మౌర్యానంతర యుగము/ గుప్తుల పూర్వయుగము (క్రీ.పూ.200 – క్రీ.శ.300)
క్రీ.పూ.200 నుండి క్రీ.శ.300 మధ్య గల కాలం భారతదేశ చరిత్రలో అత్యంత విశిష్టమైనది. ఇది రెండు మహా సామ్రాజ్యాలైన మౌర్యసామ్రాజ్యము మరియు గుప్తసామ్రాజ్యాల మధ్య ఉన్న యుగము. రాజకీయ రంగంలో అనైక్యత మరియు అనిశ్చిత పరిస్థితులున్నప్పటికీ రాజకీయేతర రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించిన కాలమిది.
రాజకీయ చరిత్ర
మౌర్యానంతర యుగంలో భారతదేశంలో అనేక విదేశీ మరియు స్వదేశీ రాజ్యాలు అవతరించాయి. ఫలితంగా దేశంలో రాజకీయ అనైక్యత రాజ్యమేలింది. మౌర్యుల అనంతరం భారతదేశంపై విదేశీ దాడులు జరిగి తద్వారా అనేక విదేశీ రాజ్యాలు అవతరించాయి. ఈ కాలంలో రాజకీయ అధికారమును విదేశీ మరియు స్వదేశీ రాజులు పంచుకొన్నారు.
విదేశీ రాజ్యాలు
భారతదేశంలోని అనేక ప్రాంతాలు మౌర్యుల తదనంతరము విదేశీయుల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. వివిధ ప్రాంతాల నుంచి దండెత్తి వచ్చిన విదేశీ తెగలు భారతదేశంలో అనేక రాజ్యాలను స్థాపించాయి. ఇందులో కొన్ని ముఖ్యమైన రాజ్యాలను ఈ క్రింద చర్చించడమైనది.
I. ఇండో-గ్రీకులు/ఇండో- బాక్ట్రియన్లు / యవనులు
బాక్ట్రియా (ఉత్తర ఆఫ్ఘనిస్తాన్)కు చెందిన గ్రీకులు వాయువ్య భారతదేశంలో ఒక స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించి, ఇక్కడే శాశ్వతంగా స్థిరపడి, భారత సంస్కృతిలో విలీనమయ్యారు. తమ విదేశీయతను, కోల్పోయి భారతీయులయ్యారు. కాబట్టి వీరిని ఇండో-గ్రీకులు అని పిలుస్తారు. భారతదేశంలో ఇండో గ్రీకులను యవనులు అని పిలుస్తారు. వీరు గ్రీకుల్లో అయోనియన్ తెగకు చెందినవారు కాబట్టి వీరిని యవనులు అంటారు.
క్రీ.పూ.మూడవ శతాబ్దంలో సెల్యూసిడ్ సామ్రాజ్యం బలహీనపడటముతో ఈ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న బాక్ట్రియా స్వతంత్ర రాజ్యమైంది. బాక్ట్రియా పాలకుడైన డెమిట్రియస్ భారతదేశంపై దండెత్తి వాయువ్య భారతదేశాన్ని జయించాడు. అలెగ్జాండర్ తర్వాత భారతదేశాన్ని జయించిన రెండవ గ్రీకు వీరుడిగా డెమిట్రియస్ను పరిగణించవచ్చు.
వాయువ్య భారతదేశంలో ప్రాకృత భాష మరియు గ్రీకు & ఖరోష్టి లిపిలో వేయబడిన డెమిట్రియస్ నాణాలు బయల్పడ్డాయి. తన సేనానియైన మినాండర్ను తాను జయించిన వాయువ్య భారతదేశంలో తన ప్రతినిధిగా నియమించాడు. బాక్ట్రియాలో డెమిట్రియస్ హత్యకు గురికావడాన్ని అవకాశంగా తీసుకొని, మినాండర్ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకొన్నాడు.
మినాండర్ (భారతదేశ గ్రంథాల్లో మిళింద) క్రీ.పూ.165 – 145 మధ్యలో పాలించాడు. ఇండో-గ్రీకుల్లో ఇతనే అత్యంత సుప్రసిద్ధుడు. ఇతని రాజధాని సకల (పాకిస్థాన్‌లోని సియాల్కోట్) భూతల స్వర్గంగా కీర్తించబడింది.
మిళిందుడు బౌద్ధమతాన్ని స్వీకరించాడు. ఇతను తన ఆస్థానంలోని బౌద్ధ భిక్షువైన నాగసేనడితో బౌద్ధమతానికి సంబంధించిన అనేక విషయాలను చర్చించేవాడు. బౌద్ధమతం గురించి మిళిందుడు అడిగిన ప్రశ్నలు మరియు నాగసేనుడు ఇచ్చిన జవాబులను గ్రంథస్థము చేశారు. ఈ గ్రంథాన్ని మిళిందపన్హా లేదా నాగసేనభిక్షుసూత్ర అంటారు. ఇది పాళీ భాషలో వ్రాయబడింది. బౌద్ధులకు త్రిపీటకాల తరువాత ఇది అత్యంత పవిత్రమైన గ్రంథము.
భారతదేశంలో ఇండో-గ్రీకులు నాణెముల ముద్రణలో విప్లవాత్మక మార్పులు ప్రవేశపెట్టారు. వీరు రెండు వైపుల ముద్రించిన నాణెములను (double die struck coins)ను ప్రవేశపెట్టడముతో punch marked Coin అదృశ్యమయ్యాయి. అంతేగాకుండా వీరు బంగారు నాణెములను ప్రవేశపెట్టారు. ఈ నాణెములపైన ప్రాకృత భాష మరియు ఖరోష్టి లిపితో శాసనాలుంటాయి.
మినాండర్ ముద్రించిన బంగారు నాణెములపైన ఒక వైపు అతని ప్రతిమ మరియు బిరుదులైన దేవవ్రత & సుదేవవ్రత ముద్రించబడ్డాయి. నాణానికి మరో వైపు బౌద్ధ ధర్మచక్రము ముద్రించబడింది.
యవనులు భారతదేశంలో అనేక ప్రాంతాలను జయించి పాటలీపుత్రం వరకు చేరుకున్నారని, ఖగోళ శాస్త్రం వీరితోనే ఆరంభమైనదని, యుగపురాణానికి చెందిన గార్గెయసంహిత తెలియజేస్తుంది.
II. స్కిథియన్లు/శకులు
మధ్యఆసియాలోని గిరిజన తెగకు చెందిన స్కిథియన్లను భారతదేశంలో శకులు అంటారు. వీరు భారతదేశంలో బోలాన్ కనుమల ద్వారా ప్రవేశించి, అనేక ప్రాంతాలను జయించి ఐదు స్వతంత్ర రాజ్యాలను స్థాపించారు. పతంజలి రాసిన మహాభాష్యంలో శకుల గురించి తొలి ప్రస్తావన ఉంది. ఈ గ్రంథము శకులను నిర్వాశిత శూద్రులు (excluded shudras) మరియు అనిర్వాశిత శూద్రులు (cleaned shudras)గా విభజిస్తుంది. శకులు భారతదేశంలో స్థాపించిన ఐదు రాజ్యాల వివరాలను క్లుప్తంగా ఇవ్వడమైనది.
కపిస రాజ్యం: ఆఫ్ఘనిస్తాన్లోని కపిస రాజధానిగా ఒక శక రాజ్యం స్థాపించబడింది.
తక్షశిల రాజ్యం: పాకిస్థాన్‌లోని తక్షశిల రాజధానిగా మరొక శకరాజ్యం కొనసాగింది. ఈ శకులు గౌతమబుద్ధుడు, శివుడు మరియు అభిషేక లక్ష్మితో కూడిన నాణెములు ముద్రించారు. ఈ వంశానికి చెందిన మొగ అనే రాజు ‘మహారాజ మహాత్మ’ అనే బిరుదాన్ని కలిగివున్నాడు.
మధుర రాజ్యం: ఉత్తరప్రదేశ్‌లోని మధుర రాజధానిగా మూడవ శక రాజ్యం వెలిసింది. ఈ రాజ్య స్థాపకుడైన రంజువులు అప్రతిహతచక్ర అనే బిరుదాన్ని పొందాడు.
ఉజ్జయిని రాజ్యం: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని రాజధానిగా మాల్వా మరియు గుజరాత్‌లను కార్ధమక శక వంశము పరిపాలించింది. ఛస్తన ఈ వంశ స్థాపకుడు. రుద్రదమనుడు ఈ వంశంలో అందరి కంటే గొప్పవాడు.
ఇతను క్రీ.శ.130-150 మధ్యలో పాలించాడు. ఇతను వేసిన జునాఘర్ / గిర్నార్ శాసనము భారతదేశంలో తొలి సంస్కృత శాసనము. ఈ శాసనం మార్యుల కాలంలో నిర్మించబడిన సుదర్శన తటాకం యొక్క చరిత్రను తెలియజేస్తుంది. ఈ శాసనం ప్రకారము సుదర్శన తటాకము చంద్రగుప్తమౌర్యుని కాలంలో నిర్మించబడగా, అశోకుని కాలంలో దీనికి మరమ్మత్తులు జరిగాయి. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ తటాకము వరదల్లో ధ్వంసం కాగా, తాను తిరిగి నిర్మించానని రుద్రదమనుడు జునాఘర్ శాసనంలో తెలియజేశాడు.
శాతవాహనులతో ఇతని వైవాహిక సంబంధాలు మరియు ఇతని విజయాలను కూడా ఈ శాసనము తెలియజేస్తుంది.
కార్ధమక వంశం అనేక శతాబ్దాలు ఉజ్జయిని రాజధానిగా మాల్వాను పాలించింది. 4వ శతాబ్దపు చివర్లో గుప్తచక్రవర్తి అయిన రెండవ చంద్రగప్తుడు చివరి కార్ధమక రాజైన రుద్రసింహ-3ను చంపి, వీరిని అంతం చేసి శకారి అనే బిరుదాన్ని పొందాడు.
దక్కన్ శక రాజ్యం: మాండసోర్ రాజధానిగా ఐదవ శక రాజ్యం దక్కన్‌ను పాలించింది. ఈ వంశాన్ని క్షహరాట వంశం అంటారు. భూమకుడు ఈ వంశ స్థాపకుడు. నహపాణుడు క్షహరాట శకుల్లో అందరికంటే గొప్పవాడు. గ్రీకు గ్రంథాల్లో ఇతన్ని ‘మాంబరస్’ అని పిలిచారు. శాతవాహన చక్రవర్తి అయిన గౌతమీపుత్ర శాతకర్ణి ఇతనిని అంతం చేసి ఈ రాజ్యాన్ని జయించాడని ఈ క్రింది ఆధారాలు తెలియజేస్తున్నాయి.
- నాసిక్ శాసనంలో గౌతమీపుత్ర శాతకర్ణి క్షహరాటవంశనిర్వశేషకార అని పిలువబడ్డాడు. అంటే క్షహరాట వంశాన్ని నిర్మూలించినవాడని అర్థం.
- నాసిక్ జిల్లాలోని జోగల్ తంబి గ్రామంలో సుమారుగా 10,000 వెండి నాణెములు బయల్పడ్డాయి. వాటిపై నహపాణుడి పేరుపైన, గౌతమీపుత్ర శాతకర్ణి పేరు తిరిగి ముద్రించబడి ఉంది. గుప్తుల పూర్వయుగము |
III. పార్థియన్లు/పహ్లవులు:
క్రీ.పూ.3వ శతాబ్దంలో సెల్యూసిడ్ సామ్రాజ్యం నుంచి స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఉత్తర ఇరాన్ ప్రాంతమైన పార్థియాను వీరు పాలించారు. పార్థియన్లు భారతదేశంపై దండెత్తి, శకులను అంతం చేసి వాయువ్య భారతదేశంలో ఒక చిన్న రాజ్యాన్ని స్థాపించారు. భారతదేశంలో వీరిని పహ్లవులు అంటారు.
ఈ వంశంలో గండోఫర్నిస్ (క్రీ.శ.19 – 45) సుప్రసిద్ధుడు. పాకిస్తాన్‌లోని తక్త్-ఎ-బాహిలో లభించిన శాసనంలో ఇతను గూఢవర్ష అనే పేరుతో పిలవబడ్డాడు. క్రీ.శ.ఒకటవ శతాబ్దానికి చెందిన సుప్రసిద్ధమైన బౌద్ధ విహారం కూడా ఇక్కడ లభించింది. గండోఫర్నిస్ యొక్క నాణాలు ఆఫ్ఘనిస్తాన్లోని బెగ్రామ్‌లో లభించాయి. సిరియాకు చెందిన క్రైస్తవ మతాచార్యుడు మరియు జీసస్ 12 మంది శిష్యులలో ఒకడైన సెయింట్ థామస్ ఇతని ఆస్థానానికి విచ్చేశాడు. భారతదేశాన్ని సందర్శించిన తొలి క్రైస్తవుడిగా సెయింట్ థామస్‌ను పరిగణించవచ్చు.
13వ శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు మార్కోపోలో మద్రాస్‌లో తాను సెయింట్ థామస్ సమాధిని దర్శించుకున్నానని తెలియజేశాడు. దీని ప్రకారం క్రీ.శ.ఒకటవ శతాబ్దములో భారతదేశానికి వచ్చిన సెయింట్ థామస్ మత ప్రచారం చేస్తూ, దక్షిణానికి వచ్చి మద్రాస్‌లో మరణించి సమాధి అయ్యాడు.
మార్కొపోలో కాకతీయుల ప్రధాన రేవుపట్టణమైన మోటుపల్లిని (ప్రకాశం జిల్లా) సందర్శించి, ఆనాటి కాకతీయ పాలకురాలు రుద్రమదేవిని గురించి కూడా సమాచారాన్నిచ్చాడు.
IV. కుషాణులు:
కుషాణులు మధ్యఆసియాలోని యూఛి లేదా తొచారియన్ తెగకు చెందినవారు. చైనాపై నిరంతరంగా దాడులు చేస్తూ దోచుకోవడము ద్వారా జీవనోపాధి పొందేవారు. క్రీ.పూ.220లో చైనా చక్రవర్తి షి-హంగ్-టి మహాకుడ్యము (great wall of China)ను నిర్మించడముతో వీరు జీవనోపాధిని కోల్పోయి, భారతదేశం వైపు తమ దృష్టిని మరల్చారు.
కుషాణులు మధ్య ఆసియాలోని ఆక్సస్ నది నుంచి భారతదేశంలోని గంగానది వరకు మహా సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీరు భారతదేశంలో పార్థియన్ మరియు శకుల పాలనను అంతం చేశారు. వీరికి వాయువ్య భారతదేశంలోని పురుషపురము (పెషావర్) మొదటి రాజధాని కాగా, యమున తీరంలోని మధుర రెండవ రాజధానిగా కొనసాగింది.
కుజులక్యాడఫిసిస్ (క్రీ.శ.15 – 64)
ఇతను ఈ వంశ స్థాపకుడు. ధర్మస్థిత, సచధర్మస్థిత మరియు మహారాజధిరాజు అనే బిరుదులు తీసుకున్నారు.
విమాక్యాడఫిసిస్ (క్రీ.శ.64 – 78)
ఇతను దినార్లు అనబడే బంగారు నాణెములు ముద్రించాడు. ఇతని నాణెములపై శివుడు, నంది, త్రిశూలం ముద్రించబడ్డాయి. ఇతను మహేశ్వర మరియు మహారాజాధిరాజు అనే బిరుదులను తీసుకున్నాడు. పాశుపత శైవాన్ని అవలంభించాడు.
కనిష్కుడు (క్రీ.శ.78)
- కుషాణలలో అందరికంటే గొప్పవాడు కనిష్కుడు.
- ఇతను రాగి మరియు బంగారు నాణెములను అధిక సంఖ్యలో ముద్రించాడు. గ్రీకు దేవతలు మరియు భారత దేవతల ప్రతిమలను నాణెములపైన ముద్రించాడు. బుద్ధుని ప్రతిమతో మరియు శాక్యబుద్ధో అనే పేరుతో నాణెములు ముద్రించాడు.
- కాశ్మీర్‌లోని కనిష్కపురము అనే నగరాన్ని నిర్మించాడు.
- కైజర్ మరియు దేవపుత్ర అనే బిరుదులు తీసుకున్నాడు. దీనిని బట్టి కనిష్కుడు రోమన్ మరియు చైనా చక్రవర్తులను అనుకరించాడని తెలుస్తుంది. సాధారణంగా రోమన్ చక్రవర్తులు కైజర్ అనే బిరుదాన్ని మరియు చైనా చక్రవర్తులు దేవపుత్ర అనే బిరుదాలు తీసుకునేవారు.
- కనిష్కుడు మహాయాన బౌద్ధమతాన్ని స్వీకరించాడు. ఇతను పురుషపురంలో ఒక మహాస్థూపాన్ని నిర్మించాడని ఫాహియాన్ తెలియజేశాడు. ఇతని ఆస్థానంలో ఇద్దరు మహాయాన పండితులు జీవించారు.
- వసుమిత్రుడు – ఇతను నాల్గవ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించాడు. మహావిభాషశాస్త్ర అనే సంస్కృత గ్రంథాన్ని రచించారు.
- అశ్వఘోషుడు – నాల్గవ బౌద్ధ సమావేశానికి ఉపాధ్యక్షుడుగా ఉన్నాడు. ఇతను వ్రాసిన శౌరిపుత్రప్రకరణ మరియు సౌందరనందన భారతదేశంలో వ్రాయబడిన తొలి నాటకాలు. వీటితో పాటుగా ఇతను బుద్ధచరిత, వజ్రసూచి మరియు గంధిస్తోత్ర అనే కావ్యాలు రచించాడు.
- కనిష్కుడి ఆస్థానంలో చరకుడనే సుప్రసిద్ధ వైద్యుడు ఉన్నాడు. ఇతను చరకసంహిత అనే గ్రంథం వ్రాశాడు. భారత వైద్య శాస్త్రానికి ఇది విజ్ఞాన సర్వస్వము లాంటిది (encyclopaedia of Indian medicine).
- చైనా గ్రంథాల ప్రకారము కనిష్కుడు ఒక యుద్ధంలో చైనా సేనాపతి పాన్చావో (Panchao) చేతిలో ఓటమి చవిచూశాడు.
- క్రీ.శ.110లో ఇతను రోమన్ చక్రవర్తి ట్రాజన్ వద్దకు ఒక దౌత్యబృందాన్ని పంపించాడు.