మౌర్యుల పరిపాలన విధానము
భారతదేశంలోనే మొట్టమొదటి వ్యవస్థీకృతమైన మరియు సమర్థవంతమైన పరిపాలన మౌర్యుల కాలంలో కనిపిస్తుంది. కౌటిల్యుడి అర్థశాస్త్రము, మెగస్తనీస్ వ్రాసిన ఇండికా మరియు అశోకుని శాసనాల ద్వారా వీరి పరిపాలన వ్యవస్థ గురించి తెలుసుకోవచ్చు.
కేంద్రీకృత పాలన (centralised administration)
మౌర్యులు అత్యంత కేంద్రీకృత పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేశారు. సర్వాధికారాలు చక్రవర్తి ఆధీనంలో ఉండేవి. చక్రవర్తి అత్యున్నత శాసనాధికారి, కార్యనిర్వాహణాధికారి మరియు న్యాయాధికారి. అనేక రంగాలపైన ప్రభుత్వ నియంత్రణ కొనసాగింది. గనులు -ఖనిజాలు, ఉప్పు తయారీ, నౌకా నిర్మాణము, ఆయుధాల తయారీ, మద్యం తయారీ ఇతరత్ర రంగాలపైన ప్రభుత్వ గుత్తాధిపత్యం ఉండేది.
అధికార బృంద౦ (bureaucracy)
చక్రవర్తికి పరిపాలనలో సహాయం చెయ్యడానికి మంత్రిమండలి ఉండేది. ఒకే చక్రం బండిని ఎలాగైతే నడపలేదో, రాజు ఒక్కడే పరిపాలనను కొనసాగించలేడని అర్థశాస్త్రం స్పష్టంగా పేర్కొంది.
మంత్రిమండలిలో పురోహిత, సేనాపతి మరియు యువరాజు సభ్యులుగా ఉండేవారు. కౌటిల్యుడి అర్థశాస్త్రములో 34 శాఖలున్నట్లు, వాటికి 34 మంది అధ్యక్షులుండేవారని చెప్పబడింది. అందులో ముఖ్యమైన అధ్యక్షుల గురించి ఈ క్రింది పట్టికలో ఇవ్వడమైనది. #Administration of the Mauryas#
అధ్యక్షుడు | శాఖ |
అకారాధ్యక్ష | గనులు, ఖనిజాల శాఖ |
అఖపాలాధ్యక్ష | అకౌంట్స్ శాఖ |
కుప్యాధ్యక్ష | అటవీశాఖ |
లక్షణాధ్యక్ష | నాణెములు ముద్రించే శాఖ |
పాణ్యాధ్యక్ష | వ్యాపార, వాణిజ్య శాఖ |
పౌతవాధ్యక్ష/ తులమానాధ్యక్ష | తూనికలు, కొలతల శాఖ |
సీతాధ్యక్ష | వ్యవసాయ శాఖ |
శుల్కాధ్యక్ష | కస్టమ్స్ శాఖ |
సురాధ్యక్ష | ఎక్సైజ్ శాఖ |
సూత్రాధ్యక్ష | చేనేత వస్త్రాల శాఖ |
వివితాధ్యక్ష | పచ్చిక బయళ్ల శాఖ |
గణికాధ్యక్ష | వేశ్య వాటికలకు సంబంధించిన శాఖ |
కొస్టగారాధ్యక్ష | ధాన్యాగారాలు, గిడ్డంగుల శాఖ |
వీరితో పాటుగా అనేక మంది ఇతర అధికారులు ఉండేవారు | |
సమాహార్త | పన్నుల శాఖాధిపతి |
సన్నిధాత | కోశాధికారి |
ఇతిహజక మహమత్తర | మహిళ సంక్షేమ అధికారి |
నగర వ్యవహారికమత్తర | నగర న్యాయాధిపతి (city court jubge) |
రూపదర్శక | నాణెముల విలువను నిర్ణయించే అధికారి |
పరిపాలన విభాగాలు
మౌర్య సామ్రాజ్యం నాలుగు రాష్ట్రాలుగా విభజించబడింది.
- ఉత్తరాపథ: తక్షశిల రాజధాని (ఇది పాకిస్థాన్‌లోని ప్రస్తుత ఇస్లామాబాద్-రావల్పిండి)
- అవంతిపథ: ఉజ్జయిని రాజధాని (మధ్యప్రదేశ్)
- దక్షిణపథ: సువర్ణగిరి రాజధాని (కర్నూల్ జిల్లాలోని ఎర్రగుడి కావచ్చు)
- ప్రాచ్యపథ: తోషాలి రాజధాని (ఒడిషాలోని ధౌలి)
- రాష్ట్రాలకు నియమించిన గవర్నర్లను కుమార లేదా ఆర్యపుత్ర అని పిలిచేవారు.
- ఒక్కొక్క రాష్ట్రాన్ని కొన్ని ఆహారాలుగా విభజించారు. ఆహారానికి ఇద్దరు ప్రధాన అధికారులుండేవారు.
- ప్రాదేశిక – శాంతిభద్రతలను నిర్వహించే అధికారి
- రజుక – రెవెన్యూ అధికారి
- గ్రామాధికారిని గ్రామణి లేదా గ్రామిక అని పిలిచారు. ఇతను గ్రామపెద్దల సహకారంతో గ్రామపాలన నిర్వహించేవాడు. గ్రామాధికారిని అగ్రనోమోయ్ (agronomoi) అని ఇండికా పేర్కొంది.
- పట్టణ పాలన గురించిన వివరాలు మెగస్తనీస్ ఇండికాలో లభిస్తాయి. ఈ గ్రంథం ప్రకారం నగర పాలనను నిర్వహించడానికి 30 మంది సభ్యులతో కూడిన అస్తినమోయ్ (astynomoi) అనే మున్సిపల్ కౌన్సిల్ ఉండేది. ఈ 30 మంది సభ్యులు 6 బోర్డులుగా విభజించబడి నగరపాలనను నిర్వహించేవారు. ఈ బోర్డులు పన్నుల వసూళ్ళు, పరిశ్రమలు, తూనికలు కొలతలు, జనాభా లెక్కల సేకరణ ఇత్యాది విధులు నిర్వహించేవి.
సైనికపాలన
సైనిక పాలనకు సంబంధించిన సమాచారాన్ని ఇండికా తెలియజేస్తుంది. 30 మంది సభ్యులున్న ఒక యుద్ధ కౌన్సిల్ (war council) ఆరు కమిటీలుగా ఏర్పడి సైన్యంలోని ఈ క్రింది ఆరు శాఖలను నిర్వహించేది.
- అశ్వికదళము (cavalry)
- కాల్బలము (infantry)
- గజదళము (elephantry)
- రథబలము (chariotry)
- నౌకాబలము (navy)
- రవాణాశాఖ (transport department)
మౌర్యుల పాలనలో బలమైన గూఢచార వ్యవస్థ (espionage) ఉండేది. కౌటిల్యుడు గూఢచారులను ‘గూఢపురుషులు’ అని పిలవగా, అశోకుని శాసనాల్లో ‘పతివేదకులు’ లేదా ‘పులిసాని’ అని పిలువబడ్డారు. మెగస్తనీస్ తన ఇండికాలో వీరిని ‘ఓవర్‌సీర్స్’ (overseers) అని పిలిచాడు.
రెవెన్యూ పాలన
కౌటిల్యుడు అర్థశాస్త్రములో రెవెన్యూ పాలన గురించి సంపూర్ణ సమాచారాన్నిచ్చాడు. భూమిశిస్తు, గనులు – ఖనిజాలు, అడవులు, రహదారులు, పశుసంపద నుంచి రాజుకు ఆదాయము వస్తుందని తెలియజేశాడు. భూమిశిస్తు (భాగ)తో పాటుగా అనేక ఇతర పన్నులను మౌర్యులు వసూలు చేశారు. అందులో ముఖ్యమైనవి:
- సేనాభక్తం – సైనికుల కోసం ప్రజలపైన విధించే పన్ను
- ప్రణయ – అత్యవసర పరిస్థితుల్లో విధించే పన్ను
- వార్తని – రహదారి పన్ను
- నిష్క్రమ్య – ఎగుమతి సుంకము
- విష్తి – శ్రమ రూపంలో చెల్లించే పన్ను (వెట్టి)
- గుల్మ/ సేనభక్తం – సైనిక పన్ను
అర్థశాస్త్రంలో రాజ్యం యొక్క ప్రధానమైన ఖర్చులు కూడా చర్చించబడ్డాయి. ఉద్యోగుల జీతభత్యాలు, సంక్షేమ కార్యక్రమాలు, యుద్ధము – సైనిక నిర్వహణ, రాజు యొక్క వ్యక్తిగత ఖర్చులు, విరాళాలు – కానుకలు మరియు కట్టడాలు ఇందులో ప్రధానమైనవి.
న్యాయపాలన
న్యాయపాలనలో చక్రవర్తి అత్యున్నతాధికారి. మౌర్యుల కాలంలో ధర్మస్త్య అనబడే సివిల్ న్యాయస్థానాలు మరియు కంఠక శోధన అనబడే క్రిమినల్ న్యాయస్థానాలుండేవి. మెగస్తనీస్ వ్రాసిన ఇండికాలో నేరాలు బహు అరుదని, దొంగతనాలు జరగవని, ప్రజలు తమ ఇళ్ళను తెరిచే వెళ్ళిపోతారని తెలియజేశాడు. మౌర్యుల శిక్షాస్మృతి కఠినంగా ఉండటము వలన నేరాలు చాలా తక్కువగా ఉండేవి. నేరనిర్ధారణ కోసము దివ్యపరీక్షలు నిర్వహించేవారు. అగ్నిదివ్య, జలదివ్య, విషదివ్య, తప్తమస్కదివ్య మొదలైన పరీక్షల ద్వారా నిందితులను దోషులుగా నిర్ధారించేవారు.
మౌర్యుల వాస్తు, శిల్పకళలు
భారతదేశంలో వాస్తుశిల్పకళ చరిత్ర మౌర్యులతోనే ప్రారంభమవుతుంది. మౌర్యుల కంటే ముందు నిర్మించిన కట్టడాలు లభ్యం కాకపోవడంతో మౌర్యులు నిర్మించిన కట్టడాలే మనదేశంలో తొలి కట్టడాలుగా పరిగణించవచ్చు. మౌర్యుల కట్టడాల్లో ప్రధానమైనవి:
అశోకుని స్తంభాలు
మౌర్యుల శిల్పకళలో అత్యంత ప్రధానమైనవి అశోకుని స్తంభాలు. ఇవి పర్షియన్ చక్రవర్తి మొదటి డేరియస్ ప్రభావంతో నిర్మించబడ్డాయి. ఒక్కొక్క స్తంభము దాదాపుగా 50 అడుగుల ఎత్తు మరియు 50 టన్నుల బరువు ఉంటుంది. వీటిపైన అశోకుడు తన శాసనాలను లిఖించాడు. ప్రతి స్తంభానికి ఒక శిరోభాగము (capital) ఉంటుంది. ఇందులో ఒక అందమైన జంతువు బొమ్మను శిల్పంగా చెక్కి అలంకరణ కోసము ఉపయోగించారు. అన్ని ప్రాంతాల్లోని స్తంభాలు ఒకే రకంగా ఉన్నప్పటికీ వాటి శిరోభాగాల్లోని జంతువులు వేర్వేరుగా ఉన్నాయి. రాంపూర్వలోని స్తంభములో వృషభము (bull capital), లౌరియనందన్‌ఘర్‌లోని స్తంభంలో సింహం (Lion capital), రుమ్మిందైలోని స్తంభంలో గుర్రపు బొమ్మ (horse capital)లు ఉన్నాయి. సారనాథ్‌లోని అశోకుని క్యాపిటల్‌ను భారత ప్రభుత్వము జాతీయ చిహ్నంగా స్వీకరించింది. ఈ స్తంభాల నిర్మాణానికి అశోకుడు మధురలో లభించే ఎర్రని ఇసుకరాయి మరియు కాశీ సమీపంలోని చూనార్‌లో లభించే గోధుమ రంగు ఇసుకరాయిని ఉపయోగించారు).
స్థూపాలు
అశోకుడు 84,000 స్థూపాలు నిర్మించాడని టిబెటన్ బౌద్ధగ్రంథమైన దివ్యవదన తెలియజేస్తుంది. ఇది అతిశయోక్తి అయినా అశోకుడు అనేక స్థూపాలు నిర్మించాడనేది చారిత్రక సత్యం. తక్షశిలలోని ధర్మార్జిక స్థూపము, సాంచి, బర్హుత్ మరియు అమరావతి స్థూపాలను అశోకుడే నిర్మించాడు.
గుహాలయాలు (Rock-cut Caves)
భారతదేశంలో గుహాలయాల నిర్మాణము అశోకుని కాలంలోనే ప్రారంభమైంది. ఇతను ప్రారంభించిన ఈ సాంప్రదాయము భారతదేశంలో 1200 సంవత్సరాలపాటు కొనసాగింది. (క్రీ.పూ.3వ శతాబ్దం నుంచి క్రీ.శ.10వ శతాబ్దం వరకు భారతదేశంలో గుహాలయాల నిర్మాణము కొనసాగింది).
అశోకుడు బారబర కొండల్లో నాలుగు గుహాలయాలు నిర్మించగా, అతని మనవడైన దశరథుడు నాగార్జుని కొండల్లో మూడు గుహాలయాలు నిర్మించాడు. ఈ గుహాలయాలన్నీ అజీవిక మతస్థులకు దానంగా ఇవ్వబడ్డాయని అక్కడున్న శాసనాలు తెలియజేస్తున్నాయి.
భవంతులు
మౌర్యులు భవనాలు కలపతో నిర్మించడము వలన అవి కాలగర్భంలో కలిసిపోయి, ప్రస్తుతము లభ్యము కావడము లేదు. అయితే వాటి ప్రస్తావనలు ప్రాచీన సాహిత్యంలో కనిపిస్తాయి.
- మెగస్తనీస్ తన ఇండికాలో మౌర్యుల భవంతులు, గ్రీకు భవంతుల కంటే గొప్పగా ఉన్నాయని పేర్కొన్నాడు.
- మౌర్యులు నిర్మించిన సౌగంగేయ భవంతిలో బంగారంతో చేసిన శిఖరాలున్నాయని పతంజలి వ్రాసిన మహాభాష్యం తెలియజేస్తుంది.
- గుప్తుల కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఫాహియాన్ మౌర్యుల భవనాలు అత్యంత సుందరంగా ఉన్నాయని, వీటిని దివ్యపురుషులు మాత్రమే నిర్మించి ఉంటారని పొగిడాడు.
- ఇటీవల పాట్నా సమీపంలోని కుమ్రహార్‌లో మౌర్యుల కాలం నాటి భవంతి అవశేషాలు బయల్పడ్డాయి.
శిల్పాలు
మౌర్యుల కాలం నాటి శిల్పాలు అనేక చోట్ల లభ్యమయ్యాయి. అందులో ముఖ్యమైనవి:
- ధౌళి (ఒడిషా)లో లభించిన ఏనుగు శిల్పము
- మధురలో లభించిన యక్షుని శిల్పము
- దిదార్‌గంజ్ (బీహార్)లో లభించిన యక్షిణి శిల్పము
మౌర్యసామ్రాజ్య పతనము
పురాణాలిచ్చిన వంశావళి ప్రకారం మౌర్యుల పాలన 137 సంవత్సరాలు (క్రీ.పూ.321 నుండి క్రీ.పూ.184 వరకు) కొనసాగింది. అశోకుడి తర్వాత మౌర్య సామ్రాజ్యం ఎక్కువ కాలం కొనసాగలేక కేవలం అర్థశతాబ్దంలోనే అంతం అయింది. మౌర్య సామ్రాజ్య అంతానికి గల కారణాల విషయంలో మాత్రం చరిత్రకారుల మధ్య ఏకాభిప్రాయము లేదు. వివిధ చరిత్రకారులు వివిధ రకాల కారణాలను వివరించారు. వీటిలో కొన్నింటిని చర్చించడమైనది.
హరప్రసాద్ శాస్త్రి: ఈ పండితుడు బ్రాహ్మణుల తిరుగుబాటు వలన మౌర్యసామ్రాజ్యం అంతమైనదని అభిప్రాయపడ్డాడు. మౌర్యులు బ్రాహ్మణ వ్యతిరేకులని, అవైదిక మతాలైన బౌద్ధ, జైన మరియు అజీవిక మతాలను ఆదరించి బ్రాహ్మణులకు శత్రువులయ్యారని తెలియజేశాడు. అందుకే బ్రాహ్మణుడైన సేనాపతి పుష్యమిత్రశుంగుడు చివరి మౌర్య చక్రవర్తి బృహద్రదుడిని హత్యచేసి మౌర్యవంశాన్ని నిర్మూలించాడని హెచ్.పి.శాస్త్రి వివరించారు. అయితే ఈ వాదనను చాలామంది వ్యతిరేకిస్తున్నారు.
మౌర్యులు అవైదిక మతాలను ఆదరించినా, బ్రాహ్మణ వ్యతిరేకులు మాత్రము కాదు. చంద్రగుప్త మౌర్యుడు బ్రాహ్మణుడైన కౌటిల్యుడికి అత్యున్నత స్థానాన్ని కల్పించాడు. అశోకుడు బ్రాహ్మణులను గౌరవించమని తన శాసనాల్లో ప్రజలను కోరాడు. వీరు బ్రాహ్మణ వ్యతిరేకులైతే పుష్యమిత్ర శుంగుడికి అత్యున్నతమైన సేనాపతి పదవి ఇచ్చి ఉండేవారు కాదు. పుష్యమిత్ర శుంగుని తిరుగుబాటును అధికారం కోసం చేసిన సైనిక తిరుగుబాటు (military coup de’tat) గానే భావించాల్సి ఉంటుందని ఆధునిక చరిత్రకారులు వాదిస్తున్నారు.
హెచ్.సి.రాయ్ చౌదరి: ఇతని ప్రకారం అశోకుడి ధమ్మ విధానము మౌర్య సామ్రాజ్యము అంతం కావడానికి ప్రధాన కారణం. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు ధమ్మను రూపొందించి యుద్ధాలను త్యజించి మరియు అహింసాయుత విధానాలను ఆచరించి సైన్యాన్ని బలహీనపరిచాడు. అశోకుని తర్వాత బలహీనమైన సైన్యంతో అతని వారసులు స్వదేశీ తిరుగుబాట్లను మరియు విదేశీ దాడులను నివారించలేక అంతం అయ్యారని ఈయన అభిప్రాయపడ్డాడు. అయితే మౌర్యుల సైన్యం బలహీనంగా ఉందని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు లభించలేదు. కళింగ ఆక్రమణ తర్వాత సమస్త భారత ఉపఖండం తన అధీనంలోకి రావడముతో అశోకుడు సైనిక కార్యకలాపాలకు స్వస్తి పలికాడే కాని, ధమ్మ విధానం వలన కాదని చరిత్రకారులు విశ్వసిస్తున్నారు. చిన్న నేరాలకు కూడా మరణ శిక్షలు విధించడము మరియు గిరిజన తిరుగుబాట్లను క్రూరంగా అణిచివెయ్యడము లాంటి చర్యల ద్వారా అశోకుడు అహింస ధర్మాన్ని పాలనలో కొనసాగించలేదని చెప్పవచ్చు.
డి.డి.కౌశాంబి: ఈయన ప్రకారం అశోకుని తర్వాత కాలంలో ఆర్థిక సంక్షోభము ఏర్పడి మౌర్య సామ్రాజ్యం అంతమైంది. అయితే దీనికి సంబంధించిన ఖచ్చితమైన పురావస్తు ఆధారాలు కాని, సాహిత్య ఆధారాలు గాని లభ్యం కాలేదు.
రొమిల్లా థాపర్: మౌర్యుల అంతానికి పలు హేతుబద్ధమైన కారణాలను చరిత్రకారిణి రోమిల్లా థాపర్ వివరించారు. అశోకుని తర్వాత వచ్చిన బలహీన వారసులు అత్యంత విశాలమైన సామ్రాజ్యాన్ని మరియు కేంద్రీకృత పరిపాలనను నిర్వహించలేకపోయారని ఆమె అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా అశోకుడు తన చివరి కాలంలో సామ్రాజ్యాన్ని విభజించడం కూడా మౌర్యసామ్రాజ్యం బలహీనపడడానికి కారణమైనదని ఆమె వివరించారు.