తిలకాష్ఠ మహిషబంధనం

Tilakashtha Mahishabandhanam

ఓసారి కాశీకి చెందిన ఓ మహాపండితుడు గొప్ప అట్టహాసంగా తన శిష్యులను వెంటబెట్టుకుని హంపి విజయనగరానికి వచ్చాడు. అతడు అప్పటికే ఉత్తర భారతదేశమంతటా పర్యటించి, అనేక మంది హేమాహేమాలాంటి కవిపండితులను వేదవేదాంగ, ఉపనిషత్తాది శాస్త్ర చర్చల్లో ఓడించాడు. #తిలకాష్ఠ మహిషబంధనం#

శ్రీకృష్ణదేవరాయలవారు ఆ మహాపండితుని,  సాదరంగా ఆహ్వానించి అతిథిగృహంలో విడిది ఏర్పాట్లు చేయించాడు. మర్నాడు ఆ పండితుడు గొప్ప ఆడంభరంగా సభలోకి ప్రవేశించాడు. వస్తూ,వస్తూనే రాయలవారిని ఉద్దేశించి, “మహారాజా! మీ కొలువులో కాకలుతీరిన పండితులున్నారని విన్నాను. వారిని చర్చలకు ఆహ్వానిస్తున్నాను. వాళ్లు గనక నన్ను ఓడిస్తే, నా బిరుదులన్నీ వారికిచ్చి వేస్తాను. వాళ్లు ఓడిపోతే నన్ను గురువుగా స్వీకరించాలి” అని ఎంతో దర్పంతో, అతిశయంతో అన్నాడు.

ఆ పండితుని మాటల్లో తప్పక గెలిచి తీరుతానన్న నమ్మకం, తనను ఓడించే వారెవరూ లేరన్న ధీమా ప్రస్ఫుటంగా కనిపించింది! అతనికున్న బిరుదులు, ఆడంబరం చూసి, సభలోని పండితులు సహా అందరూ అయోమయంలో పడిపోయారు.

శ్రీ కృష్ణదేవరాయలవారు, “మన ఆస్థానానికి విచ్చేసిన ఈ మహాపండితునితో పోటీకి దిగేవారెవరు?” అని కవిపండితులను చూస్తూ ప్రశ్నించాడు. కాశీపండితుని ఆర్భాటం, అతని విజయాలు, బిరుదులు చూచి భయపడిపోయిన ఆస్థాన కవులు ఏమీ మాట్లాడకుండా తలలు వాల్చేశారు!! దీనితో రాయలవారికి పట్టలేనంత ఉక్రోశం వచ్చింది. “నా ఆస్థానంలో వున్న పండితుల సామర్థ్యం ఇంతేనా?” అన్నారు.

అప్పటి వరకు సభలోనే నిశ్శబ్ధం కూర్చొని ఉన్న తెనాలి రామలింగడు ఒక్కసారిగా లేచి, “మహారాజా! మీరు అనుమతిస్తే, ఈ కాశీ పండితునితో పోటీ పడడానికి నేను సిద్ధం”అని అన్నాడు. కానీ పోటీ కోసం ఒక్క రోజు సమయం కావాలన్నాడు. అందుకు రాయలవారితో పాటు ఆ కాశీ పండితుడు కూడా ఒప్పుకున్నారు.

ఆ రోజు రాత్రి రహస్యంగా కవిపండితులతో సమావేశమైన తెనాలి రామలింగడు, “నేను ఆ కాశీ పండితుని ఓడిస్తాను. కానీ అందుకు మీ సహకారం కావాలి” అన్నాడు. ఆ మాటలు వినగానే, పండితులు ఎంతో సంతోషించారు. అంతేకాకుండా తమ బిరుదులను రామలింగడికి ఇచ్చివేసి, అతని శిష్యులుగా వుంటామని చెప్పారు.

మరునాడు రామలింగడు, పండితుడి వేషంలో గొప్ప అట్టహాసంగా సభలోకి ప్రవేశించాడు. నుదుట సింధూరం, విభూతి దిద్దుకొని, కాశ్మీరు పట్టుతో నేసిన ధోవతీ కట్టి, పైన పువ్వులు కుట్టిన శాలువా కప్పుకున్నాడు. మెడలో రాజులు, ప్రజలు, పండితులిచ్చిన బిరుదులు, పతకాలన్నీ తగిలించుకున్నాడు. అతనికి ముందుగా ఏడుగురు పండితులు, అతని కీర్తి ప్రతిష్ఠలను, బిరుదులను పొగుడుతూ వుంటే, అధికారులు…. పరిచారికలతో కలిసి వచ్చి సాదర స్వాగతం పలికారు.

ఇదంతా చూసిన ఆ కాశీపండితుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందాడు! ఎవరీ మహాపండితుడు అని మనస్సులో అనుకున్నాడు. ఇంతలో రామలింగడు, తన చేతిలోని పట్టువస్త్రం కప్పిన గ్రంథాన్ని, ఒక బల్లమీద జాగ్రత్తగా వుంచి చుట్టూ కలియచూశాడు! “నాతో వాగ్వాదానికి సిద్ధంగా ఎవరో పండితులు వచ్చారని విన్నాను. అతను ఎవరో నా ముందుకురండి” అని అన్నాడు.

“నేనే… ఆ మనిషిని” అన్నాడు ఆ కాశీ పండితుడు. “ఇక ఆలస్యం దేనికి? చర్చలు ప్రారంభించండి” అన్నారు రాయలవారు.

వెంటనే రామలింగడు ఠీవీగా లేచి“చూడండి, ఈ గ్రంథం పేరు తిలకాష్ఠ మహిష బంధనం. ఈ గ్రంథంపైనే మనం చర్చ జరుపుదాం” అన్నాడు.

ఇలాంటి గ్రంథం గురించి ఎప్పుడూ వినని, ఆ కాశీ పండితునికి, భయంతో వళ్లంతా చెమటలు పట్టాయి. కంగారు పడిపోయాడు. “ఎన్నో గ్రంథాలు చదివానుగానీ, ఈ తిలకాష్ఠ మహిష బంధనం గురించి ఎక్కడా వినలేదు! ఇక ఎలా చర్చ చేయగలను?” అనుకున్నాడు. దీనితో వెంటనే శ్రీకృష్ణదేవరాయలవారితో, “మహారాజా! నేను నా ఓటమిని అంగీకరిస్తున్నాను” అని అన్నాడు.

కృష్ణదేవరాయలవారు రామకృష్ణుని విజయాన్ని చూసి ఎంతో ఆనందించాడు. అంతేగాక కవిజనబాంధవుడుగా, ఆంధ్రభోజుడిగా పేరుగాంచిన రాయలవారు, ఓడిపోయినప్పకీ, ఆ కాశీ పండితుని గొప్పగా సత్కరించి, బహుమానాలు ఇచ్చి, సాదరంగా సాగనంపారు.

వికటకవి రామలింగడిని ఉద్దేశించి, “మహాకవి, నేను కూడా ఈ తిలకాష్ఠ మహిషబంధనం గురించి ఎప్పుడూ వినలేదు. ఒకసారి ఆ గ్రంథాన్ని నాకు కూడా చూపిస్తారా?” అని రాయలవారు అడిగారు.

అప్పుడు తెనాలి రామలింగడు, చిలిపిగా నవ్వుతూ, బల్లపై కప్పివుంచిన పట్టువస్త్రాన్ని తొలగించాడు. అక్కడ గ్రంథమేదీ లేదు. అట్టపెట్టెలో ఒక నువ్వులకట్టెకు పశువులను కట్టే తాడుముక్క కట్టి ఉంది. వాటిని చూసిన రాయలవారు, సభాసదులు ఆశ్చర్యపోయారు. అప్పుడు రామలింగడు, “మహాప్రభూ! క్షమించాలి! ఇది గ్రంథం కాదు. ఇది నువ్వులకట్టె, దానికి పశువులను కట్టే తాడును కట్టాను. దీనినే నేను సంస్కృతంలో తిలకాష్ఠ మహిష బంధనం అని చెప్పాను. పాపం ఇది తెలియక ఆ కాశీ పండితులవారు కంగారుపడిపోయి, ఓటమిని ఒప్పుకున్నారు” అన్నాడు.

రామలింగడి మాటలు విన్న రాయలవారు మనసారా నవ్వుకొని, వికటకవి తెలివితేటలను మెచ్చుకున్నారు. ఘనంగా బహుమానాలు ఇచ్చి సత్కరించారు.

Read: అభిమన్యు.. ‘ది రియల్ వారియర్’

Read: పంచతంత్రం

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?