మౌర్యానంతర యుగం- స్వదేశీ రాజ్యాలు
మౌర్యానంతర యుగంలో విదేశీ రాజ్యాలతో పాటుగా అనేక స్వదేశీ రాజ్యాలు కొనసాగాయి. వాటిలో ముఖ్యమైనవి:
I. శుంగరాజ్యము (క్రీ.పూ.184 – 75)
శుంగులు భరద్వాజ గోత్రానికి చెందిన బ్రాహ్మణులు. మౌర్యుల పాలనలో ఉన్నతాధికారులుగా పనిచేస్తూ, మౌర్యులను అంతం చేసి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. మధ్యప్రదేశ్‌లోని విదిశ వీరి రాజధాని. పురాణాల ప్రకారము ఈ వంశంలో పది మంది రాజులున్నారు.
పుష్యమిత్ర శుంగ
- ఇతను శుంగ వంశ స్థాపకుడు. చివరి మౌర్య చక్రవర్తియైన బృహద్రద దగ్గర సేనాపతిగా పనిచేస్తూ, అతన్ని హత్య చేసి మౌర్య సామ్రాజ్యాన్ని అంతం చేశాడు.
- యవనులను (ఇండో-గ్రీకులు) రెండుసార్లు ఓడించాడని తెలుస్తోంది. కాళిదాసు వ్రాసిన మాళవికాగ్నిమిత్రము అనే నాటకములో కూడా యవనుల ఓటమి గురించి ప్రస్తావన ఉంది.
- అయోధ్యలో రెండు అశ్వమేధ యాగాలు నిర్వహించాడు.
- పుష్యమిత్రశుంగుడు బౌద్ధమత వ్యతిరేకి అని, అశోకుడు నిర్మించిన 84,000 బౌద్ధ స్థూపాలను ధ్వంసం చేసిన క్రూరుడని టిబెటన్ బౌద్ధ గ్రంథమైన దివ్యవదన తెలియజేస్తుంది. అయితే ఈ అభిప్రాయాన్ని చరిత్రకారులు కొట్టిపారేశారు. గయ, బర్హుత్, సాంచిల్లో పుష్యమిత్ర శుంగ అనేక బౌద్ధ కట్టడాలను నిర్మించినట్లుగా ఆధారాలు లభించాయి. వీటిలో గయలోని మహాబోధి ఆలయం సుప్రసిద్ధం.
- పుష్యమిత్ర శుంగుని ఆస్థానంలో సుప్రసిద్ధ పండితుడు పతంజలి ఉన్నాడు. ఇతను మహాభాష్యము అనే సంస్కృత వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. ఇది పాణిని వ్రాసిన అష్టాధ్యాయిపైన వ్యాఖ్యానము.
అగ్నిమిత్రుడు
ఈ వంశంలో ఇతను రెండవ పాలకుడు. కాళిదాసు వ్రాసిన మాళవికాగ్నిమిత్రము అనే నాటకంలో ఇతనే కథానాయకుడు. అగ్నిమిత్రుడు మాళవిక అనే యువరాణిని ప్రేమించి పెళ్ళిచేసుకోవడము ఈ నాటకములోని కథాంశం.
కాశీపుత్ర భాగభద్ర
ఈ వంశంలో ఇతను ఆరవ రాజు. హీలియోడోరస్ అనే గ్రీకు రాయబారి ఇతని ఆస్థానానికి వచ్చాడు. ఈ గ్రీకు రాయబారి విదిశ సమీపంలో వేసిన బేసనగర్ స్తంభ శాసనం ద్వారా గ్రీకు రాజైన ఆంటియల్ సీడస్ ఇతన్ని శుంగ రాజ్యానికి రాయబారిగా పంపించాడని తెలుస్తుంది. ఈ శాసనము ప్రాకృత భాష మరియు ఖరోష్టి లిపిలో వెయ్యబడింది. భాగభద్రుని నాణెములు తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో లభ్యమయ్యాయి.
దేవభూతి
శుంగ వంశములో చివరివాడు. ఇతని సేనాపతి వాసుదేవ కణ్వ ఇతన్ని హత్యచేసి, శుంగ వంశాన్ని నిర్మూలించి, కణ్వవ శాన్ని స్థాపించాడు.
II.కణ్వ వంశం (క్రీ.పూ.75 – 27)
వీరు కణ్వాయణ గోత్రానికి చెందిన బ్రాహ్మణులు. పాటలీపుత్రము వీరి రాజధాని. వీరి గురించి పరిపూర్ణ సమాచారము లభించడము లేదు. మత్స్య మరియు వాయు పురాణాల ప్రకారము వాసుదేవ కణ్వుడు తొలి రాజు మరియు సుశర్మ చివరివాడు. ఒక ఆంధ్రరాజు పాటలీపుత్రంపై దండెత్తి, సుశర్మను చంపి కణ్వవంశాన్ని అంతం చేశాడని పురాణాలు తెలియజేస్తున్నాయి.
III. శాతవాహనులు
మౌర్యానంతర యుగంలో దక్కన్‌ను ఏకం చేసి అనేక శతాబ్దాలపాటు ఏకఛత్రాధిపత్యంగా పాలించినవారు శాతవాహనులు. వీరు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లతో కూడిన విశాల ప్రాంతాన్ని పరిపాలించారు. వీరికి అనేక రాజధానులు ఉన్నట్లుగా శాసనాలు మరియు సాహిత్యం ద్వారా తెలుస్తుంది. అవి:
- కోటిలింగాల (జగిత్యాల జిల్లా తెలంగాణ)
- ప్రతిష్టానపురము (ఔరంగబాద్ జిల్లాలోని పైథాన్ – మహారాష్ట్ర)
- శ్రీకాకుళం (కృష్ణా జిల్లా – ఆంధ్రప్రదేశ్)
- ధాన్యకటకము (గుంటూరు జిల్లాలోని అమరావతి – ఆంధ్రప్రదేశ్)
మత్స్యపురాణ సాంప్రదాయం ప్రకారం శాతవాహన వంశంలో 30 మంది రాజులు 450 ఏళ్ళు (క్రీ.పూ.225 నుంచి క్రీ.శ.225) పాలించారు.
శ్రీముఖుడు/ సిముక
పురాణాల ప్రకారం ఇతను మొదటి శాతవాహన రాజు. ఇతని 8 నాణెములు కోటిలింగాలలో లభ్యమయ్యాయి.
శాతకర్ణి – 1
- ఇతను మూడవ రాజు.
- ఇతని భార్య నాగానిక వేసిన నానాఘాట్ శాసనం ఇతని విజయాలను తెలియజేస్తుంది (శాతవాహనుల శాసనాలు ప్రాకృత భాషలో మరియు బ్రాహ్మి లిపిలో వెయ్యబడ్డాయి).
- ఇతనికి దక్షిణపథపతి మరియు అప్రతిహతచక్ర అనే బిరుదులున్నాయి.
- అశ్వమేధయాగము, రాజసూయయాగాలతో పాటు అనేక ఇతర యాగాలను నిర్వహించాడు.
- గోవులు, అశ్వాలు, ఏనుగులు, బంగారంతో పాటుగా బ్రాహ్మణులకు 13 గ్రామాలను దానంగా ఇచ్చాడు. బ్రాహ్మణులకు భూదానాలిచ్చే సాంప్రదాయము శాతవాహనుల నుండి ప్రారంభమయ్యింది. గుప్తుల కాలం నుంచి బ్రాహ్మణులకు ఇవ్వబడిన భూదానాలను అగ్రహారాలని లేదా బ్రహ్మదేయములని పిలిచారు.
- నానాఘాట్‌లోని ఒక బౌద్ధ గుహాలయములో శాతకర్ణి మరియు నాగానికతో పాటు ఇతర రాజకుటుంబీకుల శిల్పాలు ఉన్నాయి.
కుంతల శాతకర్ణి
ఇతను శాతవాహనులలో 13వ రాజు. ఇతని ఆస్థానంలో ఇద్దరు సుప్రసిద్ధ కవులు ఉన్నారు.
- గుణాడ్యుడు – ఇతను బృహత్కథ అనే గ్రంథాన్ని వ్రాశాడు. ఇది పైశాచి భాషలో వ్రాయబడింది.
- శర్వవర్మ – ఇతను సంస్కృత కవి. కాతంత్రవ్యాకరణమును రచించాడు.
హాలుడు
ఇతను 17వ రాజు. కేవలం ఐదు సంవత్సరములే పాలించాడు. ప్రాకృతంలో గాథాసప్తశతి అనే కావ్యాన్ని వ్రాశాడు. ఇందులో 700 శృంగార కవితలు ఉంటాయి. హాలుడు కవిరాజు అనే బిరుదాన్ని తీసుకున్నాడు.
గౌతమీపుత్ర శాతకర్ణి
- ఇతను శాతవాహన వంశంలో 23వ రాజు మరియు ఈ వంశంలో అందరికంటే గొప్పవాడు.
- మాతృసంజ్ఞ (metronymic – తల్లి పేరును జోడించడం) సాంప్రదాయము ఇతని కాలంలో ప్రారంభమయ్యింది.
- ఇతని తల్లి గౌతమీ బాలశ్రీ వేసిన నాసిక్ శాసనంలో ఇతని విజయాలు చెప్పబడ్డాయి.
- అస్సక/ అస్మక (బోధన్); మూలక (గోదావరి); ఋషిక (కృష్ణా ప్రాంతం); విదర్భ; సెతగిరి (నాగార్జునకొండ); వైజయంతి (బనవాసి – కర్ణాటక) మరియు అవరాంత (కొంకణ్) ప్రాంతాలను జయించాడు.
- గౌతమీపుత్ర శాతకర్ణికి అనేక బిరుదాలున్నాయి. అవి:
- ఏకబ్రాహ్మణ
- క్షత్రియ దర్పమానమర్దన
- శక, యవన, పహ్లవ నిసూధన
- త్రిసముద్రతోయపీతవాహన
- క్షహరాట వంశ నిర్వశేషకార
- రాజరాజ
- ద్విజకులవర్ధన
వాశిష్టీపుత్ర పులోమావి
ఇతను 24వ రాజు. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇతను రాజధానిని ప్రతిష్టానపురం నుంచి ధాన్యకటకానికి మార్చాడు.
శివశ్రీ శాతకర్ణి
ఇతను 25వ రాజు. కార్దమక శకరాజైన రుద్రదమనుని కుమార్తె అయిన రుద్రదమనికను వివాహం చేసుకున్నాడు.
యజ్ఞశ్రీ శాతకర్ణి
- శాతవాహనులలో 27వ రాజు. ఇతను నౌకబొమ్మతో పోటిన్ అనే మిశ్రమలోహంతో నాణెములను ముద్రించాడు.
- బాణుడు రాసిన హర్షచరితలో ఇతను త్రిసముద్రాధిపతి అని పిలువబడ్డాడు.
- ఒక సాంప్రదాయము ప్రకారం ఆచార్య నాగార్జునుడు ఇతనికి సమకాలీనుడు.
పులోమావి-3
శాతవాహనుల్లో ఇతను చివరివాడు. శాతవాహన రాజ్యం అంతమైన తర్వాత అనేక స్వతంత్ర రాజ్యాలు అవతరించాయి. అందులో ముఖ్యమైనవి:
- ఇక్ష్వాకు రాజ్యం – విజయపురి రాజధానిగా తెలంగాణ, ఆంధ్రను పాలించారు.
- అభిర రాజ్యం – నాసిక్ రాజధానిగా మహారాష్ట్రను పాలించారు.
- ఛూటు రాజ్యం – బనవాసి రాజధానిగా కర్ణాటకను పాలించారు.
మహామేఘవర్మ వంశము
ఒడిషాను పాలించిన మహామేఘవర్మ వంశం గురించిన సమాచారము హాథీగుంఫ శాసనము ద్వారా మాత్రమే లభిస్తుంది. ఈ శాసనము భువనేశ్వర్‌కు సమీపంలోని ఉదయగిరి కొండల్లోని ఒక జైన గుహాలయములో లభ్యమయింది. ఖారవేలుడు (క్రీ.పూ.2వ శతాబ్దము) అనే రాజు ఈ శాసనాన్ని ప్రాకృత భాష మరియు బ్రాహ్మి లిపిలో వేయించాడు. ఈ ప్రశస్తి శాసనంలో ఖారవేలుడు తన విజయాలను సంవత్సరాల వారిగా తెలియజేశాడు. ఈ శాసనం ప్రకారం ఖారవేలుడు:
- వరదల్లో ధ్వంసమైన తన రాజధాని కళింగనగరిని పునర్నిర్మించాడు.
- నందుల కాలంలో కళింగలో నిర్మించబడిన పంట కాలువలకు మరమ్మత్తులు చేయించాడు.
- పాటలీపుత్రముపైన రెండుసార్లు దండెత్తి అపార సంపదను జయించాడు.
- శాతవాహనులను ఓడించి వారి నగరాలను ధ్వంసం చేశాడు.
- దక్షిణాది రాజ్యాలైన పాండ్య, చోళ, చేరుల కూటమిని ఓడించాడు. హాథిగుంప శాసనం, అశోకుని శాసనాల తరువాత దక్షిణాది రాజ్యాలను ప్రస్తావిస్తున్న రెండవ శాసనంగా పరిగణించవచ్చు.
- జైనమతాన్ని ఆదరించి, ఉదయగిరిలో హాథిగుంప, రాణిగుంప మరియు గణేష్ గుంప అనే గుహాలయాలను నిర్మించి జైనులకు కానుకగా ఇచ్చాడు.