ప్రాచీన భారతదేశంలో శాస్త్రసాంకేతిక ప్రగతి
ప్రాచీన భారతీయులకు మతాలు, తత్వాలు మరియు మూఢవిశ్వాసాలు తప్ప శాస్త్రీయ పరిజ్ఞానము లేదని, అది ఆంగ్లేయుల రాకతోనే ప్రారంభమయ్యిందనే వాదన సరికాదు. ప్రాచీన భారతదేశ చరిత్రను హేతుబద్ధంగా అధ్యయనము చేసి విశ్లేషిస్తే, ప్రాచీన భారతీయులు వివిధ శాస్త్రాలలో మరియు సాంకేతిక రంగాల్లో చాలా గొప్పగా రాణించారని, వారికి ఆయా రంగాల్లో అద్భుతమైన పరిజ్ఞానముందని తెలుస్తుంది. ప్రాచీన భారతీయులు వివిధ శాస్త్రాలకు చేసిన సేవలను క్లుప్తంగా చర్చిద్దాం.
గణిత – ఖగోళ శాస్త్రాలు:
ప్రాచీన వేద సాహిత్యాన్ని పరిశీలిస్తే గణిత మరియు ఖగోళ శాస్త్రాల్లో ఆర్యులకున్న అద్భుతమైన పరిజ్ఞానము అవగతమవుతుంది. యజ్ఞయాగాలకు అవసరమయ్యే హోమగుండాల నిర్మాణమును తెలియజేసే సుళువసూత్ర గ్రంథములో అపారమైన రేఖాగణిత (geometry) పరిజ్ఞానముంది. ఐదవ శతాబ్దానికి చెందిన ఆర్యభట్ట రచించిన ఆర్యభట్టీయం అనే గ్రంథములో రేఖాగణితము, బీజగణితము, అంకగణితానికి సంబంధించిన అనేక అంశాలు చర్చించబడ్డాయి. సున్నా(0)ను, సంఖ్యలను మరియు దశాంశ పద్ధతిని ప్రపంచానికి పరిచయము చేసింది కూడా ప్రాచీన భారతీయులే.
ప్రాచీన కాలంలోని ఖగోళ శాస్త్రము కూడా గణిత శాస్త్రంలో భాగంగా కొనసాగింది. ఆర్యభట్ట తాను రచించిన సూర్యసిద్ధాంతమనే గ్రంథంలో సూర్యకేంద్రక సిద్ధాంతము (helio-centric), భూభ్రమణము (rotation), భూపరిభ్రమణము (revolution) మరియు సూర్య,చంద్ర గ్రహణాలకు శాస్త్రీయమైన కారణాలను వివరించాడు. వరాహమిహిరుడు వ్రాసిన బృహత్సంహిత భారత శాస్త్రాలకు విజ్ఞాన సర్వస్వములాంటిది. ఇతను రచించిన పంచసిద్ధాంతిక గ్రంథము ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ఐదు సిద్ధాంతాలను చర్చిస్తుంది.
వైద్యశాస్త్రము:
శిలాయుగాల నుండి భారతీయులు వైద్యశాస్త్రములో గణనీయమైన ప్రగతి సాధించారు. ఆర్యులు రచించిన వేదసాహిత్యంలో ఆయుర్వేదము అంతర్భాగము. క్రీ.పూ.6వ శతాబ్దానికి చెందిన జీవకుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో ఆరేళ్ళు వైద్యశాస్త్రాన్ని అభ్యసించాడు. చరకుడు రచించిన చరక సంహిత భారత వైద్యశాస్త్రానికి విజ్ఞాన సర్వస్వములాంటిది. శస్త్రచికిత్సలపైన శుశ్రుతుడు రచించిన శుశ్రుత సంహిత చాలా సుప్రసిద్ధ గ్రంథము.
వ్యవసాయ శాస్త్రము:
నవీన శిలాయుగానికి చెందిన భారతీయులు ప్రపంచములోనే తొలిసారిగా ప్రత్తిని మరియు వరిని పండించి వ్యవసాయ శాస్త్రానికి అద్భుతమైన సేవలందించారు. నారువేసి ఆ తర్వాత వాటిని నాటి అధిక దిగుబడిని సాధించే నూతన పద్ధతిని వరిసాగులో ఆవిష్కరించారు. దీనినే transplantation of paddy అంటాము.
భౌతిక శాస్త్రము:
కనాద ఋషి చెప్పిన వైశేషికతత్వము ప్రపంచంలోనే తొలిసారిగా పరమాణు సిద్ధాంతము (atom theory)ని చర్చించింది. పరమాణువులు కలిసి అణువులుగా ఏర్పడతాయనేది దీనిని సారాంశము.
ఏడవ శతాబ్దానికి చెందిన బ్రహ్మగుప్తుడు గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని చెప్పి ఇండియన్ న్యూటన్గా గుర్తింపు పొందాడు. మహాయాన పండితుడైన ఆచార్య నాగార్జున తన శూన్యవాద సిద్ధాంతములో conservation of energy గురించి చర్చించి ఇండియన్ ఐన్స్టీన్గా ప్రఖ్యాతిగాంచాడు.
ఇంజనీరింగ్ మరియు లోహ శాస్త్రము:
సింధూ నాగరికత ప్రజలు నిర్మించిన ప్రణాళికాబద్దమైన నగరాలను పరిశీలిస్తే, ఆనాటి ప్రజలు ఎంత గొప్ప సివిల్ ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నారో అర్థమవుతుంది. ప్రాచీన యుగంలో నిర్మించబడిన గొప్ప కట్టడాలు కూడా వీటిని తెలియజేస్తాయి. గుప్తుల కాలం నాటి మెహ్రౌలి ఇనుపస్తంభము నేటికీ ఒక గొప్ప శాస్త్రీయ అద్భుతంగా నిలిచింది. గత 1500 ఏళ్ళుగా వర్షాలకు తడుస్తూ, ఎండలకు ఎండుతూ ఈ ఇనుప స్తంభము తుప్పు పట్టకపోవడము అనాటి లోహశాస్త్ర ప్రతిభకు మచ్చుతునక.
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో గొప్ప ప్రగతి సాధించినా, ప్రాచీన భారత శాస్త్రాల్లో లోపాలు కూడా లేకపోలేదు. 11వ శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన అరబ్బు యాత్రీకుడు అల్బెరూనీ భారత శాస్త్రాలు అత్యంత గొప్పవైనప్పటికీ, గుర్తింపు పొందలేదన్నాడు. భారత పండితులు తమ జ్ఞానాన్ని రహస్యంగా దాచుకోవడము మరియు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని మతము మరియు తత్వాలతో కలిపివెయ్యడం వలన ప్రాచీన భారతీయుల గొప్పతనాన్ని ప్రపంచం గుర్తించలేకపోయిందని తెలియజేశాడు.