భారతదేశంలో నూతన మతాల ఆవిర్భావము
క్రీ.పూ.6వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా అనేక నూతన మతాలు ఆవిర్భవించాయి. ఇరాన్‌లో జొరాస్ట్రియన్ మతం, చైనాలో కన్ఫూషియస్ మరియు టావోయిజం, జపాన్‌లో షింటోయిజం మరియు భారతదేశంలో బౌద్ధ, జైన, అజీవిక మొదలైన నూతన మతాలు ఆవిర్భవించాయి.
భారతదేశంలో క్రీ.పూ.6వ శతాబ్దంలో 62 అవైదిక ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉద్యమాలన్నీ అనాటి సాంప్రదాయ బ్రాహ్మణ ఆధిపత్య సమాజాన్ని, జంతుబలులు మరియు యజ్ఞయాగాలతో కూడిన వైదిక మతాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. వీటిలో బౌద్ధం, జైనం మరియు అజీవిక ఉద్యమాలు పరిపూర్ణమైన మతాలుగా ఆవిర్భవించి కొనసాగాయి.
బౌద్ధ మరియు జైన మతాల ఆవిర్భావానికి కారణాలు
బౌద్ధ మరియు జైన మతాల ఆవిర్భావానికి ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు మత పరిస్థితులే కారణమని చెప్పవచ్చు.
సామాజిక కారణాలు: కులవ్యవస్థ ఆధారంగా కొనసాగిన సామాజిక వివక్షత మరియు లింగ వివక్షత బౌద్ధ మరియు జైన మతాలు ఆవిర్భవించడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. సమాజంలోని మితిమీరిన బ్రాహ్మణ ఆధిపత్యం ఇతర వర్గాల్లో తీవ్రమైన అసంతృప్తిని మిగిల్చింది. శూద్రులను ఏకజులుగా ముద్రవేసి అన్ని రకాల వివక్షతలకు గురిచేశారు.
మహిళలను ఇంటికి పరిమితం చేసి వారి స్వేచ్ఛను మరియు హక్కులను కాలరాశారు. ఆర్థికంగా బలోపేతమైన వైశ్యులకు సమాజంలో సరైన గుర్తింపు ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో సామాజిక మరియు లింగ సమానత్వాన్ని బోధిస్తూ, వివక్షతలను తిరస్కరిస్తూ బౌద్ధ మరియు జైన మతాలు ప్రారంభమయ్యాయి.
ఆర్థిక కారణాలు: వైదిక మత ఆచారాలు మరియు యజ్ఞయాగాదులు ఆనాటి ఆర్థిక వ్యవస్థలో సంక్షోభాన్ని సృష్టించాయి. వ్యవసాయంలో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్న పశువులను యజ్ఞయాగాల పేరుతో వధించడము, వాణిజ్యానికి వెన్నెముక అయిన వడ్డీ వ్యాపారాన్ని వైదిక గ్రంథాలు నిషేధించడము, సామాన్య ప్రజానీకంలో వైదికమతం పట్ల వ్యతిరేకతను పెంచింది. బౌద్ధ, జైన మతాలు అహింసను బోధిస్తూ యజ్ఞయాగాలను ఖండించాయి.
వడ్డీ వ్యాపారాన్ని న్యాయబద్ధమైన వడ్డీతో కొనసాగించడానికి అనుమతినిచ్చాయి. బౌద్ధ గ్రంథమైన సుత్తనిపాతం గోవును ‘అన్నద, వన్నద, సుఖద’ అని కీర్తించింది. గోపు అన్నం, అందము మరియు సుఖాన్ని కలిగిస్తుందని, దీనిని చంపకూడదని అర్థము. వైదిక ధర్మశాస్త్రాలు వ్యాపార వాణిజ్యాలపైన ఆంక్షలు విధించడముతో వ్యాపార వర్గాలు వైదికమతాన్ని వీడి బౌద్ధ మరియు జైన మతాలను ఆదరించాయి.
మత కారణాలు: పురోహిత ఆధిపత్యం మరియు యజ్ఞయాగాలు కలిసి మతరంగంలో తీవ్రమైన అశాంతిని రేకెత్తించాయి. అత్యంత ఖరీదైన మరియు క్లిష్టమైన షోడష కర్మలు చేసిన వారికి మాత్రమే మోక్షప్రాప్తి కలుగుతుందని, జనాభాలో అత్యధికులైన స్త్రీలు మరియు శూద్రులు మోక్షానికి అనర్హులని ప్రకటించి వైదిక మతము సామాన్యులకు దూరం అయింది.
బౌద్ధ, జైన మతాలు సమానత్వానికి ప్రాధాన్యత కల్పిస్తూ, అందరికీ మోక్షం సాధ్యమని ప్రకటించి సామాన్య ప్రజానీకానికి దగ్గరయ్యాయి. అంతేగాకుండా బౌద్ధ, జైన మత పండితులు తమ గ్రంథాలను పండిత భాషయైన సంస్కృతంలో కాకుండా సామాన్య ప్రజలకు అర్థమయ్యే ప్రజా భాషల్లో రచించారు. బౌద్ధ గ్రంథాలు పాళి భాషలోను మరియు జైన గ్రంథాలు అర్ధమాగధి ప్రాకృతంలోను రచించబడ్డాయి.
రాజకీయ కారణాలు: బౌద్ధ, జైన మతాలు అవిర్భావానికి ఆనాటి గణతంత్ర రాజ్యాలు కూడా దోహదపడ్డాయి. గణతంత్ర రాజ్యంలోని ప్రజలు ప్రారంభము నుండి వైదిక మతానికి వ్యతిరేకులు. వీరు యజ్ఞయాగాలను, మరియు బ్రాహ్మణ ఆధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించి బౌద్ధ, జైన మతాలకు పట్టం కట్టారు. గౌతమ బుద్దుడు మరియు వర్ధమాన మహావీరుడు గణతంత్ర రాజ్యాలకు చెందినవారు కావడం విశేషము.
పైన వివరించిన సామాజిక, ఆర్థిక, మత రాజకీయ కారణాలు బౌద్ధ, జైన మత ఆవిర్భావానికి కారణమైతే, రాజుల ఆదరణ మరియు మత ప్రచారక సంఘాల కృషి వలన ఈ మతాలు దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందాయి.
బౌద్ధమతం
భారతదేశంలో ఆవిర్భవించిన అవైదిక మరియు బ్రాహ్మణ వ్యతిరేక మతాల్లో బౌద్ధం అత్యంత ముఖ్యమైనది. ఈ మతము గౌతమ బుద్ధుని బోధనల ఆధారంగా స్థాపించబడింది.
గౌతమ బుద్ధుని జీవిత విశేషాలు (క్రీ.పూ.566-486)
గౌతమబుద్ధుడు క్షత్రియ కులానికి చెందిన శాక్య తెగలో జన్మించాడు. అందుకే బుద్ధుడిని శాక్యముని అని కూడా అంటారు. బుద్ధుని అసలు పేరు సిద్దార్ధడు. ఇతని తండ్రి శుద్ధోదనుడు కపిలవస్తు (ప్రస్తుతము నేపాల్) అనే చిన్న రాజ్యాన్ని పాలించేవాడు. చిన్న వయసులోనే తల్లి మహామాయ మరణించడముతో పినతల్లి ప్రజాపతి గౌతమి పెంచింది. సిద్ధార్ధుడు తన పదహారేళ్ల వయసులో యశోధరను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు రాహుల్ అనే కుమారుడు జన్మించాడు. గౌతమ బుద్ధుని జీవితంలోని ఈ క్రింది ఐదు ప్రధాన సంఘటనలను ‘పంచ మహాకళ్యాణములు’ అంటారు. అవి:
- జననము: బుద్ధుడు నేపాల్‌లోని లుంబినిలో జన్మించాడు. దీనికి తామర పువ్వు గుర్తు.
- మహాభినిష్క్రమణ: బుద్ధుడు ఇంటిని వీడి సన్యాసాన్ని స్వీకరించడము. ఇది 29వ ఏట జరిగింది. వరుసగా వృద్ధుడు, రోగి, శవము మరియు సన్యాసిని చూసిన బుద్ధుడు మనసు వికలమై, ప్రాపంచిక జీవితాన్ని వీడి సన్యాసాన్ని స్వీకరించాడు. ”కంటక’ అనే గుర్రాన్ని అధిరోహించి తన భవంతి నుంచి నిష్క్రమించడము వలన ఆ గుర్రాన్నే మహాభినిష్క్రమణానికి గుర్తుగా పరిగణిస్తారు.
- సంబోధి: 35వ ఏట బుద్ధుడికి జ్ఞానోదయము జరిగిన సంఘటనను సంబోధి అంటారు. ఇది గయ (బీహార్) లో నిరంజన్ నది (ఫాల్గునది) ఒడ్డున బోధి వృక్షము (రావిచెట్టు) క్రింద జరిగింది. బౌద్ధులకు పవిత్రమైన బోధిచెట్టు ఈ సంఘటనకు గుర్తు.
- ధర్మచక్ర పరివర్తన: గౌతమబుద్ధుని తొలి బోధనను ధర్మచక్రపరివర్తన అంటారు. ఎనిమిది ఆకులు కలిగిన ధర్మచక్రము దీనికి గుర్తు. ఇది సారనాథ్ (కాశీపట్టణము) లోని జింకలవనంలో జరిగింది. కొండన, భదియ, వప్ప, మహానామ, అస్సగి అనే ఐదు మంది శిష్యులు బుద్ధుని తొలి బోధనకు హాజరయ్యారు. సారనాథ్‌ను బౌద్ధమత జన్మస్థలంగా భావిస్తారు.
- మహాపరినిర్వాణ: గౌతమ బుద్ధుడు 45 ఏళ్ళ పాటు తన బోధనలను ప్రచారం చేస్తూ, వైశాలి నగరంలో చివరి వర్ష ఋతువును గడిపాడు. 80వ ఏట కుశినగరంలో తనువు చాలించాడు. దీనినే మహాపరినిర్వాణ అని అంటారు. దీనికి స్థూపము గుర్తు.
బౌద్ధ స్థూపాలు
బుద్ధుని అస్తికలపైన నిర్మించిన పవిత్ర కట్టడాన్ని స్థూపము అంటారు. స్థూపాలు మూడు రకాలుగా ఉంటాయి. అవి:
1.ధాతుగర్భ స్థూపాలు: బుద్ధుడు లేదా బౌద్ధ సన్యాసుల అస్తికలపైన నిర్మించినవి.
2.పారిభోజక స్థూపాలు: బౌద్ధ పవిత్ర గ్రంథాలు గాని, ఇతర పవిత్ర వస్తువులను ఖననం చేసి, వాటిపైన నిర్మించిన స్థూపాలు.
3.ఉద్దేశిక స్థూపాలు: ఎటువంటి వస్తువులను ఉంచకుండా నిర్మించబడినవి.
బౌద్ధ సన్యాసుల నివాస గృహాలను విహారము లేదా ఆరామము అని, వారి ప్రార్థనా మందిరాలను చైత్యములని అంటారు. బౌద్ధులకు అత్యంత పవిత్రమైన 8 పుణ్యక్షేత్రాలను అష్టమహాస్థానములు అని అంటారు. అవి లుంబిని, గయ, సారనాథ్, కుశినార, రాజగృహ, వైశాలి, శ్రావస్తి మరియు సంకిస్స.
బౌద్ధమత సిద్ధాంతాలు/ బుద్ధుని బోధనలు
I.నాలుగు ఆర్యసత్యాలు
గౌతమ బుద్ధుడు నాలుగు విశ్వజనీనమైన సత్యాలను తెలియజేశాడు.
- ప్రపంచమంతా దుఃఖమయము
- కోరికలే దుఃఖానికి కారణము
- దుఃఖాన్ని నిరోధించవచ్చు.
- దుఃఖ నివారణకు ఒక మార్గముంది. అదే అష్టాంగమార్గం
II.అష్టాంగ మార్గము
బౌద్ధమతంలో అష్టాంగమార్గము అత్యంత ముఖ్యమైన సిద్ధాంతము. అష్టాంగ మార్గాన్ని పాటించడము వలన కోరికలను అదుపుచేసుకొని దుఃఖాన్ని జయించవచ్చు.
- సరైన క్రియ – Right Action
- సరైన దృష్టి – Right Vision
- సరైన వాక్కు – Right Speech
- సరైన లక్ష్యం – Right Aim
- సరైన మార్గము – Right Effort
- సరైన జీవనోపాధి – Right Livelihood
- సరైన చైతన్యం – Right Awareness
- సరైన ధ్యానం – Right Meditation
III.ప్రత్యుత్తసముప్పద
బౌద్ధ సిద్ధాంతాల్లో ఇది మరొక ప్రధానమైన సిద్ధాంతము. ఇది కార్యకారణ సంబంధం (cause and effect relationship) గురించి తెలియజేస్తుంది. దీని ప్రకారం కారణము మరియు ఫలితము లేకుండా ఏ మానవ చర్య జరగదు.
IV.మధ్యేమార్గము (Middle Path)
గౌతమబుద్ధుడు అన్ని విషయాల్లోనూ మధ్యేమార్గాన్ని పాటించాలని, అన్నింటిలోని అతిని త్యజించాలని బోధించాడు.
బౌద్ధ సంగీతి (సమావేశాలు) |
|||||
కాలం | నగరం | అధ్యక్షుడు | సమకాలీన రాజు | లక్ష్యం | |
1 | క్రీ.పూ.483 | రాజగృహం | మహాకాశ్యపుడు | అజాతశత్రువు | బుద్ధుని బోధనలు గ్రంథస్థం చేయడం |
ప్రాధాన్యత:
1. బుద్ధుని ప్రియ శిష్యుడు ఆనందుడు సుత్తపీటికను వ్రాశాడు. ఇందులో బుద్ధుని బోధనలు ఉంటాయి. 2. బుద్ధుని మరో శిష్యుడు ఉపాలి వినయ పీటికను వ్రాశాడు. ఇది బౌద్ధుల ప్రవర్తనా నియమావళికి సంబంధించినది. |
|||||
2 | క్రీ.పూ.383 | వైశాలి | సబాకమి | కాలాశోకుడు | రెండు బౌద్ధ వర్గాల మధ్య సయోధ్య కుదర్చడం |
ప్రాధాన్యత:
బౌద్ధం 2 శాఖలుగా విడిపోయింది. మహాకాత్యాయన నాయకత్వంలోని అవంతికి చెందిన బౌద్ధులు థేరవాద లేదా స్థవిరవాదశాఖగా, మహాకశ్యప నాయకత్వంలోని వజ్జికి చెందిన బౌద్ధులు మహాసాంఘిక శాఖగాను చీలిపోయారు. |
|||||
3 | క్రీ.పూ.250 | పాటలీపుత్రం | మొగలిపుత్త తిస్స | అశోకుడు | వివిధ అంశాలపై చర్చించడం |
ప్రాధాన్యత:
1.అభిదమ్మ పీటకము వ్రాయబడింది. 2.బౌద్ధాన్ని దేశవిదేశాల్లో ప్రచారం చెయ్యడానికి ప్రచారక సంఘాలను ఏర్పాటు చేశారు. |
|||||
4 | క్రీ.శ.1వ శతాబ్ధం | కాశ్మీర్‌లోని కుందలవనం | వసుమిత్ర (అధ్యక్షుడు), అశ్వఘోషుడు (ఉపాధ్యక్షుడు) | కనిష్కుడు | బౌద్ధంలోని 18 శాఖలను విలీనం చేయడం |
ప్రాధాన్యత: 18 శాఖలు కలిసి హీనయానము మరియు మహాయానము అనే రెండు మహాశాఖలుగా ఏర్పడ్డాయి. |
నాల్గవ బౌద్ధ సమావేశంలో 18 బౌద్ధ శాఖలు కలిసి హీనయాన మరియు మహాయాన అనే రెండు ప్రధాన శాఖలుగా అవతరించాయి. స్థవిరవాద/ థేరవాద, సాతాంత్రిక, సమ్మతీయ, మహిశాసక, మూలస్థవిరవాద, కశ్యపిక మొదలైన శాఖలు కలిసి హీనయానంగా ఏర్పడ్డాయి. మహాసాంఘిక, సర్వస్తవాద, చైత్యక, హైమావతి, సిద్ధార్ధిక, లోకోత్తరవాద, పూర్వశైల, ఉత్తరశైల, అపరశైల మొదలైన శాఖలు కలిసి మహాయానంగా ఏర్పడ్డాయి.
హీనయాన మరియు మహాయాన మధ్య ముఖ్యమైన భేదాలు
హీనయానము | మహాయానులు |
హీనయానులు మార్పును వ్యతిరేకించేవారు | మహాయానులు పరిస్థితులకు అనుగుణంగా మార్పును స్వాగతించేవారు. |
వీరు పాళి భాషను కొనసాగించారు.
|
వీరు పాళి భాషను వీడి సంస్కృత భాషను
స్వీకరించారు. |
మోక్షం వ్యక్తిగతమని వీరు భావిస్తారు. | అందరికి మోక్షం సిద్ధిస్తుందని భావిస్తారు. |
బుద్ధునికి మానవరూపమివ్వరు. బుద్ధునికి సంబంధించిన చిహ్నాలను పూజిస్తారు. విగ్రహారాధనను వ్యతిరేకిస్తారు. | వీరు బుద్ధునికి మానవ రూపాన్నిచ్చి, భారతదేశంలో విగ్రహారాధనను ప్రవేశపెట్టారు. |
బర్మా, శ్రీలంక, ఆగ్నేయాసియా దేశాల్లో హీనయానం విస్తరించింది. | చైనా, జపాన్, కొరియా, నేపాల్ తదితర దేశాల్లో మహాయానము విస్తరించింది. |
వజ్రయానము
క్రీ.శ.5వ శతాబ్దంలో గుంటూరు జిల్లాలోని అమరావతిలో వజ్రయాన శాఖ ఆవిర్భవించింది. భోధిసత్వుల భార్యలైన తారలను వీరు పూజిస్తారు. నాగార్జునకొండకు చెందిన సిద్ధనాగార్జున భారతదేశంలో వజ్రయాన మతాన్ని ప్రచారం చేశాడు. ప్రస్తుతము టిబెట్ వజ్రయానాన్ని పాటిస్తున్న ఏకైక దేశము. ఇందులో రెండు ఉపశాఖలున్నాయి.
- కాలచక్రయానము: మంత్రతంత్రాల ద్వారా తాంత్రిక శక్తులను సాధిస్తే మోక్షం వస్తుందని వీరి విశ్వాసము. వీరు క్షుద్రశక్తులను కూడా పూజించారు.
- సహజయానము: లైంగిక సంపర్కము ద్వారా మోక్షం సిద్ధిస్తుందని వీరి విశ్వాసము.
బౌద్ధ పవిత్ర గ్రంథాలు
పాళి భాషలో వ్రాయబడిన త్రిపీటకాలు బౌద్ధులకు పవిత్ర గ్రంథాలు. అవి:
- సుత్తపీటక: బుద్ధుని ప్రియశిష్యుడైన ఆనందుడు దీనిని రచించాడు. గౌతమబుద్ధుని బోధనలు ఇందులో వివరించబడ్డాయి. ఇందులో 5 భాగాలుంటాయి.
- దిగనికాయ: నాలుగు ఆర్యసత్యాలు, అష్టాంగ మార్గము ఇందులో చర్చించబడ్డాయి. బుద్ధుని చివరి బోధనలతో కూడిన మహాపరినిర్వాణసుత్త కూడా ఇందులో భాగమే.
- మజ్జిమ నికయ: ఇది గౌతమబుద్ధునికి జైనులు మరియు అజీవికులతో ఉన్న సంబంధాలను తెలియజేస్తుంది.
- అంగుత్తరనికాయ: ఇందులో షోడష మహాజనపదాల సమాచారం ఉంటుంది.
- సంయుక్త నికయ: పంచ నికయలలో ఇది ఒకటి.
- ఖుద్దక నికయ: ఇది అన్నింటి కంటే పెద్ద నికయ. ఇందులో అనేక ఉపభాగాలున్నాయి. జాతకాలు ఖుద్దక నికయలో ముఖ్యమైన భాగము. ఇందులో బుద్ధుడు మరియు బోధిసత్వులకు సంబంధించిన సుమారు 550 కథలుంటాయి. మాంధాత జాతక, భీమసేన జాతక, చుళ్ళకళింగ జాతక, శ్వేతగజ జాతక మొదలైనవి ముఖ్యమైన జాతకాలు. బుద్ధవంశ, సుత్తనిపాత, ధమ్మపద, తేరగాథ మరియు థేరిగాథ అనే బౌద్ధ గ్రంథాలు కూడా ఇందులో భాగమే.
బోధిసత్వులు
బుద్ధుని పూర్వ జన్మలను (Previous Buddhas) బోధిసత్వులు అంటారు. బౌద్ధుల విశ్వాసము ప్రకారం గౌతమబుద్ధుడు అనేక సార్లు జన్మించి మానవాళికి అనేక సేవలందించాడు. ముఖ్యమైన బోధిసత్వులు:
- వజ్రపాణి: ఇతను వజ్రాయుధాన్ని (thunderbolt) కలిగి ఉంటాడు. తన ఆయుధంతో పాపులను శిక్షిస్తాడు.
- అవలోకితేశ్వర: ఇతను ఎల్లప్పుడూ పద్మాన్ని చేతిలో కలిగి ఉండడం వలన పద్మపాణి అనే పేరుతో సుప్రసిద్ధుడు. ప్రజలపట్ల కరుణ మరియు దయ చూపుతాడు.
- మంజుశ్రీ: ఇతను ఒక చేతిలో పారమిత గ్రంథాలు మరొక చేతిలో ఖడ్గాన్ని కలిగి ఉంటాడు. ఈ బోధిసత్వుడు జ్ఞానానికి చిహ్నము.
- అమితాబ: ఇతను బౌద్ధుల స్వర్గమైన ‘సుఖావతి’కి అధిపతి.
- మైత్రేయ: (Future Buddha), గౌతమబుద్ధుడు మానవజాతిని కాపాడటానికి మైత్రేయగా మరల జన్మిస్తాడని బౌద్ధుల విశ్వాసం. పద్మసంభవ, రత్నసంభవ, చక్రపాణి, విరోచన మొదలైనవారు ఇతర ముఖ్యమైన బోధిసత్వులు.
- వినయ పీటక: ఈ గ్రంథాన్ని బుద్ధుని శిష్యుడైన ఉపాలి రచించాడు. ఇందులో బౌద్ధమతస్థుల ప్రవర్తన నియమావళి (code of conduct) చర్చించబడింది. ఇందులో పతియొక్క సుత్త విభాంగ మరియు ఖండక అనే మూడు భాగాలుంటాయి.
- అభిదమ్మ పీటక: మూడవ బౌద్ధ సమావేశంలో ఇది వ్రాయబడింది. దీనిని ఆ సమావేశ అధ్యక్షుడైన మొగలిపుత్తతిస్స రచించాడనే అభిప్రాయముంది. అభిదమ్మ పీటకలో సుత్త మరియు వినయ పీటకాలకు సంబంధించిన తాత్వికపరమైన చర్చ ఉంటుంది.
ప్రాచీన కాలం నాటి బౌద్ధమత పండితులు
బుద్ధఘోషుడు (క్రీ.శ.5వ శతాబ్దము):
ఇతను హీనయానానికి చెందిన పండితుడు. నాగార్జున కొండలోని సింహళ విహారంలో జీవించాడు. పాళీ భాషలో అనేక గ్రంథాలు రచించాడు. అందులో ముఖ్యమైనవి. విసుద్ధిమగ్గ (ఇది త్రిపీటకాలపైన వ్యాఖ్యానము), ధాతుకథ ప్రకరణ, కథావత్తు ప్రకరణ, సామంత పసాదిక (ఇది వినయపీటకపైన వ్యాఖ్యానము).
ఆచార్య నాగార్జునుడు (క్రీ.శ.1వ శతాబ్దము):
హ్యూయాన్‌త్సాంగ్ ప్రకారము నాగార్జునుడు విదర్భలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. రెండవ తథాగతుడని, భారతీయ ఐన్‌స్టీన్ అని పిలువబడ్డాడు. ఇతను మహాయాన మతస్థుడు.
మహాయానంలో మాధ్యమిక వాదము మరియు శూన్యవాదము అనబడే రెండు నూతన తత్వాలను బోధించాడు. సంస్కృతంలో 24 గ్రంథాలు రచించిన గొప్ప మేధావి. మాధ్యమికకారిక, శూన్యసప్తతి, ప్రజ్ఞాపారమిత, సుహృల్లేఖ, రసరత్నాకర, ఆరోగ్యమంజరి మొదలైనవి ఇతని రచనలలో ముఖ్యమైనవి.
భావవివేకుడు (క్రీ.శ.6వ శతాబ్దము):
ఇతను మహాయాన పండితుడు. ఆచార్య నాగార్జునుడి యొక్క మాధ్యమికవాద తత్వాన్ని అనుసరించాడు. ఇతను స్వతంత్ర మాధ్యమికవాదము అనే నూతన తత్వాన్ని ప్రారంభించాడు. తర్కజ్వాల, ప్రజ్ఞప్రదీప, కరతలరత్న అనే గ్రంథాలను సంస్కృతంలో రచించారు.
బుద్ధపాలితుడు (క్రీ.శ.5-6వ శతాబ్దాలు):
ఇతను మహాయాన పండితుడు. ఇతను కూడా ఆచార్య నాగార్జుని యొక్క మాధ్యమిక వాదాన్ని అనుసరించాడు. ప్రసాంగిక మాధ్యమికవాదము అనే కొత్త తత్వాన్ని బోధించాడు. సంస్కృతంలో మాధ్యమికవృత్తి అనే గ్రంథాన్ని రచించాడు.
మైత్రేయనాథుడు:
మహాయాన మతంలో యోగకార లేదా విజ్ఞానవాద అనే తత్వాన్ని బోధించాడు. లంకావతారసూత్ర అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు.
దిగ్నాగుడు (క్రీ.శ.5వ శతాబ్దము):
తమిళనాడులోని కంచి ఇతని జన్మస్థలము. హ్యుయాన్‌త్సాంగ్ ప్రకారం ఇతను ఆంధ్రలోని వేంగి విహారంలో జీవించాడు. ఇతను మహాయానములోని యోగకారవాదాన్ని అనుసరించాడు. తర్కశాస్త్ర (father of logic) పితామహుడని పిలువబడ్డాడు. సంస్కృతంలో అనేక గ్రంథాలు రచించాడు. ప్రమాణసముచ్చయ, న్యాయప్రవేశ, ఆలంబనపరీక్ష, హేతుచక్రధమరు మొదలైనవి ఇందులో ముఖ్యమైనవి.
ధర్మకీర్తి (క్రీ.శ.7-8వ శతాబ్దాలు):
ఇతను ఆంధ్రప్రాంతానికి చెందిన మహాయాన బౌద్ధమతస్తుడు. నలంద విశ్వవిద్యాలయానికి అధిపతిగా పనిచేశాడు. ధర్మకీర్తిని పండితులు ‘Kant of India” అని పిలుస్తారు.
(నోట్: ఇమ్యాన్యుయల్ క్యాంట్ జర్మనీకి చెందిన తత్త్వవేత్త).
బౌద్ధ సంఘము
బౌద్ధమతం ఎలాంటి సామాజిక మరియు లింగ వివక్షత చూపకుండా అందరికి సన్యాసము స్వీకరించడానికి అనుమతి ఇచ్చింది. బౌద్ధమతంలో సన్యాసులను భిక్షువు లేదా బిక్కువు అని, సన్యాసినిలను భిక్షుణి / బిక్కుని అని పిలుస్తారు. వీరువురు కలిసి సంఘంగా ఏర్పడతారు. సంసార జీవితాన్ని గడిపే బౌద్ధులలో పురుషులను ఉపాసక అని, స్త్రీలను ఉపాసిక అని పిలుస్తారు. సంఘానికి అధిపతియైన సంఘథేర సన్యాస దీక్షను ఇస్తాడు. అయితే 15 ఏళ్ళు నిండని మైనర్లు, బానిసలు, ఋణగ్రస్థులు, సైనికులు మరియు అంటువ్యాధులు కలిగి ఉన్నవారు సంఘంలో ప్రవేశించడానికి అనర్హులు.
బౌద్ధమతంపై ఉపనిషత్తుల ప్రభావం
వైదికమతానికి సంబంధించిన సాహిత్యము యజ్ఞయాగాలను సమర్థించగా, ఉపనిషత్తులు మాత్రమే వాటిని తిరస్కరించడము విశేషము. పండితుల అభిప్రాయం ప్రకారం వేదసాహిత్యాన్ని బ్రాహ్మణులు రచించగా ఉపనిషత్తులను మాత్రము శ్రామణులు రచించారు. యజ్ఞయాగాదులను మరియు పురోహిత ఆధిపత్యాన్ని తిరస్కరించే వారిని శ్రమణులని అంటారు. (బౌద్ధ మరియు జైన మతస్థులను శ్రామణులని చెప్పవచ్చు).
బౌద్ధమతంపైన ఉపనిషత్తుల ప్రభావం గణనీయంగా ఉంది. గౌతమబుద్ధుడు సన్యాసాన్ని స్వీకరించి జ్ఞానోదయానికి ముందు దేశాటన చేసే సమయంలో అలారకలామ మరియు ఉద్రక అనే వేద పండితుల దగ్గర రెండేళ్ళ పాటు వేదవిద్యను అభ్యసించాడు. యజ్ఞయాగాలను సమర్థించే వేదాలు, బ్రాహ్మణాలు మరియు ఇతర వేద సాహిత్యాన్ని తిరస్కరించిన, ఎంతో విజ్ఞానము మరియు హేతుబద్ధత కలిగిన ఉపనిషత్తులను గౌతమ బుద్ధుడు ఆమోదించడమే కాకుండా వాటి ప్రభావానికి లోనయ్యాడు.
ఉపనిషత్తుల్లో చర్చించబడిన అహింసవాదము, భక్తివాదము, జ్ఞానవాదములు బౌద్ధంలో స్వీకరించబడ్డాయి. యజ్ఞాలు మరియు జంతుబలులు మూర్ఖత్వానికి నిదర్శనమని, మోక్షం భక్తి ద్వారా మాత్రమే సాధ్యమని ప్రకటించిన ఉపనిషత్తుల తత్వాన్ని బౌద్ధం అంగీకరించింది. ఉపనిషత్తుల్లోని నైతిక విలువలు, శాస్త్రీయత మరియు హేతుబద్ధత గౌతమ బుద్ధుడిని ఆకర్షితుడిని చేసింది. జన్మ- పునర్జన్మ, ఆత్మ-పరమాత్మ మరియు కర్మ-మోక్షము లాంటి ఉపనిషత్తుల్లోని తత్వములు యధాతథంగా బౌద్ధమతంలోకి ప్రవేశించాయి.
బౌద్ధమతంలోని సామాజిక దృక్పథము
అతి ప్రాచీన కాలంలో ఆవిర్భవించిన బౌద్ధమతం సామాజిక విషయాల్లో అత్యంత గొప్పవైన అభ్యుదయ భావాలు కలిగి ఉండడము విశేషము. కులవ్యవస్థ ఆధారంగా కొనసాగుతున్న తీవ్రమైన సామాజిక అసమానతలు ఆనాటి సమాజంలో బలంగా నాటుకొనిపోయి సామాన్య ప్రజానీకం వివక్షతకు గురైంది. బ్రాహ్మణ ఆధిపత్య సమాజంలో శూద్రులను మరియు అంత్యజాతుల వారిని ఏకజులని పిలిచి అవమానించారు. వారిపైన సామాజిక, ఆర్థిక, విద్యా మరియు మతపరమైన ఆంక్షలు విధించారు. సమాజంలోని అసమానతలకు మరియు వివక్షతలకు వ్యతిరేకంగా బౌద్ధం తిరుగుబాటు చేసిందని చెప్పవచ్చు. నదులన్నీ సముద్రంలో చేరి తమ ఉనికిని కోల్పోయినట్లుగా, అన్ని జాతుల ప్రజలు బౌద్ధంలో చేరి తమ కుల గుర్తింపును కోల్పోయి సమానత్వాన్ని పొందవచ్చని గౌతమబుద్ధుడు బోధించాడు.
బౌద్ధం లింగ వివక్షతలను కూడా తూర్పారబట్టింది. మహిళలను నాలుగు గోడలకు బందీ చెయ్యడము మరియు మహిళలను కేవలం చట్టబద్దమైన వారసులనిచ్చి, వంశాన్ని కొనసాగించడానికి మాత్రమే పరిమితము చెయ్యడాన్ని బౌద్ధం తప్పుబట్టింది. బౌద్ధ సంఘంలోను మరియు బౌద్ధ విద్యాసంస్థల్లోనూ మహిళలకు ప్రవేశాన్ని కల్పించి సమాజంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది.
ఉపనిషత్తుల నుండి స్వీకరించిన నైతిక విలువలు మరియు అహింసావాదమునకు బౌద్ధం కట్టుబడింది. సమాజంలో శాంతి, సుహృద్భావ పరిస్థితులను నెలకొల్పడానికి కృషి చేసింది. వివిధ సామాజిక వర్గాల మధ్య సామరస్యతను నెలకొల్పడానికి అనేక చర్యలు చేపట్టింది. బానిసలకు మరియు యజమానులకు, ఋణదాతకు మరియు ఋణగ్రహీతలకు, రాజు మరియు ప్రజల మధ్య పరస్పర సహకారం మరియు సామరస్యత అవసరమని బౌద్ధమతం గుర్తించింది.
వివక్షతలు, అసమానతలు మరియు సామాజిక అశాంతి లేని ఒక ప్రత్యామ్నాయ సమాజాన్ని సృష్టించడానికి బౌద్ధం గట్టి ప్రయత్నం చేసిందని చెప్పవచ్చు. బౌద్ధమతంలోని హేతుబద్ధత. మరియు అభ్యుదయ భావాల గొప్పతనాన్ని గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
బౌద్ధమతాన్ని వివిధ దేశాల్లో ప్రచారం చేసిన బౌద్ధ సన్యాసులు
- చైనా: కశ్యపమాతంగ, కుమారజీవ, ఆచార్య నాగార్జున మొదలైనవారు మహాయానాన్ని ప్రచారం చేశారు.
- నేపాల్: వసుబందు మహాయానాన్ని ప్రచారం చేశారు.
- శ్రీలంక: అశోకుని కుమారుడైన మహేంద్ర మరియు కుమార్తె సంఘమిత్ర స్థవిరవాద బౌద్ధమతమును (హీనయాన శాఖ) ప్రచారం చేశారు.
- ఆగ్నేయాసియా: శ్రీజ్ఞానుడు హీనయానాన్ని ప్రచారం చేశారు.
- టిబెట్: అతీషదీపాంకర, పద్మసంభవ మరియు శాంతరక్షిత అనే బౌద్ధులు వజ్రయాన మతాన్ని ప్రచారం చేశారు.
భారతదేశంలో బౌద్ధమత అంతానికి గల కారణాలు
క్రీ.పూ.6వ శతాబ్దంలో ఆవిర్భవించిన బౌద్ధమతం వివిధ రాజవంశాల ఆదరణలో ఎదుగుతూ క్రీ.పూ.4-5వ శతాబ్దాల్లో ఉచ్ఛస్థితికి చేరుకొని ఆ తర్వాత క్రమంగా క్షీణిస్తూ 12వ శతాబ్దపు చివరికల్లా తాను పుట్టిన దేశంలోనే సంపూర్ణంగా అంతరించింది. అయితే బౌద్ధ ప్రచారక సంఘాల కృషి వలన విదేశాలకు విస్తరించిన బౌద్ధమతము అనేక దేశాల్లో నేటికీ దేదీప్యమానంగా కొనసాగుతుంది. భారతదేశంలో బౌద్ధం క్షీణించడానికి పండితులు అనేక అంతర్గత మరియు బహిర్గత కారణాలను వివరించారు.
బౌద్ధమతంలో అంతర్గత కలహాలు పెరిగి, అనేక శాఖలు ఆవిర్భవించి, బౌద్ధమత ఐక్యతను అంతం చేశాయి. క్రీ.శ.ఒకటవ శతాబ్దంలో దాదాపుగా 18 బౌద్ధశాఖలున్నట్లుగా హ్యుయాన్‌త్సాంగ్ పేర్కొన్నాడు. క్రీ.శ.ఐదవ శతాబ్దంలో పజ్రయానం అనే నూతన శాఖ ప్రారంభమై బౌద్ధమతాన్ని నైతికంగా భ్రష్టుపట్టించింది. ఈ శాఖ క్షుద్రశక్తులను ఆరాధించడము ద్వారా మరియు లైంగిక సంపర్కము ద్వారా మోక్షము సాధ్యమని ప్రచారం చేసి, ప్రజలు బౌద్ధాన్ని అసహ్యించుకునే స్థాయికి దిగజార్చింది.
ఈ అంతర్గత కారణాలతో పాటు కొన్ని బహిర్గత కారణాలు కూడా బౌద్ధమతం అంతం కావడానికి దోహదపడ్డాయి. గుప్తులు, ఆ తర్వాత వచ్చిన రాజవంశాలు బౌద్ధాన్ని విస్మరించి హిందూమతాన్ని ఆదరించడము, బౌద్ధ మతం క్రమంగా అంతం కావడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. అనేక రాజవంశాల ఆదరణలో హిందూమతం సంస్కరించబడి బలోపేతమైంది. హిందూమతం విష్ణువు యొక్క దశావతారాల్లో బుద్ధునికి కూడా చోటు కల్పించి బౌద్ధమతాన్ని తనలో విలీనం చేసుకొంది.
స్వదేశీయులు మరియు విదేశీయులు బౌద్ధులపైన దాడులు చేసి భారతదేశంలో ఈ మతం అంతం కావడానికి కారకులయ్యారు. హిందూమతంలో ప్రధాన శాఖయైన శైవం విజృంభించి బౌద్ధాన్ని అంతం చెయ్యడంలో కీలక పాత్ర పోషించింది. శైవులు దాడులు చేసి అనేక బౌద్ధాలయాలను ధ్వంసం చేసి శివాలయాలుగా మార్చారు. క్రీ.శ.ఏడవ శతాబ్దంలో బెంగాల్‌ను పాలించిన శశాంకుడనే శైవరాజు బౌద్ధులకు పవిత్రమైన గయలోని బోధివృక్షాన్ని నేలకూల్చాడు. 6వ శతాబ్దంలో భారతదేశంపై దండెత్తి వచ్చిన హూణులు కూడా బౌద్ధులను ఊచకోత కోశారు. ఇక చివరగా పన్నెండవ శతాబ్దపు చివరిలో భారతదేశానికొచ్చిన తురుష్కులు బౌద్ధాన్ని సంపూర్ణంగా నాశనం చేశారు. క్రీ.శ.1194లో భక్తియార్ ఖిల్జీ అనే తురుష్క సేనాని నలందతో సహా అన్ని బౌద్ధ విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేసి, భారతదేశంలోని చివరి బౌద్ధులను చంపడంతో బౌద్ధం అంతమయింది.
భారత సంస్కృతికి బౌద్ధమత సేవలు
ప్రాచీన భారతదేశంలో అనేక శతాబ్దాల పాటు ప్రముఖ మతంగా కొనసాగిన బౌద్ధమతం భారత సంస్కృతిని మరియు సామాజిక, ఆర్థిక, మత వ్యవస్థలతో పాటు విద్యా, లలిత కళలను తీవ్రంగా ప్రభావితం చేసింది.
భారత సమాజంలో కొనసాగుతున్న సామాజిక వివక్షత మరియు లింగ వివక్షతలకు వ్యతిరేకంగా పోరాడి వాటిని కొంతవరకు తగ్గించడంలో బౌద్ధం కీలకపాత్ర పోషించిందని చెప్పవచ్చు. అణగారిన వర్గాలకు మరియు మహిళల హక్కులకు సంపూర్ణ మద్దతునిచ్చింది.
ఆర్థికాభివృద్ధికి అడ్డంకిగా మారిన వైదిక యాజ్ఞయాగాలను మరియు వ్యాపార ఆంక్షలను, బౌద్ధమతం తిరస్కరించింది. వడ్డీ వ్యాపారానికి అనుమతులిచ్చి వ్యాపారాభివృద్ధికి దోహదపడింది.
మతాలలో కొనసాగుతున్న సంక్లిష్టతను బౌద్ధం కొంత వరకు తగ్గించగలిగిందని చెప్పవచ్చు. మోక్షం అందరికి సాధ్యమని, దానికోసం ఖరీదైన యజ్ఞయాగాలు అవసరము లేదని బోధించింది. భారతదేశంలో దేవాలయాలను, విగ్రహారాధనను ప్రవేశపెట్టి మతరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికింది.
భారతదేశంలో విద్య మరియు సాహిత్యానికి బౌద్ధమత సేవలు అత్యద్భుతమైనవి. నలంద (బీహార్), నాగార్జునకొండ (ఆంధ్రప్రదేశ్), వల్లభి (గుజరాత్), విక్రమశిల (బీహార్) మొదలైన ప్రాంతాల్లో అంతర్జాతీయస్థాయి బౌద్ధ విశ్వవిద్యాలయాలను స్థాపించి దేశ విదేశాలనుండి వచ్చిన విద్యార్థులకు లౌకిక మరియు శాస్త్రీయ విద్యను అందించారు. దళితులకు మరియు మహిళలకు కూడ విద్యాసంస్థల్లో ప్రవేశాన్ని కల్పించడము బౌద్ధుల అభ్యుదయ భావాలకు నిదర్శనము. విద్యతో పాటు అద్భుతమైన సాహిత్యాన్ని అభివృద్ధి చేశారు. తొలి బౌద్ధులు పాళి భాషలో మరియు మహాయాన బౌద్ధులు సంస్కృత భాషలో అనేక గ్రంథాలను రచించారు.
లలిత కళారంగానికి బౌద్ధులు విశేషమైన సేవలనందించారు. అత్యంత గొప్ప కట్టడాలతో పాటు శిల్పాలను మరియు చిత్రలేఖనాన్ని అభివృద్ధి చేశారు. వీరి ఆదరణలో గాంధార శిల్పకళ, మధుర శిల్పకళ, సారానాథ్ శిల్పకళలు ప్రాచీన భారతదేశంలో అభివృద్ధి చెందాయి. అజంత మరియు ఎల్లోరాల్లో నిర్మించిన బౌద్ధగుహాలయాల్లో అత్యంత సుందరమైన చిత్రాలు నేటికీ దర్శనమిస్తాయి.
బౌద్ధ ప్రచారక సంఘాలు విదేశాల్లో మత ప్రచారం చేస్తూ, బౌద్ధంతో పాటు భారత సంస్కృతి మరియు సాంప్రదాయాలను తీసుకెళ్ళి, మన సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేశాయి.