బాదామి/ వాతాపి చాళుక్య రాజ్యము (క్రీ.శ.543 – 755)
ప్రస్తుత భాగల్‌కోట్ జిల్లాలోని బాదామి రాజధానిగా వీరు 200 సంవత్సరాలు దక్కన్‌ను పరిపాలించారు. బాదామి యొక్క ప్రాచీన నామము వాతాపి. (చాళుక్య అనే పేరుతో అనేక వంశాలు భారతదేశంలోని వివిధ ప్రాంతాలను వివిధ కాలాల్లో పాలించారు. కాబట్టి వారిని గుర్తించడానికి వారి రాజధానులను తప్పనిసరిగా వారి వంశనామంతో చేర్చాలి.) #Badami Chalukyas#
పులకేశి – 1
- ఇతను బాదామి చాళుక్య వంశ స్థాపకుడు. సత్యాశ్రయ మరియు రణవిక్రమ అనే బిరుదులు తీసుకున్నాడు. అశ్వమేధయాగాన్ని నిర్వహించాడు.
పులకేశి – 2 (క్రీ.శ.609-642)
- ఇతను బాదామి చాళుక్య వంశంలో అత్యంత సుప్రసిద్ధుడు. తన తండ్రి కీర్తివర్మ – 1 మరణించే సమయంలో మైనర్ కావడంతో అతని చిన్నాన్న మంగలేశుడు సంరక్షకుడిగా పరిపాలన నిర్వహించాడు. పులకేశి-2 యుక్త వయస్సుకు వచ్చిన తరువాత కూడా మంగలేశుడు పరిపాలన అధికారాలను అప్పగించకపోవడంతో అంతర్యుద్ధం కొనసాగింది. చివరికి తన చిన్నాన్న మంగలేశుడిని ఓడించి అధికారాన్ని హస్తగతం చేసుకొన్నాడు.
- ఇతని అధికారియైన రవికీర్తి రచించిన ఐహోలు శాసనంలో రెండవ పులకేశి ఈ క్రింది సైనిక విజయాలను సాధించాడని చెప్పబడింది.
- మైసూరు పాలిస్తున్న పశ్చిమ గాంగులను ఓడించాడు.
- కొంకణ్ ప్రాంతాన్ని పాలిస్తున్న మౌర్యులను ఓడించి, ఎలిఫెంటా దీవిని ఆక్రమించుకున్నాడు. ఇందులోని సుప్రసిద్ధమైన త్రిమూర్తి గుహాలయమును ప్రపంచ వారసత్వ కేంద్రంగా UNESCO గుర్తించింది.
- కోస్తాంధ్రను పాలిస్తున్న విష్ణుకుండినులు మరియు రణదుర్జయులను ఓడించాడు. కోస్తాంధ్రలో జయించిన ప్రాంతాలకు తన సోదరుడైన కుబ్జవిష్ణువర్ధనుడిని గవర్నర్‌గా నియమించాడు. ఇతను క్రీ.శ.624లో స్వతంత్రమును ప్రకటించుకొని వేంగి చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు. ఈ రాజ్యము 450 ఏళ్ళు కోస్తాంధ్రను పాలించింది.
- ఉత్తర భారతదేశాన్ని పాలిస్తున్న హర్షవర్ధనుడిని ఓడించి, తన రాజ్యాన్ని ఉత్తరాన నర్మద నది వరకు విస్తరింపజేశాడు.
- ఇతను కంచి రాజధానిగా పాలిస్తున్న పల్లవులపై రెండుసార్లు దండెత్తాడు.
- క్రీ.శ.630లో జరిగిన పుల్లలూరు యుద్ధంలో పల్లవ రాజైన మహేంద్రవర్మ-1ను చంపి, అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు.
- క్రీ.శ.642లో జరిగిన మణిమంగళ యుద్ధంలో పల్లవ రాజైన నరసింహవర్మ-1 చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. రెండవ పులకేశిని చంపి నరసింహవర్మ-1 వాతాపికొండ అనే బిరుదును తీసుకున్నాడు. తాత్కాలికంగా బాదామి రాజ్యం పల్లవుల వశమైంది. #Badami Chalukyas#
విక్రమాదిత్య-1
- రెండవ పులకేశి యొక్క కుమారుడైన ఇతను 12 ఏళ్లు నిరంతరంగా పోరాడి పల్లవుల నుంచి తన రాజ్యాన్ని తిరిగి సాధించాడు. ఇతను కంచిపై దండెత్తి మహేంద్రవర్మ-2ను చంపి, కంచిని ధ్వంసం చేశాడు.
విక్రమాదిత్య-2
- బాదామి చాళుక్య చివరి రాజుల్లో ప్రముఖుడు. ఇతను మూడు సార్లు పల్లవులపై దండెత్తి కంచిని ధ్వంసం చేశాడు.
- బాదామి చాళుక్యులు మరియు పల్లవుల నిరంతర యుద్ధాలు రెండు రాజ్యాలను బలహీనపరచాయి. బాదామి చాళుక్యుల దగ్గర గవర్నర్‌గా పనిచేస్తున్న దంతిదుర్గుడు చివరి రాజైన కీర్తివర్మ-2ను అంతంచేసి రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించాడు.
బాదామి చాళుక్యుల కట్టడాలు
- బాదామి చాళుక్యుల ఆదరణలో దక్కన్‌లో వాస్తుశిల్పకళలు అత్యున్నత శిఖరాలకు చేరుకున్నాయి.
- బాదామిలో అద్భుత శిల్పాలతో కూడిన నాలుగు గుహాలయాలను నిర్మించారు. ఇందులో రెండు గుహాలయాలు వైష్ణవ మతానికి, ఒక గుహాలయం శైవ మతానికి మరియు చివరిది జైనమతానికి చెందినవి. వీటిలో విష్ణువు యొక్క దశావతారాలకు చెందిన శిల్పాలతో పాటు శివుని యొక్క వివిధ రూపాలతో కూడిన అద్భుత శిల్పాలున్నాయి. వామన, నరసింహ, వరాహ, అనంతశయన విష్ణు, 18 చేతులు కలిగిన నటరాజు, అర్ధనారీశ్వర, మహిశాసురమర్ధిని, గణేష మరియు కార్తికేయ శిల్పాలు ఇందులో ముఖ్యమైనవి. జైన గుహాలయంలో తీర్థంకర శిల్పాలతో పాటు, నగ్నంగా ఉన్న గోమఠేశ్వర శిల్పము ఉంటుంది.
- బాదామి చాళుక్యుల కాలంలో ఐహోలు హిందూ దేవాలయ శిల్పకళకు కేంద్రంగా మారింది. ఇక్కడ వందకు పైగా ఆలయాలు నిర్మించబడ్డాయి. దేవాలయ నగరంగా (town of temples)గా ఐహోలు ప్రసిద్ధిగాంచింది. హుసిమల్లిగుడి, మెలగిత్తి శివాలయ, మెగుతి జినాలయ, లాడ్‌ఖాన్ ఆలయము, సూర్యనారాయణ ఆలయం, గౌడార్ ఆలయము మరియు దుర్గ ఆలయాలు సుప్రసిద్ధమైనవి.
- బాదామి చాళుక్యుల సుప్రసిద్ధ ఆలయాలకు ఇంకొక కేంద్రం పట్టడకల్. ఇక్కడ 10 హిందూ దేవాలయాలను నిర్మించారు. ఇవి ద్రావిడ, నగర మరియు వెసార శైలులలో నిర్మించబడ్డాయి. ఇందులో విరూపాక్ష ఆలయం లేదా లోకేశ్వర ఆలయము సుప్రసిద్ధమైనది. ఈ ఆలయాన్ని విక్రమాదిత్య-2 తన భార్య లోకమహాదేవి కోసము నిర్మించాడు. ఈ ఆలయం కంచిలోని కైలాసనాథ ఆలయాన్ని పోలి ఉంటుంది.
- రామాయణ మరియు మహాభారతంతో పాటు అనేక పౌరాణిక గాథలను శిల్పాలుగా ఈ ఆలయ స్తంభాలపైన మరియు గోడలపైన చెక్కారు. పాపనాథాలయం, త్రిలోకేశ్వర ఆలయం, మల్లిఖార్జున ఆలయం, కాశీ విశ్వేశ్వరాలయం మరియు గలగనాథ ఆలయం ఇతర ముఖ్య ఆలయాలు. UNESCO పట్టడకల్‌ను ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది. #Badami Chalukyas#
- జోగుళాంబ – గద్వాల జిల్లా (తెలంగాణ)లోని ఆలంపూర్‌లో సుప్రసిద్ధ నవబ్రహ్మేశ్వర ఆలయాలు బాదామి చాళుక్యుల కాలంలోనే నిర్మించబడ్డాయి. ఈ శివాలయాలు తుంగభద్రా నది ఒడ్డున శిఖర శైలిలో నిర్మించబడ్డాయి. ఇందులో ముఖ్యమైనవి:
- బాలబ్రహ్మేశ్వర ఆలయం
- వీర బ్రహ్మేశ్వర ఆలయం
- గరుడ బ్రహ్మేశ్వర ఆలయం
- స్వర్గ బ్రహ్మేశ్వర ఆలయం
- అర్క బ్రహ్మేశ్వర ఆలయం
- తారక బ్రహ్మేశ్వర ఆలయం
- అలంపూర్ సమీపంలో కూడలి సంగం దగ్గర సంగమేశ్వర ఆలయాన్ని కూడా ఈ కాలంలోనే నిర్మించారు. శ్రీశైలం ప్రాజెక్టులో ముంపునకు గురైన కూడలి సంగంలోని ఈ ఆలయాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు జాగ్రత్తగా ఆలంపూర్‌కు తరలించారు. #Badami Chalukyas#
- కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణము (ఆంధ్రప్రదేశ్) చుట్టూ నవనందీశ్వర ఆలయాలు అనబడే తొమ్మిది శివాలయాలను నిర్మించారు. ఇందులో ముఖ్యమైనవి:
- మహానందీశ్వర ఆలయం (మహానంది)
- పద్మనందీశ్వర ఆలయం
- సూర్యనందీశ్వర ఆలయం
- శివనందీశ్వర ఆలయం
- గరుడ నందీశ్వర ఆలయం