చరిత్ర అధ్యయనం – పురావస్తు మరియు లిఖిత ఆధారాల విశ్లేషణ

Sources of Indian History

History (చరిత్ర) అనే పదము Historia అనే గ్రీకు పదం నుంచి ఆవిర్భవించింది. దీని అర్థం పరిశోధన లేదా అన్వేషణ. గతాన్ని పరిశోధించి అధ్యయనం చేసే శాస్త్రమును చరిత్ర అంటారు. చరిత్రతో పాటు పురావస్తుశాస్త్రము (Archaeology) కూడా గతాన్ని అధ్యయనము చేస్తుంది. ఈ రెండు శాస్త్రాలు ఒకే లక్ష్యాన్ని కలిగి ఉన్నప్పటికీ వేర్వేరు లక్ష్య సాధన మార్గాలను అవలంభిస్తాయి. చరిత్ర గతాన్ని సాహిత్యము (records) ద్వారా అధ్యయనము చేస్తే, పురావస్తు శాస్త్రము వస్తు అవశేషాల (material remains) ద్వారా అధ్యయనము చేస్తుంది. వీటి ఆధారాలు (sources) వేర్వేరుగా ఉంటాయి.

పురావస్తు ఆధారాలు (Archaeological Sources)

పురావస్తు శాస్త్రవేత్తలు గతాన్ని నిర్మించడానికి వివిధ ఆధారాలను ఉపయోగిస్తారు. అందులో శాసనాలు, నాణెములు, కట్టడాలు, శిల్పాలు మరియు త్రవ్వకాలలో బయల్పడిన వస్తు అవశేషాలు ముఖ్యమైనవి.

శాసనాలు (Inscriptions)

ఏదైనా గట్టి ఉపరితలముపైన లిఖించబడిన శాశ్వత లిపిని శాసనము అంటారు. శాసనాల్లో, ఉన్న సమాచారమును బట్టి వీటిని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.

  1. ప్రశస్తి శాసనాలు (Eulogies): ప్రశస్తి అంటే పొగడ్త. ఇవి ఒక రాజు యొక్క విజయాలను, గొప్పతనాన్ని కీర్తిస్తూ వేసే శాసనాలు. సముద్రగుప్తుడి అలహాబాద్ శాసనము, గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క నాసిక్ శాసనము, రెండవ పులకేశి యొక్క ఐహోలు శాసనము ప్రశస్తి శాసనాలకు కొన్ని ఉదాహరణలు.
  2. రాజాజ్ఞలు (Edicts): ఇవి ఒక రాజు తన ఉత్తర్వులను మరియు ఆజ్ఞలను తెలియజేస్తూ వేసే శాసనాలు. అశోకుడు వేసిన శాసనాలన్నీ రాజాజ్ఞలే.
  3. దాన శాసనాలు (Land Charters): ప్రశస్తి శాసనాలు మరియు రాజాజ్ఞలను రాజులు మాత్రమే వేస్తారు. కానీ దాన శాసనాలు రాజులతో పాటు ప్రైవేటు వ్యక్తులు కూడా చెయ్యవచ్చు. పురోహితులకు లేదా మతసంస్థలకు ఇచ్చిన భూదానాల (endowments) వివరాలు ఇందులో లిఖిస్తారు. సాధారణంగా వీటిని రాగిరేకులపైన లిఖిస్తారు కావున వీటిని తామ్రఫలక శాసనాలు (copper plate inscriptions) అని కూడా అంటారు.

సింధు నాగరికత కాలం నాటి ముద్రికలపైన ఉన్న చిత్ర లిపి శాసనాలు భారతదేశంలో తొలి శాసనాలుగా పరిగణించవచ్చు. అయితే ఈ శాసనాలను ఇంతవరకు ఎవరూ చదవలేకపోయారు. క్రీ.పూ.మూడవ శతాబ్దంలో అశోకుడు వేసిన శాసనాలే మనదేశంలో పండితులు చదవగలిగిన తొలి శాసనాలుగా గుర్తించవచ్చు. ఈ శాసనాలు చాలా వరకు ప్రాకృత భాష మరియు బ్రాహ్మిలిపిలో వేయబడ్డాయి. తరువాత కాలం నాటి సంస్కృత శాసనాలు కూడా బ్రాహ్మిలిపిలోనే వేయబడ్డాయి. పురావస్తుశాస్త్రములో శాసనాలను అధ్యయనము చెయ్యడానికి ఎపిగ్రఫీ (Epigraphy) అనే ప్రత్యేక విభాగముంది. శాసనాల్లోని ప్రాచీన లిపులను అధ్యయనము చెయ్యడానికి పేలియోగ్రఫీ (Paleography) అనే విభాగముంది.

నాణెములు (Coins)

ఒక కాలంలో ముద్రించబడిన నాణెములు ఆ కాలానికి సంబంధించిన రాజకీయ, ఆర్థిక, సామాజిక, మతపరమైన విషయాలను తెలియజేస్తాయి. మనదేశములో క్రీ.పూ.ఆరవ శతాబ్దములో ముద్రించిన విద్దాంక నాణెములు (punch-marked coins) తొలి నాణెములుగా గుర్తించబడ్డాయి. మౌర్యుల పూర్వయుగంలో మరియు మౌర్య యుగంలో ఈ నాణెముల వాడకం కొనసాగింది. ఇవి వెండి మరియు రాగితో చేయబడ్డాయి. వీటిపైన ఒకటి లేదా అనేక బొమ్మలను ముద్రించారు. ఈ నాణెములపైన ఎటువంటి లిపి లేకపోవడంతో వీటిని ముద్రించిన రాజులు గురించి తెలుసుకునే అవకాశము లేదు. మౌర్యుల అనంతర యుగంలో భారతదేశాన్ని పాలించిన విదేశీ రాజులు బంగారు నాణెములను ప్రవేశపెట్టారు. పురావస్తుశాస్త్రములో నాణెములను అధ్యయనము చెయ్యడానికి ‘న్యూమిస్‌మ్యాటిక్స్’ (Numismatics) అనే ప్రత్యేక విభాగముంది.

కట్టడాలు మరియు శిల్పాలు (Monuments and Sculptures)

ప్రాచీన కట్టడాలు మరియు శిల్పాలు కూడా ఒక కాలానికి సంబంధించిన అనేక విషయాలను తెలియజేస్తాయి. ఉదాహరణకు తాజ్‌మహల్ ఆనాటి మొగల్ చక్రవర్తుల వైభవోపేతమైన జీవితాన్ని తెలియజేస్తుంది. కాకతీయుల కాలం నాటి రామప్ప ఆలయంలోని శిల్పాలు ఆనాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక మరియు మతపరమైన విషయాలను తెలియజేస్తాయి. వివాహిత స్త్రీ మంగళసూత్రాన్ని ధరించే సాంప్రదాయము ఆ కాలంలోనే ఉన్నట్లు రామప్ప శిల్పాల ద్వారా తెలుస్తుంది. కట్టడాలను మరియు శిల్పాలను అధ్యయనము చేయడానికి ఐకనోగ్రఫి (Iconography) అనే ప్రత్యేక విభాగముంది.

త్రవ్వకాల్లో బయల్పడిన వస్తు అవశేషాలు (Excavated Material)

గతాన్ని అధ్యయనము చెయ్యడానికి పురావస్తు శాస్త్రవేత్తలకు త్రవ్వకాల్లో బయల్పడిన వస్తు అవశేషాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కుండలు, ఆహారధాన్యాలు, వస్త్రాలు, ఆయుధాలు, పనిముట్లు, ఆభరణాలు, గృహాల అవశేషాలు మొదలగునవి ఆనాటి పరిస్థితులను మనకు తెలియజేస్తాయి.

పురావస్తు శాస్త్రంలో ప్రాచీన వస్తువుల కాలాన్ని నిర్ధారించే పద్ధతులు

త్రవ్వకాల్లో బయల్పడిన వస్తు అవశేషాల కాలాన్ని ఖచ్చితంగా నిర్ణయించే అనేక శాస్త్రీయ పద్ధతులను పురావస్తు శాస్త్రవేత్తలు ఉపయోగిస్తున్నారు. వీటి ద్వారా ఆ వస్తువుల కాలంతోపాటు, త్రవ్వకాలు జరిపిన ప్రాంత కాలాన్ని కూడా నిర్ధారిస్తారు. కొన్ని ముఖ్యమైన శాస్త్రీయ కాల నిర్ధారణ పద్ధతులను (dating methods) ఈ క్రింద చర్చించడమైనది.

1) రేడియో-కార్బన్ డేటింగ్ (Radio-carbon Dating):

త్రవ్వకాల్లో బయల్పడిన జీవసంబంధ అవశేషాల కాలాన్ని ఈ పద్ధతి ద్వారా కనుగొనవచ్చు. ఈ విధానాన్ని 1949లో చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన విల్లార్డ్ లిబ్బీ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అణుధార్మికత కలిగిన రేడియో కార్బన్ (C-14)ను ప్రతి జీవి ప్రకృతి నుండి స్వీకరిస్తూ ఉంటుంది. ఆ జీవి మరణించిన తర్వాత అందులోని (C-14) క్రమంగా క్షీణిస్తుంది. యాభై శాతం(C-14) తగ్గడానికి 5568 సంవత్సరాలు పడుతుంది. దీనినే ‘half-life’ అంటాము. రేడియో కార్బన్ ఎంత మేరకు క్షీణించిందో తెలుసుకోవడము ద్వారా ఆ జీవి కాలాన్ని నిర్ధారించవచ్చు. (C-14) తక్కువ ఉన్న అవశేషాలు చాలా ప్రాచీనమైనవని భావించవచ్చు.

2) పొటాషియం – ఆర్గాన్ డేటింగ్ (Potassium – argon Dating):

ఈ పద్ధతి ద్వారా శిలల ఆవిర్భావ కాలాన్ని కూడా లెక్కకట్టవచ్చు. అగ్నిపర్వత ప్రాంతాల్లో లభించిన శిలాల కాలాన్ని దీని ద్వారా తెలుసుకొనే అవకాశం ఉంది.

3) యురేనియం – లెడ్ డేటింగ్ (Uranium – lead Dating):

లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన శిలల కాలాన్ని కూడా ఈ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు.

4) డెండ్రోక్రోనాలజీ డేటింగ్ (Dendrochronology or Tree-ring Dating):

ఈ శాస్త్రీయమైన పద్ధతి ద్వారా ప్రాచీన చెట్ల వలయాలను (tree rings) అధ్యయనం చేసి వాటి కాలాన్ని నిర్ధారించవచ్చు.

5) థెర్మొల్యుమినిసెన్స్ డేటింగ్ (Thermoluminescence Dating):

నిప్పుల్లో కాల్చబడిన ప్రాచీన వస్తువుల కాలాన్ని తెలుసుకోవడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. కాల్చిన ఇటుకలు, కుండలు మరియు ఇతర వస్తువుల కాలాన్ని ఈ విధానం ద్వారా నిర్ధారించవచ్చు.

చారిత్రక ఆధారాలు/లిఖిత ఆధారాలు (Historical Sources / Literacy Sources)

చరిత్రకారులు గతాన్ని అధ్యయనము చెయ్యడానికి లిఖిత (సాహిత్య) ఆధారాలను ఉపయోగిస్తారు. సాహిత్య ఆధారాల్లో స్వదేశీ గ్రంథాలు మరియు విదేశీ గ్రంథాలు చరిత్ర రచనకు ఉపయోగపడతాయి.

స్వదేశీ గ్రంథాలు (Indigenous Accounts)

ఇవి భారతదేశంలో భారతీయుల ద్వారా వ్రాయబడిన గ్రంథాలు. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు.

  1. మతగ్రంథాలు: ఇవి వివిధ మతాలకు చెందిన పవిత్ర గ్రంథాలు. ఇందులో వైదిక / హిందూ గ్రంథాలు, జైన గ్రంథాలు, బౌద్ధ గ్రంథాలు మొదలైనవి గతాన్ని అధ్యయనం చేయడానికి సహకరిస్తాయి. క్రీ.పూ.1500 – 1000 మధ్య రచించబడిన ఋగ్వేదమును భారతదేశంలోనే తొలి గ్రంథంగా గుర్తిస్తారు.
  2. లౌకిక గ్రంథాలు: ఇవి ఏ మతానికి సంబంధము లేని గ్రంథాలు. క్రీ.పూ.ఐదవ శతాబ్దంలో పాణిని వ్రాసిన అష్టాధ్యాయి అనే వ్యాకరణ గ్రంథమే మనదేశంలో తొలి లౌకిక గ్రంథము.
విదేశీ గ్రంథాలు (Foreign Accounts)

అతి ప్రాచీన కాలం నుండి భారతదేశాన్ని అనేక మంది విదేశీయులు సందర్శించి అమూల్యమైన సమాచారాన్ని అందించారు. వీరు భారతదేశానికి దండయాత్రీకులుగా, రాయబారులుగా, తీర్థయాత్రికులుగా, వ్యాపారస్తులుగా, పర్యాటకులుగా సందర్శించి తమ అనుభవాలను కళ్ళకు కట్టినట్లుగా వివరించారు. చరిత్ర రచనకు విదేశీ గ్రంథాలు విశ్వసనీయమైన ఆధారాలు. వీరు వివిధ భాషల్లో వ్రాసిన కొన్ని మఖ్యమైన గ్రంథాలను ఈ క్రింద చర్చించడమైనది.

(I) గ్రీకు గ్రంథాలు: మెగస్తనీస్ వ్రాసిన ‘ఇండిక’ గ్రీకు గ్రంథాలన్నింటిలోను అత్యంత ప్రముఖమైనది. ఇది మౌర్యుల గురించి తెలియజేస్తుంది.

(II) లాటిన్ గ్రంథాలు: ప్లీని వ్రాసిన ‘నాచురల్ హిస్టరీ’ ఒక ముఖ్యమైన లాటిన్ గ్రంథము. ఇది ప్రాచీన కాలం నాటి ఇండో – రోమన్ వ్యాపారం గురించి తెలియజేస్తుంది.

(III) చైనీస్ గ్రంథాలు: చైనీస్ భాషలలో వ్రాయబడిన గ్రంథాల్లో అత్యంత ముఖ్యమైనది హుయాన్‌త్సాంగ్ వ్రాసిన సీ-యు-కీ. ఈ గ్రంథము క్రీ.శ.ఏడవ శతాబ్దములో ఉత్తర భారతదేశాన్ని పాలించిన హర్షవర్ధనుడి గురించి తెలియజేస్తుంది.

(IV) టిబెటన్ గ్రంథాలు: ‘దివ్యవదన’ అనే టిబెటన్ బౌద్ధ గ్రంథము అశోకుడి గురించి తెలియజేస్తుంది.

(V) శ్రీలంక గ్రంథాలు: మహావంశ, దీపవంశ మరియు కులవంశ అనే సింహళ బౌద్ధ గ్రంథాలు. మౌర్యుల గురించి వివరాలు అందిస్తాయి.

(VI) అరబిక్ గ్రంథాలు: మధ్యయుగంలో అనేక మంది అరబ్బు యాత్రికులు భారతదేశాన్ని సందర్శించి విలువైన సమాచారాన్ని ఇచ్చారు.

నోట్‌: స్వదేశీ సాహిత్యంతో పోలిస్తే విదేశీ సాహిత్యము చరిత్ర రచనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. విదేశీయుల రచనల్లో సాధారణంగా పక్షపాత వైఖరి తక్కువగా ఉంటుంది మరియు సామాన్య ప్రజల జీవిన విధానాన్ని ఇవి కళ్లకు కట్టినట్లుగా చూపిస్తాయి.

Leave a Comment

error: Content is protected !!