ఏమిటి ఈ ‘మనిషి’ బ్రతుకు?

street dogs

అహమ్.. అహమ్… హాయ్! హెల్లో! నమస్తే!… ఎలా ఉన్నారు? ఏంటి? నేను ఎవరా? అని అనుకుంటున్నారా? నన్ను గుర్తుపట్టలేదా? ఒక్క నిమిషం ఆగండి….

‘భౌ…భౌ…భౌ….’

హా…. ఇప్పుడు గుర్తుపట్టారా? నేనే.. రోజూ మీ వీధి చివర్లో ఉన్న కారు కింద పడుకునే కుక్కని.

కుక్క ఏంటి ఇలా గడగడా మాట్లాడమేంటని ఆశ్చర్యపోతున్నారా? మరేం లేదండి… ఆ దేవుడు నాకో వరం ఇచ్చాడు. ఒక్క రోజు పాటు నా మాటలు మీకు.. అదే మనుషులకు వినపడుతుందని వరం ఇచ్చాడు. మరి ఉపయోగించుకోవాల్సిందే కదా! అందుకే ఇలా వచ్చేశా.

ప్రపంచానికి.. అదేదో మాయదారి కరోనా పట్టిందని విన్నాను. దానికి మందు లేదని, అది వస్తే పుటుక్కున్న పోతున్నారని తెలిసింది. మీ ఇంట్లో అందరు క్షేమమేనా? అప్పుడప్పుడు వాకింగ్ అని బయటకు వచ్చే బామ్మ గారు ఈ మధ్య కనిపించడం లేదు. అంతా కుశలమే కదా! జాగ్రత్త సుమీ! మీకేమైనా అయితే నేను తట్టుకోలేను. మొన్న 2-3 నెలలు మీరు సరిగ్గా కనపడపోయే సరికి నాకు జ్వరం వచ్చేసింది.

ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ప్రపంచాన్ని శాసించే మనిషిని ఓ సూక్ష్మ జీవి గడగడలాడిస్తోందంటే మామూలు విషయమా?

నా జీవితంలో ఎప్పుడూ చూడని కొన్ని వింతలు లాక్డౌన్ కాలంలో చూశాను. కొందరు నా దగ్గరకి వచ్చి బిస్కెట్లు, బిర్యానీ పొట్లాలు ఇచ్చేవారు. హమ్మయ్య! తిండి దొరికిందిరా దేవుడా అనుకునేవాడిని. అక్కడి వరకు అంతా బానే ఉండేది. కానీ ఆ తర్వాత వాళ్లు ఫోన్లు పట్టుకుని చేసిన హంగామా అంతా ఇంతా కాదు. రకరకాల యాంగిల్స్లో ఫోజులిచ్చి నాతో ఫొటోలు దిగేవాళ్లు. ఒక్కోసారి నాకిచ్చిన కూడును కూడా తిననిచ్చేవారు కాదు. ‘ఇదేం వింత రా బాబు?’ అనుకునేవాడిని. మీ భాషలో దీన్నే ‘పబ్లిసిటీ’ అంటారంట కదా?

ఇన్నేళ్లు నా దగ్గరకి కూడా రాని వారు, నేను ఉన్నానా? లేనా? అని పట్టించుకోని వారు హఠాత్తుగా నన్ను పట్టుకుని, నా మీద పడి ఫొటోలకు ఫోజులిస్తుంటే కొంత చిరాకుగా అనిపించింది. ‘అవసరం’ ఏదైనా చేయిస్తుంది.. ఎక్కడికైనా తీసుకెళుతుంది కదూ!

ఒక్కోసారి మీ పెంపుడు కుక్క స్థానంలో నేను ఉంటే బాంగుండూ అనిపిస్తుంది. ఇవేవీ లేకుండా హాయిగా రాజభోగాలు అనుభవించొచ్చు.

అయినా.. ఎందుకండి పెంపుడు కుక్కలకు మాకూ అంత తేడా చూపిస్తారు? మేము చెత్తలో బ్రతుకుతామనా? మీరు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకుని… రోడ్లల్లో చెత్త వేస్తుంటారు. మీ పెంపుడు కుక్కల్లా మాకు హాయిగా జీవితాన్ని గడిపేయడానికి నీడ ఉండదు కదా! మరి మీరేసిన చెత్తలోనే కదా మేము ఉండాల్సింది! ఇది మరి ఎవరి తప్పో? వాటికేమో వారానికోసారి స్పెషల్ బాత్ టబ్బులో స్నానాలు.. మాకేమో పొంగిపొర్లుతున్న డ్రైనేజీతో కష్టాలు.

విదేశాల నుంచి తెప్పించుకుంటారంటగా… చింటూ, బంటూ, రాకీ అని పేర్లు కూడా పెడతారంటగా? ఎందుకండి ఇంత వ్యత్యాసం? ‘వీదేశీ కుక్కలు వద్దు.. దేశీయ శునకాలే ముద్దు’ అని స్వయంగా ప్రధాని మోదీ చెప్పారు. ఆ మాటలు విన్నారా? కనీసం ఇకనైనా మమ్మల్ని పెంచుకుంటారా? అంతరవరకు ఎందుకండి.. మమ్మల్ని ఛీదరించుకోవడం మానేస్తారా?

అయినా ఇది మీకేం కొత్త కాదు కదా! నేను వింటూనే ఉంటాను, చూస్తూనే ఉంటాను. మీలో మీకే చాలా గొడవలుంటాయంటగా? ‘కులం’ పేరుతో ఒకరికి ఒకరు దూరంగా ఉంటారంట. ‘మతం’ ముసుగులో కొట్టుకుంటారంట కదా? ‘అందరూ అలా ఉంటారేంటి’ అని అడుగుతారా? అబ్బో ఇలాంటి వాళ్లని నేను చాలా మందినే చూశాను. ‘నీ.. మీ’ వరకు అంతా బానే ఉంటుంది. ‘నా, మన’ వరకు వచ్చేసరికి అంతా మారిపోతుంది. అప్పటివరకు శాంతి ప్రవచనాలు చెప్పిన వ్యక్తి, ఒక్క క్షణంలో ఊసరవెల్లిలా మారిపోతాడు.

అవునండీ… భూమిని కూడా పంచేసుకుని… మీ జోలికి వస్తే సొంత కుటుంబం, బంధువులు అని కూడా చూడకుండా కత్తులతో పొడుచుకుని చంపేసుకుంటారంట కదా? ఇదేం విడ్డూరమండి బాబు!

రోడ్డు ప్రమాదాలు, నిరుద్యోగుల ఆత్మహత్య, ప్రేయసి కాదంటే యాసిడ్ పోసేయడం.. తల్లిదండ్రులు వద్దంటే ఆత్మహత్యలు చేసుకోవడం… ఇలా మీ గురించి పేపర్లో చదువుతుంటే నాకు ఏడుపొస్తుంది. పేపర్ ఎక్కడిదంటారా? మీరు బయట వేసే చెత్తలో అవి కూడా ఉంటాయిగా మరి.

అమ్మో… ఇవన్నీ చూస్తుంటే మేమే నయం అనిపిస్తోంది. మా ‘భౌ.. భౌ’లే మేలనిపిస్తోంది. కానీ మాకు కూడా ఈ మధ్య ‘మనిషి’ బుద్ధులు పట్టుకుంటున్నాయి. నాకు చాలా భయమేస్తోంది. ఓ పేటలోని కుక్కలు మరో వీధి కుక్కలను వారి పేటలోకి రానివ్వడం లేదు. వస్తే అరుపులు.. కేకలు… గోలగోల.

అమ్మో… వెంటనే కుక్కల సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి.. ‘మనం మనుషుల్లా అవ్వకూడదురా బాబూ!’ అని ప్రసంగాలు చేయాలి. లేకపోతే పరిస్థితి చెయ్యి దాటిపోయేలా ఉంది.

ప్రసంగాలంటే గుర్తొచ్చింది. కొందరు తెల్ల చొక్కాలేసుకుని స్టేజీల మీద తెగ మాట్లాడటం చూశాను. మైక్ చేతికి అందితే చాలు పూనకం వచ్చినట్టు ఊగిపోయారు. ‘ఉద్యోగాలిస్తాం… రోడ్లు బాగు చేస్తాం, మీ జీవితాలను మార్చేస్తాం’ అని ఎవోవో మాట్లాడేశారు.

ఆ తర్వాతే తెలిసింది… అవన్నీ ఎన్నికల హామీలని, వారంతా రాజకీయ నేతలని. మన వీధి చివర ఉన్న టీ కొట్టులో తాపీగా కూర్చుని పేపర్ చదువుతూ ప్రపంచ విశేషాలు మాట్లాడుకున్న ఇద్దరు తాతల దగ్గర విన్నాను.

ఒక్కోసారి.. మైక్ పట్టుకున్న వారిని చూస్తే జాలేస్తుంది. గెలుపు కోసం ఎన్ని తిప్పలో! ఒక్కోసారి మిమ్మల్ని చూస్తే బాధేస్తుంది. బ్రతుకు సాగించడం కోసం ఎన్ని కష్టాలో.

ఇవన్నీ మేము చూస్తూనే ఉంటాం. రాత్రి పూట స్నేహితులందరం కలిసినప్పుడు ఈ విషయాలన్నీ చెప్పుకుని కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుంటూనే ఉంటాం.

అయినా మాకంటే బుర్ర లేదు.. మేము ఆలోచించలేము. మరి.. ఆ ‘మైక్ ప్రియుల’ను మీరెలా నమ్ముతున్నారు? ఇంకెన్నాళ్లు వాళ్ల చేతిలో మైక్ పెడతారు? ఏంటో ఇవన్నీ మీకే తెలియాలి. ఇవన్నీ అడగడానికి నేనెవరిని? ఈరోజు గడిస్తే నా ‘భౌ…భౌ’లే కదా మీకు వినపడేవి.

                                                      – VISWA (WRITER) 

ఇదీ చూడండి: దేవుడు ఉన్నాడా? ఇదే సాక్ష్యం

ఇదీ చూడండి: సెకెండ్ ఛాన్స్‌

 

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?