మౌర్య సామ్రాజ్యము భారతదేశ చరిత్రలో వెలసిన తొలి మహాసామ్రాజ్యము. మౌర్యులు భారతదేశాన్నే కాక సమస్త భారత ఉపఖండమును పాలించారు. హర్యంక, శిశునాగ మరియు నందుల కాలంలో జరిగిన సామ్రాజ్య విస్తరణ మౌర్యుల కాలంలో అత్యున్నత శిఖరాలకు చేరుకొంది. #Mauryan Empire#
(నోట్: మగధ అనేది సామ్రాజ్యం పేరు కాగా, మౌర్య అనేది వంశము పేరు).
సామ్రాజ్య విస్తీర్ణము
మౌర్య సామ్రాజ్యము పశ్చిమాన ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ వరకు మరియు తూర్పున బంగ్లాదేశ్ వరకు విస్తరించింది. ఉత్తరాన కాశ్మీర్ నుంచి దక్షిణాన కావేరి నది వరకు విస్తరించింది. అశోకుని శాసనాలు ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్‌లోనూ, పాకిస్థాన్‌లోని షాబాజ్‌గిర్ మరియు మన్షేరా లభించాయి. కల్హణుడు వ్రాసిన రాజతరంగిణి ప్రకారము అశోకుడు కాశ్మీర్‌లో శ్రీనగర్ అనే నగరాన్ని నిర్మించాడు.
అశోకుని శాసనాలు కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్‌లో లభ్యమయ్యాయి. కర్నూలు జిల్లాలోని ఎర్రగుడి మరియు రాజులమందగిరి అనే గ్రామాల్లో అశోకుని శాసనాలు బయల్పడ్డాయి. దక్షిణాదిన తమిళనాడు, కేరళ మినహా భారత ఉపఖండమంతా మౌర్యుల ఆధీనంలో ఉండేది. అశోకుని రెండవ శిలాశాసనము మరియు పదమూడవ శిలాశాసనములలో చోళ, పాండ్య, చేర (కేరళపుత్ర) అనే సరిహద్దు రాజ్యాలు తమిళనాడు మరియు కేరళలను పాలిస్తున్నాయని చెప్పబడింది.
మౌర్యుల చరిత్రకు ఆధారాలు
మౌర్యుల చరిత్రను అధ్యయనము చెయ్యడానికి అనేక ఆధారాలను పండితులు ఉపయోగిస్తున్నారు. విదేశీ సాహిత్యము, స్వదేశీ సాహిత్యము మరియు అశోకుని శాసనాలు ఇందులో అత్యంత ముఖ్యమైనవి.
విదేశీ సాహిత్యము:
మౌర్యుల చరిత్ర గురించి తెలుసుకోవడంలో గ్రీకు, రోమన్, సింహళ, టిబెటన్, చైనీయుల గ్రంథాలు ఎంతగానో సహకరిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైన గ్రంథాలను పరిశీలిద్దాం. #Mauryan Empire#
- అలెగ్జాండర్ యొక్క సేనాని నియార్కస్ ఆనాటి భారతీయుల గురించి చాలా సమాచారము ఇచ్చాడు. భారతదేశములో ధర్మశాస్త్రాలు గ్రంథస్తము చెయ్యబడలేదని, పండితులు వాటిని తమ స్మృతిపథంలో భద్రపరిచారని తెలియజేశాడు. అందుకే భారత ధర్మశాస్త్రాలను స్మృతులు అంటాము. ఉదాహరణకు యజ్ఞావల్క్య స్మృతి, మనుస్మృతి మొదలైనవి.
- మెగస్తనీస్ గ్రీకు భాషలో వ్రాసిన ఇండికా (క్రీ.పూ.300): మౌర్యుల గురించి చాలా సమాచారాన్ని ఇస్తుంది. సిరియాను పాలిస్తున్న సెల్యుసిడ్ వంశస్థుడైన సెల్యూకస్ నికెటర్ తన రాయబారిగా మెగస్తనీస్‌ను చంద్రగుప్తమౌర్యుని ఆస్థానానికి పంపించాడు. ఇండికాలో మౌర్యుల సైనిక పాలన, గ్రామపాలన మరియు పట్టణ పాలన గురించి వివరాలున్నాయి.
నోట్: మొగస్తనీస్ ఇండికాలో ఈ క్రింది వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఉన్నాయి.
- భారతదేశంలో బానిస వ్యవస్థ లేదని ఇండికా గ్రంథము తెలియజేస్తుంది. కాని ఆ కాలంలోనే కౌటిల్యుడు వ్రాసిన అర్థశాస్త్రములోను మరియు అశోకుని శాసనాల్లోను బానిస వ్యవస్థ గురించి స్పష్టమైన ప్రస్తావనలు ఉన్నాయి.
- భారత సమాజంలో ఏడు కులాలున్నాయని ఇండికా తెలియజేస్తుంది. ఈ ఏడు కులాల్లో ఎక్కడా వర్తకుల ప్రస్తావన లేదు. అయితే భారతదేశంలో ప్రాచీనకాలం నుండి చాతుర్వర్ణ వ్యవస్థ కొనసాగింది.
- భారతీయులకు వడ్డీ వ్యాపారము తెలియదని ఇండికాలో చెప్పబడింది. భారతీయ గ్రంథాల్లో వేదకాలం నుంచి వడ్డీ వ్యాపారమున్నట్లు ఆధారాలున్నాయి.
- భారతదేశంలో కరువు కాటకాలు లేవని ఇండికా గ్రంథం తెలియజేస్తుంది. అశోకుని శాసనాల్లోను మరియు ఆనాటి జైన గ్రంథాల్లోను తీవ్రమైన క్షామ పరిస్థితులున్నట్లుగా చెప్పబడింది.
నోట్: మెగస్తనీస్ వ్రాసిన అసలైన ఇండికా గ్రంథము ఇంతవరకు లభ్యంకాకపోవడము వలన పై అంశాలపైన స్పష్టత లేదు. ప్రాచీన గ్రీకు చరిత్రకారులు మెగస్తనీస్ యొక్క ఇండికా గురించి ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రస్తుతమున్న ఇండికాను సంకలనం చేశారు.
- స్ట్రాబో (క్రీ.పూ.ఒకటవ శతాబ్దము – క్రీ.శ. ఒకటవ శతాబ్దము): గ్రీకు భాషలో వ్రాసిన ‘Geography’ మౌర్యుల గురించి కొంత సమాచారాన్ని ఇస్తుంది. సెల్యూకస్ నికెటర్ కుమార్తె అయిన హెలెనను చంద్రగుప్త మౌర్యుడు వివాహము చేసుకొన్నాడని ఈ గ్రంథం తెలియజేస్తుంది.
- జస్టిన్ (క్రీ.శ.2వ శతాబ్దము): గ్రీకు భాషలో వ్రాసిన ‘An Epitome’ అనే గ్రంథంలో సాండ్రకోటస్ (గ్రీకు గ్రంథాల్లో చంద్రగుప్తుడిని సాండ్రకోటస్ అని పిలిచారు) వాయువ్య భారతదేశాన్ని జయించి అలెగ్జాండర్ నియమించిన గ్రీకు గవర్నర్లను అంతం చేశాడని సమాచారముంది.
- అర్రైన్ (క్రీ.శ.2వ శతాబ్దము): గ్రీకు భాషలో మరొక ‘Indica’ అనే గ్రంథాన్ని రచించాడు. ఇందులో నందవంశ రాజులకు 2,00,000 కాల్బలము, 60,000 అశ్వికదళము మరియు 6000 గజదళము ఉందని తెలియజేశాడు.
- ప్లీని : రోమ్ నగరవాసి అయిన ప్లీని (క్రీ.శ.1వ శతాబ్దము) ‘Natural History’ అనే గ్రంథమును లాటిన్ భాషలో వ్రాశాడు. మౌర్యులకు 6,00,000 కాల్బలము, 30,000 అశ్విక దళము, 9000 గజదళము మరియు 8,000 రథబలము ఉన్నదని మౌర్యుల చతురంగబలాల గురించి తెలియజేశాడు.
- శ్రీలంక బౌద్ధగ్రంథాలైన మహావంశ, దీపవంశ, కులవంక మరియు వంశతపకాసిని అనే పాళీ గ్రంథాలు మౌర్యుల గురించి సమాచారాన్ని ఇస్తున్నాయి. మహావంశ గ్రంథం ప్రకారము అశోకుడి కుమారుడు మహేంద్ర మరియు కుమార్తె సంఘమిత్ర శ్రీలంకలో బౌద్ధమతాన్ని ప్రవేశపెట్టి ప్రచారం చేశారు. అశోకుడు తన 99 మంది సోదరులను చంపి రాజ్యానికి వచ్చాడని కూడా ఈ గ్రంథం చెబుతుంది. మౌర్యులు బుద్ధుని యొక్క శాక్యవంశానికి చెందినవారని వంశతపకాసిని తెలియజేస్తుంది.
- ప్రాచీన కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికులు కూడా మౌర్యుల గురించి సమాచారమిచ్చారు. క్రీ.శ.5వ శతాబ్దంలో వచ్చిన ఫాహియాన్ మౌర్యుల కట్టడాల గొప్పతనము గురించి వ్రాశాడు.
- క్రీ.శ.7వ శతాబ్దంలో వచ్చిన హ్యుయాన్‌త్యాంగ్ తాను వ్రాసిన సీ-యూ-కీ అనే గ్రంథం, ఉపగుప్త అనే ఎనిమిదేళ్ళ బాలసన్యాసి ప్రభావముతో అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించాడని తెలియజేశాడు. అయితే ఆ బాలుడి పేరు నిగ్రోధ అని మహావంశ గ్రంథం తెలియజేస్తుంది.
- టిబెటన్ బౌద్ధ గ్రంథమైన దివ్యవదన అశోకుడి గురించి సమాచారాన్ని ఇస్తుంది. అశోకుడే కథానాయకుడిగా ఈ గ్రంథం టిబెటన్ భాషలో వ్రాయబడింది.
స్వదేశీ సాహిత్యం:
భారతదేశంలో వ్రాయబడిన ఈ క్రింది లౌకిక మరియు మత గ్రంథాలు మౌర్యుల గురించి విశేష సమాచారాన్ని అందిస్తున్నాయి. #Mauryan Empire#
- కౌటిల్యుడు (క్రీ.పూ.4వ శతాబ్దము) వ్రాసిన అర్థశాస్త్రము మౌర్యుల పరిపాలన గురించి సమాచారాన్నిస్తుంది. కౌటిల్యుడికి చాణక్య మరియు విష్ణుగుప్త అనే పేర్లు కూడా ఉన్నాయి. చంద్రగుప్తమౌర్యుని ఆస్థానంలో ఇతను ప్రధానమంత్రిగా పనిచేశాడని చరిత్రకారుల అభిప్రాయము. వాస్తవానికి రాక్షసమంత్రి ప్రధానిగా ఉన్నాడు. కౌటిల్యుడిని ‘ఇండియన్ మాకియవెల్లి’ అని పిలుస్తారు. (16వ శతాబ్దములో ఇటలీకి చెందిన నికోలో మాకియవెల్లి ‘ప్రిన్స్’ అనే కావ్యం వ్రాశాడు) 1905లో మైసూరులోని ఒక ప్రాచీన గ్రంథాలయంలో ఆర్.శ్యామశాస్త్రి అనే పండితుడు అర్థశాస్త్ర కావ్యాన్ని కనుగొన్నాడు. ఇది సంస్కృత భాష మరియు గ్రంథ లిపిలో లభించింది.
అర్థశాస్త్రము 15 అధికరణాలు (ఛాప్టర్స్)గా విభజించబడింది. ఒక్కొక్క అధికరణ ఒక్కొక్క పరిపాలన అంశం గురించి వివరంగా తెలియజేస్తుంది. అయితే ఈ గ్రంథంలో ఎక్కడా మార్యుల ప్రస్తావన లేకపోవడము అనేక సందేహాలకు తావునిస్తుంది. 15 అధికరణాల్లో ఉన్న సమాచారాన్ని క్లుప్తంగా ఇవ్వడమైనది.
అధికరణ | సమాచారం |
I | రాచరికము, రాజు యొక్క విధులు, రక్షణ మరియు దైనందిన కార్యక్రమాలు, మంత్రిమండలి నియామకం మొదలైన అంశాలు. |
II | 34 శాఖలు మరియు వాటి అధ్యక్షులు |
III | సివిల్ న్యాయస్థానాలు |
IV | క్రిమినల్ న్యాయస్థానాలు |
V | అధికారుల జీతభత్యాలు. (అత్యధికంగా సేనాపతికి 48,000 కర్షాపణముల జీతమని ఈ గ్రంథం తెలియజేస్తుంది). |
VI | రాజ్యము యొక్క సప్తాంగములైన స్వామి (రాజు), అమాత్య (మంత్రి), బల లేదా దండ (సైన్యం), దుర్గ (కోట), కోశ (ఖజాన), జనపద (భూభాగము) మరియు మిత్ర (మిత్రదేశం) గురించి సమాచారం. |
VII | విదేశాంగ విధానము |
VIII | ప్రకృతి వైపరీత్యాల సమయంలో పాలకుల విధులు |
IX & X | యుద్ధనీతి |
XI | గణ రాజ్యాలతో సంబంధాలు |
XII to XV | పరిపాలనకు సంబంధించిన ఇతర అంశాలు |
- విశాఖదత్తుడు (క్రీ.శ.5వ శతాబ్దము) వ్రాసిన ముద్రారాక్షసము మౌర్య సామ్రాజ్య స్థాపన గురించి తెలియజేస్తుంది. చాణక్య మరియు చంద్రగుప్త కలిసి ధననందుడిని ఓడించి, నందవంశాన్ని నిర్మూలించి, మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించారని ఈ గ్రంథం తెలియజేస్తుంది. ఇదే సమాచారాన్ని విష్ణుపురాణం, మహావంశ, పరిశిష్టపర్వన్ అనే గ్రంథాలు కూడా ఇస్తున్నాయి.
- భట్టబాణుడి హర్షచరిత (ఏడవ శతాబ్దము) మౌర్య సామ్రాజ్య పతనము గురించి తెలియజేస్తుంది. చివరి మౌర్యచక్రవర్తి బృహద్రదను అతని సేనాపతి పుష్యమిత్రశుంగ చంపి మౌర్య వంశాన్ని అంతం చేశాడని ఈ గ్రంథం చెపుతుంది. విష్ణుపురాణం కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తుంది.
- కల్హణుడు వ్రాసిన రాజతరంగిణి (12వ శతాబ్దము) కాశ్మీర్ చరిత్రను తెలియజేస్తూ మౌర్యుల గురించి కూడా ప్రస్తావిస్తుంది. ఈ గ్రంథం ప్రకారం అశోకుడు శ్రీనగర్ అనే నగరాన్ని నిర్మించాడు. ఇతని కుమారుడు జలౌక శైవ మతస్థుడని మరియు అశోకుని తరువాత సింహాసనం అధిష్టించాడని కూడా ఈ గ్రంథం తెలియజేస్తుంది.
- పురాణాలు మౌర్యుల వంశావళిని తెలియజేస్తాయి. ఇందులో మౌర్యులు శూద్రులని, హీనజాతి వారని మరియు అసురులని చెప్పబడింది. (మౌర్యులు అవైదిక మతాలను ఆదరించడము వలన బహుశ వైదిక సాహిత్యములో వీరిని ఈ రకంగా అవమానించి ఉండవచ్చు).
- పాళీ భాషలో వ్రాయబడిన బౌద్ధ జాతక గ్రంథాలు మౌర్యుల కాలం నాటి సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులను తెలియజేస్తాయి.
- హేమచంద్రుడు అనే జైనకవి వ్రాసిన పరిశిష్టపర్వన్ అనే గ్రంథంలో చంద్రగుప్త మౌర్య శ్రావణబెళగొళలో సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించాడని సమాచారముంది.
అశోకుని శాసనాలు
అశోకుని శాసనాలను రాజాజ్ఞలు (edicts) అనవచ్చు. అశోకుడు తన ఆజ్ఞలను శిలలపైన చెక్కించి వాటిని అనుసరించమని ప్రజలను ఆదేశించాడు. ఈ శాసనాలు మౌర్యుల చరిత్ర అధ్యయనానికి అత్యంత కీలకము.
- ఇంతవరకు 181 శాసనాలు భారత ఉపఖండంలోని 47 ప్రాంతాల్లో లభ్యమయ్యాయి. ఈ శాసనాలలో అశోకుడు మూడు భాషలు (ప్రాకృతం, గ్రీకు మరియు ఆరమిక్) మరియు నాలుగు లిపులను (బ్రాహ్మి, ఖరోష్టి, గ్రీకు మరియు ఆరమిక్) ఉపయోగించాడు.
- ప్రాకృత భాష 46 ప్రాంతాల్లోను మరియు గ్రీకు & అరమిక్ భాషలు కేవలము గాంధార / కాందహార్ ద్విభాష శాసనాలలోను కనిపిస్తాయి. అదేవిధంగా బ్రాహ్మిలిపి 44 చోట్ల, ఖరోష్టి లిపి రెండు చోట్ల మరియు గ్రీకు & ఆరమిక్ లిపులు ఒక చోట కనిపిస్తాయి.
- పాకిస్థాన్‌లోని మన్షెరా మరియు షాబాబ్‌గిర్ శాసనాల్లో మాత్రమే అశోకుడు ఖరోష్టి లిపిని ఉపయోగించాడు. కాందహార్‌లో గ్రీకు మరియు ఆరమిక్ లిపులను ఉపయోగించాడు.
- భారతదేశంలో లభించిన శాసనాలన్నింటిలోనూ అశోకుని బ్రాహ్మిలిపిని మాత్రమే ఉపయోగించాడు.
- 1837లో జేమ్స్ ప్రిన్సెప్ అనే బ్రిటీష్ ఇండాలజిస్ట్ బ్రాహ్మిలిపిని తొలిసారిగా చదివాడు. నొర్రిస్ అనే ఇంకొక పండితుడు ఖరోష్టి లిపిని కనుగొన్నాడు. అశోకుడు ఉపయోగించిన నాలుగు లిపులలో బ్రాహ్మి మరియు గ్రీకు లిపులు ఎడమ నుంచి కుడివైపుకు వ్రాయబడితే, ఖరోష్టి మరియు ఆరమిక్ మాత్రము కుడి నుంచి ఎడమకు వ్రాయబడ్డాయి.
- అశోకుని శాసనాల్లో అతని బిరుదులైన ‘దేవానాంపియ’ మరియు ‘పియదస్సి’ అని కనిపిస్తే, కేవలం మస్కి (కర్ణాటక), నిత్తూరు (కర్ణాటక), ఉడెగోళం (కర్ణాటక) మరియు గుజ్జర (మధ్యప్రదేశ్)లో దొరికిన శాసనాల్లో మాత్రమే ‘అశోక మహారాజ’ అనే అసలు పేరు కనిపిస్తుంది.
అశోకుని శాసనాలను పండితులు మూడు రకాలుగా విభజించారు. అవి:
1.శిలాశాసనాలు (Rock Edicts): కొండలపైన నేరుగా లిఖించబడిన శాసనాలను శిలాశాసనాలు అంటారు. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ శాసనాలు లభ్యమయ్యాయి. రెండు ముఖ్యమైన శిలాశాసనాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.
a) పశ్చిమబెంగాల్‌లోని భబ్రు శిలాశాసనములో అశోకుడు బౌద్ధమతమందు తన విశ్వాసాన్ని ప్రకటించాడు. ఇందులో ‘బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి’ అని త్రిశరణ్యములను ప్రస్తావించాడు.
b) అశోకుని శిలాశాసనాల్లో 14 ప్రధాన శిలాశాసనాలు ముఖ్యమైనవి. ఒకే శిలపైన 14 శాసనాలను లిఖించారు. ఎర్రగుడి (కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్), సోపార (మహారాష్ట్ర), గిర్నార్/ జునాఘర్ (గుజరాత్), కల్సి (ఉత్తరాఖండ్), ధౌలి (ఒరిస్సా), జౌగడ (ఒరిస్సా), మన్షేర (పాకిస్తాన్), షాబాజ్‌గిర్ (పాకిస్తాన్) అనే ఎనిమిది ప్రాంతాలలో ఇవి లభ్యమయ్యాయి.
అశోకుడు 14 శాసనాల్లో ప్రజలకు ఈ క్రింది ఆజ్ఞలను జారీ చేశాడు.
- మొదటి శిలాశాసనంలో జీవహింసను చెయ్యకూడదని, జంతుబలులు నిషిద్ధము అని తెలియజేశాడు.
- రెండవ శిలాశాసనంలో రహదారుల నిర్మాణము, చెఱువుల త్రవ్వకాలు, మొక్కలను నాటడము లాంటి ప్రజాసంక్షేమ కార్యక్రమాలను తెలియజేశాడు. ఇందులోనే దక్షిణ సరిహద్దు రాజ్యాలైన చోళ, పాండ్య, కేరళపుత్ర (చేర) మరియు తామ్రపర్ణి (శ్రీలంక) లను ప్రస్తావించాడు.
- మూడవ శిలాశాసనంలో బ్రాహ్మణులను (వైదిక మతాచార్యులు) మరియు శ్రామణులను (అవైదిక మతాచార్యులు) గౌరవించాలని సూచించాడు.
- నాల్గవ శిలాశాసనంలో హింసను వీడాలని, తాను కూడా భేరిఘోషను (యుద్ధభేరిలు) వీడి ధమ్మఘోషను చేపట్టానని తెలియజేశాడు.
- ఐదవ శిలాశాసనంలో ప్రజలు తమ బానిసల పట్ల దయను ప్రదర్శించాలని మరియు తాను ప్రతి సంవత్సరము తన పట్టాభిషేకపు రోజున ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నానని తెలియజేశాడు.
- ఆరవ శిలాశాసనంలో ప్రజలందరు తన కన్నబిడ్డలని వ్యాఖ్యానించాడు.
- ఏడవ శిలాశాసనములో అన్ని మతాలు మరియు వర్గాల ప్రజలు సామరస్యంగా జీవించాలని సూచించాడు.
- ఎనిమిదవ శిలాశాసనంలో తాను విహారయాత్రలు మాని, ధమ్మయాత్రలు చేపట్టానని తెలియజేశాడు.
- తొమ్మిదవ శాసనంలో యజ్ఞయాగాలు వీడి, ధమ్మను అందరూ పాటించాలని సూచించాడు.
- పదవ శాసనంలో ధమ్మ అంటే చెడు నుంచి విముక్తి అని ధమ్మను నిర్వచించాడు.
- పదకొండవ శాసనంలో అశోకుడు ధమ్మను వివరించాడు.
- పన్నెండవ శిలాశాసనంలో ప్రజలందరు ఒకరి మతాన్ని మరొకరు గౌరవిస్తూ శాంతియుత సహజీవనము చెయ్యాలని కోరాడు.
- పదమూడవ శిలాశాసనము అన్నిటికంటే పెద్దశాసనము, ఇందులో అశోకుడు చేసిన కళింగ యుద్ధం యొక్క వివరాలున్నాయి. ఇందులోనే దక్షిణాదిన ఉన్న సరిహద్దు రాజ్యాల ప్రస్తావన ఉంది. ఈ శాసనంలో తాను ఈ క్రింది ఐదు మంది గ్రీకు రాజులతో దౌత్యసంబంధాలు కలిగిఉన్నానని ప్రస్తావించాడు.
- అంతియోక (అంటియొకస్ -2) – సిరియ పాలకుడు.
- తురయమ (టాలమి ఫిలడెల్ఫస్) – ఈజిప్ట్ పాలకుడు
- అలికసుద్ర (అలెగ్జాండర్) – ఎపిరస్ (ప్రస్తుత గ్రీస్) పాలకుడు
- అంతికిని (ఆంటిగోనస్ గొనాటస్) – మ్యాసిడోనియా పాలకుడు
- మాగ – సిరీన్ (ప్రస్తుత లిబియా) పాలకుడు
- పద్నాల్గవ శాసనంలో పైశాసనాలను శిలలపై లిఖించాలని ఆదేశించాడు.
2.స్తంభ శాసనాలు (Pillar Edicts)
అశోకుడు భారీ కొండరాళ్ళను గుండ్రటి స్తంభాలుగా తొలచి వాటిని నగరాల మధ్యలో ఏర్పాటు చేసి వాటిపైన శాసనాలను చెక్కాడు. రాంపూర్వ (బీహార్), లౌరియనందన్‌ఘర్ (బీహార్), లౌరియ అరరాజ్ (బీహార్), కౌశాంభి (అలహాబాద్), రుమ్మిండై (లుంబిని) మరియు ఢిల్లీ – మీరట్, ఢిల్లీ – తోప్రా మొదలైన ప్రాంతాలలో అశోకుని స్తంభశాసనాలు లభించాయి.
అశోకుడు అలహాబాద్‌లో వేసిన స్తంభ శాసనంపైనే సముద్రగుప్తుడు మరియు మొఘల్ చక్రవర్తి జహంగీర్ తమ శాసనాలను వేయడం విశేషం. అశోకుడు మీరట్ (ఉత్తరప్రదేశ్) మరియు తోప్రా (హర్యానా) లో వేసిన స్తంభ శాసనాలను 14వ శతాబ్దంలో సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీకి తరలించాడు.
రుమ్మిండై (బుద్ధుని జన్మ స్థలమైన లుంబిని) స్తంభ శాసనంలో అశోకుడు లుంబిని వాసులకు గౌరవసూచకంగా పన్నుల్లో రాయితీలను కల్పించినట్లు సమాచారముంది. మౌర్యుల పన్నుల వ్యవస్థ తెలుసుకోవడానికి ఈ శాసనం ఉపయోగపడుతుంది.
3.గుహాలయ శాసనాలు (Cave Edicts)
అశోకుని ఏకైక గుహాలయ శాసనము గయ సమీపంలో బారబర అనే ప్రాంతంలో లభించింది. ఈ శాసనం ప్రకారం అశోకుడు బారబరలో నాలుగు గుహలు నిర్మించి, వాటిని అజీవికులకు దానం చేశాడు. ఇవి భారతదేశంలో నిర్మించబడిన తొలి గుహాలయాలు (rock-cut caves). ఈ గుహాలయాలకు సుదామ, లొమసఋషి, కర్ణచౌపార, గోపిక అనే పేర్లు ఇవ్వబడ్డాయి. #Mauryan Empire#