గుప్తుల పరిపాలన
గుప్తుల కాలంలోని ముఖ్యమైన అధికారులు:
- సంధి విగ్రాహక – విదేశాంగశాఖ
- కుమారామాత్య – ఉన్నత అధికారులు
- మహాబలాధికృత – సేనాపతి
- భటాశ్వపతి – అశ్వదళాధికారి
- కటుక/ పీలుపతి – గజదళాధికారి
- దండపాశాధికరణ – పోలీస్ శాఖాధిపతి
- శౌల్కిక – కస్టమ్స్ అధికారి
- మహాదండనాయక – మఖ్య న్యాయమూర్తి
- అఖపాలాధికృత – అకౌంట్స్ శాఖాధిపతి
- హిరణిక మరియు ఔద్రాంగిక – పన్నులు వసూలు చేసే అధికారి
పరిపాలన విభాగాలు:
- గుప్త సామ్రాజ్యము అనేక భుక్తులు (రాష్ట్రాలు)గా విభజించబడింది. భుక్తి యొక్క ముఖ్యాధికారిని ఉపారిక అన్నారు.
- భుక్తులను విషయాలు (జిల్లాలు)గా విభజించారు. విషయపతి వీటికి అధికారిగా వ్యవహరించేవాడు.
- గ్రామణి అనే అధికారి గ్రామ పాలనను నిర్వహించేవాడు.
- వర్తకులతో కూడిన నిగమ సభలు నగర పాలనను నిర్వహించేవి.
గుప్తుల మత పరిస్థితులు
గుప్తుల యుగంలో మత రంగంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. భక్తి ప్రధానమైన హిందూమతం పరిపూర్ణ రూపంలో అవతరించింది. ప్రాచీన భారతదేశంలోని ఇతర మతాలన్నీ క్రమంగా హిందూమతంలో విలీనమయ్యాయి. హిందూమతంలో వైష్ణవ మరియు శైవ అనే రెండు ప్రధాన శాఖలు ఆవిర్భవించాయి.
వైష్ణవము
గుప్తుల కాలంలోనే విష్ణువు యొక్క దశావతారములు ప్రసిద్ధి గాంచాయి. ధర్మాన్ని స్థాపించడానికి విష్ణువు అనేక సార్లు అవతరించాడనే విశ్వాసము ప్రజల్లో బలంగా ఉండేది.
- మత్స్య అవతారము: మానవజాతిని రక్షించడానికి విష్ణువు మత్స్య అవతారంలో వచ్చి మనువును వరద నుండి కాపాడారు.
- కూర్మ అవతారము: అమృతం కోసం దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మధనం చేస్తుండగా, మందర పర్వతాన్ని మొయ్యడానికి విష్ణువు కూర్మ అవతారం ఎత్తాడు.
- వరాహ అవతారము: రాక్షసుడైన హిరణ్యాక్షుడిని సంహరించి భూమాతను కాపాడటానికి విష్ణువు వరాహ రూపంలో అవతరించాడు.
- నరసింహ అవతారము: హిరణ్యకశిప అనే రాక్షసుడిని సంహరించడానికి విష్ణువు నరసింహంగా అవతరించాడు.
- వామన అవతారము: కేరళ పాలకుడైన బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కిన వామనుడు విష్ణువు యొక్క ఐదవ అవతారము. (మళయాళీయులు ఓనమ్ పండుగను బలిచక్రవర్తి జ్ఞాపకార్థము జరుపుకుంటారు.)
- పరుశురామ అవతారము: గొడ్డలి చేతపట్టిన రాముడిగా అవతరించిన విష్ణువు క్షత్రియులను అంతం చేసి వారి రాజైన కార్తవీర్యార్జునుడిని చంపాడు.
- రామ అవతారము: విల్లు, బాణము చేత పట్టిన రాముడిగా అవతరించిన విష్ణువు లంకాదీశుడైన రావణుడిని సంహరించాడు.
- కృష్ణావతారము: విష్ణువు మధుర పాలకుడైన కంసుడిని అంతం చెయ్యడానికి కృష్ణుడిగా అవతరించాడు.
- బుద్ధావతారం: మానవాళికి అహింసా మార్గాన్ని మరియు సామాజిక సమానత్వాన్ని బోధించడానికి విష్ణువు బుద్ధునిగా వచ్చాడని పురాణాలు తెలియజేస్తున్నాయి.
- కల్కి అవతారము: విష్ణువు కలియుగ అంతంలో కల్కిగా అవతరిస్తాడని పురాణాలు తెలియజేస్తున్నాయి.
శైవము
హిందూమతంలో శైవము ఇంకొక ప్రధాన శాఖ. ఇందులో అనేక ఉప శాఖలు ప్రాచీన కాలంలోనే ఆవిర్భవించాయి. అందులో ముఖ్యమైనవి:
- పాశుపతము: ఇది శైవంలోని అతివాద శాఖ. క్రీ.శ.2వ శతాబ్ధంలో గుజరాత్‌కు చెందిన లకులీసుడు దీనిని ప్రారంభించాడు. ఇతను పంచార్థవిద్య అనే గ్రంథాన్ని రచించాడు.
- కాపాలిక మరియు కాలముఖ: క్రీ.శ.4 మరియు క్రీ.శ.5వ శతాబ్దాల్లో ఈ రెండు శాఖలు ఆవిర్భవించాయి. ఇవి పాశుపత శైవం యొక్క ఉపశాఖలు.
- అఘోర శైవము: క్రీ.శ.12వ శతాబ్దములో దీనిని అఘోర శివాచార్య స్థాపించాడు. ఈ శైవ శాఖ నేటికీ కాశీ ప్రాంతంలో కనిపిస్తుంది. వీరు మలమూత్రాలు, మానవ కళేబరాలు కూడా తింటారని అంటుంటారు.
- మితవాద శైవ శాఖలు: పై అతివాద శాఖలతో పాటుగా శైవమతంలో ఈ క్రింది మితవాద శైవ శాఖలు కూడా ఆవిర్భవించాయి.
మితవాద శైవ శాఖ | స్థాపకుడు |
త్రిక | అభినవ గుప్త (కాశ్మీర్) |
ప్రత్యాభిజ్ఞ | వసుగుప్త (కాశ్మీర్) |
స్పందశాస్త్ర | కల్లాట మరియు సోమానంద (కాశ్మీర్) |
శుద్ధశైవ/ శివాద్వైత | శ్రీకాంత శివాచార్య (మధ్య భారతదేశం) |
వీరశైవము | బసవన్న (కర్ణాటక) |
గుప్తుల లలితకళలు (Fine Arts)
గుప్తుల కాలాన్ని సాంప్రదాయ చరిత్రకారులు స్వర్ణయుగమని అభివర్ణించారు. లలిత కళల్లో మరియు సాహిత్యంలో అత్యున్నత ప్రగతి సాధించడము వలన స్వర్ణయుగమని పిలిచారు. అయితే ఆధునిక చరిత్రకారులు ఈ అభిప్రాయముతో ఏకీభవించడము లేదు. కేవలము లలిత కళలు, సాహిత్యము ఆధారంగా స్వర్ణయుగాన్ని నిర్ణయించలేమని, మానవ జీవనములోని అన్ని రంగాలు అత్యున్నత ప్రగతి సాధిస్తేనే దాన్ని స్వర్ణయుగమని చెప్పవచ్చని వీరి అభిప్రాయం.
గుప్తుల కాలంలో ఆ పరిస్థితి కనిపించదు. అయితే వాస్తుశిల్పకళ, చిత్రలేఖనము మరియు సాహిత్యము అత్యున్నత శిఖరాలకు చేరుకోవడము వలన ఈ కాలాన్ని స్వర్ణయుగమని పరిగణించకపోయినా సాంస్కృతిక యుగము (classical age) అని ఖచ్చితంగా పిలవవచ్చు.
గుప్తుల వాస్తుశిల్పకళ
గుప్తుల కాలంలో బౌద్ధ శిల్పకళ మరియు హిందూ శిల్పకళలు సమానంగా అభివృద్ధి చెందాయి. గుప్తులు వైష్ణవులైనప్పటికీ అన్ని మతాలను ఆదరించి తమ లౌకిక భావాలను వ్యక్తపరిచారు.
బౌద్ధ శిల్పకళ
గుప్తుల కాలంలో సారనాథ్ శిల్పకళ అనే నూతన బౌద్ధ శిల్పకళా శైలి ప్రారంభమయ్యింది. కాశీ సమీపంలోని సారనాథ్ కేంద్రంగా ఈ శైలి అభివృద్ధి చెందింది. గౌతమ బుద్ధుడిని ‘ధర్మచక్ర పరివర్తన ముద్ర’ లో చూపించే శిల్పాలు సారనాథ్ శైలిలో ప్రముఖమైనవి. బీహార్‌లోని సుల్తాన్‌గంజ్‌లో లభించిన ఏడున్నర అడుగులు ఎత్తున్న రాగి బుద్ధుని శిల్పం గుప్తుల కాలానికి చెందినది. ప్రస్తుతం ఇది ఇంగ్లాండులోని బర్మింగ్‌హామ్ మ్యూజియంలో ఉంది. గుప్తులు అనేక బౌద్ధ గుహాలయాలను నిర్మించారు. వీటిలో విహారాలు మరియు చైత్యాలున్నాయి. అజంతాలోని 30 బౌద్ధ గుహాలయాల్లో కొన్నింటిని గుప్తులు నిర్మించారు. దీనితో పాటుగా మధ్యప్రదేశ్‌లోని బాగ్‌లో 9 బౌద్ధ గుహాలయాలు కూడా వీరు నిర్మించినవే.
హిందూ శిల్పకళ
భారతదేశంలో నేటికీ నిలిచి ఉన్న తొలి హిందూ దేవాలయాలు నిర్మించిన ఘనత గుప్తులకే దక్కుతుంది. వీరు గుహాలయాలు (cave temples) మరియు నిర్మితి ఆలయాలను (structural temples) నిర్మించారు. విదిశ జిల్లాలోని ఉదయగిరి (మధ్యప్రదేశ్)లో 20 హిందూ గుహాలయాలను నిర్మించారు. ఇవి భారతదేశంలోనే తొలి హిందూ గుహాలయాలు. ఇందులో శైవ మరియు వైష్ణవ గుహాలయాలున్నాయి.
ఈ గుహాలయాల్లో అత్యున్నతమైన హిందూ శిల్పకళ కనిపిస్తుంది. ఐదవ గుహాలయంలో కనిపించే ‘భూమిని కాపాడుతున్న వరాహ శిల్పము’ ఉదయగిరి శిల్పాల్లో అత్యంత సుప్రసిద్ధమైనది. వీటితో పాటు ఏకముఖలింగము, గణేష మరియు నాగరాజు శిల్పాలు దర్శనమిస్తాయి. గుప్తులు నిర్మించిన నిర్మితి ఆలయాలు (structural temples) మధ్యప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తాయి. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని గుప్తులకు రెండవ రాజధానిగా ఉంటూ సాంస్కృతిక మరియు సాహిత్య కేంద్రంగా ఉండేది. వీరు నిర్మించిన హిందూ దేవాలయాలు శిఖర/ నాగర శైలిలో ఉంటాయి. గుప్తులు ప్రారంభించిన ఈ శైలి ఉత్తర భారతదేశంలో నేటికీ కొనసాగుతోంది. (ప్రాచీన భారతదేశంలో మూడు హిందూ దేవాలయ శైలులు అభివృద్ధి చెందాయి. ఉత్తర భారతదేశంలో శిఖర లేదా నాగర శైలి, దక్షిణ భారతదేశంలో ద్రావిడ శైలి మరియు దక్కన్‌లో వెసార శైలి వెలిసాయి.)
నోట్: హిందూ దేవాలయంలో గర్భగుడిపైనున్న కట్టడాన్ని విమానము అని, ఆలయ ద్వారమును గోపురము అ అంటారు. ఈ మూడు శైలులలో విమానం యొక్క ఆకారము వేరువేరుగా ఉండడం మనం గమనించవచ్చు.
గుప్తులు నిర్మించిన ముఖ్య ఆలయాలు:
- కంకాళిదేవి ఆలయము – తిగ్వ (మధ్యప్రదేశ్)
- విష్ణు ఆలయం మరియు వరాహ ఆలయం – ఎరాన్ (మధ్యప్రదేశ్). ఈ ఆలయంలోని నిలువెత్తు హరిహర శిల్పము చాలా సుప్రసిద్ధమైనది.
- పార్వతి ఆలయం మరియు మహాదేవ ఆలయం లేదా చౌముఖ్‌నాథ్ ఆలయం – నాచనకుతర (మధ్యప్రదేశ్)
- శివాలయము – భూమ్ర (మధ్యప్రదేశ్) ఈ ఆలయంలోని మహిశాసురమర్ధిని శిల్పము అత్యంత విశిష్టమైనది.
- దశావతార ఆలయం – దియోఘర్ (ఉత్తరప్రదేశ్). అనంతశయన శిల్పము మరియు గజేంద్రమోక్షం శిల్పాలు ఆలయ గోడలపైన అత్యంత సుందరంగా చెక్కబడ్డాయి.
- బితారిగావ్ ఆలయం (ఉత్తరప్రదేశ్) – కాన్పూర్ సమీపంలోని ఈ ఆలయం పూర్తిగా శిథిలమవ్వడము వలన ఏ దేవుని ఆలయమో తెలియడము లేదు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇది భారతదేశంలో నేటికీ నిలిచి ఉన్న తొలి హిందూ దేవాలయము.
అజంతా శిల్పకళ & చిత్రలేఖనము
అజంత ఔరంగాబాద్ జిల్లా (మహారాష్ట్ర)లో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లోని అటవీ ప్రాంతంలో ఉంటుంది. బౌద్ధమతానికి సంబంధించిన వాస్తుశిల్పము (architecture), శిల్పము (sculpture) మరియు చిత్రలేఖనము (paintings) యొక్క అద్భుతమైన సమాహారము ఇక్కడ దర్శనమిస్తుంది. భారతదేశంలో UNESCO గుర్తించిన తొలి ప్రపంచ వారసత్వ కేంద్రమిది.
అజంతాలోని సహ్యాద్రి పర్వతాల్లో 30 బౌద్ధ గుహాలయాలు నిర్మించబడ్డాయి. ఇందులో విహారాలు మరియు చైత్యాలున్నాయి. ఈ గుహాలయాలు ఏ కాలంలో, ఏ రాజుల ఆదరణలో నిర్మించబడ్డాయో తెలియడము లేదు. అయితే ఇక్కడ లభించిన శాసనాలు ద్వారా అజంత గుహాలయాలు క్రీ.పూ.2వ శతాబ్దము నుండి క్రీ.శ.8వ శతాబ్దము మధ్యలో నిర్మించబడ్డాయని తెలుస్తుంది. ఈ వెయ్యేళ్ళ కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన అనేక వంశాలు ఈ గుహాలయ నిర్మాణములో పాల్గొని ఉండవచ్చు. శాతవాహనులు, అభీరులు, వాకాటకులు, గుప్తులు మరియు బాదామి చాళుక్యులు అజంత నిర్మాణాలను చేపట్టి ఉండవచ్చు.
పాళీ భాషలో వ్రాయబడిన జాతకాల నుండి బుద్ధుని మరియు బోధిసత్వుల కథలను స్వీకరించి, వాటిని చిత్రాలుగా గీసి మరియు శిల్పాల రూపములో చెక్కి గుహాలయాల గోడలను మరియు పైకప్పులను అలంకరించారు. బుద్ధుని జీవితములోని ప్రధాన ఘట్టాలతో పాటు బోధిసత్వులైన వజ్రపాణి, పద్మపాణి చిత్రాలు అందంగా చిత్రీకరించారు. ఈ గుహల్లో మహాపరినిర్వాణ (మరణిస్తున్న బుద్ధుడు) శిల్పము సుప్రసిద్ధమైనది. క్రీ.శ.8వ శతాబ్దములో బౌద్ధము క్షీణించడముతో ఈ గుహలు అజ్ఞాతంలోకి వెళ్ళాయి. 1819లో జాన్‌స్మిత్ అనే ఆంగ్లేయుడు ఈ గుహలను కనుగొన్నాడు.