తన మూషిక మిత్రుడికి స్వయంగా కృతజ్ఞతలు తెలిపాడు. మిగిలిన పావురాలు కూడా తమను బంధవిముక్తులను చేసిన ఆ మూషిక పరివారానికి కృతజ్ఞతలు తెలిపాయి.
తరువాత రాకరాక వచ్చిన తన మిత్రునికీ, ఆయన పరివారానికీ హిరణ్యకుడు ఘనమైన విందు ఇచ్చాడు. ఆ విందులో, “ఐకమత్యం అనేది చాలా గొప్పది. దాని వల్లనే వలలో చిక్కుకున్న మన మిత్రులు గొప్ప ఆపద నుంచి తప్పించుకున్నారు. వారిని చూసి మన మూషికాలు కూడా చాలా ఐకమత్యంగా ఉండాలని” హిరణ్యకుడు తన పరివారానికి సూచించాడు.
రోజంతా విందులు, వినోదాలతో గడిపిన తరువాత… చిత్రగ్రీవుడు తన మిత్రుడైన హిరణ్యకుని దగ్గర సెలవు తీసుకొని, తన రాజ్యానికి పయనమయ్యాడు. హిరణ్యకుడు కూడా వారికి ఘనమైన వీడ్కోలు పలికి, తన కలుగులోకి వెళ్లిపోయాడు.
ఇదంతా చాటుగా చూస్తున్న లఘుపతనకమనే కాకి, హిరణ్యకుని మంచితనాన్ని తన మనస్సులో మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. తప్పకుండా ఇలాంటి మంచి మూషిక రాజుతో స్నేహం చేయాలనుకుంది. అనుకున్నదే తడవుగా, హిరణ్యకుని కలుగు ముందు వాలింది.
*మిత్రులారా కథ ఇంకా ఉంది… వేచి ఉండండి*
ఇదీ చూడండి: పులి – బాటసారి కథ
ఇదీ చూడండి: శత్రువు ఎంత బలవంతుడైతే ఏంటి?